"ఎలా?"
"అమ్మాయింట్లోనే వుంది.."
"అమ్మాయికి పెళ్ళెయిపోయిందేమో..."
"అయింది కానీ ఊళ్ళో ఊళ్ళోనేగా..అక్కపోయిన దుఃఖం తల్లితో పంచుకుందుకు వచ్చింది..."
"ఇంత దుఃఖంలోనూ మీరు అల్లుడి క్షేమం గురించి ఆలోచిస్తున్నారు..."
"కూతురుపోవడం నా దురదృష్టం. అందుకని ఓ అమాయకుడికి చేయని నేరాన్నంటగట్టలేను-" అన్నాడు సీమ తండ్రి.
"సరే-మీ అమ్మాయిని పిలవండి. మీ కభ్యంతరం లేకుంటే ఆమెతో యేకాంతంగా మాట్లాడాలి..." అన్నాడు కిల్లర్.
"మీరు డిటెక్టివులు మీకు సహకరించడం నా బాధ్యత.." అన్నాడు సీమ తండ్రి.
కొద్దిక్షణాలలోనే ఓ గదిలో స్నేహను కలుసుకున్నాడు కిల్లర్.
స్నేహకూడా ఇంచుమించు సీమలాగే వుంది. మనిషి కాస్త రంగు తక్కువ కొద్దిగా పొట్టి.
కిల్లర్ తన్నుతాను పరిచయం చేసుకుని సీమ హత్య కాబడిందనీ, మోహనరావు ననుమానిస్తున్నానీ చెప్పాడు.
"బావ ననుమానించడం చాలా అన్యాయం!" అంది స్నేహ వెంటనే.
"ఎందుకని?"
"ఎందుకంటే మొదట్లో కొంతకాలం మేము కూడా బావననుమానించాము. అక్కయ్య బావ గురించి చాలా నేరాలు చెప్పింది. అవన్నీ నిజమని నమ్మేమంతా ముఖ్యంగా నేను.."
"అసలవి అబద్దాలని ఎందుకనుకోవాలి?"
"బావ గురించి అక్కయ్యేం చెప్పిందంటే....?" అంటూ ప్రారంభించింది స్నేహ ఆమె చెప్పిన విశేషాలతడి కాశ్చర్యాన్ని కలిగించాయి.
మోహనరావింట్లో ఓ పనిమనిషి వుంది. అది మనిషాట్టే బాగుండదు. మోహనరావా పనిమనిషి అందాన్ని పొగిడి సీమను దాని ఎదుటే చిన్నబుచ్చేవాడు ఖరీదైన సీమ బట్టలు పనిమనిషిని కట్టుకోమనేవాడు. దాని బట్టలు సీమను కట్టుకోమనేవాడు. పనిమనిషి అజమాయిషీలో ఇంటి చాకిరీ అంతాసీమచేత చేయించేవాడు. ఇది వాళ్ళు ముగ్గురుకీ తప్ప వేరెవ్వరికీ తెలియదంటుంది సీమ ఆమె కిది చాలా అవమానంగా వుండేది.
"అతడలా ఎందుకు చేసేవాట్ట?"
"నువ్వు దరిద్రురాలివి. ఒక్కసారిగా ఐశ్వర్యాన్ని హరించుకోలేవు నెమ్మదిగా అలవాటు పడాలి-అనే వాడని సీమ చెప్పింది..."
"ఈ మాటలబద్ధమని యెందుకనుకోవలసి వచ్చింది?"
"అక్కమాటలు వినగానే నాకావేశం వచ్చింది. సరాసరి బావనే వెళ్ళి అడిగేశాను. బావ చలించలేదు. మీ అక్కకు నామీద అబద్ధాలు చెప్పడం సరదాఅన్నాడు. కావాలంటే మీ అక్కచేతినే నిజం చెప్పి స్తానన్నాడు. చెప్పించమన్నాను. బావ అక్కను పిలిచాడు. ఓ గదిలోకి తీసుకొని వెళ్ళాడు. కాసేపాగి నన్ను లోపలకు పిలిచాడు. అక్క తను చెప్పినవన్నీ అబద్దాలని ఒప్పేసుకొంది..."
కిల్లర్ ఆశ్చర్యంగా-"తనబద్దాలెందుకు చెప్పిందిట?" అన్నాడు.
"అప్పుడప్పుడు తన మనసు మనసులో వుండదుట. ఎందుకో బావంటే ఆవేశం వస్తుందిట. బహుశా తన ప్రేమ వివాహాన్ని దెబ్బతీశాడనికూడా కావచ్చునంది. అలా అబద్దాలు చెప్పాలనిపిస్తుందిట. బావ దేవుడుట. తన్ను దేవతలా ఆరాధిస్తున్నాడుట.....మున్ముందు కూడా తానబద్దాలు చెబితే సీరియస్ గా తీసుకోవద్దంది-...." అంది స్నేహ.
"చాలా విచిత్రంగా వుంది. మీ బావ గదిలోనికి తీసుకొని వెళ్ళి ఆమెను బెదిరించాడేమో!" అన్నాడు కిల్లర్.
"అక్క ముఖంలో భయం లేదప్పుడు. ఎంతో ప్రశాంతంగా వుంది. బావ చెప్పినదేమిటంటే నిజం చెప్పమని తను బ్రతిమాలుకున్నానని!"
"ఆ బ్రతిమాలడం నీ యెదురుగా యెందుకు చేయలేదు?"
స్నేహ అంత విషాదంలోనూనవ్వి-"మరదలి ముందైనా సరే భార్య కాళ్ళు పట్టుకోవడం తనకు చిన్నతనమన్నాడు బావ...." అంది.
"ఆ తర్వాత సీమ మళ్ళీ నీకు బావ గురించి అబద్ధాలు చెప్పిందా?"
"ఆహా-చెప్పడం అది మానలేదు.....పైగా ఇంకా దారుణంగా చెప్పేది. బావలో యేదో మంత్రశక్తి వున్నదంది. అందుకే తను నవనీత్ ని కాదని అతణ్ణి పెళ్ళి చేసుకుందట. అందుకే అతడెదురుగా వుంటే అతడికి వ్యతిరేకంగా మాట్లాడలేదుట. ఆపైన నన్ను హెచ్చరించింది కూడా.....నువ్వక్కడికి రాకు.....నీకు తెలియకుండానే బావకు లొంగిపోతావు-...అంటూ...." ఈ మాట చెప్పడానికి స్నేహ కొంచెం సిగ్గుపడింది.
"మోహనరావలాంటి వాడని నీకు అనిపించిందా?"
"లేదు బావ చాలా మర్యాదస్థుడు." అంది స్నేహ వెంటనే.
"ఆ మాట నీవు మీ అక్కకు చెప్పావా?"
"చెప్పాను ఇంట్లో యెవ్వరూ తనమాట వినడం లేదని విసిగిపోయి అది చివరికోరోజున - మీరెవ్వరూ నాకు కలిసిరారు. ఏదో ఒకరోజున నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు తెలిసివస్తుంది....అంది...."
కిల్లర్ ఆమెను మరికొన్ని ప్రశ్నలువేసి అర్ధ చేసుకున్నదిది.
సీమకు నవనీత్ ని మర్చిపోవడం సాధ్యం కావడంలేదు. ఆమె ప్రేమను అందరూ తక్కువ అంచనా వేశారు. ఆమె మోహనరవుని ద్వేషిస్తోంది. అతడిని మానసికంగా హింసించడమే ఆమె ధ్యేయం. అందువల్ల ప్రయోజన మేమిటీ అన్న విషయం ఆమె కవసరంలేదు. ఆమె మొండిది. అనుకున్నది సాధించాలి. ఆ మొండితనంతోనే ఆత్మహత్య చేసుకుంది.
ఇంచుమించు సీమ తండ్రి చెప్పినమాటలనే సీమ చెల్లెలూ చెప్పింది. సీమ అబద్ధాలు చెబుతున్నదని ఆమె వద్ద ఋజువుకూడా వుంది.
"ఇంతగా సీమ ప్రేమను పొందిన ఆ నవనీత్ ను కలుసుకోవాలి. అతడి అడ్రసు కావాలి నాకు...." అన్నాడు కిల్లర్.
"అంటే మీరింకా ఈ కేసు పరిశోధిస్తారా?" అంది స్నేహ ఆశ్చర్యంగా.
"మొండితనంతో ఆత్మహత్య చేసుకుందని సీమ గురించి మీరంతా అంటున్నారు. ఆమెకు జీవించాలన్న కాంక్ష ఎక్కువగా వున్నదని నా అభిప్రాయం ఆమె హఠాత్తుగా ఆత్మహత్య యెందుకు చేసుకుందో తెలుసుకొనితీరాలి నేను...." అన్నాడు కిల్లర్.
స్నేహ అతడికి నవనీత్ చిరునామా యిచ్చింది.
7
చాలా చిన్నగది అది. అందులో ప్లాస్టిక్ పెట్టెడు వున్న ఇనుపమంచం మీద కూర్చున్నాడు నవనీత్. అతడి కెదురుగా చిన్న ఇనుప కుర్చీలో కూర్చున్నాడు కిల్లర్.
నవనీత్ చూడ్డానికి చాలా సామాన్యంగా వున్నాడు. సన్నగా, పొడుగ్గా, చామనఛాయలో వున్న నవనీత్ ముఖం మొదటిసారి చూడగానే గుర్తుండిపోతుందనుకుందుకులేదు.
కిల్లర్ అతడికి తన కథ చెప్పి-"నిన్ను చూడాలని వచ్చాను-" అన్నాడు.
"నాకోసం ఉద్యోగం చూడండి. నేనే మిమ్మల్ని చూడాలని వస్తాను..." అన్నాడు నవనీత్. అతడి గొంతు వినసొంపుగా వుంది.
"నువ్వు సీమను ప్రేమించావు. సీమ నిన్ను ప్రేమంచింది. నీ ప్రేమకథ గురించి నీ నోట వినాలనుకుంటున్నాను-" అన్నాడు కిల్లర్.
"మా ప్రేమ కధ నిజంకాదు. అబద్ధం!" అన్నాడు నవనీత్.
