Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 15

 

                      దేవుడి లాంటి మనుషులు

                                                                       వసుంధర
    అవధాని గారు తలుపు తీసేసరికి ఎదురుగా ఒక అపరిచితుడు నిలబడి ఉన్నాడు.
    "నా పేరు గోపాలకృష్ణ" అన్నాడతను నవ్వుతూ.
    "రండి! కూర్చోండి! ,మీ గురించి శర్మ చెప్పాడు నాకు" అన్నాడు అవధాని. ఇద్దరూ లోపలకు వెళ్ళి చెరో కుర్చీలో కూర్చున్నాక మళ్ళీ అన్నాడు అవధాని. "మా వాడు అన్ని పరీక్షలు బాగానే రాశాడండీ- ఒక్క ఇంగ్లీషు తప్ప. ఆ గండం గడిస్తే వాడు పరీక్ష ప్యాసు కావడాని కేమీ డోకా లేదు."
    గోపాలకృష్ణ మళ్ళీ నవ్వాడు. "చూడండి అవధాని గారూ! అన్నీ నాకు శర్మ చెప్పాడు. మీవాడి మీద మీరుచాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు అడియాసలు కాకూడదు. ఈ గండం గడిస్తే మీ జాగ్రత్త మీరు పడతారు. గండం గడుస్తుందనీ నేను హామీ ఇస్తున్నాను. కానీ డబ్బు కోసంమీరు వెనుకాడకూడదు."'    
    "ఎంతవుతుంది?"
    'అలా అడిగితె నేనేం చెప్పగలను చెప్పండి. రిజిష్ట్రాఫీసులో గుమస్తాను పట్టుకోవాలి. పేపర్లేక్కడికి వెళ్ళాయో తెలుసుకోవాలి. ఆ ఎగ్జామినర్ చేయి తడపాలి. ఇందుకోసం ఎన్ని ఊళ్ళు తిరగాలో ఎంతమంది చేతులు తడపాలో...."
    "ఆ సంగతి నాకు తెలుసుననుకోండి. ఈ విషయంలో నాకేమీ అనుభవం లేదు. అందువల్ల దేనికెంత ఖర్చవుతుందో నేను ఊహించనైనా ఊహించలేను. మీరే చెప్పండి!"
    "అయిదు వందలు " అన్నాడు గోపాలకృష్ణ సాలోచనగా.
    'అయిదు వందలే!" అవధానీ కంగారుగా అన్నాడు.
    "మీ కుర్రాడికో సంవత్సరం కలిసి వచ్చేలా చేస్తున్నందుకు నేను చాలా తక్కువ చార్జి చేశానని ఆశ్చర్య పడుతున్నారా? ఇందులో ఆశ్చర్యాని కేముంది? నాకు డబ్బాశ లేదు.
    "మీరడిగినది తక్కువే కావచ్చు. కానీ నా శక్తికీ అది ఎక్కువే మరి" అన్నాడు అవధాని.
    గోపాలకృష్ణ లేచి నిలబడ్డాడు. "సరే - అయితే మీఇష్టం నా దగ్గిర బేరాలు కుదరవు . ఇది ఎంతో రిస్కుతో కూడుకున్న వ్యవహారం .అందువల్ల ఎరిగున్న వాళ్ళు చెబితే వచ్చ నేను. అందరి దగ్గరా ఈ పనికి ఒప్పుకునే రకం కాదు. అదీ కాక రిజల్టు గ్యారంటీ ఇస్తున్నాను . నేను ప్యాసు చేయించ లేకపోతె మీడబ్బు మీకు తిరిగి వచ్చేస్తుంది."    
    అవధాని కంగారు పడుతూ "అలా లేచి వెళ్ళిపోకండి మరి. నన్ను కాస్త ఆలోచించు కొనివ్వండి. డబ్బు తిరిగి ఇచ్చేయడం గురించి మాట్లాడుతున్నారు. అంటే మీ ప్రయత్నాలు ఫలించక పోయే అవకాశాలు కూడా ఉన్నాయా?" అన్నాడు అనుమానంగా.
    "ఎందుకు లేవూ? మీ వాడికి బొత్తిగా నూటికి పదో పదిహేనో మాత్రమే మర్కులోచ్చేయనుకోండి అప్పుడు నేను చేయగలిగేదేమీ ఉండదు."
    "మావారు ప్యాసుకు దగ్గరలోనే ఉంటాడు లెండి. ముందుగా మీరు కాస్త వాడి మార్కుల సంగతి కనుక్కోండి . ప్యాసయ్యే అవకాశమున్నదీ లేనిదీ చెబితే, అప్పుడు...."
    'చూడండీ అవధాని గారూ! మార్కులు తెలుసుకోవడాని కింకా చాలా వ్యవధి ఉంది. అప్పుడు మీకు సహాయం చేయడం ఇంకా కష్టం అవుతుంది. అందువల్ల మీకు సహాయం చేయడం ఇంకా కష్టం అవుతుంది. అందువల్ల మార్కులు తెలిశాక నాచార్జి పెరిగిపోతుంది. మీవాడికి అయిదు మార్కులు తక్కువోచ్చాయనుకోండి. అప్పుడు మార్కుకి రెండు వందల చొప్పున ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతే కాదు మార్కులు తెలుసుకుని వచ్చినందుకు ఎక్స్ట్ ట్రా ఫీజు వందరూపాయలిచ్చు కోవలసి ఉంటుంది. ఇప్పుడే మీరో నిర్ణయాని కొస్తే . మీరు అంతా కలిపి అయిదు వందలు అంతే!"
    "ఒకవేళ మావాడు ప్యాసయి వుంటే ...."
    "ఎంత మాట! ప్యాసైనవాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తానా? పువ్వుల్లో పెట్టినట్లు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎటొచ్చీ ఈ శుభవార్త మీ కందించినందుకు నాకు దారి ఖర్చు లిప్పించే యగలిగితే ఆనందిస్తాను. ఆపైనా మీ ఇష్టా ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. బలవంతం లేదు"
    అవధాని ఒక్క క్షణం ఆలోచించాడు. "సాయంత్రానికి మీరడిగిన డబ్బిస్తాను"అన్నాడు.

                               *    *    *    *

    "నువ్వేమీ సందేహించనక్కర లేదోయ్ అతన్ని పూర్తిగా నమ్మవచ్చు" అన్నాడు శర్మ.
    'ఒక్కటే అనుమానం. ఒకవేళ మావాడు ప్యాసయ్యాడనుకో . ఇతను కాలేదని అబద్దమాడితే...."
    "నో నో నో ! ఆతనలాంటి మనిషి కాదు. అయినా మార్కుల విషయంలో అబద్దం చెప్పి తన వ్యాపారాన్ని పాడుచేసుకునే ఫూల్ కాడతను. ప్యాసు మార్కుల కంటే మీవాడికి మరీ ఎక్కువ వస్తే తనంతట తనే ప్యాసయ్యాడని ఎవరికైనా అర్ధమై పోతుంది. అందువల్ల అలాంటి మోసం చేయడతను."
    "అయితే నమ్మి అతనికి డబ్బు ఇమ్మంటావ్?"
    "నమ్మవచ్చంటాను నేను. డబ్బివ్వడం నీ ఇష్టం ."

                               *    *    *    *

    "కంగ్రాచ్యులేషన్స్ అవధాని గారూ! ఇవిగో మీ అయిదు వందలు. మీవాడు పరీక్ష ప్యాసయ్యాడు. అనవసరంగా మీరు భయపడ్డారుకానీ మీవాడికి ఇంగ్లీషులో నూటికి యాభై మార్కులు వచ్చాయి" అన్నాడు గోపాలకృష్ణ.
    అవధాని ముఖం వెలిగింది. అతను సంతోషంగా డబ్బు తీసుకుని అందులోంచి యాభై రూపాయలు తీసి ఇచ్చాడు గోపాలకృష్ణ కు.
    గోపాల కృష్ణ ఆ నోట్లు అందుకుని,"కానీ - నేను నాకు ఖర్చులిస్తే చాలన్నానే" అన్నాడు.
    "అవుననుకోండి . కానీ మీరు శుభవార్త తెచ్చారు. ఇది నా సంతోషం కొద్ది ఇచ్చాను."    
    "అందరికీ ఇలా శుభవార్త లు తేగలిగితే చాలా బాగుండేది. కానీ ఒక్క మీ కేసు తప్పితే మిగతావన్నీ ఫెయిలయిన కేసులే. వాటిలో ఇరవై మూడు కేసులు మాత్రం నెగ్గేలా ఉన్నాయి. చూడాలి. ఏమవుతుందో" అని గోపాలకృష్ణ అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయాడు.
    "ఇరవై మూడు కేసులంటే -- ఇతని ఆదాయం ఎంతన్న మాట?" అని గుణించుకుని గుండె బాదుకున్నాడు అవధాని.

                                       2
    "నా శాయశక్తులా ప్రయత్నించాను కానీ మీ వాడికి మరీ తక్కువ మార్కులోచ్చాయి . పది మార్కులకు మించి కలపడానికి ససేమిరా అంగీకరించా లేదు. ఎగ్జామినర్ అవి కలపగా ఇంకా పది మార్కులు కావలి మీవాడికి" అంటూ డబ్బు తిరిగి ఇచ్చేశాడు గోపాలకృష్ణ.
    అతనిచ్చిన నోట్లని అందుకుంటూ , "అంతా నా దురదృష్టం. పరీక్షలు కాగానే- మీ చెవిన వేశాను. మీరు పేపర్లేక్కడికి వెడుతున్నాయో కనుక్కుని, వెళ్ళి శ్రమపడి వచ్చారు. కానీ ఫలితం లేకపోయింది" అన్నాడు రామానాధం.
    "ఏం చేస్తాం. నా శ్రమ వృధా అయిన చోట దారి ఖర్చులు కూడా మినహాయించుకొను నేను-" అన్నాడు గోపాలకృష్ణ.
    "యెంత మాట! మీరు వద్దన్నా మీ కష్టం ఉంచుకుంటానా నేను? మావాడి రాత బాగోలేకపోతే దానికి మీరేం చేస్తారు?" అంటూ, రామనాధం కొంత డబ్బు ఇవ్వబోయాడు. కానీ గోపాలకృష్ణ పుచ్చుకోలేదు. అక్కణ్ణించి లేచి మరో ఇంటికి బయల్దేరాడు.
    పరీక్షల సీజను లో గోపాలకృష్ణ చాలా బిజీగా ఉంటాడు. ఆ జిల్లాలో పరీక్షలు కాగానే కాస్త అనుమానంగా ఉన్న ప్రతి వారికి గోపాలకృష్ణ తో అవసరం పడుతుంది. విషయం అతని చెవిన పడేస్తే అతను ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఆరంభ దశలోనే చెప్పిన వాళ్ళ గురించి అతను ఎగ్జామినర్ ఎవరో తెలుసుకుని, అక్కడికి వేడతానంటాడు. కొంచెం ఆలస్యంగా చెప్పిన వాళ్ళ గురించి - రిజిస్టారు ఫీసు లో క్లర్కు ద్వారా మానేజ్ చేస్తానంటాడు. ఈ రెండు పద్దతుల ద్వారా అతను ఆ సీజను లో డబ్బు బాగా సంపాదిస్తాడు.
    అతని సంపాదన నిర్విఘ్నంగా కొనసాగిపోడానికి  కారణం మరొకటుంది. అతను ఎవరినీ మోసం చేయడు. ఎవరిలోనూ అవసరమైన ఆశలు రేకెత్తించడు. ప్రయత్నాలు తను చేస్తానంటాడు. అందరికీసరియైన సమాచారమే అందజేస్తాడు. తన ప్రయత్నాలు ఫలించినప్పుడు నమ్మకంగా డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు.
    రామనాధం ఇంటి దగ్గర్నుంచి గోపాలకృష్ణ తిన్నగా బసవరాజు ఇంటికీ వెళ్ళాడు. బసవరాజు ముందు జాగ్రత్త మనిషి. అయన తన కొడుక్కి అనుమానమున్న పేపరు సంగతి చాలా ముందుగానే గోపాలకృష్ణ కార్య రంగంలోకి దూకి, ఎగ్జామినర్ ని పట్టి ఫలితం సాధించాడు. బసవరాజు కొడుకు ప్యాసయ్యాడు.
    ఆ సంవత్సరం గోపాలకృష్ణ ఎగ్జమినర్స్ ని పట్టి పద్దెనిమిది మందిని , రిజిస్ట్రారాఫీసులో గుమాస్తా ద్వారా మరో ఏడుగురినీ ప్యాసు చేయించి పది పదిహేను వేల వరకూ సంపాదించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS