Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 16

   
    నన్ను పంపి చూడండి ప్రభూ! అప్పుడు నమ్మకం మీకే కలుగుతుంది " అన్నాడు కన్నయ్య .
    "తప్పించుకుపోవడానికి నువ్వు వేస్తున్న పధకం ఇది" అన్నాడు వీరసేనుడు.
    మంత్రి రాజును వారించి, "పునాదులతో మాయమైపోయిన నా ఇంటి సంగతి మరిచి పోకూడదు మీరు " అన్నాడు.
    ఈ కొత్త వార్తా విని కన్నయ్య ఆశ్చర్యపడ్డాడు. మంత్రిని అడగ్గా అయన జరిగింది చెప్పాడు.
    ఇది వింటూనే కన్నయ్యకు ఎక్కడ లేని ధైర్యమూ వచ్చింది. తన భిక్షాపాత్ర మహిమను కోల్పోలేదు.
    "అవును ప్రభూ! నా భిక్షా పాత్ర అక్రమ దానాన్ని స్వీకరించదు. స్వంతమైన వస్తువును ఇస్తేనే అది స్వీకరిస్తుంది. ఈ విషయం నాకు స్పురించలేదు" అన్నాడు కన్నయ్య.
    దుర్జయ దేశాన్ని తానొక్కడూ జయించుకు రాగలనని వాడు రాజుకు మరింత నమ్మకంగా చెప్పాడు. వాడికిప్పుడు భిక్షాపాత్ర శక్తి పైన తిరుగులేని నమ్మకం కలిగింది.
    "సరే , ఇదీ చూద్దాం !" అంటూ రాజు కన్నయ్యను తీసుకుని తన రధాలశాలకు వెళ్ళాడు. "వీటిలో ఏ రధం కావాలో కోరుకో! రధ చోదకుడితో సహా అది నీదవుతుంది " అన్నాడు.
    కన్నయ్య అక్కడున్న వాటిలో ఒకదాన్ని చూపించాడు.
    కానీ రాజు దానం చేసినా ఆ రధం మాయం కాలేదు. కన్నయ్య భిక్షా పాత్రలో ప్రవేశించ లేదు.
    కాసేపు ఈ విచిత్రం ఎవ్వరికీ అర్ధం కాలేదు. తర్వాత మంత్రి నెమ్మదిగా , "మహాప్రభూ! ఈ రధాలన్నీ తమకు రాజరికపు వారసత్వంగా సంక్రమించినది. మీరు రాజు కావడం వల్ల మీది అయినవి తప్పితే ఇవి మీ స్వంతం కాదు. ఇవి ప్రజల సొమ్ముతో తయారైనవి, వీటిని దానం చేసే హక్కు మీకు లేదను కుంటాను" అన్నాడు.
    వీరసేనుడికి ముందు కోపం వచ్చింది. కానీ కాసేపటికి తమాయించు కున్నాడు.
    రాజు చెవిలో ఆయన్ని దానకర్ణుడని, వంది మాగధులు పొగడ్డం వినబడింది. ఇంతకాలం అయన లెక్కలేనన్ని దానాలు చేశాడు. ఆ గొప్ప తనం తనదేనని విర్రవీగుతున్నాడు. ఈ భిక్షాపాత్ర తన దానాన్ని స్వీకరించనంత వరకూ ఆయనకు అసలు విషయం తెలియలేదు. ప్రజల సొమ్మును ప్రజల తరపున దానం చేస్తూ , ఆ గొప్పతనం తనదనుకుని భ్రమ పడ్డాడు. తను విచ్చలవిడిగా దానాలు చేయడానికి కారణం కూడా అదే! అది తను కష్ట పడి సంపాదించిన డబ్బు కాదు.
    శివపురం;లో భద్రయ్య ఇంటిని దానం చేయగలిగాడు. ఆ ఊరి పౌరులంతా కన్నయ్యకు ఏదో ఒకటి దానం చేయగలిగారు. రాజధాని లో తన మంత్రి కూడా కన్నయ్యకు ఇల్లు దానం చేశాడు. ఒక దేశానికి మహరాజై ఉండి కూడా నిజంగా తనుదానం చేయగలిగిందేముంది ?
    తను ఒక దేశానికి సంరక్షకుడు. ఆ దేశాన్ని సంరక్షిస్తున్నంత కాలం కొన్ని హక్కులు తనకు సంక్రమిస్తున్నాయి. తను విఫలుడైతే ఆ హక్కులన్నీ పోతాయి. తననుభవిస్తున్న వైభోగాలు , తను ధరిస్తున్న ఆభరణాలు, ఆఖరుకు తాను ధరించిన దుస్తులు, వీటిలో ఏ ఒక్కటీ తన స్వంతం కాదు.
    వీరసేనుడు కన్నయ్య వంక ప్రేమాభిమానులతో చూసి, "నీ కారణంగా నేనిప్పుడొక కొత్త జీవిత సత్యం తెలుసుకున్నాను. దానకర్ణుడిగా పేరు పొందిన నాకు, నిజానికి దానాలు చేసే అర్హత లేదు. ఆ అర్హత సంపాదించుకోవడం కోసం నేను కొంత కాలం శ్రమ పడతాను. అంతవరకూ దుర్జయ దేశం పై దండెత్తే ఆలోచన నాకు లేదు" అన్నాడు.
    ఆ క్షణంలో రాజులో వచ్చిన మార్పుకు మంత్రి ఆశ్చర్యపోయాడు. చిన్న విషయాన్నీ పెద్దదిగా భావించి, మనసు కష్ట పెట్టుకోవద్దని మంత్రి వీరసేనుడికి చెప్పాడు కానీ అయన వినలేదు.
    ఆ రోజునుంచీ వీరసేనుడు సాయంసమయాల్లో విలాసంగా విహరించడానికి బదులు రత్న కంబళీలు తయారు చేయసాగాడు. ఆ విద్య అయన చిన్నతనంలో గురుకులవాసం చేసినపుడు నేర్చుకున్నాడు. తను చేయడమే కాకుండా, మహారాణి చంద్ర మతిని కూమార్తె ఇందుమతిని కూడా వృత్తి విద్య నభ్యసించి స్వయం సంపాదన చేయవలసిందిగా ప్రోత్సహించాడు రాజు.
    
                                      11

    వీరసేనుడింకా రత్న కంబళీలు తయారు చేస్తూ, ధన సంపాదన చేస్తూ ఉండగానే అయన కింకో సమస్య వచ్చింది. కొద్ది మాసాల క్రితం అయన పర్యన్వేషణ లో తన కూమార్తె చిత్ర పటాలను వివిధ దేశాలకు పంపి ఉన్నాడు. అశోక దేశపు రాజు త్రిశోకుడూ , కమలదేశపు రాజు విమలుడూ ఆ చిత్ర పటాలను చూసి రాజకూమార్తెను మోహించి వివాహభిలష తో అక్కడికి తరలి వచ్చారు.
    రాజకుమారులు సంస్కారవంతులు. వారు ఇందుమతి అభీష్టాన్ని మన్నిస్తామని రాజుకు హామీ ఇచ్చారు. అయితే రూప, గుణ, సంపద ల్లో సరి సమానులుగా ఉన్న వారిలో ఎవరినీ స్వీకరించాలో ఇందుమతి నిర్ణయించు కోలేక పోయింది.
    ముందు ఇద్దరూ మల్లయుద్ధం చేశారు. ఎంత కాలం కొనసాగినా ఆ యుద్ధం తేలలేదు. శారీరక బలం లోనూ, మల్ల విద్యలోనూ ఇద్దరూ సరిసమానులని తేలింది.
    ఇద్దరూ కత్తి యుద్ధం ఏర్పాటయింది. ఆ విషయం లోనూ అంతే అయింది.
    ఇద్దరూ ఆ తర్వాత పండిత గోష్టి లో పాల్గొన్నారు. పాండిత్యం లో ఇద్దరూ అఖండు లేనని ఎవరు ఎక్కువో చెప్పలేమనీ ఆస్థాన పండిత ప్రముఖు లన్నారు.
    ఇలా వరుసగా ఒక మాసం రోజుల పాటు వారిద్దరికీ ఎన్నో పోటీలు జరిగాయి. ఒక్క విషయం లోనూ ఎవ్వరూ గెలవలేదు. ఎవ్వరూ ఓడలేదు.
    "మాలో ఎవరు ప్రజ్ఞా శాలి అన్న మీమాంస తేలేది కాదు. ఇంక రాజకుమార్తె నిర్ణయానికి కట్టుబడి ఉండడం మినహాగా మరే దారీ లేదు" అన్నారు త్రిశోకుడూ, విమలుడూ.
    వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది.
    వీరసేనుడు తన కుమార్తె తో , "అమ్మా ! ఈ వ్యవహారాలన్నీ ఎంతకాలం సాగాదీస్తాము ? ఆ ఇద్దరిలో నీకు ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పు " అన్నాడు.
    అందుకు ఇందుమతి విచారంగా, 'రాచకన్య వీరుణ్ణి వరించాలంటారు. ఈ రాజ కుమారులిద్దరూ అన్నింటి లోనూ సమానులుగా ఉన్నారు. వీరిలో నేను ఒకరిని ఎన్నుకుంటే రెండో వారిని చిన్న బుచ్చినట్లే కదా! అందుకు కారణం యేమని చెప్పగలను? అకారణంగా ఎవరిని చిన్న బుచ్చినా జీవితాంతం అది నాకు బాధను కల్గిస్తుంది కదా !" అంది.
    ఆమె చెప్పింది సబబే నని రాజుకు తోచింది. అయితే ఏం చేయాలి ?
    ఈ సమయంలో కన్నయ్య వీరసేనుడిని కలుసుకుని, "మీ సమస్యకు పరిష్కారం నేను చూపగలననుకుంటాను " అన్నాడు.
    రాజు ఆత్రుతగా "ఏమిటది చెప్పు" అన్నాడు.
    కన్నయ్య కోరిక పై రాజు ఇందుమతిని అక్కడకు రప్పించాడు.
    "నువ్వు త్రిశోకుణ్ణి వివాహం చేసుకున్నావనుకో అందుకు బాధపదతావా ?" అన్నాడు కన్నయ్య.
    "విమలుడి మనసుకు కష్టం కలిగిందన్న బాధ తప్ప ఇంకే బాధ నాకుండదు" అంది ఇందుమతి.
    "పోనీ విమలుడిని చేసుకుంటే ?"
    'అప్పుడూ బాధ పడను. త్రిశోకుడి ,మనసుకు కష్టం కల్గిందన్న బాధ మాత్రం ఉంటుంది."
    'అంటే నువ్వు ఇద్దర్నీ ప్రేమిస్తున్నవన్న మాట. పోనీ ఈ ఇద్దర్నీ పెళ్ళి చేసుకోకూడదు ?" అన్నాడు కన్నయ్య.
    వీరసేనుడి కళ్ళు కోపంతో ఎర్ర బడ్డాయి. ఇందుమతి మాత్రం సిగ్గుతో తల వంచుకుని, :ఒక స్త్రీకి ఇద్దరు భర్తలుండడం శాస్త్రం ఒప్పుకోదు కదా!" అంది.
    వీరసేనుడు కోపంగా కన్నయ్య వంక చూసి 'అది ముక్కు పచ్చలారని బిడ్డ. దాని బుర్రలో ఇటువంటి పిచ్చి ఊహలు నాటి పాడు చేయకు తక్షణం ఇక్కడ్నించి వెళ్ళు !" అన్నాడు.
    "సావధానంగా నేను చెప్పేది వినండి  ప్రభూ ! అందరకూ నచ్చే విధంగానే పని జరుగుతుంది. ముందు మీరు మీ కుమార్తెను నాకు దానం చేయండి ?" అన్నాడు కన్నయ్య.
    "దుర్మార్గుడా! ఇదా నీ ఊహ! నా కూతురు నీవంటి సామాన్యుణ్ణి పెళ్ళాడదు" అన్నాడు వీరసేనుడు.
    "ప్రభువులు మరీ తొందర పడుతున్నారు. మీరు నాకు తండ్రి లాంటివారు. మీ ఏలుబడి లోని వాణ్ణి. మీ పుత్రిక నాకు సోదరీ మణురాలు. కలలో కూడా ఆమెను వివాహమాడాలని అనుకోను" అన్నాడు కన్నయ్య.
    ఆ మాటలు వింటూనే రాజు శాంతించాడు. కన్నయ్య చెప్పింది సావధానుడై విని, వాడికి తన కూతుర్ని దానం చేశాడు. ఇందుమతి వాడి భిక్షా పాత్రలో ప్రవేశించి మాయమై పోయింది.
    "నా కూతురు ఏమైపోయింది?" అన్నాడు రాజు కంగారుగా.
    "మీ అమ్మాయికి ఏ ప్రమాదము లేదు, రాదు " అంటూ కన్నయ్య , "సోదరీ, ఇందుమతీ ! నువ్వు బయటకు వచ్చి మీ తండ్రి గారికి నయనానందం కలిగించు " అన్నాడు.
    వెంటనే భిక్షాపాత్ర లోంచి ఇందుమతి బయటకు వచ్చి తండ్రికి పాదాభివందనం చేసింది.
    వీరసేనుడి అద్భుతం చూసి నిశ్చేష్టుడై పోయాడు.
    "ఈమెను అశోక దేశపు రాజు త్రిశోకుడి కిచ్చి వివాహం చేయండి !" అన్నాడు కన్నయ్య .
    "మరి విమలుడి సంగతేమిటి ?" అన్నాడు వీర సేనుడు.
    "సోదరీ ఇందుమతీ! నువ్వే బయటకు వచ్చి మీ తండ్రి గారికి నయనానందం కలిగించు " అన్నాడు కన్నయ్య. వీరసేనుడు నివ్వెర పోయి చూస్తుండగా భిక్షా పాత్రలోంచి ఇందుమతిని ముమ్మూర్తులూ పోలిన మరో యువతి బయటకు వచ్చి తండ్రికి పాదాభివందనం చేసింది.
    "ఇప్పుడే నేను తలచుకుంటే ఈ ప్రపంచాన్ని ఇందుమతులతో నింపివేయగలను. అవసరానికి మించి పనిచేయడం నా అభిమతం కాదు. త్రిశోకుడికి, విమలుడికి మనసు కష్ట పెట్టకుండా మీ కుమార్తె ఇందుమతి వివాహం జరిపించడానికి అనువైన పరిష్కారం ఇదొక్కటే !" అన్నాడు కన్నయ్య .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS