Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 14

 

    ఆ దొంగ న్యాయాధికారి బావమరిది. అతగాడికి దుర్వ్యసనాలున్నాయి. వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల అతడు తనకు అవసరమైన డబ్బును తన బావగారైన న్యాయాధికారి ఇంట్లోంచి అప్పుడప్పుడు దొంగాలిస్తున్నాడు. కొంత కాలంగా ఇంట్లోంచి డబ్బు పోతున్న విషయం న్యాయాధికారి గమనించాడు. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్ట లేడు గదా!
    దొంగ తన తప్పు ఒప్పుకున్నాడు. న్యాయాధికారి భార్య తన తమ్ముడు చేసిన పనికి ఎంతో అవమన పడింది.
    న్యాయాధికారి కన్నయ్య ను మెచ్చుకుని, "నీ కారణంగా నాకెంతో లాభం చేకూరింది. ఇంటి పరువు వీధి కెక్కుకుండా , ఇంటి దొంగను పట్టుకో గలిగాను. నేను నీ కలలను నమ్ముతాను. నువ్వు నేరస్థుడిని కాదు. నువ్వు నీ ఇచ్చ వచ్చిన చోటకు పోవచ్చును " అన్నాడు.
    అయితే కన్నయ్య వెంటనే శివపురం వెళ్ళి పోలేదు. రాజధానీ నగరంలో వింతలు చూడాలని మరికొన్నాళ్ళు అక్కడే ఉండిపోయాడు.

                                     7

    కన్నయ్య వెళ్ళిన కొన్ని రోజులులకు గురవయ్య కూడా కొంత డబ్బు తీసుకుని రాజధానీ నగరం వచ్చి చేరాడు. కన్నయ్య శిక్ష అనుభవిస్తుంటే చూసి ఆనందించాలన్నది అయన ఆశ. అయితే అక్కడకు రాగానే రాజవీధుల్లో నిర్బితగా తిరుగుతున్నా కన్నయ్య ఆయనకు ఎదురు పడ్డాడు.
    "నీకు శిక్ష పడలేదా ?" అన్నాడు గురవయ్య ఆశ్చర్యంగా.
    కన్నయ్య ఏ అరమరికా లేకుండా జరిగిందంతా చెప్పాడు.
    "వీడి అదృష్టం మండిపోనూ!' అనుకున్నాడు గురువయ్య. అయితే ఆయనకీ విషయం అంతటితో వదలాలనిపించలేదు. న్యాయాధికారి బావమరిదిని అయన కలుసుకుని, "మా ఊరి కన్నయ్య వల్ల నీకు జరిగిన అవమానం విన్నాను. మా ఊళ్ళో నాకూ వాడిలాంటి అవమానమే చేశాడు. ప్రతీకారం తీర్చుకుందామని వాణ్ణిక్కడకు పంపిస్తే మీ బావగారు కూడా వాడి వలలో పడిపోయారు. వాడికి శిక్ష పడేలా చేయాలంటే ఇంకే ఉపాయమూ లేదా ?' అనడిగాడు.
    న్యాయాధికారి బావమరిది కాసేపు అలోచించి, "న్యాయాధికారి వదిలేసిన వాళ్ళను కూడా మంత్రి గారు మళ్ళీ విచారించవచ్చు. కానీ ఆ విషయం ఆయనకు తెలివిగా నచ్చజేప్పాలి ?" అన్నాడు.
    ఇద్దరూ కలిసి కాసేపు ఆలోచించారు.
    మంత్రి గారికి ఓ మంగలి ఉన్నాడు. మంత్రి వాడితో అంతరంగిక వ్యవహారాలన్నీ చర్చిస్తుంటాడు. ఊళ్ళో ఎక్కడ కెక్కడి వార్తలూ విని మంగలి మంత్రికి చేరవేస్తుంటాడు.
    వీళ్ళిద్దరూ కలిసి మంగలిని కలుసుకుని తను ఇబ్బంది చెప్పుకున్నారు. గురవయ్య మంగలికి పది బంగారు కాసులు బహుమతిగా ఇచ్చాడు.
    "మీకేం కావాలో చెప్పండి?" అన్నాడు మంగలి సంతోషించి.
    "మంత్రిగారు నా విషయం మళ్ళీ విచారించి నాకు న్యాయం జరిపించాలి " అన్నాడు గురవయ్య.
    "నామీద వచ్చిన అపవాదు పోవాలి " అన్నాడు న్యాయాధికారి బావమరిది.
    మర్నాడు మంగలి మంత్రికి కాళ్ళు పట్టే సమయంలో, "ప్రభూ! నాదో చిన్న మనవి . న్యాయవిచారణ అంతా తమరు పూర్తిగా న్యాయమూర్తిగారికే వదిలి పెడుతున్నారా లేక అప్పుడప్పుడు అదెలా జరుగుతుందో గమనిస్తున్నారా ?" అనడిగాడు.
    'అలా ఎందుకు అడుగుతున్నావు?' అనడిగాడు మంత్రి.
    మంగలి మంత్రికి కన్నయ్య కధ చెప్పి, "ఇల్లు దానం పట్టి మాయం చెయ్యడమా, నిజమయ్యే కలలు కనడమా చిత్రంగా లేదూ ! ఇది చూస్తె న్యాయాధికారి కన్నయ్య వద్ద డబ్బు తీసుకుని వదిలేశాడని నా మంద బుద్ధికి తోస్తున్నది" అనడిగాడు.
    "ఇందులో నష్టపోయిన ఆ గురవయ్య నాకు నిన్న రాజదానీలో ఒకచోట దిగులుగా కూర్చుని కనబడ్డాడు. అడిగితె ఇదంతా చెప్పాడు. తర్వాత నేను కూడా విచారించగా అంతా నిజమేనని తెలిసింది. ఆ కన్నయ్య కూడా ఇక్కడిక్కడే తిరుగుతున్నాడని తెలిసింది" అన్నాడు మంగలి.
    "ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది. తక్షణం రాజభటుల్ని పంపించి ఆ గురవయ్యనూ, కన్నయ్యనూ నా ముందుకు రప్పించు " అన్నాడు మంత్రి.
    న్యాయధికారితో పాటు మంగలి కూడా వెళ్ళాడు. కాసేపటికి మంగలి గురవయ్యనూ, కన్నయ్య నూ వెంట బెట్టుకుని వచ్చాడు.
    మంత్రి వాళ్ళ ముఖాత అన్నీ విన్నాక, "నువ్వు ఆరితేరిన మొనగాడిలా కనబడుతున్నావు. ఇల్లు దానం పట్టడం అసాధ్యం . నీకున్న కక్షతో భద్రయ్య భవనాన్ని మనుషుల్ని పెట్టి కూలదోసి ఉంటావు " అన్నాడు కన్నయ్యతో .
    "నేనలాంటి వాడిని కాదు. నా భిక్షా పాత్ర మహిమ గలది. మీరు మీ ఇల్లు నాకిచ్చేస్తానని ఒక్క మాట అన్నారంటే అది మాయమై నా పాత్రలోకి వచ్చేస్తుంది " అన్నాడు కన్నయ్య.
    'అయితే నా ఇల్లు ఇచ్చేస్తున్నాను. నీ పాత్రను తీసుకోమను " అన్నాడు మంత్రి.
    మంత్రి ఇల్లు కూడా మాయం కాలేదు. కన్నయ్య తెల్లమొహం వేశాడు. ఏమయిందో వాడికి అర్ధం కాలేదు. భిక్షా పాత్ర మహిమ పోయిందే మోనన్న అనుమానం వాడికి లేదు. ఎందుకంటె అది వాడికి యధావిధిగా అడిగిన వన్నీ ఇస్తూనే ఉంది.
    "కాబట్టి నువ్వు చెప్పిందంతా అబద్దం. నీకు కారాగారవాసం తప్పదు" అన్నాడు మంత్రి.
    "నాకేమీ తెలియదు. అన్నీ నా కలల ప్రకారం జరుగుతున్నాయి. ఇదొక్కటే ఎందుకు జరగలేదో అర్ధం కావడం లేదు" అన్నాడు కన్నయ్య.
    "నీ వేషాలు నా దగ్గర కాదు" అన్నాడు మంత్రి. అయన వాడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే కారాగారంలో పడేయమన్నాడు. తన తప్పు ఒప్పుకునే వరకూ తిండి పెట్టవద్దన్నాడు , నీళ్ళు కూడా ఇవ్వద్దన్నాడు.
    గురవయ్య కు ఎంతో సంతోషం కలిగింది. అయన మంగలికి మరో పదికాసులు బహుమతిగా ఇచ్చాడు . రాజభటులు కన్నయ్యను తీసుకు వెళ్ళి ఓ చీకటి కొట్లో పడేసి, "వారం రోజుల తర్వాత వస్తాం. బ్రతికుంటే మళ్ళీ మాట్లాడుకుందాం " అని వెళ్ళిపోయారు.
    
                                    8
    కన్నయ్య పెద్దగా దిగులు పడలేదు. వాడు భిక్షా పాత్ర నడిగి దీపం తీసుకున్నాడు. గదంతా వెలుగుతో నిండిపోతుంది. వాడు పక్క ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారం భిక్షా పాత్ర సమకూర్చేది. వాడికి కావలసిన పుస్తకాలనది ఇచ్చేది.
    ఒంటరితనం తప్ప ఆ గదిలో వదికింకేం బాధ లేదు.
    మొదటిరాత్రి నిద్రలోనే వాడికి ఓ కల వచ్చింది. ఆ కలలో వాడికి రాజధానీ నగరంలో ఓ చెరువు దగ్గర పడి వున్న పరమేశ్వరాలయం కనబడింది. ఆలయం ఆవరణ లో ఓ రావి చెట్టు ఉన్నది. ఆ చెట్టు క్రింద ఓ సాధువు కూర్చున్నాడు. కన్నయ్య వెళ్ళి ఆ సాధువుకు నమస్కరించాడు.
    సాధువు కన్నయ్యను దీవించి, "నాకు ఇలా సన్యాసిలా జీవించాలని లేదు. కానీ నా వాళ్ళు వచ్చి నన్నడిగితే తప్ప సన్యాసం వదిలి పెట్ట కూడదని నా గురువు ఆజ్ఞాపించాడు. నాకు నేనై నావాళ్ళ కంటబడలేను. వాళ్ళే నన్ను వెతుక్కుంటూ రావాలి. ఈ ఊళ్ళో ఇంకొక్క వారం రోజులు మాత్రమే వుంటాను. ఈ వారం రోజుల్లోనూ నా వాళ్ళు రాకపోతే నాకింకా సన్యాసమే గతి" అన్నాడు దిగులుగా.
    "ఎవరు స్వామీ మీ వాళ్ళు?' అన్నాడు కన్నయ్య.
    "ఈ దేశపు రాజుకు మంత్రి !" అన్నాడు సాధువు.
    ఈ సమాచారం వెంటనే మంత్రికి అందజేయాలనుకున్నాడు కన్నయ్య. అయితే వాడి చీకటి కొట్లోకి ఎన్ని రోజులు గడిచినా ఎవ్వరూ రావడం లేదు. తను కారాగారంలో వున్నానన్న బాధ కంటే మంత్రికీ సమాచారం చెప్పలేక పోతున్నానన్న బాధే వాడికి దిగులు ఎక్కువ కలిగించింది. కానీ ఏం చేయగలడు?
    కన్నయ్య చీకటి కొట్లో ప్రవేశించిన ఆరో రోజున వాడేలా ఉన్నాడో చూడాలన్న కుతూహలంతో రక్షక భటుడొకడు తలుపులు తీసి అందులో ప్రవేశించాడు. గదిలో సకల సదుపాయాలతో ఉన్న కన్నయ్యాను చూసి వాదాశ్చర్య పోయాడు.
    "నువ్వు నీరసంతో పడిపోయుంటావను కున్నాను" అన్నాడు వాడు.  
    "నా నీరసం సంగతి అలా వుంచు నువ్వు తక్షణం మంత్రిగారి  నిక్కడకు పోల్చినా సరే, నన్నాయన దగ్గరకు తీసుకెళ్ళినా సరే. అందువల్ల మంత్రి గారెంతో సంతోషిస్తారు. లేదా మీ మంత్రి గారు జీవితాంతం విచారించవలసి వుంటుంది. అయన గురించి నాకు ఓ కల వచ్చిందని చెప్పు " అన్నాడు కన్నయ్య.
    భటుడు అందుకు నిరాకరించాడు. అయితే కన్నయ్య వాడికి భిక్షా పాత్ర లోంచి వంద బంగారు కాసులు తీసి ఇచ్చి, "నేను చెప్పిన పని చేశావంటే ఇంకా ఇస్తాను" అన్నాడు. ఇది చూసిన భటుడు కన్నయ్య దగ్గర భిక్ష పాత్రను లాక్కునెందుకు ప్రయత్నించి భంగ పడ్డాడు. వాడు పాత్రను తాకగానే ఎవరో విసిరేసినట్లు దూరంగా పడిపోయాడు వాడు.
    "తేలివి తక్కువ పనులు చేయకు. నేను చెప్పి నట్లు విను" అన్నాడు కన్నయ్య.
    భటుడు కారాగారం తలుపులు వేయడం కూడా మరిచిపోయి అక్కణ్ణించి మంత్రి గారింటికి పరుగెత్తి తను చూపిన విడ్డూరం చెప్పాడు. అది వింటూనే మంత్రి కూడా ఆశ్చర్యపోయాడు. అయన వెంటనే భటుడితో కలిసి చీకటి కొట్టుకు ఉరకలు పరుగుల మీద వెళ్ళాడు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS