"మీ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తవలేదా సార్?"
భార్గావకి ముచ్చెమటలు పోస్తున్నాయి. తనెందుకిలా ఫీలవుతున్నాడు? ఆఫ్టరాల్ ఒక ఆడపిల్ల బెదిరిస్తే....తనెందుకు భయపడుతున్నాడు? సాహితీ జగత్తులో స్థానం సంపాదించినప్పటి నుండి ఆత్మసాక్షిగా తనకు తెలుసు....ఇప్పటివరకు తనతో ఏ ఆడపిల్లకు లింక్స్ లేవు. వ్యక్తిపరంగా, వృత్తి పరంగా తనెవరికి శత్రువూ కాదు ....మరెందుకు తనకీ భయం....?? ఆ కంఠం వినగానే తనకెందుకు గుండెల్లో గుబులు??
"....." ఏదో మాట్లాడాలనుకున్నా మాట్లాడ లేకపోయాడు భార్గవ.
"ఇంకా నన్ను గుర్తుపట్ట లేదా?... హ....హ...హ..." రింగులు తిరిగివస్తున్న భయంకర నవ్వు.
"మాట్లాడదల్చుకుంటే....ముందుకొచ్చి మాట్లాడు. ఇలాంటి హెచ్చరికలు నాకు మామూలే" అన్నాడు నిగ్రహించుకుంటూ.
"మౌనికను చంపద్దు....ప్లీజ్ భార్గవ....మీరు సృష్టించిన మౌనికని చంపితే ఆ పాత్రను చంపిన నెల రోజుల్లోగానే నువ్వు చంపబడతావ్."
"నా నవల్లోని పాత్రకూ....నీకూ ఏమిటి సంబంధం?" దవడ కండరం బిగించిపడ్తూ అన్నాడు.
"ఏమిటా....?" అదే నువ్వు.... "నేనే మౌనికను కాబట్టి."
ఆ నవ్వు కర్ణపుటాలను తాకి కపాలాన్ని బ్రద్దలు చేస్తుందా అన్నంత కర్కశంగా వుంటే తట్టుకోలేక ఫోన్ పెట్టేశాడు భార్గవ.
మొహంనిండా పేరుకున్న చెమటను కర్చీఫ్ తో తుడుచుకుంటూ...."ఇదీ సంగతి.... చూసావ్ గా....అంతుబట్టకుండా వుంది" అన్నాడు భారంగా.
"విన్నావురా....ఈ లెటర్ లో కూడా అదే హెచ్చరించినట్టుంది....అన్నట్టు ఇలాంటివి ఎన్ని ఉత్తరాలు వచ్చివుంటాయి."
"దీంతో మూడు...." అన్నాడు కుర్చీలో వెనక్కు వాలుతూ. రెండు ఫోర్ సెప్స్ తో పట్టి చదివాడు అమితేష్.
"ముందు కాఫీ తీసుకొని...కొద్దిసేపు రిలాక్స్ అవు...ఎవరో గడుగ్గాయి అమ్మాయి చేస్తున్న పనై వుంటుంది" అన్నాడు అమితేష్ కాఫీ అందిస్తూ.
"రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది...?" అన్నాడు భార్గవ.
"మూడు నాలుగు గంటల్లో ప్రింట్స్ తయారు చేస్తాను. కాని నవల్లోని పాత్రను చంపడానికి అడ్డుపడుతోంది కదా ఆమె, మరి ఆ పాత్రను ఉంపదల్చుకున్నవా?" అన్నాడు అమితేష్ కుతూహలంగా.
"లేదు ఆ పాత్రను చంపినపుడే...వూహించని ముగింపవుతుంది. ఇలాంటి బెదిరింపులకు ఆ పాత్రను బ్రతకనివ్వదల్చుకోలేదు..." అన్నాడు భార్గవ దృఢంగా.
"చాలా విచిత్రమైన కేసులా వుంది కదూ! అసలీ హెచ్చరికలు చేస్తున్న వ్యక్తి పై ఆ పాత్ర ప్రభావం బాగా పడివుండాలి. లేదా సీరియల్లోని ఆ పాత్ర రీతిలో ఆమె జీవితాన్ని సరిదిద్దుకొనైనా వుండాలి. లేదా తన జీవితాన్నే ఆ పాత్రలో మమేకం చేసుకొని జీవిస్తూనయినా వుండాలి. అందువల్లే ఆ పాత్రను చంపనివ్వడం లేదేమో...?" అన్నాడు అమితేష్ ఏదో వూహిస్తూ.
"సమాజంలో ఎవరిమీద ఏ పాత్ర ఎలాంటి ప్రభావం చూపుతుందో గానీ....సమాజంలోని వ్యక్తుల ప్రభావమే పాత్రల మీద పడుతుంది చాలా మంది రచనల్లో ఏది ఏమైనా, ఆ పాత్రనే నేనని బెదిరించటం నమ్మశక్యం గాకుండా వుంది."
"ఎప్పుడో, ఏదో ఇంగ్లీషు సాహిత్యంలో చదివినట్లు గుర్తు. పాత్రలన్నీ ప్రేతాత్మలై వచ్చి ఒక రచయితని పీక్కుతిన్నట్టు..."
ఆ మాటకు ఉలిక్కిపడి చూశాడు భార్గవ.
"అదెంతవరకు నిజమోగాని....నువ్వు మాత్రం ఈలోగా టెలిఫోన్ డిపార్ట్ మెంట్ సాయం కూడా తీసుకో..." అన్నాడు అమితేష్.
భార్గవ తేరుకొని "సరే! ఫింగర్ ఫ్రింట్ రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తాయి?" అన్నాడు.
"నేనే స్వయంగా ప్రింట్ తీయిస్తానులే"
"సరైన రిజల్ట్స్ వస్తాయంటావా?" అనుమానంగా అన్నాడు భార్గవ.
ఆ మాటకు అమితేష్ నవ్వి-
"ఫింగర్ ప్రింట్స్ అంటే అంత తేలిగ్గా తీసుకోకురా! మనుషుల గుర్తులేం ఖర్మని మైకోబాక్టీరియాల వేలిముద్రలు కూడా డెవలప్ చేసేంతగా ఎదిగింది మన సైన్సు విజ్ఞానం....ఈ మధ్యే లండన్ లోని బార్ట్ స్ ఆస్పత్రి వారు ఒక క్రొత్త పద్దతి కనిపెట్టారు. ముద్రల ద్వారా కేవలం యిరవై నాలుగు గంటలలోపునే క్రిమిని గుర్తుపట్టవచ్చు. మాలాంటి ఇంటర్ పోల్ డిటెక్టివ్ లంతా వేలిముద్రల మీద ఆధారపడినట్లే వీళ్ళు క్రిమి ముద్రలను రూపొందిస్తున్నారు."
"చాలా కష్టమయిన పనే కదా?"
"అవును మరి! సూక్ష్మ క్రిములకు కాస్తంత అణుధార్మిక శక్తి కలిసిన పదార్ధాన్ని తినిపిస్తారు. ఆ తరువాత స్కానింగ్ పద్దతిలో ఆ తిండిని ఎలా జీర్ణం చేసుకుంటుందో పరిశీలిస్తారు."
"అన్ని జీవుల తిండీ ఒకేలా జీర్ణం కాదా?" అన్నాడు భార్గవ.
"క్రిముల్లో వేరు! తిండి ఆరగించుకునే పద్దతి ఒక్కో క్రిమిలో ఒక్కో రకంగా వుంటుంది....స్కానర్ కు అనుసంధించిన కంప్యూటర్ క్రిమి జీర్ణక్రియ విధానాన్ని నోట్ చేస్తుంది. అంటే డానికి సంబంధించిన ముద్రలన్నీ కంప్యూటర్ లో యిమిడిపోతాయన్నమాట. దీనినే 'అంబిస్' అంటారు. ఎగ్జాంపుల్ గా నువ్వొక క్రిమిని గుర్తించాల్సి వస్తే అంబిస్ పద్దతిలో ఆ క్రిమి వేలిముద్రలు తీయించి, అంతకు ముందు తయారై ఎగ్జిబిట్ చేయబడిన ముద్రలతో పోల్చి చూసి ఆ క్రిమిని గుర్తుపట్టవచ్చు. ఇది హెల్త్ వాళ్ళకు ఎక్కువ ఉపయోగం" అన్నాడు అమితేష్.
"ఎ.యం.బిఐ.యస్. అంటే?" అడిగాడు భార్గవ.
"ఆటోమేటెడ్ మైక్రో బయాలాజికల్ ఐడెంటిఫికేషన్ సిస్టం అన్నమాట..."
"థాంక్స్! ముందు నా ప్రాబ్లెం అవుతే సాల్వ్ చేయండి. చాలా విషయాలు తెలిపావు__మెనీథాంక్స్" అన్నాడు భార్గవ లేస్తూ.
