Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 14


    "కళ్యాణి !" అంటూ సుధాకర్ పెట్టిన గావుకేక ఆ యింటిని దాటి వెళ్ళి వీధి వీధిలో సంచలనాన్ని కలిగించింది.

                                      2
    "సందేహం లేదు-- ఇది ఆత్మహత్య!" అన్నాడు ఇన్ స్పెక్టర్ శేఖర్.
    "నేను ఒప్పుకుంటాను కానీ ఎందుకు? ఏ లోటూ లేని నా చిట్టి చెల్లెలికి ఆత్మహత్య చేసుకోవలసిన కర్మేం పట్టింది?"
    "ఆ విషయం ఇంకా తేలలేదు. ఒక పర్యాయం ఆత్మహత్య అని దృవపరిస్తే కారణాలు వెతికి పట్టుకోవడం ఎంతోసేపు కాదు...." అన్నాడు శేఖర్.
    'ఆత్మహత్య అని ఎలా దృవపరుస్తారు?"
    "ఆ ఇంట్లోకి మరోకరు వచ్చే అవకాశం లేదు. అక్కడ మరొకరు మసలిన జాడ లేదు. తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె కాగితం పెట్టింది. హత్యకు అవకాశాలు లేనిచోట ఆత్మహత్య గా నిర్ణయించక తప్పదు ..." అన్నాడు శేఖర్.
    'ఆత్మహత్య చేసుకున్నానంటూ రాసి వున్న కాగితం మీది దస్తూరీ నా చెల్లెలిది కాదు. అందుకు కారణం వివరించగలరా?"
    "దస్తూరీ అమెది కాదని మీరంటున్నారు. మాకలా అనిపించడం లేదు...."
    "దస్తూరీ నిపుణుల ద్వారా పరీక్షించి చూస్తె మీకే తెలుస్తుంది ?"
    'చూడండి మిస్టర్ సుధాకర్! మరణించినది మీ చెల్లెలు కాబట్టి మీరింతగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్నో చూశాన్నేను. ప్రతి చిన్నదానికీ అనుమానం పెట్టుకుంటే ప్రతి ఆత్మహత్యనూ హత్యగా అనుమానించవచ్చు. ఇది హత్య అని అనుమానించవలసిన పరిస్థితులేర్పడితే ఎలాగూ తప్పదు. కేసు సింపుల్ గా వున్నప్పుడు దాన్ని కంప్లికేటేడ్ చేయడం నాకిష్టం లేదు" అన్నాడు శేఖర్.
    'అయితే కారణాలేం చూపిస్తారు?"
    "ప్రత్యేకంగా ఇవి అని చెప్పలేము గానీ - సూచించగలము. ఆమె ఎవరినైనా ప్రేమించి మోసపోయి వుండవచ్చు...."
    "ఎందుకు మోసపోతుంది? ఆమె ఎవరిని ప్రేమించినా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఎన్నడూ ప్రవర్తించను....."
    'అవుననుకోండి. కానీ వివాహితుడామెను మోసం చేస్తే...."
    "వాడి రక్తం కళ్ళ జూస్తాను...." అన్నాడు సుధాకర్.
    "చూడండి మిస్టర్ సుధాకర్. ఇటువంటి ముక్కలు మీరు నా ముందు అనకూడదు. నేను బాధ్యత గల పోలీస్ ఇన్ స్పెక్టర్ని. మీ మాటలు నా రికార్డు లోకి వెడితే అని మిమ్మల్ని నేరస్థుల్ని చేయగలవు...."
    "చెయ్యనివ్వండి ఇన్ స్పెక్టర్ ! నా ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు పోయాక నేను బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం? దాన్ని చంపినదేవరో తెలిస్తే..."
    "ఆవేశ పడకండి. మిస్టర్ సుధాకర్ -- ఇది హత్య కాదు, ఆత్మహత్య . పుట్టిన ప్రతి జీవికి ఎప్పుడో అప్పుడు మరణం తప్పదు. అందరూ ఏదో రోజున పోవలసిన వాళ్ళమే. కాస్త ముందూ, వెనకా - అంతే! నాలుగు రోజులు పొతే మీరు కూడా మీ చెల్లెలి మరణం గురించి మరిచి పోగలుగుతారు. మరుపు మనకు దేవుడిచ్చిన వరం. మీవంటి అన్నగారి అభిమానాన్ని కలకాలం అందుకునే భాగ్యం మీ చెల్లెలికి లేరు. మీ ముందింకా చాలా భవిష్యత్తుంది. లేనిపోని ఆలోచనలకూ మీ మనస్సులో చోటిచ్చి బంగారం లాంటి మీ భవిస్యత్తు ను పాడు చేసుకోవద్దు. ఒక పోలీసు ఇన స్పెక్టర్ గా కాక శ్రేయోభిలాషిగా మీకీ సలహా ఇస్తున్నాను" అన్నాడు శేఖర్.
    సుధాకర్ భారంగా నిట్టూర్చి అక్కణ్ణించి బయట పడ్డాడు.

                                       3
    "అయితే నేనేం చేయాలంటారు ?" అన్నాడు డిటెక్టివ్ శాస్త్రి.
    "నా చెల్లెలిది ఆత్మహత్య కాదని నా అంతరాత్మ ఘోషిస్తోంది. దాన్ని చంపిందేవరో, ఎందుకు చంపారో తెలుసుకోవాలి...." అన్నాదు సుధాకర్.
    "పోలీసులు ఆత్మహత్య అంటున్నారు. ఇంట్లో బంధువుల్లెవ్వరూ లేరు. హత్య చేయవలసిన అవసరమూ, అవకాశమూ ఎవరికీ కనుపించడం లేదు. ఈ పరిస్థితుల్లో మీ చెల్లెలిది ఆత్మహత్య కాదని ఎందుకు అనుకుంటున్నారు?" అన్నాడు శాస్త్రి.
    "దానికి జీవితం మీద అంతులేని మమకారం. ఎట్టి విపత్కర పరిస్థితుల్లో నైనా జీవితాన్ని కొనసాగించడమే కానీ తుద ముట్టించడం దాని ధ్యేయం కాదు. చిన్నప్పట్నించీ దాని మనస్తత్వం నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లో నూ అది ఆత్మహత్య తలపెట్టదు. ఇది నా నమ్మకం."
    శాస్త్రి ఆలోచనలో పడ్డాడు. సుధాకర్ చెప్పిన దంతా విన్నాక కళ్యాణి ఆత్మహత్య విడ్డూరంగా అతనికి కూడా తోచింది. చనిపోవడానికి పది రోజుల ముందు కళ్యాణి సుధాకర్ కి రాసిన ఉత్తరం అతను చదివాడు. ఆ ఉత్తరంలో కళ్యాణికి జీవితం పట్ల మోజు స్పష్టంగా తెలుస్తోంది. ఆ మోజు ఒక్క పదిరోజుల్లో పోయిందంటే అందుకేదో బలవత్తరమైన కారణముండాలి!
    "ఒక వేళ కళ్యాణి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అందుకేదో బలవత్తర మైన కారణముండి వుండాలి . అదేమిటో తెలుసుకోవాలి. అన్నయ్యగా నేను అన్ని విధాలా తనకు రక్షణ ఇవ్వగలనన్న నమ్మకం దానికి ఉంది. ఆ నమ్మకాన్ని కూడా వదిలిపెట్టి అది ఆత్మహత్య చేసుకున్నదంటే అందుకు కారణమేమిటో నే నూహించలేకుండా వున్నాను!" అన్నాడు సుధాకర్.
    "ఒకే , ఈ కేసు నేను చేపడతాను. మీ మనసు బాధపడుతున్నదని నాకు తెలుసు. నావద్దకు వచ్చేవారంతా అటువంటి స్థితిలోనే వస్తారు. అయినా వ్యాపారమన్నాక వ్యాపారమే! మీరివ్వగల ఫీజు చెబుతారా?" అన్నాడు శాస్త్రి.
    "నా చెల్లెలి పెళ్ళి కోసం ఇంతవరకూ పన్నెండు వేలు పోగు చేశాను. ఇప్పుడది దాన్ని చంపిన హంతకుణ్ణి కనుక్కోవడానికి వినియోగిస్తాను" అన్నాడు సుధాకర్.
    "ఒకే.... నాకు అడ్వాన్స్ అక్కర్లేదు. నేను జయప్రదం అయినప్పుడే మీదగ్గర డబ్బు తీసుకుంటాను. మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరిచ్చిన సమాచారం నాకు చాలు. మీరు వెళ్ళవచ్చు....' అన్నాడు శాస్త్రి.
    సుధాకర్ లేచి అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
    డిటెక్టివ్ శాస్త్రి పూర్తీ పేరు సోమనాధ శాస్తి అతడి వయసు ముప్పై సంవత్సరాలు. గవర్నమెంటు వుద్యోగం చేస్తుండగా అయిదేళ్ళ క్రితం హటాత్తుగా అతనికి ఏదో వారసత్వపుటాస్తి కలిసి వచ్చింది. చిన్నతనం నుంచీ అతనికి నేరాలన్నా . నేర పరిశోధన అన్నా అపరిమితమైన ఇష్టం.
    ఆస్తి కలిసి రాగానే అతడు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నేర పరిశోధనను వృత్తిగా స్వీకరించాడు. అతడు పనిచేసే ఆఫీసులోనే టైపిస్టు గా వుండే రమణమూర్తి కూడా ఉద్యోగం వదిలిపెట్టి శాస్తి వద్ద అసిస్టెంటు గా చేరిపోయాడు.
    రామమూర్తి వయసు ఇరవై వుంటుంది. ధైర్యానికి లోటు లేదు కానీ చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. చాలాసార్లు అతడు రోళ్ళలో తలదూరిస్తే శాస్త్రి రోకటి పోట్లు బాధ నుంచి రక్షించాడు.
    శాస్త్రి భర్య పేరు వెంకట రమణ. అమెనతడు ముద్దుగా రామూ అని పిల్చుకుంటాడు. ఆమెకు భర్త చేపట్టిన వృత్తి నచ్చలేదు. ఈ విషయంలో తప్ప అన్ని విషయాల్లోనూ భర్త ఆమె మాటలు వింటాడు.
    వారికిద్దరు ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లవాడు. మరి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు శాస్త్రి.
    బహుశా వెంకటరమణ అదృష్టం వల్లనే అయుంటుంది- శాస్త్రి కింతవరకూ ప్రమాదకరమైన కేసులు తగల్లేదు. డబ్బు మాత్రం సరాసరి నెలకు వెయ్యి వరకూ సంపాదిస్తున్నాడు.
    రమణమూర్తి రాగానే శాస్త్రి అతడికి కేసు వివరాలన్నీ చెప్పి - "ఏం చేస్తే బాగుంటుందంటావ్?" అన్నాడు.
    "సుబ్బరామయ్య గారి పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది."
    శాస్త్రి నవ్వి "నీ బుద్ది పోనిచ్చుకున్నావు కాదు. వయసులో వున్న ఆడపిల్లల తోటా కేసు మొదలు పెట్టేది!" అన్నాడు.
    రమణమూర్తి గతుక్కుమని 'అది కాదు సార్! చనిపోయింది కూడా వయసులోని పిల్ల . ఆ పిల్లలూ, ఈ పిల్లా ఒకే ఇంట్లో వుంటున్నారు. వరుసకు అక్కా చెల్లెళ్ళు. కళ్యాణి గురించి వాళ్ళివ్వగలిగిన వివరాలు సుధాకర్ కూడా ఇవ్వలేడేమో!" అన్నాడు.
    "బాగుంది . నువ్వు చెప్పింది కరెక్టే . అలాగే చేద్దాం!" అన్నాడు శాస్త్రి.
    "అయితే ఎప్పుడు వెళ్ళమంటావు ?"
    "ఇప్పుడే ....కానీ నువ్వు వెళ్ళవలసిన చోటు వేరు, సుబ్బరామయ్య గారి ఎదురింట్లో నువ్వు కొంత సమాచారం సేకరించాలి...." అన్నాడు శాస్త్రి.
    రమణమూర్తి నిరుత్సాహంగా "ఆ ఇంట్లో ఆడపిల్లలున్నారా?" అన్నాడు.
    "ఉన్నారో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం పదమూడేళ్ళ కృష్ణ శర్మ అనే కుర్రాడిని ఇంటర్వ్యూ చేయాలి " అన్నాడు శాస్త్రి.
    "మరి సుబ్బరామయ్య గారి పిల్లలు...."
    "వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ." అన్నాడు శాస్త్రి.
    "అమ్మగురూ! నా అయిడియాను నువ్వుపయోగించుకుంటున్నావా ?" అని మనసులో మాత్రం అనుకున్నాడు రమణమూర్తి.

                                     4
    "నిజానికిది నూట రెండు రూపాయలు. కానీ యీ రెండు రోజులూ ఎనభై రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ నూట రెండు రూపాయలై పోతుంది...." అంది గౌరీ.
    "ఎందుకని?" అన్నాడు శాస్త్రి.
    "ఇది మీ షాపులో రివాజు. ఒకోవారం ఒకో వెరైటీ కన్సేషనల్ రేట్స్ కి అమ్ముతాము..." అంది గౌరీ.
    శాస్త్రి చిన్నగా నవ్వి "ఈ కన్సెషన్ అన్ని విషయాల్లోనూ వుంటుందా ?" అన్నాడు.
    "అంటే?" అందామె.
    శాస్త్రి స్వరం తగ్గించి "అన్ని విషయాల్లోనూ అంటున్నాను...." అన్నాడు.
    గౌరీ చిత్రంగా శాస్త్రి వంక చూసి అదోలా నవ్వింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS