శారద నిజంగా ఆ నీళ్ళు తాగిందా లేక తాగినట్లు నటిస్తోందా?
ఏది ఏమైనా తను వేచి చూడాల్సిందే.....అతను మంచమెక్కాడు. ఆమె ఆవులించింది.
"అదేం చిత్రమో.....ఉన్నట్లుండి నిద్ర ముంచుకు వస్తోంది...." అంది శారద.
రఘు కూడా ఆవులించి-"నాకూ అలాగే వుంది. అయితే ఇందులో చిత్రమేముంది? టైము పదిన్నర దాటింది-" అన్నాడు.
"అవుననుకోండి. కానీ ఈ రోజు నాకు కబుర్లు చెప్పాలనివుంది. మీతో చాలా మాట్లాడాలని వుంది-" అని మళ్ళీ ఆవులించి - "అబ్బా - లాభంలేదు...." అంది. ఆమె కళ్ళు మూతలు పడిపోతున్నాయి.
మందు పనిచేస్తూ ఉండైనా ఉండాలి. ఆమె నటిస్తూ నైనా వుండాలి. అదే నటనైతే ఆమె అద్భుత మైన నటి అనుకోవచ్చు. అంత సహజంగా నటిస్తోందామె.
కొద్ది క్షణాల్లో నిద్రకు పడింది శారద. రఘు ఆమెను కదిపాడు. కుదిపాడు. ఆమె చలించలేదు. కొన్ని పరీక్షలైన తరువాత ఆమె నిజంగా నిద్రపోయిందని నిర్ణయించుకున్నాడు.
తను కలిపిన మందు చాలా బలమైనది. మరో ఆరు గంటలవరకూ ఆమెకు వళ్ళు తెలియదు. కానీ ఆమె నిజంగా మందు తాగిందా?
రఘు ఓ అరగంటసేపు ఎదురు చూశాడు. అతడిలో కోర్కెలు బుసలుకొడుతున్నాయి. నెమ్మదిగా మంచం దిగి హేమ ఉన్న గదిలోకి వెళ్ళి-"హేమా!" అని పిలిచాడు.
హేమ సిద్దంగానే వుంది. వెంటనే పలికింది.
ఇద్దరూ తిరిగి పడక గదిలోకి వచ్చారు. రఘు గది తలుపులు వేశాడు. శారదను జాగ్రత్తగా ఎత్తి నేలమీద పడుకోబెట్టాడు. తర్వాత హేమతో శృంగారం ప్రారంభించాడు.
ఈ అనుభవం అతడికి గొప్పగా ఉంది.
ఒకవేళ శారద నిద్ర నటిస్తూంటే అంతకంటే తెలివితక్కువ మనిషి వుండదనుకోవాలి. తన ఎదురుగా భర్త పరాయి స్త్రీని అనుభవిస్తూంటే అంతా చూసి-తప్పు జరిగిపోయాక-నాకంతా తెలుసు-మీరు తప్పుచేశారు అనడంవల్ల ప్రయోజనమేమిటి?
అదీకాక ఆడది అలా సహించలేదు!
ఇంట్లో యింకెవ్వరూ లేరు. గదిలో తాము ముగ్గురమే ఉన్నారు. శారద నిద్రమత్తులో ఉంది. గది తలుపులు వేసివున్నాయి. జరిగింది శారద తెలుసుకునే అవకాశం లేదు.
తర్వాత రఘు, శారద గురించి ఆలోచించలేదు.
6
శారదకు తెల్లవారుజామున అయిదింటికి మెలకువ వచ్చింది. లేచి పక్కనే ఉన్న భర్తవంక చూసి అదోలా నిట్టూర్చింది. నిద్రపోతున్న అతడి ముఖంవంక తదేకంగా చూస్తూ-"ఎంత అందగాడు?" అనుకొంది.
ఈ అందమే తనను భ్రమలో పడేస్తుంది. ఈ అందమే తనను అతడికి దాసోహం కమ్మంటుంది. ఈ అందమే తనకు ఆకర్షణయింది. ఈ అందమె తనకు శాపమూ అయింది.
అతడిలో వున్న అవగుణాలన్నీ తెలిసి కూడా కేవలం అందానికి భ్రమపడి అతన్ని పెళ్ళాడింది. అతన్ని తన అదుపులోకి తెచ్చుకోవాలని ఆమె సంకల్పం. తెచ్చుకోగలనన్నది ఆమె నమ్మకం.
ఎన్ని అవగుణాలున్నా అతను మంచివాడు. అది ఆమె అదృష్టం!
శారద ప్రేమగా అతడి చెంపలు నిమిరింది. జుత్తులోకి వేళ్ళు పోనిచ్చింది. అతను వళ్ళెరక్కుండా నిద్రపోతున్నాడు. ఆమె యేం చేసినా అతడికి తెలియడం లేదు.
శారద మంచం దిగి పూజగదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుంది. అది లేవగానే రోజూ ఆమె విధిగా చేసేపని. దణ్ణం అయేక ఆమె మందిరంలోకి చూసి ఉలిక్కిపడింది. మరుక్షణం ఆమె కళ్ళు యెర్రగా అయ్యాయి. కోపంగా పడక గదిలోకి పరుగెత్తి ఒక్క కుదుపుకుదిపి భర్తను లేపింది.
రఘుకు మత్తు కళ్ళు విడడంలేదు-"యేమిటి శారదా!" అంటున్నాడు ముద్దగా.
"రాత్రి...రాత్రి....మీరు పరాయి స్త్రీని అనుభవించారు...." అంది శారద.
రఘు మత్తు విడిపోయింది...."యేమిటన్నావ్?"
"రాత్రి....మీరు..." అని ముఖం కప్పుకుని యేడవసాగింది. శారద.
రఘు కలవరపడ్డాడు-"నువ్వేమంటున్నావో అర్ధం కావడంలేదు నాకు..."
"అర్ధమయ్యేలా చెప్పాలా?-....మీ వ్యవహారం సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమైంది..." అంటూ మొదలుపెట్టి అతనే ఆశ్చర్యపోయేలా వివరించి చెప్పింది శారద.
"ఎందుకలా అనుకుంటున్నావ్?" అన్నాడు రఘు అనునయంగా.
"ఇంక మీరేం మాట్లాడొద్దు. జరిగింది ఒప్పేసుకోండి. ఆఖరికి ఇంతకు తెగించారన్నమాట. మీక్కావలసిన దాన్ని ఇంటికే తీసుకొచ్చి...." అంటూ మళ్ళీ యేడవ సాగింది శారద.
రఘుకి ఏమనాలో తెలియలేదు.
"శారదా-నీకు ఈ తప్పుడు సమాచారం ఎవరు చెప్పారో తెలిస్తే-నేను నీకు కలిగిన అపోహను తొలగించి ఉండేవాణ్ణి. ఇప్పుడు నీకు ఎలా చెప్పాలో తెలియడంలేదు" అన్నాడు రఘు.
"అనవసరంగా దబాయించకండి. నా సమాచారం మనుషులమీద ఆధారపడ్డది కాదు. నా మనసు....అది అబద్దం చెప్పదు...." అంది శారద.
"అయితే నీ మనసు నన్ను తప్పుచేయకుండా ఎందుకు ఆపదు? అంతా చూస్తూ ఊరుకుని అప్పుడు ఈ రంగంలోకి దిగుతుందేం? నువ్వనేది యెంత హాస్యాస్పదంగా వుందో నువ్వే అర్ధంచేసుకో-" అన్నాడు రఘు.
"మనసు అనుభూతి పొందగలదు తప్పితే మాట్లాడలేదు. మాట్లాడే తనువు అప్పుడే అపస్మారక స్థితిలో ఉందో. రాత్రి మంచినీళ్ళు తాగేవరకూ బాగానేవున్నాను. తాగగానే నిద్రముంచుకొచ్చేసింది. ఇప్పుడు నాకు అనుమానం కల్గుతోంది. ఇది మీరు కావాలని ఆడిన నాటకమేనని. ఆ గ్లాసులో మిగిలిన నీళ్ళు పరీక్షచేయిస్తే అందులో నిద్రమందు కలిసిందీ లేనిదీ తెలుస్తుంది-" అంది శారద.
రఘు ఆమెవంక భయంగా చూస్తూ-"అందులో నిద్రమందు కలిసిందని తెలిస్తే ఏంచేస్తావ్?" అన్నాడు.
"ఇంత విషంతాగి చచ్చిపోతాను!" అంది శారద.
"ప్లీజ్-అంతమాటనకు శారదా!" అన్నాడు రఘు. అతను చటుక్కున చేతుల్తో ముఖం కప్పుకుని-"నేను పాపిని, నీచుణ్ణి, నీకు తగనివాణ్ణి. నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావు నువ్వు?" అంటూ ఏడ్వసాగాడు.
"ఛీ - అసహ్యంగా ఏడుస్తారెందుకు?-" అంది శారద-"తప్పుచేసింది నేను. మిమ్మల్ని పెళ్ళిచేసుకోవడం తప్పు అని అంతా అన్నారు. కానీ కాదని వాదించాను నేను. ఈ రోజు మీరు కూడా అంతా అన్నమాటే అంటున్నారు. ఇంక నేను బ్రతికి లాభం లేదు. మరొక్కసారి మీరిలా ప్రవర్తించారో నేను మిమ్మల్ని హెచ్చరించను. నా ప్రాణం తీసుకుంటాను-"
అతను కళ్ళు మెరిశాయి-"అంటే నువ్వు నాకు మరొక్క అవకాశం ఇస్తున్నావా?" అన్నాడు.
"ఏం-ఇవ్వననుకున్నారా-ఇవ్వకూడదనుకున్నారా?" అంది శారద తీవ్రంగా.
రఘు చటుక్కున శారద చేతులు పట్టుకుని-"అలా మాట్లాడకు శారదా! నాకు నువ్వు కావాలి-నువ్వు నా దేవతవు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. నన్ను నేను సంస్కరించుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వు-" అన్నాడు.
"ఒక్క అవకాశం మాత్రమే ఇస్తున్నాను-" అంది శారద.
