Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 14

 

    "మీరెవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను..." అంది జానకి ఆశ్చర్యంగా.
    సీతమ్మ జానకి తండ్రి పేరు, ఊరి పేరు చెప్పింది.
    "అవును-- సరిగ్గానే చెప్పారు.... కానీ మీరెవరో ...."
    "అప్పుడే నన్ను మర్చిపోయారన్న మాట....కిషోర్ గుర్తున్నాడా..." అనడిగింది సీతమ్మ.
    "కిషోర్ అంటే లలిత అన్నయ్య....?' అంది జానకి ప్రశ్నార్ధకంగా.
    "ఆ అతనే....అప్పట్లో మీరిద్దరూ రోజూ ఒకర్నొకరు చూసుకోకుండా ఉండలేక పోయారు. ఒక రోజున మీ ఏకాంతానికి నేను భంగం చేశాను...."
    సీతమ్మ ఇంకా ఏదో చెప్పబోతుండగా జానకి ఆమెను ఆపి - "చూడండి. మీరెవరో నిజంగా నాకు తెలియదు. అనవసరంగా దేనికీ అవేశపడని తత్త్వం నాది. అందుకని తాపీగా చెబుతున్నాను. నాకు పెళ్ళయింది. నా భర్త పేరు కిషోర్ కాదు. సూర్యారావు . పెళ్ళికి ముందు నేనెవరి తోనూ తిరగలేదు. కిషోర్ నాకు అన్న లాంటి వాడు. మీరు ఎవర్ని చూసి ఎవరనుకుని పోరపడుతున్నారో తెలియదు. మరెవరి దగ్గరైనా ఇలా మాట్లాడారంటే బహుశా మీరు కట్టుడు పళ్ళు పెట్టించుకోవాల్సి వుంటుంది...." అంది.
    సీతమ్మ మారు మాట్లాడకుండా అక్కణ్ణించి బైట పడింది.
    "ఇంక రెండు ఉపాయలున్నాయి. జానకి పేరున కిషోర్ కి ఒక ప్రేమ లేఖ వ్రాసి అతడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి. అలాగే కిషోర్ పేరున జానకికో ప్రేమలేఖ వ్రాసి ఆమె ప్రవర్తన ఎలాగుంటుందో చూడాలి..."అన్నాడు వెంకన్న సాలోచనగా.
    "అలా చెయ్యొద్దు...." అన్నాడు సూర్యారావు -- 'అప్పుడు జానకికి నిజంగానే కిషోర్ పై ప్రేమ పుట్టి అతడితో లేచి పోవచ్చు. అసలే ఇద్ద్టరికీ ఒకరిపై ఒకరికి ఆకర్షణ వుంది. దానికిలాంటి ప్రోత్సాహం లభించడం నాకిష్టం లేదు...."
    "అయితే ఆఖరి ఉపాయం చెప్పనా?" అన్నాడు వెంకన్న.
    "ఏమిటది?"
    "జానకిని హత్య చేయడం. హత్య చేసేముందు ఆమెకు ఆమె తప్పుల్ని చెప్పడం చాలా అవసరం. అప్పుడు మీకు మానసిక తృప్తి కూడా ఉంటుంది...." అన్నాడు వెంకన్న.
    "ఆహా -- ఎన్నాళ్ళకు మీరు నేను కోరిన సలహా యిచ్చారు? మీరిలాంటి సలహా యిస్తారనే చాలాకాలంగా ఎదురు చూస్తున్నాను. హత్య ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో మీరే నాకు వివరించాలి...." అన్నాడు సూర్యారావు.
    'అలాగే -- అవన్నీ రేపు చూద్దాం--" అన్నాడు వెంకన్న.
    సూర్యారావు వెళ్ళిపోయాక -- "సూర్యారావు పెళ్ళాన్ని హత్య చేయకపోతే నేనే అతణ్ణి చంపేసేలా ఉన్నాను--ఇలాంటి కేసెక్కడా వినలేదు, కనలేదు...." అన్నాడు.
    
                                      10
    మర్నాడుదయం వెంకన్న ఆఫీసుకు చిన్న బ్రీఫ్ కేస్ తో వచ్చాడు సూర్యారావు. అతను మరీ అంత ఉత్సాహంగా లేడు. దిగులుగా వెంకన్న వంక చూస్తూ -- "ఇంక మీరే నా గురువు...." అన్నాడు.
    "నిన్న ఏం జరిగింది?' అన్నాడు వెంకన్న.
    "ఇంతకాలం నేను గుర్తించలేదు. ఆమె .....అనగా నా భార్య జానకి..... అసాధారణ స్త్రీ! నాకామే భార్యగా లభించడం జన్మజన్మల అదృష్టం. ఆమె అందం, నడక, మాట, తీరు.... ఒకటేమిటి -- ఈ సృష్టిలో ఆమెలాంటి వ్యక్తీ మరోకతే లేదు...." అన్నాడు సూర్యారావు.
    "ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒక్కలా ఉండరు. అన్ని ఒక్కలా వుంటే కనీసం వెలి ముద్రలైనా తేడా వుంటాయి. అందువల్ల మీ భార్య వంటి స్త్రీ మరొకామె ఉండదని నాకు తెలుసు --" అన్నాడు వెంకన్న.
    "మీరేమనండి. ఆమె అపూర్వ వ్యక్తీ--" అన్నాడు సూర్యారావు.
    "అయితే ఆమెను చంపనంటారా?' అడిగాడు వెంకన్న. ఈ పిచ్చివాడు నాకెక్కడ దొరికాడు భగవంతుడా అన్న దిగులు అతడి కళ్ళలో కనబడుతోంది.
    "ఎందుకు చంపను? చంపి తీరతాను. అదే నా నిర్ణయం అంటూ సూర్యారావు బ్రీఫ్ కేసు తెరిచి ఓ వస్తువు బైటకు తీశాడు. అది తళతళ మెరుస్తున్న కత్తి!
    "ఈ కత్తి ఎక్కడ సంపాదించారు?" ఆశ్చర్యంగా అడిగాడు వెంకన్న.
    "ఇదీ ఆమె సంపాదనే౧ కాలేజీలో జాన్సీ లక్ష్మీ బాయి వేషం వేస్తె బహుమతిగా ఇదామెకిచ్చారుట. ఆ కత్తితోనే ఈరోజు నేనామె ప్రాణాలు తీయబోతున్నాను--" అన్నాడు సూర్యారావు.
    "మిస్టర్ సూర్యారావ్! మీ మీద నాకు పూర్తీ సానుభూతి వున్నది. అందుకే అడుగుతున్నాను. హత్య చేసి మీరేమి సాధించదల్చుకున్నారు? హంతకుడిగా కోర్టులో నిలబడి జడ్జి చేత శిక్ష వేయించుకుందామనా? లేక తెలివిగా హత్య చేసి తప్పించుకుందామనా?" అన్నాడు వెంకన్న.
    సూర్యారావు సాలోచనగా -- "జానకిని హత్య చేసి కూడా నేను తప్పించుకునే సాధనముందంటారా?' అన్నాడు. అతని మాటల్లో ఆశ కూడా ధ్వనిస్తోంది.
    "ఉంది, మీకు నేను సాయపడతాను కూడా -' అన్నాడు వెంకన్న.
    'అయితే నేను ధన్యుణ్ణి. మీరెలా చెబితే అలా చేస్తాను--" అన్నాడు సూర్యారావు.
    "మీ భార్యను కత్తితో హత్య చెయ్యవద్దు. రివాల్వర్ తో చంపండి..." అన్నాడు వెంకన్న.
    "నా దగ్గర రివాల్వర్ లేదే...." అన్నాడు సూర్యారావు.
    "నా రివాల్వర్ ఇస్తాను...." అన్నాడు వెంకన్న.
    "మీ రివాల్వర్ ఇస్తారా?' ఆశ్చర్యంగా అన్నడుసూర్యారావు.
    'అవును....అందువల్ల రెండు ప్రయోజానాలు, హత్యా ఆయుధానికి మీకూ ఏ విధమైన సంబంధమూ వుండదు. ఆమె వద్దకు నా రివాల్వర్ ఎలా చేరిందో నేను కధ అల్లుతాను. నాకు మీరు పారితోషకంగా పదివేలిస్తే చాలు. ఈ హత్య జరిగే విధంగానూ, మీరు హంతకుడు కాకుండా ఉండే విధంగానూ చక్కని పధకం తయారు చేస్తాను. సాధారణంగా నాకిలాంటి పనులిష్టముండదు. కానీ మీ కధ స్వయంగా చూశాక మీకు సాయపడాలనిపించింది. మీ భార్య అందచందాల్లో ఆదర్శ మహిళ కావచ్చు, కానీ ఆమె నయవంచకి. అటువంటి వారెంతకైనా తగుదురు. అలాంటి వారివల్ల  మీకే కాదు ఈ సమాజానికే ప్రమాదం. ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు నేను మీ యింటికి వస్తాను. కాలింగ్ బెల్ మ్రోగించను. మీరే సరిగ్గా ఆ టైముకు తలుపులు తీసి వుంచాలి. నేను సరాసరి లోపలికి వస్తాను. రివాల్వర్ ఇస్తాను. అప్పుడు మీరామెను లేపి రివాల్వర్ తో బెదిరించి-- మీరెందుకు ఆమెను చంపబోతున్నారో వివరించి -- సంజాయిషీ అడిగి -- ఆ సంజాయిషీ సంతృప్తికరంగా లేకపోతే ఆమెను వెంటనే పేల్చి చంపేయండి. ఆ తర్వాత మీరు నా రివాల్వర్ నాకిచ్చేసి నాతొ వచ్చేయండి. మీకు దుర్భేద్యమైన ఎలిబీ సృష్టిస్తాను. మీకు న్యాయస్థానం భయం లేకుండా చేస్తాను...." అన్నాడు వెంకన్న.
    "వెంకన్న గారూ - ఇన్నాళ్ళకు మీరు నన్ను పూర్తిగా  అర్ధం చేసుకున్నారు. సరిగ్గా ఇదే నేను కోరుకున్నది. నా భార్యకు ఆమె చేసిన తప్పు చెప్పాలన్నది ఎన్నాళ్ళుగానో నేను కలగంటున్న కోరిక. కానీ ఒక పర్యాయం ఆమె ఎదుట పడి అంత మాటన్నాక ఆ తర్వాత ఆమెకు ఎదురు నిలవలేను. ఆమెతో మాట్లాడలేను. ఆమె ప్రవర్తనకు తట్టుకోలేను. అందుకే ఆమె డైరీ చదివినా కూడా అమెనేమీ అనలేకపోతున్నాను. ఇప్పుడైతే చెప్పదలచినవన్నీ చెప్పేక ఆమెను చంపేస్తాను. అందువల్ల నాకింక మళ్ళీ ఆమెకు ఎదుట పడాలన్న బెంగ వుండదు...." అన్నాడు సూర్యారావు.
    వెంకన్న నిట్టూర్చి --- "మనం మళ్ళీ రాత్రి కలుసుకుందాం--" అన్నాడు.


                                    11
    "నమస్కారం-- మనమిదివరలో ఒకసారి కలుసుకున్నాం--" అన్నాడు వెంకన్న.
    "అవును, ఆతర్వాత మీరు డిటెక్టివ్ వెంకన్న గారని తెలిసింది. మీ పేరు వినడమే కానీ మిమ్మల్ని చూసే అదృష్టం కలిగిందని అప్పట్లో నాకు తెలియలేదు--"అంది జానకి.
    వెంకన్న ఆశ్చర్యంగా -- "నేను డిటెక్టివ్ నని మీకెవరు చెప్పారు?" అడిగాడు.
    ఆమె నవ్వి ఊరుకుంది.
    "సరే -- ఎలాగో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు నేను డిటెక్టివ్ గానే మిమ్మల్ని హెచ్చరించాలని వచ్చాను--"
    "హెచ్చరికా?" అందామె ఆశ్చర్యంగా.
    'అవును, మీ ప్రాణాలిప్పుడు ప్రమాదంలో ఉన్నాయి...."
    "నా ప్రాణాలకు ప్రమాదమా? వాటిని భద్రంగా మావారు కాపాడుకుంటారు..."అంది జానకి తేలికగా నవ్వి పారేస్తూ.
    "మీవారే ఇప్పుడు మీ ప్రాణాలకు ప్రమాదం తల పెట్టాలన్నది ఇప్పటి నా హెచ్చరిక!"
    జానకి క్షణకాలం మ్రాన్పడి పోయింది -- "ఏమన్నారు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS