"ఈ పిల్ల విషయంలో బిజినెస్ గురించి ఆలోచించకు. పెళ్ళి వరకే నీ సాయం. ఆ తర్వాత నువ్వు మర్చిపోవాలి."
"ఇంత అందాన్నేలా మరిచిపోతాను ?" అన్నాడు శతభిషం.
"నేను సీరియాస్ గా చెబుతున్నాను. పద్మావతి ని నేను మోసగించవచ్చు. కానీ ఆమెను పడుపు వృత్తి లో దించలేను...."
"పోనీ నాక్కూడా ఓ చాన్స్ ....?"
"మిస్టర్ శతభిషం .....నువ్వామేను నా భార్యగా గుర్తించి మాట్లాడాలి ...." అన్నాను సీరియస్ గా.
"నీ భార్యగా గుర్తించాలంటే దర్జాగా అందరికీ తెలిసేలా పెళ్ళి చేసుకోవచ్చుగా...." అన్నాడు శతబిషం.
నా మాటల్లోని తెలివి తక్కువతనం అర్ధమయింది. తను వివాహం చేసుకున్న అమ్మాయికి భార్య అన్న గుర్తింపు రాకుండా వుండాలనుకున్నవాడే పెళ్ళి విషయంలో శతబిషం సాయం కోరుకుంటాడు.
"సారీ మిస్టర్ శతభిషం! ప్రస్తుతానికి నేనామెను భార్యగానే భావిస్తాను. నా మానసిక స్థితి మారే వరకు నువ్వామే గురించి తేలికగా మాట్లాడొద్దు...."
"సరే - స్నేహితుడి మనసు కష్ట పెట్టనులే ....కాని నీ అవసరం తీరాక ఈ స్నేహితుణ్ణి మాత్రం గుర్తించుకోవాలి...."అన్నాడు శతభిషం వంకరగా నవ్వుతూ.
ఆ వంకర నవ్వు చూడగానే నాలో అదో రకమైన జుగుప్సాభారం కలిగింది. నేను తప్పు చేస్తున్నావా అన్న భావం కూడా తొలిసారిగా నాలో కలిగింది.
రోజూ సాయంత్రం పద్మావతిని కలుసుకుంటున్నాను. పద్మావతీ నాతొ తన కలల గురించి వివరిస్తుండేది.
"నాకు పెద్దగా కోరికలు లేవు. కార్లలో తిరగాలని లేదు. మేడల్లో నివశించాలని లేదు, చిన్న యిల్లు చాలు. ఆ యింటిని నా అభిరుచుల కనుగుణంగా తీర్చి దిద్దుకుంటాను. ఆ యింట్లో నేను, నా భర్త ....ఇద్దరం ఒకరి కొకరు అర్ధం చేసుకుని ఒకరి కొకరుగా జీవించగలిగితే చాలు ...." అందొక రోజు.
అప్పుడు నా మనసులో ఏదో కలుక్కుమంది.
"పెళ్ళయ్యాక నువ్వు నన్నుద్యోగం చేయమనకూడదు. పెళ్ళయ్యాక స్త్రీని శాసించగల మగవాడు భర్త ఒక్కడే కాగలడు. ఉద్యోగినిని ఇంట్లో భర్త ఆఫీసులో అధికారి శాసించగల్గుతారు. మరో మగవాడు నన్ను శాసించగలడన్న భావన నన్ను అసంతృప్తి రాలీని చేస్తుంది...." అందామె ఇంకో రోజు.
నేను వణికి పోయాను. నిండు మనసుతో ఈమె నన్ను ప్రేమిస్తోంది. నా గురించి యేమేమో ఊహించుకుంటోంది. ఈమెకు నేనివ్వమన్న ప్రతిఫలమేమిటి?
"ఎప్పుడూ మనమిద్దరం కలిసే వుండాలి. నా దుస్తులు అలంకరణ నీ అభిరుచులను ప్రతిభీంబించాలి. వివాహమైనాక భిన్నవ్యక్తిత్వాలుండవు. మనది ఏక వ్యక్తిత్వం కావాలి. ప్రతి విషయాన్ని అవగాహనలో చర్చించి -- ఎవరి పాయింట్లో మంచి వుంటే, న్యాయముంటే అదే స్వీకరించాలి. నేనన్నదే సాగాలన్న పట్టుదల , అహం -- ఇద్దరిలోనూ ఉండకూడదు. మన దాంపత్యజీవనం ప్రపంచానికే ఆదర్శం కావాలి...." అందామె మరో రోజు.
ఆమె మాటలు నాలో పాపభీతిని కలిగిస్తున్నా ఆమె పట్ల ప్రేమాభియానాలతో పాటు జాలిని కూడా పెంచుతున్నాయి. కానీ నాలో నిస్వార్ధం నన్ను మోసానికే ప్రోత్సహిస్తోంది, పెళ్ళయ్యేవరకూ మరేమీ ఆలోచించవద్దని స్వార్ధం నన్ను హెచ్చరిస్తోంది.
అనుకున్న ప్రకారం టెండరు పద్మావతీ చెప్పిన పార్టీకే వెళ్ళింది. శతబిషం మా యిద్దరి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశాడు. మధ్య మధ్యలో నన్ను బాధ పెట్టకుండా అంతరాత్మ పీక నొక్కుతూ ముందడుగు వేస్తున్నాను.
11
ఆరోజు రాత్రి యెనిమిది గంటల సమయం .
నేను పద్మావతింట్లో వున్నాను.
నేను, పద్మావతి, ముత్యాల్రావు ఊరి చివరి రామాలయానికి వెళ్ళవలసి వుంది టాక్సీలో. టాక్సీ శతభిషం ముత్యాల్రావింటికి పంపుతాడు.
మేము ముగ్గురం టాక్సీ కోసం ఎదురు చూస్తున్నాం.
పద్మావతి ముఖంలో పట్టరాని సంతోషం.
ఎప్పటికీ తప్పించుకోలేననుకున్న గోపీచంద్ విష వలయం నుంచి తప్పించుకుందామె. అటు పైన వేరవ్వరి విష వలయంలోకి చిక్కు కొనవసరం లేకుండా నావంటి భర్త రక్షణ లభిస్తోంది.
ఆడదాని కంత కంటే కావలసిందేముంది ?
ఇలాగనుకునే పద్మావతి, ఆమె తండ్రి ముత్యాలరావు మహాదానంద పడిపోతున్నారు.
ఎనిమిది గంటల ఇరవై నిముషాలకి టాక్సీ యింటి ముందాగింది. ముగురం టాక్సీ ఎక్కాం. ముగ్గురమూ ఒక సీట్లోనే కూర్చున్నాం. నాకూ పద్మావటికీ మధ్యగా కూర్చున్నాడు ముత్యాల్రావు.
టాక్సీ కొంత దూరం వెళ్ళాక -- "సార్ -- మన టాక్సీని మరో టాక్సీ వెంటాడుతోంది --" అన్నాడు డ్రైవర్.
నేను కంగారుపడి వెనక్కు చూశాను. పద్మావతీ మాత్రం చలించకుండా -- "అది వెంటాడడం కాదు, అందులో నా ఫ్రెండ్స్ వస్తున్నారు --" అంది.
"నీ ఫ్రెండ్సా -- నాకు చెప్పలేదేం?" అన్నాను.
"నేను నాక్కూడా తెలియకుండా పెళ్ళి చేసుకోగలనేమో కానీ నా ఫ్రెండ్స్ కి తెలియకుండా కుదరదు. వాళ్ళు మొత్తం నలుగురు ...." అంది పద్మావతి.
అంటే పద్మావతి పెళ్ళికి సాక్ష్యాన్ని తీసుకొస్తోందన్నమాట. ఇంతవరకూ ఈ విషయాన్నీ రహస్యంగా వుంచిందంటే ఆమె నన్ననుమానించిందా?" ఈ సాక్ష్యాలూ మున్ముందు నా కిబ్బందిని కలిగిస్తాయా?
"వీళ్ళ విషయం ముందుగా నాకు చెప్పాల్సింది...." అన్నాను.
ముత్యాల్రావు వెంటనే -- "నీకేం భయం లేదు , ఈ పెళ్ళి విషయం వాళ్ళెక్కడా అనరు. రహస్యాన్ని వాళ్ళకులా నువ్వు కూడా కాపాడలేవు" అన్నాడు.
రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచి ఏమి లాభం?
ముందు పద్మావతిని నాదాన్ని చేసుకోవాలి, ఆ తర్వాత ఆమె మాత్రం నన్నేం చేయగలదు ?
పద్మావతి ముందు జాగ్రత్త కోసం తన స్నేహితులని పిలిచిందా లేక వాళ్ళామెకంతటి గాడ స్నేహితులా! తనను ప్రతినిత్యం కాపాడుతున్న డాక్టర్ శ్రీనివాసమూర్తి ని కూడా ఆమె పెళ్ళికి ఆహ్వానించడం లేదని చెప్పంది . అంటే ఈ స్నేహితులాయన కంటే ముఖ్యమై వుండాలి.
టాక్సీ రామాలయం ముందాగింది. అక్కడ పూజారి పురోహితుడు సిద్దంగా ఉన్నారు. పురోహితుడు నన్ను చూస్తూనే - "అయ్యా! దండలు తెప్పించాను . అన్ని సిద్దంగా ఉన్నాయి. ముహూర్తాని క్కూడా ఇంక నిమిషాలే గడువుంది-" అన్నాడు.
ఈలోగా మా వెనుక ఓ టాక్సీ ఆగింది. అందులోంచి ఓ యువకుడు దిగాడు. మనిషి బలంగా , ఎత్తుగా ఆకర్షణీయంగా వున్నాడు. అంతకు ముందే అతడి నెక్కడో చూశాననిపించింది. క్షణం లోనే గుర్తు కూడా వచ్చింది.
అతడు సుకుమార్.
పద్మావతీ టాక్సీ దిగి చనువుగా అతణ్ణి సమీపించి "వాళ్ళను కూడా తీసుకొచ్చావా?" అంది.
"ఊ" అన్నాడు సుకుమార్.
పద్మావతి పురోహితుణ్ణి సమీపించి -- "అయ్యా మేమే వదువరులం. ఇంక తంతు ప్రారంభించండి" అంది.
నేను మ్రాన్పడిపోయాను. ఆమె పురోహితుడితో సుకుమార్ని వరుడిగా పరిచయం చేసింది. నేనేదో అనేలోగా - "నూతన్! టాక్సీలో నా ఫ్రెండ్స్ నువ్వే రిసీవ్ చేసుకోవాలి ...." అందామె.
అప్పుడే టాక్సీ వెనుక డోర్ తెరుచుకుని -- ఓ యువతి దిగింది , ఆమె వెనుకనే ....
"మైగాడ్ !" అనుకున్నాను.
ఆ యువతి నా భార్య. ఆమె వెనకనే అయిదు , మూడేండ్ల వయసు గల మా పాప, బాబు దిగారు.
నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు.
శ్రీమతి నన్ను సమీపించింది -- "ఎంత మంచి హృదయమండి మీది! ఇద్దరు ప్రేమికులను కలపడం కోసం మీరు ఎంతగా కష్టపడ్డారో పద్మావతి చెప్పింది. రహస్యంగా మీరిలాంటి పనులు కూడా చేస్తుంటారని నాకు తెలియదు.
ఉదాహరణగా చూపిస్తానని ఆమె ఈ రోజు నన్నీ పెళ్ళికి ఆహ్వానించింది."
శ్రీమతి నన్ను వేళాకోళం చేస్తోందా అని ఆమె వంక పరీక్ష గా చూశాను. ఆమె కనులలో ఆరాధన కనబడింది.
అప్పుడు నేను సుకుమార్ వంక తిరిగాను. అతడి కనుల్లో కొట్టవచ్చినట్లు నాపట్ల కృతజ్ఞతా భావం కనబడుతోంది.
"వాళ్ళు పుణ్య దంపతులు సుకుమార్! వారి ఆశీర్వాదంతో మనం కలకాలం సుఖంగా వుంటాం." అంది పద్మావతి.
"యాభై వేలు లంచమిచ్చినా జరుగని పని పైసా ఖర్చు లేకుండా జరిగిపోయింది. మన పెళ్ళి జరిగితే తన ప్రాణాలు తీసుకుంటానన్న నాన్న ఈ కాంట్రాక్టు సంపాదించగానే అంతా నా యిష్టమన్నాడు. మన పెళ్ళి కింత కష్టమైన షరతు విధించినందుకు నేను నిన్ను నాన్న అధ్వర్యంలో కాకుండా నాకై నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. నాన్న పెట్టిన షరతు ను సులభ సాధ్యం చేసిన నూతన్ అధ్వర్యంలో మన పెళ్ళి జరగడం మన అదృష్టం అన్నాడు సుకుమార్.
నాకు మతి పోయినట్లయింది. కానీ విషయం అర్ధమవుతోంది. ఈ కధలో గోపీచంద్, దయానిధి , స్మగ్లింగ్ ఆఖరికి శ్రీనివాసమూర్తితో సహా అంతా పద్మావతి తండ్రితో కలిసి ఆడిన నాటకం. ఆమె సుకుమార్ ని ప్రేమించింది. సుకుమార్ ఆమెను ప్రేమించాడు. పెళ్ళి సాఫీగా జరపడానికి నానుండి టెండర్ సమాచారం కావాల్సోచ్చింది.
పద్మావతి తెలివిగా నన్నుపయోగించుకుంది. తెలివైన ఆమె నా గురించీ, నా సంసార జీవితం గురించి పూర్తీ అరా తీయడం కుండా ఉంటుందనుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నేను తేలుకుట్టిన దొంగలా వూరుకోవలసి వచ్చింది. అయినా ఓ అవకాశం కల్పించుకొని పద్మావతిని నెమ్మదిగా -- "అయితే నువ్వెప్పుడూ నన్ను ప్రేమించ లేదా ?" అన్నాను.
"లేకేం .... ఎటొచ్చీ అది టెండర్ లవ్ !" అంది.
శతబిషం తన ఏర్పాట్లతో ఇలాంటి పెళ్ళి జరిగిందని అనుకుని ఉండడు. అందుకు నేను ఆధ్వర్యం వహిస్తున్ననని నేనూ ఊహించలేదు.
ఆ తర్వాత మాత్రం నేను గమనించిందేమిటంటే పద్మావతి జీవితం తను కన్న కలలకు అనుగుణంగా గడిచింది. అలాంటి కోరికలు నా భార్యకూ వుంటాయని గ్రహించి నేనూ నా భార్య కలలు పండించడానికి ప్రయత్నిస్తున్నాను. తనకు తెలిసినప్పటికీ నా దౌష్టాన్ని తన భర్తకూ, నా భార్యకూ తెలియకుండా దాచిన పద్మావతి వంటి ఆడపిల్ల అస్తమానూ నాకు తగలక పోవచ్చు. అందుకే నేను మళ్ళీ పరాయి ఆడపిల్లల జోలికి వెళ్ళలేదు.
-----: అయిపొయింది :-----
