అప్పుడు తీశాడు సత్యం -- తన మొలలోని కత్తి!
ప్రకాశం కంగారుగా సత్యం కేసి చూసి -- "ఏమిటిది?" అన్నాడు.
"కనబడడం లా -- కత్తి!"
"ఎందుకు ?"
"నీ దగ్గరున్న తోలు సంచీ యిలాగివ్వు--" అన్నాడు సత్యం.
ప్రకాశం తడబడుతూ -- "అయితే నువ్వు బంగారం కోసం నన్ను వెన్నాడుతూ వచ్చావన్న మాట !" అన్నాడు .
"ఊ"
"నా దగ్గర బంగారం తీసుకున్నా నువ్వెక్కడికి పోతావు? క్షణాల మీద నిన్నొచ్చి పట్టుకుంటారు మావాళ్ళు"
'అలాంటి ఆశలేం పెట్టుకోకు! నాజేబులో తాళ్ళు వున్నాయి. నిన్నో మూల కట్టి పడేసి మరీ పోతాను--"
సత్యం మాటలకు ప్రకాశం భయపడ్డాడు. ఇలాంటి సంఘటన కతను తయారై లేడు.
"ఊ త్వరగా తియ్యి ...." అన్నాడు సత్యం.
ప్రకాశం బాధగా, బెంగగా జేబులో చేయి పెట్టి...." "అన్నట్లు ఆ హోరేమిటి?' అన్నాడు.
"పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు. నేనంత తేలిగ్గా మోసపోయే రకం కాదు--" అన్నాడు సత్యం . కాని అతనిక్కూడా వెనక నుంచి హోరు వినబడుతూనే వుంది.
"మోసం కాదు. చాలా పెద్ద శబ్దం అవుతోంది. అటు చూడు...." అంటూ వెనక్కు తిరిగాడు ప్రకాశం. శబ్దం బాగా యెక్కువ కావడం వల్ల సత్యాని క్కూడా అటు చూడక తప్పలేదు. చూసేసరికి!
శరవేగంతో వస్తోంది మహా జల ప్రవాహం!
3
ఏరు పొంగుతోంది. వరదలు పరుగెత్తు. నాకసలే ఈత రాదు...." అన్నాడు ప్రకాశం.
సత్యం కంగారుపడ్డాడు. కత్తి జేబులోకితోసేశాడు. అతను గట్టు వైపు పరుగు లంకించబోతే --"అలా వెడితే అన్నీ ముళ్ళ డొంకలు. ఎరేలాగూ గట్టును ముంచేస్తుంది. ఊరి దగ్గర గట్టు ఎత్తు. ఏట్లోనే పరుగెడదాం!' అన్నాడు ప్రకాశం.
ఇద్దరూ పరుగు లంకించుకున్నారు. ప్రాణాలకు తెగించి మరీ పరుగెడుతున్నారు.
"ఊరోచ్చేస్తోంది!" అన్నాడు ప్రకాశం.
"ఊరి గట్టు సమీపిస్తోంది. గట్టు కవతలగానే ఓ మర్రి చెట్టుంది--" ఆ చేట్టేక్కుదాం --" అన్నాడు సత్యం.
"వద్దు, నాలుగడుగులు వేసి గట్టెక్కామంటే-- గండం గడిచి గట్టెక్కినట్లే -- " అన్నాడు ప్రకాశం.
ఇద్దరూ వగరుస్తున్నారు. కాళ్ళు కదలలేమంటున్నాయి కానీ బుద్ది తొందర పెడుతోంది.
గట్టుకు కాస్త దగ్గర్లో ఉండగా ప్రవాహం వచ్చి ప్రకాశం మీద పడింది.
"ప్లీజ్-- నన్ను పట్టుకో -- నాకీత సరిగ్గా రాదు--" అంటూ అరిచాడు ప్రకాశం.
సత్యం అప్రయత్నంగా అతన్ని పట్టుకున్నాడు. గట్టెక్కే ప్రయత్నం చేస్తుండగా పడి వారిద్దర్నీ లాగుతోంది. ఆ శక్తిని ఎదిరించే బలం వారిద్దరికీ కూడా ఉన్నట్లు లేదు.
ఉన్నట్లుండి ఓ పెద్ద కెరటం విరుచుకు పడింది. ఇద్దరూ ములిగి పోయారు. ఓ చేత్తో సత్యం ప్రకాశాన్ని పట్టుకుని రెండో చేత్తో తేలడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఇంక ఊళ్ళోకి చేరే ప్రసక్తి లేదు. వరద సంగతి ఊళ్ళో యింకా తెలిసి వుండదు. అందుకే గట్టు మీద జనం లేరు. సత్యం, ప్రకాశం మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతున్నారు. ఆ దృశ్యాన్ని మర్రి చెట్టు మీద నలుగురు మనుషులు చూశారు.
ఆ నలుగురు మనుషులు కూడా ప్రజశంతో పాటు బస్సు దిగినవారే! వాళ్ళు ఏటి హోరు విని -- ఆ వేగాన్ని అంచనా వేసి -- తాము గట్టేక్కలేమని గ్రహించి మర్రి చేట్టేక్కేశారు. వాళ్ళెక్కిన కాసేపట్లోనే చెట్టు చుట్టూ నీరు వచ్చేసింది.
ప్రకాశం నీట్లో కొట్టుకుపోతున్నాడని తెలిసినా వాళ్ళలో యెవరూ నీట్లో కి ఉరికి అతణ్ణి రక్షించాలని అనుకోలేదు. అది ఆత్మహత్య తో సమానమని వారందరికీ తెలుసు. యెవరికైనా తమ ప్రాణాలకు తర్వాతనే కదా -- ఇతరుల ప్రాణాలు.
ప్రకాశం కష్టం మీద తేలడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రవాహం శరవేగంతో వారిని లాక్కుపోతోంది. సత్యం ఇంకా అతడి పట్టు విడవలేదు.
అలా వెడుతుండగా చేతుకేదో కర్రలాంటిది తగిలి యిద్దరూ ఆగిపోయారు. తలెత్తి చూస్తె అదొక ఎలక్ట్రిక్ పోల్!
"గట్టిగా ఈ స్థంబాన్ని పట్టుకో-- ఇదే మనకు ఆధారం -- " అన్నాడు సత్యం గట్టిగా.
ప్రకాశం వణుకుతూనే ఎలక్ట్రికల్ పోల్ పట్టుకుని-- "నువ్వు నా ప్రాణాలు రక్షించావు. నీ కేమిచ్చినా నా ఋణం తీరదు--" అన్నాడు.
"నీ దగ్గరున్న బంగారం యిచ్చేస్తావా?" అన్నాడు సత్యం.
"తప్పకుండా! అయినా నీలో చాలా మానవత్వం ఉంది. నువ్వు ప్రవాహానికి తట్టుకున్న పద్దతి చూస్తుంటే గజ ఈతగాడివని అనిపిస్తోంది. అలాంటప్పుడు నా దగ్గరున్న బంగారం లాక్కుని నామానానికి నన్నొదిలి పెట్టి వడిలో ఈదుకుంటూ పోవచ్చును. కానీ నువ్వలా చేయలేదు. నా ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించావు. మానవత్వం తప్ప అందుకు మరో కారణాన్నూహించలేను!" అన్నాడు ప్రకాశం.
సత్యం నవ్వి -- "దొంగాడా అరవకురా -- అన్నట్లు ఇప్పుడు నువ్వు నా కా సామెత చెబుతావా?' అన్నాడు.
"దొంగవైనా సరే నేనిప్పుడు నిన్ను నమ్ముతున్నాను. నన్ను పాలముంచినా నీట ముంచినా నీదే నాభారం. దగ్గరున్న బంగారం నీకు సంతోషంగా అర్పించుకుంటాను. నా ప్రాణాల కంటే అదేం యెక్కువ కాదు. నన్ను రక్షించు -- ప్లీజ్!" అన్నాడు ప్రకాశం.
సత్యం మనసు వొక్క క్షణం ఊగిసలాడింది. తానిప్పుడు ప్రకాశం దగ్గర బంగారం లాక్కుని పారిపోతే !
ప్రకాశం ముఖం లోని దైన్యం , అతని మాటల్లోని అర్దింపు -- సత్యంలోని మానవత్వాన్ని తట్టి లేపాయి. అతను ప్రకాశాన్ని రక్షించాలనే అనుకున్నాడు. ఆ క్షణంలో అతను దొంగ కాదు మనిషి.
క్రింద నీటి లెవల్ పెరుగుతోంది. ఇద్దరూ స్థంభం మీదకు ఎగబాకారు.
"వాటం చూస్తుంటే ఈ లెవెల్ యెలా పెరుగుతూనే వుండేలా గుంది--" అన్నాడు ప్రకాశం.
అతని మాటలు అబద్దం కాలేదు. నీటి ఎత్తు అలా పెరుగుతోంది. ఇద్దరూ స్థంభం పైకి పైకి పోతున్నారు.
కాసేపటికి యిద్దరూ స్థంభం వరకూ వచ్చేశారు.
"ఇలా యెంత సేపు?చేతులు వణుకుతున్నాయి. పైకి పోదామంటే -- ఏకంగా పైకి పోవడం తప్ప దారి లేదు" అన్నాడు ప్రకాశం దిగులుగా. అతను పెరుగుతున్న నీటి ఎత్తునే చూస్తున్నాడు.
సత్యం ప్రకాశం వంక చూస్తూ -- "కంగారులో తీగెల్ని ముట్టుకోకు -- షాక్ కొట్టే ప్రమాదముంది....' అంటూ హెచ్చరించాడు.
అయితే ఆ స్థితిలో ప్రాణాపాయ స్థితిలో గాబరా లేకుండా తాపీగా ఉండడం ఎవరికైనా కష్టమే .... సత్యం హెచ్చరిస్తుండగానే ప్రకాశం మరి కాస్త పైకి వెళ్ళాలన్న ప్రయత్నం లో చెయ్యి పైకి జాపి కరెంట్ తీగలు తగిలి కుయ్యోమని అరిచాడు. షాక్ కి అతను స్థంభం నుంచి దూరంగా పడిపోయాడు.
సత్యం అదే సమయంలో నీట్లోకి దూకి ప్రకాశం జుట్టు దొరకబుచ్చుకున్నాడు. మరి ఎలక్ట్రిక్ పోల్ వారికి దొరికే అవకాశం లేదు. ప్రవాహం వారిని ఏటో లాక్కుని పోతోంది.
సత్యానికి ఈదడం చాలా కష్టంగా వుంది. ఎక్కడా నేల అందడం లేదు. ప్రకాశం వాటం చూస్తె స్పృహ తప్పినట్లే వుంది. అతనికి మాటామంతీ లేకుండా పోయింది. అతన్ని తేల్చడానికి ప్రయత్నిస్తూ ఎలాగో తంటాలు పడుతున్నాడతను. ఆ సమయంలో ప్రవాహంలో కొట్టుకు వస్తున్నా గడ్డివాము వారి దగ్గరగా వచ్చింది.
సత్యం దాన్ని ఆధారం చేసుకున్నాడు. నెమ్మదిగా దాని మీదకు యెక్కడానికి ప్రయత్నించాడు. తను యెక్కి దాని మీదకు ప్రకాశాన్ని లాగడానికి అతనికి చాలా కష్టమయింది.
ప్రకాశం గడ్డి వాము మీద వళ్ళు తెలీకుండా పడుకుని వున్నాడు. అతనికి స్పృహ తెప్పించాలని కాసేపు వృధా ప్రయత్నం చేశాడు సత్యం.
అయితే వారి సమస్య అంతటితో అవలేదు. గడ్డివాము బలంగా లేదు. నీటి దెబ్బకు క్రమక్రమంగా విడిపోయి సన్నబడిపోతోంది. దాన్ని ఒక కట్టగా వుంచడానికి నానా ప్రయత్నాలు చూస్తున్నాడు సత్యం.
ప్రవాహం వేగం తట్టలేదు కానీ ఎత్తు తగ్గుతున్నట్లే వుంది. గడ్డివాము పూర్తిగా విడిపోతున్న సమయంలో సత్యం ప్రకాశాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడతని సంతోషానికి మేరలేదు.
నీళ్ళు మోకాళ్ళ కు కాస్త పైకి మాత్రమే వున్నాయి. లోతట్టే లేదు.
