Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 15


    "కామినీ, వీరిద్దరే నా మమ్మీ, డాడీ.
    డాడీ పేరు చంద్రశేఖరరావు, మమ్మీ పేరు ఊర్మిళా దేవి. డాడీకి సంఘంలో ఎంత పలుకుబడివుందో మమ్మీ మహిళామండలిలో అంత పేరుంది" అన్నాడు కిరణ్.
    "ఐ.సీ." అంది కామినీదేవి.
    మమ్మీ, డాడీ పేర్లేనా? ఎన్ని లకారాలున్నాయో కూడా చెప్పు. వ్యంగ్యంగా అన్నాడు రావుగారు.
    ఆ మాట వినిపించుకోకుండా ఇరువురు కలిసి రావుగారి దగ్గరకు వెళ్ళారు. "మమ్మీ, డాడీ పక్కకురా ఇరువురు నమస్కరిస్తాము." అన్నాడు కిరణ్.
    ఈ పాద నమస్కారాలు అతి వినయాలు, నీ నోటివెంట వింటుంటే చాలా వింతగా వుంది. మమ్మీ, డాడీ మీరు గౌరవం వుండే అన్నమాట, మాకు తెలీకుండానే పెళ్ళి చేసుకుని వచ్చింది."
    "అదికాదు, డాడీ అసలు ఏం జరిగిందంటే..."
    చెప్పొద్దు అన్నట్లు చేతులతో వారించాడు రావుగారు. టక్కున నోరుమూసుకున్నాడు కిరణ్.
    "పద, నా గదిలోకివెళ్ళి మాట్లాడుకుందాము. అన్నాడు రావుగారు సోఫాలోనుండి లేస్తూ.
    కిరణ్ కి సంతోషం వేసింది, తండ్రికి ఏదో ఒకటి చెప్పి, ఒప్పించవచ్చని అనుకున్నాడు.
    రావుగారు లేవగానే, ఊర్మిళాదేవి లేచింది. కిరణ్ కామినీ చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు.
    "నీవు ఒక్కడివే నాతో రావాల్సింది. నేను మాట్లాడవలసినది నీతో మాత్రమే! రావుగారు అన్నాడు.
    "అదికాదు డాడీ..." ఏదో చెప్పబోయాడు కిరణ్.
    "నేను నీతో వంటరిగా మాట్లాడదలచుకున్నాను. అలా ఇష్టం ఐతే నీవు ఒక్కడివి రా, లేకపోతే నువ్వు చెప్పే ఒక్కమాట కూడా వినిపించుకో నవసరంలేదు."
    "కామినీ! నువ్వు ఇలా సోఫాలో కూర్చో నేను డాడీతో మాట్లాడి వస్తాను" కామిని, చేతిమీద బుజ్జగింపుగా తట్టి అన్నాడు కిరణ్.
    కామిని వారి ఎదుటనే సోఫాలో కూర్చుండిపోయింది.
    వాళ్ళు ముగ్గురూ లోపలికి వెళ్ళిపోయారు. వెళుతూ, వెళుతూ ఊర్మిళాదేవి వెనుతిరిగి కోడలిపిల్లని ఒక చూపు చూసి వెళ్ళింది. సమాధానంగా కామిని నిర్లక్ష్యంగా ఒక్క చూపు చూసి మొహం ప్రక్కకు త్రిప్పుకుంది.
    ఈ ఇంట్లో పాదం మోపాను. మీరు కాదు కదా, మీ తల్లో జేజెమ్మ కూడా ఏమీ చెయ్యలేదు. నా సంగతి తెలియదు. పాదరసంలాంటి, మీ కొడుకే నా గుప్పెట్లో బిగించబడ్డాడు, ముసలి పీనుగులు మీరు నన్నేం చేస్తారు. మీరు నాతో మంచిగా వుంటే ఈ ఇల్లు ప్రశాంతి నిలయం అవుతుంది. లేని మరుక్షణం గేమ్ మొదలు పెడతాను. అశాంతి నిలయమో, రణరంగమో ఓహ్! కామిని నిర్లక్ష్యంగా అనుకుంది.
    కామిని అలా అనుకోవటంలో కూడా అర్ధముంది. వస్తు తహా గుణవంతురాలు కాకపోవచ్చు. అన్నీ సవ్యంగా వుంటే ఎవరి జోలికి పోనిపిల్ల, లేకపోతే తోక త్రొక్కబడిన త్రాచే. కిరణ్ కావాలని ఆమె తోక త్రొక్కాడు. ఇంక ఏం జరిగినా ఈ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన మీదే ఆధారపడి వుంటుంది.
    కిరణ్ ప్రేమించానంటూ కామినీని పొందాడు. ఆమె ఎప్పుడైతే, తను తల్లి కాబోతున్నానని చెప్పిందో అప్పుడే తను తన ధన గర్వంతో ఆమెని బెదిరించి వెళ్ళిపోయాడు. కానీ అనుకోని పరిస్థితులలో కిరణ్ చాలా తేలికగా కామిని తల ముందు తల వంచక తప్పలేదు.
    ఇప్పుడైనా, రావుగారు ఊర్మిళాదేవి మర్యాదగా ఏం జరిగింది అని అడిగినట్లయితే ఏదో కథ చెప్పి ఆ ఇంట్లో చక్కగా అతికిపోయేది. కాని పరాయి పిల్లలాగా ఆమెని అక్కడే వదిలి, కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళారు.
    ఇదిచాలు, కామిని అవమాన భారంతో త్రోక త్రొక్కిన త్రాచులా అవటానికి.
    రావుగారు లకారాలకి అధిపతి. కిరణ్ వారికి ఒక్కడే కొడుకు. చెప్పా పెట్టకుండా పెళ్ళి చేసుకుని వస్తే వాళ్ళమనసులు ఎంత క్షోభిస్తాయి. అలాంటి ఆలోచన రాలేదు కామినీకి. కిరణ్ ని అవలీలగా హత్యానేరం నుండి తప్పించిన కామిని, ఈ విషయంలొ తెలివి తక్కువ ఆలోచన చేసింది. ఎంతవరకు తనవైపునుంచే ఆలోచించింది.
    ఏం జరిగితే ఏం మాట్లాడాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా మెలగాలి, అని ఆలోచిస్తూ కూర్చుంది.
    
                                10
    
    కిరణ్ లోపలికి అడుగు పెట్టాడు.
    రావుగారు వెనుదిరిగి చూసి, "తలుపు వెయ్యి" అన్నాడు.
    "ఎందుకు డాడీ మనమే కదా ఇక్కడ వున్నది" అన్నాడు కిరణ్.
    "ఇక్కడ వున్నది మనమే కానీ మన పరువు బజారులో పడకుండా వుండటానికి" రావుగారి స్వరం కఠినంగా వినిపించింది.
    తప్పు చేసిన వాడిలాగా కిరణ్ తల వంచుకున్నాడు.
    "ఆలస్యం ఎందుకు? అడగండి" ఊర్మిళాదేవి అంది.
    "అదికాదు మమ్మీ..."
    ఏదో మాట్లాడబోయిన కిరణ్ కి మధ్యలోనే అడ్డువచ్చి.
    "నేను మాట్లాడింది నీతోకాదు" అంది ఊర్మిళాదేవి.
    "కిరణ్ నువ్వేమి చెప్పనక్కరలేదు. నేను ప్రశ్నలు వేస్తాను. వాటికి మాత్రమే సమాధానం చెప్పు."
    "అలాగే డాడీ" బుద్దిమంతుడిలాగా అన్నాడు కిరణ్.
    "నువ్వు దాన్ని ప్రేమించవా?" రావుగారు మొదటి ప్రశ్న అడిగారు.
    తండ్రి కామినీని దాన్ని అవటం కిరణ్ గమనించాడు. "దాన్ని" అన్న ఒక్క పదంలోనే, కామినీ మీద ఎంత కసి, కోపం వున్నాయో గ్రహించాడు. అయితే ఇపుడు అవన్నీ ఆలోచించే టైమ్ లేదు. "ఎస్ డాడీ" అని వూరుకున్నాడు.
    "ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా!"
    "టైమ్ లేకపోయింది డాడీ...."
    "అయితే ప్రేమించడం పెళ్ళి చేసుకోవడం క్షణాలలో జరిగి పోయిందన్న మాట!"
    "లేదు, లేదు. పెళ్ళి నిన్న చేసుకున్నాను. ప్రేమించడం ఎప్పుడో జరిగి పోయింది...." నాన్చుతూ ఆగాడు కిరణ్.
    "అయితే చాలా నెమ్మదిగా ప్రేమిస్తూ నచ్చి, పెళ్ళి చేసుకోవటానికి వచ్చేటప్పటికి క్షణంలో నిర్ణయం తీసుకున్నానన్నమాట" రావుగారు వ్యంగ్యంగా అడిగాడు.
    కిరణ్ తల వంచుకొని వినపడీ వినపడనట్లు 'ఊ' అన్నాడు.
    "తల్లి తండ్రులకి చెప్పే టైము లేకుండా, దిక్కూ మొక్కూ లేనివాడిలాగా, ఒంటరిగా, అంత అర్జంటుగా పెళ్ళి చేసుకుని ఫోన్ చేసే అవసరం ఎందుకు వచ్చింది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS