Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 16


                                                           3    
    "నిక్షేపంగా మనూళ్ళో సెంటరుండగా అబ్బాయి నెక్కడో గుంటూరు సెంటరుకు పెట్టించారేమండీ?" అంది గోపాలకృష్ణ భార్య ప్రమీల.
        "ఏదో కారణం లేనిదే నేనలా చేయనని నీకు తెలుసు గదా-"
    "ఏం కారణమో మేమిటో, అక్కడ మన కేవరున్నారు?" ఓ చుట్టమా...."
    "ఎవరుండా లేమిటీ, నేను కుర్రాడితో పెళ్ళి పరీక్షలు రాయించి తీసుకొస్తాను."
    "హాయిగా మనూళ్ళోనే అయితే...."
    "మనూళ్ళో అయితే మనవాడి నంబరు , అందరికీ తెలిసి పోతుంది. కర్మకాలి వాడు ఫెయిలయితే....."
    "మనవాడు ఫెయిల్ కావదమేమిటండీ? వాడు చాలా తెలివైనవాడు. అదీకాక ఆపైన మీ ప్రయత్నాలుండనే ఉన్నాయి."
    "ఆ సంగతే చెబుతుంట. మన దురదృష్టం కొద్దీ నా ప్రయత్నాలు ఫేయిలయ్యాయనుకో. వీడికి చాలా తక్కువ మార్కులొస్తే నేను చేయగలిగేదేమీ ఉండదు. కానీ అప్పుడు జనానికి నామీద నమ్మకం పోతుంది. కన్నకొడుకునే ప్యాసు చేయించుకోలేని వాడు ఇతరుల విషయంలో ఏం చేయగలడులే అనుకుంటారు. అందువల్ల నా వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి, వీడి పరీక్షా ఫలితాలకి సంబంధించిన నిజం నలుగురికీ అందుబాటులో ఉండకూడదు."
    భర్త ఆలోచనను అభినందించకుండా ఉండలేకపోయింది. ప్రమీల, నిజమే! లోకులు కాకులు.
    గోపాలకృష్ణ కొడుకు గుంటూరు లో పరీక్షలు వ్రాశాడు.

                            *    *    *    *

    "గుంటూరు సెంటర్లో ని పేపర్లు ఎక్కడి కెళ్ళాయో చెప్పగలవుటోయ్?"
    సూర్యం ఆశ్చర్యంగా చూశాడు. గోపాలకృష్ణ వంక "ఎందుకూ?"
    "ఆ ఎగ్జామినర్ ని పట్టాలి."
    "కాయ్. నా సామిరంగా! నా దగ్గరే వేస్తున్నావేమి నీ చిట్కాలు?"
    "లేదు సూర్యం. సీరియస్ గానే అడుగుతున్నాను."
    "అయాం వెరీ సారీ! ఈ విషయంలో నీకేమీ హెల్ప్ చేయలేను. నావల్ల అయ్యేదల్లా మార్కులు చెప్పగలగడమే.
    "రిజిస్ట్రా రాఫీసులో ఇన్నేళ్ళు గా పనిచేస్తున్నావు, ఎగ్జామినర్సేవరో తెలుసుకోలేమంటావా?"
    "అది చాలా సీక్రెట్ పద్దతిలో జరుగుతుంది. పేపర్ల అన్నింటికీ రీ నంబరింగ్ జరుగుతుంది. అలా రీనంబరింగ్ జరిగేక అసలు నంబరు పేపరు మీద ఉండదు. కొత్త నంబరు మాత్రమే ఉంటుంది. ఆ కొత్త నంబర్స్ కి కరస్పాండింగ్ పాత నంబర్స్ తెలుసుకోవాలంటే రిజిస్ట్రారు ను కలుసుకోవలసిందే."
    "అయితే ఏం లాభం లేదంటావ్?"
    "ఏమీ లాభం లేదు. కానీ ఏమిటి సంగతి?"
    "మావాడు పరీక్షలు రాశాడు. అన్నీ బాగానే రాశానంటున్నాడు. కానీ లెక్కల విషయంలో నాకు కొంచెం అనుమానంగా ఉంది."
    సూర్యం నవ్వాడు. "ఐసీ! ఇంతకాలం ఇతరుల విషయం కాబట్టి ఎగ్జమినర్స్ దగ్గరకు కేడుతున్నానని చెప్పి, ఎక్కడికో పోయి హాయిగా ఓ పది రోజులు గడిపి వచ్చేసే వాడివి. ఇప్పుడు నీ కొడుకు సంగతి వచ్చేసరికి తెలుస్తోంది బాధ."
    "సూర్యం. మావాడి పరీక్ష పొతే నాకు పెద్ద బాధ లేదు. కానీ అందువల్ల నా వ్యాపారం పడిపోతుంది. కన్నకొడుకునే ప్యాసు చేయించుకోలేక పొతే ...."
    "నువ్వన్నది నిజమే, నీ వ్యాపారం పడిపోతే నాకూ నష్టమే, ఏమైతే ఏంలే, మార్కులు నా చేతిలో ఉన్నవే గదా! చూద్దాం!"

                              *    *    *    *

    "నీ ఉత్తరం చూడగానే ఉరకలు పరుగుల మీద వచ్చి వాలాను." అన్నాడు గోపాలకృష్ణ.
    "అవును మరి. మీ వాడికి లెక్కల్లో రెండు మార్కులు తక్కువోచ్చాయి" అన్నాడు సూర్యం.
    "ఎలాగో అలా వాడు ప్యాసు కావాలోయ్ సూర్యం. ఎంత ఖర్చయినా సరే!" ఆవేశంగా అన్నాడు గోపాలకృష్ణ.
    'అన్నీ తెలుసుండీ ఎందుకలా అవేశాపడతావు? డబ్బుకు మార్కులు కొనగలమా?"
    "ఎందుకు కొనలేమూ? యూనివర్సిటీ లో అలాంటి సందర్భాలు లేవా?"
    "లేవని నేననను. కానీ అటువంటివి మనకు అందుబాటులో లేవని మాత్రం చెప్పగలను. అయినా కంగారెందుకూ? మీవాడు తప్పక ప్యాసవుతాడు."
    "ప్యాసాతాడంటావా?అన్నీ సబ్జక్టు ల్లోనూ ప్యాసై ఒక్కదాంట్లో కొద్ది మార్కులు తక్కువొచ్చిన వాళ్ళను ప్రతి ఏటా మార్కులు కలుపుతూనే ఉన్నారు. ఏటా ఒక కమిటీ మీటయి ఎన్ని మార్కులు కలపవచ్చున్నది నిర్ణయిస్తూనే ఉంది. ఈ సంవత్సరం మాత్రం అలా ఎందుకు జరగదనుకుంటున్నావు?"
    "ఎన్ని మార్కులు కలపవచ్చునంటావు?"
    "అదే కమిటీ మీటయ్యే వరకూ తెలియదు. సాధారణంగా ఒకటో రెండో మార్కులు ఎలౌచేస్తారు. కుర్రాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుందది. పేపర్ల బాగా కష్టంగా ఉన్నాయనిపిస్తే ఒక్కోసారి పది మార్కుల దాకా కలుపుతారు.అయితే అది ఏ పేపరు కష్టంగా ఉంటె దానికే వర్తిస్తుంది."
    "ఈ ఏడాది లెక్కల పేపర్లు చాలా కష్టంగా ఉన్నాయి. మరి."
    "మీవాడికి కష్టంగా ఉంటె చాలదు. మొత్తం అందరికీ కష్టంగా ఉండాలి మరి" అని నవ్వాడు సూర్యం. 'అనవసరంగా కంగారు పడకు. నాల్రోజుల్లో అన్నీ తెలుస్తాయి. ఇక్కడే ఉండిపో"
    గోపాలకృష్ణ అక్కడ నాలుగు రోజులున్నాడు. ఆ నాలుగు రోజులూ కూడా అతను టెన్షన్ లో ఉన్నాడు. ఆ టెన్షన్ లోనే అతను ఏడు కొండలవాడికి మొక్కుకున్నాడు కూడా. కొడుకు పరీక్ష ప్యాసైతే తల నీలాలిస్తానని.
    ఏడుకొండల వాడి మహిమ రుజువయింది. ఆ సంవత్సరం లెక్కల్లో తక్కువొచ్చిన వారందరికీ నాలుగు మార్కుల వరకూ కలపవచ్చునని కమిటీ నిర్ణయించింది.
    ఈ వార్త వింటూనే గోపాలకృష్ణ ఎగిరి గంతేసినంత పని చేశాడు. "నేను దేవుడికి మొక్కుకున్నానోయ్ సూర్యం. ఇదంతా ఆ దేవుడి చలవే!"
    "ఇందులో దేవుడి దేముందోయ్! ఎప్పుడూ జరుగుతున్నదే ఈ ఏడూ జరిగింది."
    గోపాలకృష్ణ కు ఏదో స్పురించింది. "అయితే మనమూ దేవుడి లాంటి వాళ్ళమేనోయ్ సూర్యం. మనవల్ల పని అవుతుందని నమ్మి అనేకమంది మనకు డబ్బు ఇస్తున్నారు. మనం చేసేదేమీ లేదు. ఫలితాల కోసం వేచి ఉంటున్నాం. ఫలితం వస్తే మనకు క్రెడిట్ వస్తోంది. లేకపోతె అది వాళ్ళ ఖర్మ. దేవుడూ అంతే గదా! మ్రొక్కుతున్న వారందరి కోరికలూ తీర్చదాయన. కోరికలు తీరిన వారాయన మహిమను పొగుడుతుంటారు. తీరని వారు తమ ఖర్మను నిందించుకుంటారు."
    'అక్రమ మార్గాల్లో ఫలితాలు సాధించాలను కునే వారు ఎంతకాలం దేవుడికీ,మనలాంటి వాళ్ళకూ సంపాదనకు లోటుండదు" అన్నాడు సూర్యం."

                                     ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS