వాళ్ళు వెళ్ళేసరికి కారాగారం తలుపులు బార్లా తెరిచి వున్నాయి. కానీ కన్నయ్య లోపలే ఉన్నాడు.
"మీ భటుడు తలుపులు వేయడం మర్చి వెళ్ళాడు. ఐనా నేను పారిపోయే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటె నేను న్యాయానికి కట్టుబడిన వాణ్ణి" అన్నాడు కన్నయ్య.
ఇంతవరకు మంత్రి ఎందరినో ఆ చీకటి కొట్లో వేయించాడు. ఇంత సుఖంగా అందులో వున్న వాణ్ణి చూడడం ఆయనికిదే ప్రధమం. కన్నయ్యలో ఏదో విశేషముందని ఆయనకు తోచింది. "ముందు నీ కల గురించి చెప్పు " అన్నాడాయన.
కన్నయ్య తనకు వచ్చిన కల గురించి ఆయనకు చెప్పాడు.
అది వింటూనే మంత్రి కంగారుగా లేచాడు. ఆయనకో మేనల్లుడున్నాడు. వాడికి పదిహేనేళ్ళ వయసప్పుడు మంత్రి పదేళ్ళ తన కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు. ఆ తర్వాత ఏమయిందో గాని ఇల్లు వదలి వెళ్ళిపోయాడు. ఇది జరిగి పదేళ్ళ యింది. కన్నయ్య కల వినగానే మంత్రికి అది నిజమా అబద్దమా అని ఆలోచించాలని పించలేదు. తన అల్లుడు మళ్ళీ తిరిగి వచ్చాడేమో ననిపించింది.
మంత్రి అక్కడ్నించి బయల్దేరి తన కూతురి తీసుకొని కన్నయ్య చెప్పిన పరమేశ్వరాలయం దగ్గరకు వెళ్ళాడు. ఆలయం ఆవరణ లో కూర్చుని వున్న సాధువు నాయన చూసాడు. ఆయనకు వాడిలో తన మేనల్లుడి పోలికలు చాలా కనిపించాయి.
మంత్రి పరుగున సాధువును సమీపించి అయన ఒంటి మీద కప్పుకున్న కాషాయ శాలువా లాగేసాడు. సాధువు చాతి మీద పొడవాటి నల్లని మచ్చను చూస్తూనే 'అల్లుడూ! " అంటూ పెద్దగా కేక పెట్టాడాయన. కత్తి యుద్ధం నేర్చుకునే రోజుల్లో వాడికి అక్కడ గాయమై ఏర్పడిన మచ్చలు అవి.
"ఎవరు మీ అల్లుడు ?" అన్నాడు సాధువు.
"నన్ను గుర్తుపట్టలేదా బాబూ! నేను ఈ దేశపు మంత్రినీ, నీకు మేనమామనీ, మామనీ కూడా. నీ భార్యను తీసుకొని వచ్చాను. సుఖంగా సంసారం చేయక నీకీ సన్యాసమెందుకు బాబు? నాతొ పాటు వెంటనే ఇంటికి రా " అన్నాడు మంత్రి.
సాధువు మంత్రినీ, కూతుర్నీ కాస్సేపు మార్చి మార్చి చూసి, "నేనిక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది " అని అడిగాడు.
మంత్రి వెంటనే కన్నయ్య కధ చెప్పాడు.
"చాలా ఆశ్చర్యంగా వుందే! నా ఉనికి మీ అంతట మీకు ఎలా తెలుస్తుందా అని వేదన చెందుతున్నాను. ఆ కన్నయ్య ఎవడో గాని భగవంతుడిలా నన్నాదుకున్నాడు. నాకీ సన్యాసం బాధ తప్పింది" అంటూ వాడు లేచి అక్కడున్న మంత్రి కూతురి చేయి పట్టుకొని, "మంజరీ ! ఇంతకాలం నిన్నోదిలి సన్యాసుల్లో తిరిగినందుకు నన్ను మన్నిస్తావు కదూ!" అన్నాడు.
మంజరీ సిగ్గుతో తల వంచుకుంది.
9
కన్నయ్యను మంత్రి వదలి పెట్టడమే గాకుండా మంచి బహుమతులు కూడా ఇచ్చాడు. ఈ విషయం విని గురవయ్య లబో దిబో మన్నాడు. మంత్రిగారి మంగలి- "తెలియక మీకు సాయపదాలనుకొన్నాను. ఆ కన్నయ్య మహానుభావుడు. వెధవ బుద్దులు వదలి పెట్టి మద్యాడగా బ్రతుకు" అని గురవయ్యకు సలహా ఇచ్చాడు.
ఐతే గురవయ్య ఊరుకోలేదు. న్యాయాధికారి బావమరిదితో కలిసి అయన ఆ పర్యాయం రాజుగారి చాకలి దగ్గరకు వెళ్ళాడు.
గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళు సామాన్యుల గోడు వినాలంటే ఇలాంటి చిల్లర జనాల వల్లనే పని అవుతుంది. రాజుగారికి తన న్యాయాధికారి కంటే, మంత్రి కంటే కూడా తన చాకలి మాటల పైనే గురి ఎక్కువని గురవయ్యకు న్యాయాధికారి బావమరిది చెప్పాడు. గురవయ్య రాజుగారి చాకలికి పాతిక బంగారు కాసులు బహుమానం ఇచ్చాడు.
చాకలి రాజు దగ్గరకు వెళ్ళినపుడు అనువు చూసుకొని కన్నయ్య కధ చెప్పాడు. న్యాయాధికారి, మంత్రి వాడి దగ్గర లంచాలు తిని శిక్షించకుండా వదిలి పెట్టేసినట్లు వాడు రాజుకు చెప్పాడు. ఇది వింటూనే రాజు వాళ్ళిద్దరికీ కబురంపి విషయం అడిగాడు.
"ఆ కన్నయ్యను తక్షణం పట్టుకుని కారాగారంలో పడేయండి. దీని గురించి విచారణ కూడా లేదు" అన్నాడు రాజు.
రాజభటులు వెళ్ళి కన్నయ్య ను పట్టుకుని ఎవరూ చొరబడ లేని ఓ చీకటి కొట్లో పడేశారు. కన్నయ్య ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు.
కన్నయ్య మళ్ళీ కారాగారంలో ఒంటరివాడై పోయాడు. అయితే ఎప్పటి లాగే వాడు భిక్షాపాత్ర సాయంతో అన్ని సదుపాయాలూ ఏర్పాటు చేసుకుని అందులోనే హాయిగా ఉన్నాడు.
కన్నయ్య కారాగారంలో పడ్డందుకు గురవయ్యకు చాలా సంతోషంగా వుంది. అయన రాజు గారి చాకలికి మరో పాతిక కాసుల బంగారం బహుమతిగా ఇచ్చాడు.
కన్నయ్య ప్రభావం చవి చూసిన న్యాయాధికారికీ, మంత్రికీ రాజు చేసిన పని నచ్చలేదు. కన్నయ్య ఎన్నో శక్తులు కలిగి వుండి కూడా న్యాయానికి కట్టుబడి ఉంటున్నాడు. తన శక్తుల్ని దుర్వినియోగం చేయడం లేదు. అలాంటి వాణ్ణి కారాగారంలో ఉంచడం దేశానికి అరిష్టమేమోనని ముఖ్యంగా మంత్రికి అనిపించింది. ఎలాగైనా రాజుకు ఈ విషయం నచ్చ జెప్పాలని ఇద్దరూ అనుకున్నారు. అయితే న్యాయాధికారి రాజును కలుసుకోవడానికి భయపడ్డాడు.
అందువల్ల మంత్రి ఒక్కడే రాజు వద్దకు వెళ్ళి, "మహా ప్రభూ ! కన్నయ్యలో ఏదో మహిమ వున్నదాని నాకు తోస్తోంది. న్యాయాధికారి వాణ్ణి కారాగారంలో వేసినపుడు , వాడికి న్యాయాధికారి గురించి కలవచ్చి నిజమయింది. ఇప్పుడు మీరు వాణ్ణి కారాగారంలో ఉంచారు. వాడికి మీ గురించి కూడా ఏదో కల వస్తుందనీ అది నిజమవుతుందని, నా బుద్దికి తోస్తున్నది. తమరు నా మాట ఆలకించి, రేపు ఉదయం ఒక పర్యాయం కన్నయ్యను చూసి, వాడికేం కల వచ్చిందో విచారించండి " అన్నాడు.
"నువ్వు వాడి దగ్గిర లంచం తిన్నావు. అందుకే వాడి గురించి నాకిలా చెబుతున్నావు. నేను వాడిని కలుసుకొను" అన్నాడు రాజు చిరాగ్గా.
సరిగ్గా అదే సమయానికి ఇంటి దగ్గర్నుంచి మంత్రి గారికి కబురు వచ్చింది. స్వగ్రామంలో మంత్రి గారిల్లు పునాదులతో సహా మాయమైనదని అప్పుడే వార్త వచ్చిందట.
"ఇల్లు మాయం కావడమేమిటి?" అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
"ఏమో! చాలా విచిత్రంగా వుంది ప్రభూ! కానీ ఇలాంటి విడ్డూరం శివపురంలో జరిగింది" అంటూ మంత్రి ఆయనకు కన్నయ్య కధ పూర్తిగా చెప్పాడు.
"ఇప్పుడు నేనుంటున్నది నా స్వంత ఇల్లు కాదు. ప్రజల సొమ్ముతో మంత్రులకని కట్టబడ్డ భవనమది. నేను నా ఇల్లు కన్నయ్యకు దానం ఇచ్చేశాను. వెంటనే కన్నయ్య భిక్షా పాత్ర ఆ ఇంటిని స్వీకరించిందన్న మాట. ఆలోచిస్తుంటే కన్నయ్య కధ నిజమేననిపిస్తోంది " అన్నాడు మంత్రి.
రాజుకు ఇది నమ్మ శక్యం కాలేదు.
మంత్రి ఉండే ఊరక్కడికి చాలా దూరం. ప్రత్యేకమైన రధాల్లో ప్రయాణం చేస్తే తప్ప అక్కడికి రెండు రోజుల్లో చేరడం కష్టం ! మంత్రి గారి మనిషి, ఇల్లు మాయంయ్యాక ఒకటి రెండు రోజులు అందుకు కారణాలు తెలుసుకుందుకు ప్రయత్నించి , ఏమీ దొరక్కపోగా నెమ్మదిగా కాలి నడకన బయల్దేరి ఈవేళకి వచ్చి ఈ వార్త చెప్పాడు.
ఇందులో నిజానిజాలు రాజు కూడా తెలుసుకోవాలను కున్నాడు. అయన ఓ ప్రత్యేకమైన రధం ఏర్పాటు చేయించి మంత్రితో కలిసి ఆ గ్రామం వెళ్ళాడు.
నిజంగానే ఇప్పుడక్కడ ఆ ఇల్లు లేదు. అయితే ఒకప్పుడు ఇల్లు ఉండేదనడానికి సూచకంగా పునాదులు మాత్రం ఉన్నాయి.
మంత్రి సాలోచనగా, "వాడి భిక్ష పాత్ర శక్తిని అనవసరంగా శంకించి నిక్షేపం లాంటి ఇల్లు పోగొట్టుకున్నాను. న్యాయాధికారి న్యాయస్థాన భవనాన్ని కన్నయ్యకు దానం చేసాడు. ఐతే ఆ భవనం ప్రజలదే గాని ఆయనది కాదు. అందువల్ల అది మాయం కాలేదు" అన్నాడు.
రాజుకు కన్నయ్యను కలుసుకోవాలన్న ఆత్రుత పెరిగింది. వాడికిప్పుడు తన గురించి ఎలాంటి కల వచ్చిందో తెలుసుకోవాలని అయన తహతహలాడుతున్నాడు.
10
కారాగారంలో సకల సదుపాయాలతో హాయిగా ఉన్న కన్నయ్యను చూసి ఆశ్చర్యపోయాడు రాజు. రాజును చూస్తూనే కన్నయ్య - " మీ కోసమే ఎదురుచూస్తున్నాను. ప్రభూ! మీకు సంబంధించి నాకొక అద్భుతమైన కల వచ్చింది " అన్నాడు.
"ఏమిటా కల " అన్నాడు రాజు ఆత్రుతగా.
"మీ చతురంగ బలాల నుంచి ఒక్కొక్కటి మాత్రం ఎన్నుకొని నేను తీసుకొన్నానుట . అప్పుడు బయల్దేరి మీకు పక్కలో బల్లెం లా ఉన్న దుర్జయ దేశాన్ని ఓడించి మీకు స్వాధీనం చేశానుట" అన్నాడు కన్నయ్య.
కన్నయ్య ఉండే దేశాన్నీ, దుర్జయ దేశాన్నీ పెద్ద పర్వత శ్రేణులు వేరు చేస్తున్నాయి. దుర్జయ దేశపు రాజు క్రూరసేనుడు పేరుకు తగ్గట్టే మహా క్రూరుడు . ఆయనకు, అంతులేని సైనిక బలం ఉంది. ఆ సైనిక బలంతో పొరుగు దేశాల సరిహద్దు గ్రామాలను దోచుకుంటూ ఉంటాడు. తనకున్న పర్వత శ్రేణుల్లో అయన అనువైన కోటలు కట్టాడు. శత్రువు లెవ్వరూ దుర్జయ దేశంలో ప్రవేశించ లేరు.
"తరతరాలుగా దుర్జయ దేశం మాకు శత్రు రాజ్యం. తాతల కాలం నాటి నుంచీ ఆ దేశాన్ని ఏమీ చేయలేక మేము నానా అవస్థలూ పడుతున్నాం. నువ్వొక్కడివీ దాన్ని సాధించుకు వస్తావా ? నమ్మదగ్గ కధేనా ఇది" అన్నాడు రాజు వీరసేనుడు వెటకారంగా.
