Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 15

 

    అప్పుడు వనజ వంట్లో శక్తి లేదు. ఆమె ఆ యువకుడు చెప్పినట్లు చేసింది.  
    దారిలో శ్రీరాం అన్నాడు -- "ఈ విషయంలో రిక్షావాడిని తప్పు పట్టి లాభం లేదు. వాడి కటువంటి అవకాశ మివ్వడం మనదే తప్పు -- అందులోనూ మీ అందం సాధారణమైనది కాదు."
    వనజ సిగ్గుపడింది .
    శ్రీరామ్ ఆమెను ఇంటి వద్ద దింపాడు. వనజ అతడికి ధన్యవాదాలు చెప్పి చిరునామా తీసుకొన్నది.

                                   4
    తనకు జరిగిన అనుభవం వనజ ఇంట్లో చెప్పుకోలేదు. అంత రాత్రి వేళ సాహసించి స్టేషను నుంచి ఇంటికి ఒంటరిగా వచ్చినందుకు ఇంట్లో అంతా ఆమెను కోప్పడ్డారు.
    మర్నాడు సుమిత్ర వాళ్ళింటికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుని జరిగినదంతా చెప్పుకుంది. వనజ , సుమిత్ర వంక నిర్లక్ష్యంగా చూసి -- "నీ ముఖం చూడగానే వాడికి ధైర్యం వచ్చి వుండాలి. నా రిక్షావాడు నోరు మూసుకుని రిక్షా తొక్కాడు " అన్నది. జరిగిందేమిటో ఆమె ఎవ్వరికీ చెప్పదల్చుకోలేదు.
    "ఎలాగైనా నువ్వు అదృష్టవంతురాలివి . నీ రిక్షావాడు నాకూ, నా రిక్షావాడు నీకు తగలాల్సింది --అప్పుడు తెలిసేది నీ ప్రతిభ" అన్నది సుమిత్ర.
    వనజకు తన అదృష్టం మీద నమ్మకం వున్నది. నిజానికి వనజ కూడా సుమిత్రకులా ప్రవర్తించి వుంటే రిక్షావాడామె జోలికి వచ్చి వుండేవాడు కాదు. ఆమె రిక్షావాడిని రెచ్చగొట్టింది. అప్పుడే వాడికి తను మగాడు, ఆమె ఆడది అని గుర్తుకు వచ్చింది. తన శక్తిని చూపాలనుకున్నాడు. అటువంటి పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుని కూడా ఆమె ఆ ఇబ్బంది నుంచి బయటపడగలిగింది. అదృష్టం శ్రీరామ్ రూపంలో వచ్చింది.
    "నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకో అనుమానం కలుగుతున్నది. ఆ రిక్షావాడు కేవలం డబ్బు తీసుకుని నిన్ను వదిలి పెట్టాడా అని ?" అన్నాది వనజ.
    "పోనీ వదిలి పెట్టలేదనుకో " అంది సుమిత్ర.
    "మరి...."
    సుమిత్ర తేలికగా నవ్వి -- 'ఇప్పుడు మా అక్కకు నగ చేయించి ఇవ్వాలి. పోరుగింటావిడకు కొత్త వాచీ కొనివ్వాలి. పక్కింటాయన బాకీ తీర్చాలి. నేను పోగొట్టుకున్న వాటిలో ఇవే నాకు విలువైనవి" అన్నది.
    వనజ నిట్టూర్చి -- "కొన్ని కొన్ని విషయాలు నేను నీ అంత తేలికగా తీసుకోలేదు" అన్నది.
    'అదృష్టవంతురాలివి . ఎరువు సరుకులతో బయల్దేరాను. అన్నీ పోయాయి. అదే పరిస్థితుల్లో నీకేమీ పోలేదు. " అన్నాడు సుమిత్ర. ఆమె మనసులో నిజంగానే వనజంటే అసూయ పడుతున్నది. ఇప్పుడు తన కష్టాలు గట్టెక్కాలంటే తనకా ఉద్యోగం రావాలి. అయితే వనజ చాలా అదృష్టవంతురాలు. ఆ ఉద్యోగం వనజకే వస్తుందేమో నన్న భయం  సుమిత్రకున్నది."
    కానీ ఉద్యోగం విషయంలో ఇద్దరి అదృష్టమూ ఒకే విధంగా వున్నది. ఉద్యోగం ఇద్దరికీ వచ్చింది.
    జీతం నెలకు అయిదు వందలు.
    స్నేహితురాండ్రిద్దరూ కలిసే మళ్ళీ బయల్దేరారు. అయితే వనజ సుమిత్ర అంత ఉత్సాహంగా లేదు. *-కారణం శ్రీరామ్!
    ఇంటర్వ్యూ నుంచి తిరిగి వచ్చినప్పట్నించీ ఆమె తరచుగా శ్రీరా'మ్ ను రహస్యంగా కలుసుకుంటున్నది.
    శ్రీరామ్ నిరుద్యోగి. ఎంకం ప్యాసయ్యాడు. మంచి ఆటగాడు. రెండేళ్ళుగా ఉద్యోగ ప్రయత్నంలో వున్నాడు. అతడి తల్లిదండ్రులు పూర్తిగా అతడి పైనే ఆధారపడి వున్నారు. అతడికి అప్లికేషన్ పెట్టడానికి కూడా డబ్బు దొరకని స్థితిలో వున్నాడు.
    శ్రీరామ్ ది పేకాటలో హస్తవాసి మంచిది. కొందరు స్నేహితులతడిని తన తరపున ఆడిపెట్టమని బలవంత పెడుతుంటారు. పెట్టుబడి స్నేహితుడిది. నష్టం వచ్చినా స్నేహితుడిదే -- లాభం వస్తే మాత్రం నాలుగో వంతు శ్రీరామ్ కి వస్తుంది. ఈ విధంగా శ్రీరామ్ నెలకు యాభై రూపాయలు తక్కువ లేకుండా సంపాదిస్తున్నాడు. అ డబ్బే అతడు పై ఖర్చులకూ, ఇతరాలకూ ఉపయోగపడుతున్నది.
    చాలా తొందరగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
    "మన ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం వచ్చినా -- మనం వెంటనే పెళ్ళి చేసేసుకుందాం " అంది వనజ.
    "మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా ?" అన్నాడు శ్రీరాం.
    "మీ పెద్దల సంగతి , నీ సంగతి చూసుకో -- నేను మా యింట్లో అన్ని విధాల సర్వ స్వతంత్రురాలీని" అన్నది వనజ.
    "అయితే నాకు అంగీకారమే!" అన్నాడు శ్రీరాం.
    ఇప్పుడు వనజకు  ఉద్యోగం వచ్చింది. శ్రీరామ్ ను  అక్కడికి వచ్చేయమన్నదామె.
    "మా వాళ్ళను వదిలి ఎలా వచ్చేది?" పైగా అక్కడైతే అద్దె కూడా యిచ్చుకోవాలి. ఇక్కడ మాకు స్వంతిల్లు ఉన్నది" అన్నాడు శ్రీరాం.
    "నేనక్కడికి వెళ్ళి నీ కోసం ప్రయత్నిస్తాను " అన్నది వనజ.
    ఉప్పుడామెకు శ్రీరాం తో రోజూ మాట్లాడడం అలవాటయింది. అతణ్ణి చూడకుండా ఉండగలనా అనిపిస్తున్నదామెకు. అందుకే వెళ్ళి ఉద్యోగంలో చేరడానికి ఉత్సాహంగా లేదామెకు.

                                   5
    అదృష్టం మరోసారి వనజను కౌగలించుకున్నది.
    ఆమె బాస్ సత్యనారాయణ, అతడామెను తోలి చూపులోనే ప్రేమించాడు. ఆమెతో తరచుగా మాట్లాడుతుండేవాడు. ఏకాంతానికి ప్రయత్నిస్తుండేవాడు. వనజకు అతడి తీరు నచ్చలేదు. బాస్ కదా అని సహించింది.
    ఆఖరికి ఒకరోజున సత్యనారాయణ ఆమెతో "నన్ను నువ్వు తప్పుగా అర్ధం చేసుకోకూడదు. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఇష్టపడితే నిన్ను పెళ్ళి చేసుకుంటాను " అన్నాడు.
    వనజలో ఒక ఆకర్షణ వున్నది. ఆ ఆకర్షణకు చాలా మంది పురుషులు గురి అవుతుంటారు.
    "మీరు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే మీరు నా ప్రేమను గౌరవించాలి" అన్నది వనజ.
    'అంటే?" అన్నాడు సత్యనారాయణ.
    వనజ తన ప్రేమ కధ చెప్పుకుని "మీరు శ్రీరామ్ కు ఏదైనా దారి చూపించి మీ ప్రేమ ఎంత స్వచ్చమైనదో నిరూపించుకొండి" అన్నది.
    సత్యనారాయణ తన ప్రేమ స్వచ్చతను నిరూపించుకున్నాడు. ఫలితంగా ఆ ఉళ్ళో ని మరో కంపెనీలో శ్రీరామ్ కు నెలకు మూడు వందల రూపాయల జీతం మీద అప్రెంటీస్ ట్రెయినీగా పోస్టింగయింది.
    శ్రీరామ్ అక్కడకు వచ్చాడు. వనజ, అతడు చాలా స్వేచ్చగా తిరుగుతుండేవారు.
    "నేను నీకు చాలా ఋణపడి వున్నాను" అన్నాడు శ్రీరాం ఓ రోజున వనజతో.
    "భార్యాభర్తల మధ్య రుణాలుండవు " అన్నది వనజ.
    "మనమింకా భార్యాభర్తలం కాలేదు" అన్నాడు శ్రీరామ్.
    "ఏ క్షణంలో నువ్వు నన్ను ఆ రిక్షావాడి నుండి రక్షించావో అప్పుడే నా మనసులో భర్తగా స్థానం సంపాదించుకున్నావు. ఆ క్షణం నుంచీ మనం భార్య భర్తలం . మిగతా వన్నీ పెద్దవాళ్ళ ఫార్మాలిటీస్" అన్నది వనజ.
    "ఈ సంగతి ముందే చెబితే నేను నీకింత దూరంగా ఉండేవాడిని కాదు గదా" అంటూ కాస్త దగ్గరయ్యాడు శ్రీరామ్.
    వనజ అభ్యంతర పెట్టలేదు.
    ఆ విధంగా ఇద్దరూ ఒకటి కూడా అయ్యారు.
    శ్రీరామ్ కు జీవితం పై చాలా ఆశలున్నాయి. అతడు చాలా పెద్ద ఎత్తులో వున్నాడు. అతడి అభిరుచులకు అనుగుణంగా వనజ చేతనైంతలో ఆర్ధికంగా అతడికి సాయ పడుతున్నది.
    అలా ఓ సంవత్సరం గడిచింది.
    ఒకరోజున శ్రీరామ్ ఆమెతో "సారీ వనజా!' అన్నాడు.
    "నాకో మంచి పెళ్ళి సంబంధం వచ్చింది. వధువుతో ఇరవై వేల కట్నం. ఆపైన మంచి హోదా గల ఉద్యోగం. నా తల్లిదంద్రుడు లీ పెళ్ళి చేసుకోమని బలవంత పెడుతున్నారు...."
    "మరి నువ్వు నా సంగతి చెప్పలేదా?" అన్నది వనజ.
    'చెప్పాను , వాళ్ళకు నువ్వు నచ్చలేదు ...."
    "నువ్వూ మా వాళ్ళకు నచ్చవు. మనవాళ్ళ సంగతి వద్దు. నీ సంగతి చెప్పు....' అన్నది వనజ.
    "ముందు నీ సంగతి చెప్పు ?" అన్నాడు శ్రీరామ్.
    "నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే -- నీవు లేకపోతె నేను బ్రతకలేను. నాకు నువ్వు కావాలి" అన్నది వనజ.
    'అందుకే సారీ చెప్పాను " అన్నాడు శ్రీరామ్.
    'అంటే?"
    "నీమీదా చాలా కధలున్నాయి. ఉద్యోగంలో చేరిన అతి స్వల్ప వ్యవధిలో నీ బాస్ నా కోసం ఉద్యోగం వేయించాడు. ఆయనకంత అవసరమేమిటి? నేను నిన్ను నమ్ముతాను. కానీ లోకం నమ్మదు. నేను నీతో జీవించాలనుకుంటున్నాను. కానీ నీతో పాటు ఈ లోకంలోనే జీవించాలి. లోకాన్ని నేను విస్మరించలేను" అన్నాడు శ్రీరామ్.
    వనజ అతణ్ణి బ్రతిమాలిడింది. అతడి ముందు ఏడ్చింది. శ్రీరాం చలించలేదు.
    "నువ్వు వేరే పెళ్ళి చేసుకునే మాటైతే నన్ను చంపేసేయ్" అంది వనజ.
    "హత్యలు చేయడం నా వల్ల కాదు" అన్నాడు శ్రీరాం.
    అతడు దృడ నిశ్చయంతో వున్నాడు.
    "నీకోసం నన్ను ప్రేమించి పెళ్ళాడాలనుకున్న నా బాస్ ను వదులుకున్నాను" అంది వనజ.
    "అతడి ప్రేమను నువ్వు నమ్మావా వనజా? కొన్నాళ్ళ పాటు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆ పైన తనే నిన్ను వదిలించుకుందుకు చూసేవాడు" అన్నాడు శ్రీరాం.
    శ్రీరామ్ పచ్చ కామెర్ల రోగి కూడా అయ్యాడని వనజ గ్రహించింది.
    "శ్రీరాం ! అయితే యిక నువ్వు నాకు దక్కనట్లే .... బహుశా నేను ఆత్మహత్య చేసుకుంటాను."
    "ఇప్పుడలా అనిపిస్తుంది. తర్వాత అంతా మామూలై పోతుంది."
    "పోనీ నా ఆఖరి కోరిక తీరుస్తావా?"
    "ఏమిటది?"
    ఆ కోరిక శ్రీరామ్ కిష్టమయినదే. ఒక్కసారి అతడామెతో గడపాలి.
    శ్రీరాం సంతోషంగా అంగీకరించాడు.
    అప్పుడు వనజ అతణ్ణి కౌగలించుకుంది. అది ఎంతో బలమైన కౌగిలి. తను మనసారా ప్రేమించిన మగవాడు తనకు దక్కకుండా పారిపోతుంటే ఆపడం కోసం సర్వశక్తులూ క్రోడీకరించిన ఒక మగువ కౌగిలి అది.
    ఆ కౌగిలిలో ఉక్కిరిబిక్కిరవుతూనే ఆనందిస్తున్నాడు శ్రీరామ్. అయితే ఆ కౌగిలి వెన్నుపోటు పొడవడానికని అతడికి తెలియదు. తెలిసే సరికి బలంగా కత్తి అతడి వెన్నులో దిగబడింది.
    "దుర్మార్గుడా! స్త్రీలను వంచించే నీ వంటి వారిని నేను బ్రతకనిస్తా ననుకున్నావా?" అన్నది వనజ.
    వనజ చేతిలో శ్రీరాం చచ్చిపోయాడు.

                        *    *    *    *

    'ఆఖరికి నీ అదృష్టం యిలా తగలబడిందేమిటే ?" అంది వనజ తో సుమిత్ర.
    వనజ జైల్లో కటకటాల వెనుక వున్నది.
    సుమిత్రకు వనజ అప్పుడు శ్రీరామ్ తనకే విధంగా పరిచయమయినదీ చెప్పి, "ఆరోజు ఆ రిక్షావాడి చేతిలో మానభంగం పొందినా నాకీ దశ పట్టేది కాదు. ఎందుకంటె ఆ ఒక్క క్షణంలో వాడిమీద ద్వేషమే కలిగేది. తరువాత మనసు సరిపెట్టుకునేదాన్ని. కానీ ఈ శ్రీరాం నన్ను పూర్తిగా వశపరచుకున్నాడు. వాడు లేనిదే నేను బ్రతకలేననే స్థితికి నన్ను తీసుకుని వచ్చాడు. ఆరోజు నన్నలా రక్షించి, ఇప్పుడీ స్థితిని కల్పించాడు. ఆ రిక్షావాడు తలపెట్టిన మానభంగం కంటే వీడు తలపెట్టిన మానభంగం క్రూర మయినదీ, ఘోరమైనదీ" అన్నది.
    అప్పుడామే ఏడ్వడం లేదు.
    ఆమె చూపులు, మాటలు అమాయకురాలయిన ఆడపిల్లలను మాయమాటలతో వశ పర్చుకొవాలనుకునే దొంగ ప్రేమికులకు తిరుగులేని హెచ్చరికల్లా ఉన్నాయి.

                                   ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS