సుమిత్ర బొమ్మలా వుండిపోయింది. అన్నీ పోగొట్టుకున్నట్లే వున్నదామేకు.
"రిక్షాదిగు " అన్నాడు రిక్షావాడు.
"ఇక్కడా?" అన్నది సుమిత్ర.
"బాగుంది -- నిన్నిక్కడ దింపకుండా -- ఇంటిదాకా దిగబెట్టడానికి నేనేమైనా వెర్రాడిని అనుకున్నావా?" అన్నాడు రిక్షావాడు.
రిక్షావాడు సుమిత్రకు దారి చూపిస్తూ -- "ఇలా తిన్నగా వెళ్ళిపో -- దారిలో నీకే భయమూ వుండదు లే" అన్నాడు.
తెలికైనా బ్రీఫ్ కేసుతో సుమిత్ర రోడ్డు మీద నిలబడింది.
"నీ బెంగ నాకు తెలుసులే -- నా ఫ్రెండు నీ ప్రెండుని వదిలి పెట్టడులే -- ఆమెకూ వున్నదంతా పోతుంది" అంటూ వాడు సుమిత్రకు హామీ ఇచ్చాడు.
సుమిత్రకా రిక్షావాడిని వదిలి వెళ్లాలనిపించలేదు. ఏ దైవమైనా కరుణించి ఎవరైనా వస్తే బాగుండును. తన సర్వస్వమూ వాడి దగ్గరే వుండి పోయినట్లుంది. ఇప్పుడేలాగో అలాగ....
అయినా తనకంత అదృష్టమా!
ఆమె చూస్తుండగా రిక్షా వెనక్కు తిరిగింది. ఆమె చూస్తుండగానే రిక్షా కనుమరుగయిపోయింది.
సుమిత్ర ఉస్సురని నిట్టూర్చి తన ఇంటి వైపు దారి తీసింది. కన్నీళ్ళు ఆ దారిని తడుపుతూనే వున్నాయి -- ఆమె ఇల్లు చేరేవరకూ !
3
"చైను ఊడిందమ్మా!" అన్నాడు రిక్షావాడు.
"ఊ సరే -- తొందరగా కానీ" అన్నది వనజ.
కొద్దిసేపట్లో రిక్షా మళ్ళీ బయల్దేరింది. ఓ పావుగంటలో మళ్ళీ ఆగిపోయింది.
"మళ్ళీ చైను ఊడిందా?"
"లేదమ్మా - చైను నాకు కావాలి !' అన్నాడు రిక్షా వాడు.
"ఏం చైను ?" అన్నది వనజ.
"నీ మెడలోది ."
"రాస్కెల్ !" అంటూ రిక్షా దిగింది వనజ.
రిక్షావాడు ముందు కాస్త తడబడినా "ఏంటమ్మా -- మాటలు జాగ్రత్తగా రానీ" అన్నాడు.
"నీ నోటిని బట్టే నా నోరూ వుంటుంది " అంది వనజ.
'చూడమ్మా -- ఇక్కడ చుట్టూ ఎవ్వరూ లేరు. రమ్మన్నా ఎవరూ రారు. నేను నిన్నేం చేసినా దిక్కులేదు. మర్యాదగా నీ మెడలోని గొలుసూ , చేతీ వాచీ, పెట్టెలోని డబ్బు, బట్టలు - తీపి ఇచ్చేయి. లేదా - నేను నీవంటి మీద చేయ్యేయ్యాల్సోస్తుంది " అన్నాడు రిక్షావాడు.
వనజ చుట్టూ చూసింది. వాడు చెప్పిందాంట్లో అబద్దం లేదు, ఆమె బుర్ర చురుగ్గా పనిచేసింది.
"సరే - నువ్వు చెప్పినట్లే చేస్తాను" అంటూ రిక్షాలోని బ్రీఫ్ కేసు తీసి తెరుస్తున్నట్లుగా నటిస్తూ - మెరుపు వేగంతో రిక్షా వాణ్ణి ఒక్క తోపు తోసింది. వాడు పడగానే తను శక్తి నంతనీ పుంజుకుని పరుగు ప్రారంభించింది.
రిక్షావాడు క్షణాల మీద లేచాడు. రిక్షా ఎక్కాడు. వాడి అదృష్టమేమో - ముందున్న దంతా డౌను.
వనజ పరుగెడుతోంది. అలాంటి పరుగు ఆమెకు అలవాటు లేదు. పైగా ఓ చేతిలో బ్రీఫ్ కేసు బరువు, కేవలం భయం ఆమెను పరుగెట్టిస్తోంది.
రిక్షావాడు ఆమెను దాటించి, దారికి అడ్డంగా రిక్షా ఆపి, ఒక్క ఉరుకు ఉరికి -- "నన్ను తప్పించుకు పోదామను కున్నావా ?" అన్నాడు.
వాడి చేతిలో కత్తి వుంది.
"నీకు ప్రాణాలే ముఖ్యమో, డబ్బే ముఖ్యమో - త్వరగా తేల్చుకో " అన్నాడు వాడు.
వనజ కధ ఇంతదూరం వెడుతుందని ఊహించలేదు.
ఇప్పుడు తనేం చేయాలి?
మెడలో గొలుసు పొతే మళ్ళీ చేయించుకోవచ్చు. చేతికున్న వాచీ పొతే మళ్ళీ కొనుక్కోవచ్చు. పెట్టెలో నాలుగు చీరలు, రెండు వందల రూపాయల నగదు వున్నాయి. ఆ నష్టం పూడ్చుకోవడం పెద్ద కష్టం కాదు.
రిక్షావాడితో పెనుగులాడ్డం వల్ల తన ప్రాణం పోకపోయినా ప్రమాదకరమైన గాయాలు తగలవచ్చు. అవి తనకు అపకారం ఏర్పరచవచ్చు . తను శాశ్వతంగా ఏ గుడ్డిదో, కుంటిదో అయిపోతే?
"తొందరగా ఇవ్వు...."
వనజ వాడికి తన మెడలోని గొలుసు ఇచ్చింది. చేతి వాచీ ఇచ్చింది. పెట్టె తెరిచి చీరలు, డబ్బు ఇచ్చింది.
రిక్షావాడు నవ్వాడు.
"ఇంకా కావాలి నాకు."
"ఇంకేం లేవు ! అంది వనజ భయంగా.
"పెట్టెలో బట్టల కంటే నువ్వు కట్టుకున్న బట్టలు బాగున్నాయి" అన్నాడు రిక్షావాడు.
'అయితే...."
'అయితే లేదు -- గియితే లేదు -- అవి కూడా ఇచ్చేసేయ్...."
వనజకు మతి పోయినట్లయింది.
రిక్షావాడు నవ్వుతున్నాడు-- "నేనూ ధర్డు ఫారందాకా చదువుకున్నాను. ఓ చిన్న ఉద్యోగం దొరికినా, బుల్లి వ్యాపారం పెట్టుకున్నా ఏ సినిమా హీరో లాగో వుండేవాణ్ణి. ఇలాగున్నానని కంగారుపడకు. నీ బట్టలు అడగను -- అలా పక్కకు పోదాం రా ."
వనజ మాట్లాడలేదు.
"బట్టలిస్తావా ? పక్కకు వస్తావా ?"
రెండూ అవమానకరమైనవే!
సుమిత్ర మాట విని స్టేషన్లో వుండిపోతే ఏ ఇబ్బందీ వుండేది కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? రిక్షావాడు చాలా దుర్మార్గుడిలా వున్నాడు.
వనజ వాడిని అంతటితో వదిలేపెట్టమని బ్రతిమాలింది.
"చేతిలో కత్తి వుంది. కత్తంటే నీకు భయముంది. మంచి ఒంటరి ప్రదేశం -- నీలాంటి ఆడది నాకు డబ్బిచ్చినా దొరకదు. ఇలాంటి అవకాశాన్ని నేను పోగొట్టుకోలేను" రిక్షావాడు ఆవేశంతో వున్నాడు.
"ప్రాణాలు పోయినా నేనిందుకు అంగీకరించను" అంది వనజ.
ఆమె రోడ్డు వైపే ఆశగా చూస్తున్నాది. ఎక్కడా నర సంచారం లేదు.
రిక్షావాడామె మీద పడ్డాడు. ఆమె వాడిని వెనక్కు తోసింది. ఇద్దరి మధ్యా పెనుగులాట ప్రారంభమైంది . రిక్షావాడు ఆవేశంతో పరిసరాలు మరిచిపోయాడు. వనజ జీవితంలో ఇదే అంతిమ పోరాటమన్నట్లు ప్రతిఘటిస్తున్నది.
సరిగ్గా అప్పుడు సైకిలు బెల్లు ఒకటి వినబడింది.
వనజ రిక్షావాడు - ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు.
'అప్పుడే సైకిలు దిగిన ఓ యువకుడు సైకిలు స్టాండ్ వేస్తున్నాడు.
మొదటిసారిగా రిక్షా వాడిలో కంగారు కనబడింది. అయితే వాడు మరోసారి పరిసరాలు చూసుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. తన చేతిలో కత్తి వున్నది.
"రక్షించండి ?" గట్టిగా అరిచింది వనజ.
ఆ యువకుడు రిక్షా వాడిని ఎదుర్కున్నాడు. క్షణాల మీద వాడిని మట్టి కరిపించాడు.
వనజ రెండూ చేతులూ ఎత్తి ఆ యువకుడికి దణ్ణం పెట్టింది.
వనజకు రిక్షావాడు తీసుకున్న వస్తువులు వెనక్కు వచ్చేశాయి.
"నా పేరు శ్రీరాం" అన్నాడా యువకుడు -- "స్నేహితులతో పేకాడి ఇప్పుడు తిరిగి ఇంటికి వెడుతున్నాను."
వనజ క్లుప్తంగా తన కధ చెప్పి -- "సమయానికి మీరు రాకపోతే బహుశా నా ప్రాణం పోయి వుండేది" అంది.
ఆడపిల్లలు ఒంటరిగా రాత్రి సమయంలో ఇలా బయల్దేరడం ప్రమాదం" అన్నాడా యువకుడు.
వనజ బుద్దిగా తలూపింది.
శ్రీరాం రిక్షావాడిని రిక్షా ఎక్కమన్నాడు. కానీ వాడు కదలకుండా పడి వున్నాడు. రిక్షా తొక్కే స్థితిలో లేడు.
"నేను నడిచి వెడతాను" అన్నది వనజ.
"మిమ్మల్ని ఇంటి దగ్గర దిగ విడుస్తాను. సైకిలు వెనకాల కూర్చోగలరా?" అన్నాడతను.
