Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 14

 

    నవ్వుతూ లోపలకు ప్రవేశించింది శోభ. ఆలోచిస్తున్నాను నేను. మధ్యాహ్నపు సంగతి శోభను అడగాలా వద్దా అన్నది.
    ఇద్దరం పడక గదిలో కూర్చున్నాం. శోభకు పోరుగింటావిడ పంపిన గారెలు పెట్టాను. శోభ అడగ్గా వెంకట్రావు తెచ్చిచ్చినట్లు వివరం చెప్పి, వెంకట్రావు చెప్పిన సంగతులు కూడా వివరించాను.
    శోభ తనలోనే ముసి ముసి గా నవ్వుకుంటూ "నన్ను నువ్వు క్షమించాలి వసంతా?" అంది.
    తర్వాత నెమ్మదిగా శోభ జరిగిన విషయం వివరించింది.
    తను ఆఫీసుకి వెళ్ళి నా అనారోగ్యం సమాచారం అందజేసి తన ఆఫీసుకి వెళ్ళబోతుండగా ఆమె ప్రియుడు తగిలాడట. అతగాడికి ఆరోజు ఎందువల్లనో కాళీ అని శోభను కూడా ఆఫీసుకు సెలవు పెట్టవలసిందని రిక్వస్ట్ చేశాడట. శోభ ఒప్పుకుని ఆఫీసులో సెలవు చీటీ ఇచ్చి అతనితో బయల్దేరిందట.
    ఇద్దరూ కాసేపు ఓ పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారట. టైము పదకొండు న్నార ప్రాంతంలో శోభ తన ప్రియుడిని నాకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇంటికి వచిందిట. నేను అంత త్వరగా ఆఫీసుకు వెళ్ళగలనని ఆమె అనుకోలేదట.
    ఇంటిదాకా వచ్చాక తలుపు తాళం చూసి శోభ ప్రియుడు నిరుత్సాహానికి మారుగా ఉత్సాహం ప్రకటించాడట. కాంతతో లభించబోయే ఏకాంతవాసం అతనిలో ఉత్సాహాన్ని కలిగిస్తే శోభను కాస్త కలవరపరిచిందట.
    కానీ ఇద్దరూ ఇంట్లో అడుగు పెట్టారు. ఒక గంట సేపు కబుర్లతో కాలక్షేపం చేశారు. తన ప్రియుడిలో మగతనపుటావేశాన్ని గుర్తించిన శోభ అతన్ని దృష్టి మరల్చడం కోసం పెరట్లోకి తీసుకు వెళ్ళింది. కొబ్బరి మొక్కను చూపించి మా సమస్యను తెలియబర్చింది. పురుష పుంగవుడు ఆవేశపడి కొబ్బరిమొక్క దగ్గర సుమారు నిలువెత్తు గొయ్యి తీశాడు. ఈ పర్యాయం ఖంగుమన్న శబ్దం రాకపోవడం శోభను చాలా ఆశ్చర్య పరిచింది.
    అతను విషయం విని 'అది ఏదో నిధే అయుంటుంది. కావలసిన వాళ్ళు తవ్వితే అరడుగు లోతులో దొరికేది. నాబోటి వాళ్ళు తవ్వితే మూడు నిలువుల లోతు కెళ్ళినా దొరకదు"అన్నాడు.
    అతను మళ్ళీ కొబ్బరి మొక్కను యధాస్థానం లో పాతేశాడు. ఆ తర్వాత అతనితో ఏకాంతం ప్రమాదమని గుర్తించి శోభ బయటకు తీసుకెళ్ళి పోయింది.
    "మేము వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా ఈ వెంకట్రావు కాబోలు తలుపు తట్టాడు. ఆ పరిస్థితుల్లో సాహసించి తలుపు తీయలేకపోయాను" అంది శోభ.
    ఆశ్చర్యంగా అన్నీ విన్నాను. నా అనుమానాలన్నీ తొలగి పోయాయి. "అయితే నువ్వొక ప్రేమికురాలవన్న సంగతి ఇంతకాలం ఈ స్నేహితురాలికి తెలియకుండా దాచావన్న మాట" అన్నాను నిష్టూరంగా.
    శోభ నవ్వి "ఇందులో దాచడానికేముందీ ఇంతవరకూ చెప్పడానికి సరైన అవకాశం రాలేదంతే. అతను మా ఊరి వాడె నా స్నేహితురాలు సుజాత అన్న" అంది.
    ఉలిక్కిపడ్డాను. "అయితే అతన్ని నేను కూడా చూశాననుకుంటాను." అన్నాను.
    "ఆహా! ఆ వివరాలన్నీ అతను నాకే నాడో చెప్పాడు. కానీ నువ్వతన్ని సరిగా అర్ధం చేసుకోలేదని కూడా చెప్పాడు"అంది శోభ.
    నేనేమీ మాట్లాడలేదు గానీ నాకేమిటో అదోలా అనిపించింది. ఇద్దరు వ్యక్తులు నన్ను "సుజాతా!" అని పిలిచారు. ఆ ఇద్దరూ పరస్పరం తెలిసినవారే. నేను నిధి వుంటుందని అనుమానపడ్డ ప్రాంతంలో ఆ ఇద్దరూ నేను లేని సమయంలో తవ్వకం కొనసాగించారు. ఇది కేవలం కాకతాళీయమా?
    అసలు నా ఇంట్లో నిజంగా నిధి వుందా? నా అదృష్టాన్ని తారుమారు చేయగలిగి నంతటి డబ్బును నిధి రూపంలో అమ్మ ఎలా కూడ బెట్టగలిగింగి?
    నా ఈ ఆలోచనలకూ సమాధానం వెంటనే లభించలేదు. లభించదని కూడా నాకు తెలుసు.
    ఒక పర్యాయం అమ్మను తలుచుకుని భక్తీ భావంతో మనసులోనే ఆమెకు నమస్కరించుకున్నాను.

                                  9
    ఇంట్లో అమ్మకు ఒక చిన్న పెట్టె ఉంది. దాన్ని అమ్మ చాలా భద్రంగా చూసుకునేది. నేను అమ్మ చనిపోయాక ఆపెట్టెను శుభ్రపరచి, నా పెట్టెలో పెట్టుకున్నాను.
    ఆ పెట్టెలో కొన్ని కాగితాలూ ఓ రెండు పుస్తకాలు ఒక దేవుడి పటమూ వుంటాయి. కాగితాలు యేవో ఉత్తరాల్లా నాకు అనిపించేవి. పుస్తకాలు యేవో  మామూలు నవలలు, దేవుడి పటం వెంకటేశ్వరస్వామిది.
    అమ్మ జీవితానికి సంబంధించిన రహస్యమేదైనా నా ఆకాగితాల్లో కనబడుతుందే మోనని ఒక పర్యాయం నాపెట్టేలో వున్న ఆ చిన్న పెట్టెని తీశాను.
    పెట్టె మూత తెరువగానే వెంకటేశ్వరస్వామి పటం కనపడాలి. ఆ పెట్టె ఎప్పుడు సద్దినా నేనలాగే ఏర్పాటు చేస్తాను. కానీ ఈ పర్యాయం అలా జరుగలేదు. అన్నింటి కంటే పైన ఉత్తరాలు గా నేను భావించే కాగితాలున్నాయి.
    నా మనసు పరిపరి విధాల పోయింది. సందేహం లేదు ఎవరో ఈ పెట్టెని కదిపారు!
    ఒక్క క్షణం మనసును చిక్క బెట్టుకుని ఆ కాగితాలను చదివాను. అవి ఉత్తరాలు కాదు. ఒక స్త్రీని పొగుడుతూ అల్లబడిన వచన కవిత్వం. దస్తూరీ ముత్యాల కోవలా వుంది. నవలలు తీశాను. అట్ట తర్వాత రెండు మూడు పేజీలు  చించ బడ్డాయి. రెండు నవలకూ కూడా చివరి అట్ట - రెండు నవలలకూ లేదు.
    ఆ పెట్టె తెరవడం ద్వారా నేను తెలుసుకున్న చెప్పుకోదగ్గ సమాచారేమేదీ లేదు. కానీ నా ఇంట్లో నా వస్తువులు శోధించబడుతున్నాయన్న అనుమానం కలిగింది. ఈ అనుమాన్నాదారంగా చేసుకుని నా బీరువాలూ, పెట్టెలూ పరిశీలించాను. వాటన్నింటినీ ఎవరో ఏదో వస్తువు కోసం గాలించినట్లు అతి సులభంగా నాకు గ్రహింపయింది.
    శోభ ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర వహిస్తోందని కూడా తెలిసిపోయింది. ఈ విషయం తెలియగానే నాకు భయం, బాధ, దుఖమూ ఒక్కసారిగా కలిగాయి.
    "అమ్మా! ఈలోకంలో నన్ను ఒంటరిదాన్ని చేసి పోయావు. ఎలా బ్రతికేదమ్మా భయంకరమైన ఈ మనుష్యుల మధ్య" అంటూ చేతుల్లో ముఖంపెట్టుకుని కాసేపు ఏడ్చాను.
    క్రమంగా ఊరట కలిగింది.
    శోభ సినిమా నుంచి తిరిగి వచ్చే సమయామవుతోందని గ్రహించి నెమ్మదిగా వంట ప్రయత్నం మొదలు పెట్టాను. అన్నం ఉడికే సరికి శోభ వచ్చింది. భోజనాలయ్యాక ----
    "మనం మూడ నమ్మకాలంటూ తీసి పారేస్తాం గానీ కొన్నింటిలో నిజముంటుంది" అంది శోభ.
    "ఎందుకలాగంటున్నావ్?' అనడిగాను.
    "ఖంగు మన్నట్లే అని మాయమైపోయిన నీ నిధి సంగతి మేము కలగ జేసుకోవడం వల్లనే అది మాయమై పోయిందని నా అనుమానం."
    నేను నవ్వి "అది నిధి అని ఎవరన్నారు? అసలు నా దొడ్లో నిధి ఉందని ఎందుకనుకుంటున్నావ్?" అనడిగాను.
    'అంతకుముందు రోజు స్పష్టంగా విన్న శబ్దం మరుసటి రోజుకు మాయమైందంటే మరెకారనమూ తోచడం లేదు. నీ దొడ్లో నిధి గురించి నీకు చీమ కుట్టి నట్లయినా వున్నట్లు లేదు. ఎప్పుడో దక్కించుకున్నదానిలా నిమ్మకు నీరెత్తినట్లున్నావ్" అంది శోభ భావగర్బితంగా నా వంక చూస్తూ.
    "కారణం చెప్పనా -- "నా దొడ్లో నిధి వుంటుందని నేననుకోవడం లేదు" అన్నాను.
    "నిధి సంగతి నీ కంతగా తెలియదు. హక్కుదారులు కాని వాళ్ళ కది రాయి, రప్పల్లా , పాముల్లా కనపడవచ్చు. అసలైన వాళ్ళ కంటికే అది ధనంలా కనబడుతుంది."
    "ఎందువల్ల?"
    "తమ వారసుల కంద జేయవలసిందని కోరి ధనాన్ని భూమాతకు అప్పగించినప్పుడు, కేవలం వారసులకే అది ఉపయోగపడేలా చేయడం భూమాత బాధ్యత. ఆమె మహిమ వల్లనే నేను చెప్పినట్లు జరుగుతుంది." అంది శోభ.
    "సరే నువ్వు చెప్పినవన్నీ నిజమే ననుకుందాం. అటువంటప్పుడు నేను కంగారుపడి ఏం ప్రయోజనం? నేను నిధికి వారాసురాలనైతే అది నాకు అప్రయత్నంగా లభించాలి. కాని పక్షంలో అదేల్లాగూ నా వశం కాదు" అన్నాను.
    "అలా కాదు. నీకేదైనా పెట్టె భూమిలో దొరికిందనుకో అందులో కేవలం చిల్లర పెంకులున్నాయనుకో, అంతమాత్రాన దాన్నవతల పారేయకు."
    అర్ధమైంది నాకు. నాకేమైనా దొరికిందేమోనన్న అనుమానం శోభకు కలిగింది. అందుక్కారణం ఆమె ప్రయత్నించిన సమయానికి భూమిలో ఏ శబ్దం కాకపోవడంతో అందుకే ఆమె ఇల్లంతా శోధిస్తోంది. నేను అదోలా నవ్వి "భూమిలో దొరికెదైతే కనీసం ఇత్తడి పెట్టాయి వుండవచ్చు. పెట్టెలో చిల్లర పెంకులుంటే ఎం? అవతల పారేయడానికి ఇత్తడి మాత్రం తక్కువ ఖరీదులో ఉందా?" అన్నాను.
    "అలాగని నేనలేదు. కానీ అందులో ఉండే చిల్లర పెంకుల విలువ నీకు తెలియదని చెబుతున్నాను" అంది శోభ.
    "సరే అలాంటిదేమైనా జరిగినప్పుడు పెట్టె నాది చిల్లర పెంకులు నీవి>సరా?" అన్నాను.
    "సరే మరి మాట తిరక్కూడదు" అంది శోభ. ఆ తర్వాత ఇద్దరం కూడా నవ్వుకున్నాం.
    మర్నాడు శోభ లేని సమయం చూసి పొరుగింటి వెంకట్రావు కి భూమిలో నాకు దొరికిన నల్లరాతిని చూపించి "ఇదేమైనా బంగారం లా కనిపిస్తుందేమో చూడు"అనడిగాను అనుమానంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS