తర్వాత అతడు వచ్చే పర్చేజాఫీసర్ డేనియల్ని, స్టోర్సాఫీసరు వెంకట్రామయ్యని కలుసుకున్నాడు. వాళ్ళతో మాట్లాడేక-మధుమూర్తి వద్ద ఎక్స్-32 ఉన్న విషయం ఆ ఆఫీసర్సు కేకాక-ఆ డిపార్టు మెంటులో గుమస్తాలందరికీ తెలుసని అర్ధమయింది. ప్రత్యేకించి ఏ ఒక్కరినీ అనుమానించడం కష్టం.
3
డిటెక్టివ్ వెంకన్న శంకర్రావుని కలుసుకుని సెంట్రల్ గవర్నమెంటు లాబరేటరీలోని కొందరు ఉద్యోగుల పేర్లు చెప్పి-"కొన్నాళ్ళపాటు వీరిపై నిఘా ఉంచి-వీరి దినచర్యలు తెలుసుకోండి-" అన్నాడు.
"పనికివచ్చే సమాచారం దొరికిందా?"
"లేదు. కానీ ఎక్స్-32 ప్రయోగంతో సుబ్బారావు చనిపోయాడన్న విషయం మీరింకా బైట పెట్టలేదుకదా అది నేనక్కడ బైట పెట్టాను. ఫలితంగా లాబొరేటరీలో చర్చలు ప్రారంభమవుతాయి. ఆసక్తికరమైన విశేషాలు బైటపడవచ్చు"
"బైటపడినా మనకెలా తెలుస్తాయి?" అన్నారు శంకర్రావు.
"ఊళ్ళో నాకు కొందరు అభిమానులున్నారు. ఇలాంటి విషయాల్లో సాయపడడం వాళ్ళకు సరదా, ఒకరుకాదు-ఇలాంటి వారు వందల్లో ఉన్నారు. అదో పెద్ద నెట్ వర్కు ఆ నెట్ వరకును వదిలిపెడుతున్నాను. పనికొచ్చే సమాచారం చాలా దొరుకుతుంది...."
"దొరక్కపోతే?"
"ఇట్నించి నరుక్కు రావడమయింది-ఇక అట్నించి నరుక్కు వస్తాను...." అన్నాడు వెంకన్న.
"అంటే?"
"వసంత మామూలు మనిషవుతోంది. సుబ్బారావు వ్యక్తిగత విశేషాలు సేకరించాలి కదా...." అన్నాడు వెంకన్న.
శంకర్రావు వెంకన్నతో కరచాలనంచేసి- "ఈ కేసులో మీరు తొందరగా విజయం సాధిస్తారు...." అన్నాడు.
"అప్పుడు మీ దగ్గర ఫీజు వసూలు చేస్తాను-" అన్నాడు వెంకన్న.
"తప్పకుండా యిచ్చుకుంటాను. డబ్బుతో వెలకట్టలేని ఫీజు...."
వెంకన్న అక్కన్నిమ్చి ఇంటికి వెళ్ళాడు. అక్కడ సీతమ్మ, రాజమ్మ అతడికోసం యెదురు చూస్తున్నారు. వారి ముఖాల్లో ఉత్సాహముంది.
"ఏమైనా పనికివచ్చే సమాచారం లభించిందా?"
"అవును బాస్!" అంటూ సీతమ్మ అతడికి కాగితాలందించింది.
వెంకన్న ఆ కాగితాలు చూసి - "సెభాష్!" అన్నాడు.
అది సీతమ్మ, రాజమ్మ కలిసి సంయుక్తంగా తయారు చేసిన నోట్సు సాధారణంగా ఆ అసిస్టెంట్సిద్దరూ విడి విడిగా నోట్సు తయారుచేస్తారు. కలిసి పనిచేసినపుడల్లా మాత్రం ఫలితం విడివిడిగా చేసినప్పటికంటే అద్బుతంగా ఉంటుంది.
విన్నదాని కిద్దరి ఊహాశక్తి జోడించగా తయారయిన నోట్సంది. వెంకన్న నోట్సును శ్రద్దగా మూడుసార్లు చదివాడు.
సుబ్బారావుకు లాబొరేటరీ అంటే ప్రాణం. సైన్సు తప్ప ఇంకో ధ్యాస లేదతడికి తను కనిపెట్టిన విశేషాల నతడు సులభపద్ధతిలో భార్యకు కూడా చెబుతూంటాడు. అతడి కారణంగా ఆమెకూ వైజ్ఞానిక పరిశోధనలంటే ఆసక్తి కలిగింది. కొత్త పత్రిక రాగానే సీరియల్ నవల గురించి యెదురుచూసినట్లు-రోజూ భర్త రాకకోసం సాయంత్రాలెదురు చూసేది వసంత. ఆ రోజు పరిశోధనల వివరాలడిగేది. సుబ్బారావెంతో సంతోషంగా ఆమెకన్నీ వివరించి చెప్పేవాడు.
సుబ్బారావుకు ప్రచారం గిట్టదు. అతడు చాలా గొప్ప విషయాలే పరిశోధిస్తున్నాడు. అతడి పరిశోధనా ఫలితాలు విదేశీ పత్రికల్లో వచ్చాయి. కానీ అతడు ఇంటికి వచ్చే మిత్రులతో లాబొరేటరీ విశేషాలు మాట్లాడడు. తన పరిశోధనల గురించి చెప్పడు. భార్యతోనూ, సైంటిస్టులతోనూ మాత్రమే అతడు వాటిని గురించి మాట్లాడతాడు. కానీ ప్రవీణ్ కుమార్ ను మాత్రం ఇందులో మినహాయించాలి. అతడి ఉద్యోగ మేమిటో తెలియదు కానీ అతడు శాస్త్రజ్ఞుడు కాదు. కానీ తరచుగా సుబ్బారావు, ప్రవీణ్ కుమార్-రీసెర్చి విశేషాలు మాట్లాడుకు నేవారు. ప్రవీణ్ కుమార్ సుబ్బారావుకు ప్రాణమిత్రుడూ కాదు. చిన్ననాటి స్నేహితుడూ కాదు. ఇద్దరికీ ఎలా పరిచయమయిందో తెలియదు వసంతకి. అతడు నెలకి ఒకటి రెండు సార్లు తమ యింటికి వస్తూంటాడు. తమ ఇంటికి రమ్మని యెప్పుడూ అడగలేదు. అతడికి వివాహమయిందో లేదో కూడా ఆమెకు తెలియదు. భర్త నడిగితే అతడి గురించి వివరాలడగొద్దని చెప్పాడు. ప్రవీణ్ కుమార్ వసంతతో ఎప్పుడూ మాట్లాడలేదు. అతడు రాగానే ఆమె కాఫీ యిచ్చేది. అతడు సుబ్బారావుకు థాంక్స్ చెప్పి వెళ్ళే వాడు. కానీ సుబ్బారావు మరణానికి వారం రోజుల ముందు మాత్రం అతడు-వసంతతో మాట్లాడాడు. చెల్లెమ్మా అని ఆప్యాయంగా పిలిచాడు. నీ భర్త జీనియస్ అన్నాడు. ఆ పూటకు వాళ్ళింట్లోనే భోంచేస్తానన్నాడు. తను కూడా స్వీట్సు పట్టుకుని వచ్చాడు. ఏం జరిగిందని వసంత భర్త నడిగింది. నా ప్రయోగాలవల్ల అతడు ప్రయోజనం పొందాడని చెప్పాడు సుబ్బారావు. వసంత వివరాలడిగితే సుబ్బారావు చెప్పలేదు. వారంగడిచాక చెబుతానన్నాడు. వారం గడిచేసరికి చనిపోయాడు.
ప్రవీణ్ కుమార్ కాక సుబ్బారావుకున్న మిగతా స్నేహితులందరూ వసంతకు బాగా తెలుసు. అందరిళ్ళకూ రాకపోకలున్నాయి, అందరికీ సుబ్బారావంటే ఎంతో యిష్టం. ఆడా, మగా అందరూ సుబ్బారావు తెలివి తేటల్నీ, నెమ్మదితనాన్నీ, సమయస్ఫూర్తినీ మెచ్చుకునే వారు. ఒక స్నేహితుడి భార్య మృణాళినికి వసంత దగ్గర చనువెక్కువ. పెళ్ళికి ముందు పరిచయముంటే సుబ్బారావును వసంతకు దక్కనిచ్చ్జే దాన్ని కాదనీ-తనే పెళ్ళి చేసుకుని ఉండేదాన్ననీ ఆమె వసంతతో అంది. వీలుంటే అతడితో ఎఫైర్ పెట్టుకోవాలనుందని కూడా అందామె.
మృణాళిని మాట్లాడే పద్ధతి తమాషాగా ఉంటుంది. ఆమె నిన్ను చంపేస్తానని అన్నా తేలిగ్గా తీసుకోవాలని పిస్తుంది తప్ప కోపం రాదు. మృణాళిని కారణంగా వసంతకు భర్తంటే ఆరాధనా భావం పెరిగింది తప్ప- మృణాళినిపై కోపం రాలేదు. అయితే ఆమె భర్తకు మృణాళిని మాటలు చెప్పింది.
"నువ్వు చెప్పింది వింటూంటే నా కాశగానే ఉంది. కానీ మృణాళిని భర్త పెద్ద గూండా. పెద్దమనిషిలా కనబడతాడు కానీ పెద్ద మనుషుల్ని కూడా నడి బజార్లో పొడిచేయగల మొండిధైర్యం మనిషి..." అన్నాడు సుబ్బారావు.
అప్పుడు వసంత భయపడింది. కానీ ఆమెకు తెలిసి సుబ్బారావుకీ, మృణాళిని భర్తకూ యెప్పుడూ గొడవలు జరుగలేదు.
సుబ్బారావుకు మరో ముఖ్యస్నేహితుడు లక్ష్మీనారాయణ ఆయన వయసులో సుబ్బారావు కంటే పదిహేనేళ్ళయినా పెద్దయి ఉంటాడు. ఆయన వసంతను చనువుగా అమ్మాయ్ అని పిలుస్తాడు. ఆయనకు వ్యాపారముంది. సుబ్బారావుతో ఆయన-"నువ్వెన్నేళ్ళుద్యోగం చేసినా ఇంతే! నీ తెలివితేటల్ని సైన్సుమీంచి తప్పించి నాతో చేతులు కలుపు. ఏడాది తిరక్కుండా లక్షాధికారిని చేస్తాను...." అన్నాడు చాలాసార్లు. సుబ్బారావు నవ్వి ఊరుకుంటే-"నువ్వయినా చెప్పవమ్మా మీ ఆయనకి" అంటూండేవాడు. సుబ్బారావు తన మాటలు వినడంలేదని ఆయనకు కోపంగా ఉండేది. వసంత ఆయన గురించి సుబ్బారావు నడిగితే-"మనిషిలా కనిపించినా ప్రమాదకరమైనవాడు. ఆయనతో దూరంగా ఉన్నంత కాలమే స్నేహం. కాస్త దగ్గరయ్యామంటే మనం ఫినిష్-" అని తన అభిప్రాయం చెప్పాడతడు. కానీ సుబ్బారావు మరణానికి పదిరోజులకి ముందు లక్ష్మీనారాయణ అతన్నెంత గానో మెచ్చుకుని-"నీ సలహాలవల్ల నాకు లక్షల్లో లాభించింది. చాలా థాంక్స్-వారంరోజుల్లో నువ్వు నాతో జాయినయ్యావా సరే-లేకుంటే నిన్ను సైన్సుకి మాత్రం మిగిలనివ్వను-" అన్నాడు. ఆయన వెళ్ళి పోయాక సుబ్బారావు-"లక్ష్మీనారాయణగారు నా గురించి సీరియస్ గానే ఉన్నారు. నేనూ సీరియస్ గా ఆలోచించాలి-" అన్నాడు.
