Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 14


    "అతన్నేం చేయకండి. ఇదంతా నా ప్రోద్బలంమీదనే జరిగింది. నాకు మీమీద పగ-ఇలా తీర్చుకుంటున్నాను ..." అంది మాధురి.
    "వాడి సంగతి తర్వాత చూస్తాను. నాకూ ముందు నీ సంగతే చూడాలనుంది. నామీద పగబట్టి బ్రతికినవాళ్ళీ లోకంలో లేరు...." అన్నాను.
    "మీకు భార్యగా ఈ లోకంలో ఉండాలని నాకూలేదు ...." అంది మాధురి.
    "ఓహ్-అయితే చావు...." అంటూ మొలలోంచి బాకు తీశాను.
    "చంపుతారా-అదొక్కటే తక్కువయింది మనకి. చంపండి చూస్తాను...." అంది మాధురి.
    ఆమె కళ్ళలో నాకు భయం కనబడలేదు. నేను చంపననుకుంటోందనుకుంటాను. నాలుగేళ్ళుగా నాతో కాపురం చేస్తోంది. నా క్రూరత్వానెప్పుడూ చవిచూడలేదు. అందుకే తను ధైర్యంగా ఉంది.
    "చంపితే ఇంకా చూసేదేముందే-"అంటూ ఆమెను సమీపించాను. నేను సమీపించాక ఆమె ఒక అడుగు వెనక్కువేసింది. నేను చటుక్కున ఆమెను పట్టుకుని మెరుపువేగంతో గుండెల్లో బాకు దింపాను.
    'కెవ్వుమని' అరిచింది మాధురి. అయితే చాలా త్వరగా ఆమె ప్రాణంపోయింది. మాధురితోపాటే మరో కేక విన్నాను. అది ఆ యువకుడిది.
    చటుక్కున వాణ్ణి చూశాను. వాడు భయంతో వణికిపోతున్నాడు. మనిషి వయస్సెంతో ఉండదు. ఇరవైదాటి ఉండొచ్చు. ముఖం అమాయకంగా, భయంగా వుంది. వాడు పెదవులు కదిపి మాటలు పలికించాలని విఫల యత్నాలు చేస్తున్నాడు.
    "ఉన్నది ఒక్కటే బాకు. కంగారుపడకు-నీవంతు వస్తుంది!"
    "నన్ను చంపవద్దు..." అంటూ గొణిగాడు వాడు.
    నేను మాధురిని సమీపించి గుండెల్లోంచీ బాకును లాగేసి ఆమె కనురెప్పలు మూసేశాను. ఏదో నా డ్యూటీ నేను చేస్తునట్లుంది కానీ హత్యచేసిన భయంలేదు నాలో. అసలు హత్యగురించి ఆలోచించినా, హత్యచేసినా నాలో ఏవిధమైన భావమూ ఉండదు.
    మాధురి నాలుగు సంవత్సరాలుగా నాతో జీవితం పంచుకుంటోంది. అయినా ఆమె చనిపోయిందంటే నాకాట్టే బాధగాలేదు. సాక్ష్యాన్నీ, శవాన్నీ కూడా మాయం చేసేయాలి. అదే ప్రస్తుతం నా ధ్యేయం. బాకును తీసుకుని ఆ యువకుణ్ణి సమీపించాను.
    "నన్ను చంపవద్దు-" అన్నాడు మళ్ళీ వాడు.
    "నీ పేరు?"
    "చంద్రశేఖరశర్మ"
    "ఎందుకొచ్చావిక్కడికి?"
    "బుద్ధి గడ్డితిని....."
    "బుద్ధి గడ్డి ఎలాతింది?"
    "నేను రోజూ ఈ వీధిలోంచి వెడుతూంటాను. నన్ను చూసి నవ్వుతూంటుంది ఈ ఇంట్లోని ఆవిడ. ఈ రోజు నన్ను పిలిచింది. నిజంగా ఎందుకో తెలియదు నాకు. లోపలికి పిలిచాక తెలిసింది - ఎందుకో? నేను వద్దంటున్నాతఃనే బలవంతం చేసింది. చివరకు లొంగిపోయాను. మీరు వచ్చారు....."
    వాడు కాస్త మాట్లాడగలుగుతున్నాడు. వణుకుకూడా తగ్గింది.
    "నువ్వు చేసింది తప్పని తెలియదూ?"
    "తెలుసు...."
    "అయితే ఎందుకుచేశావ్?"
    "ఇంకెప్పుడూ చేయను...."
    "ఆ అవకాశంకూడా నేనివ్వను...." అంటూ జేబురుమాలుతీసి బాకుమీది రక్తం తుడుస్తున్నాను.
    "నన్ను చంపవద్దు....." అన్నాడు చంద్రశేఖరశర్మ.
    "ఎందుకని?"
    "మా ఇంటికి నేనొక్కడినే ఆధారం. నాకు అమ్మా నాన్నా ఉన్నారు. ముగ్గురు తమ్ముళ్ళూ, ఇద్దరు చెల్లెళ్ళూ ఉన్నారు. నేను నెలకు అయిదువందలు సంపాదిస్తున్నాను. నేను లేకపోతే ఇంటిల్లపాదీ పస్తులతో చచ్చిపోతారు...."
    "నువ్వు చావకపోతే నేను చస్తానుమరి. నా ప్రాణాల కంటే నీవాళ్ళ ప్రాణాలెక్కువకాదు నాకు...."
    "నన్ను వదిలిపెడితే మీపేరు చెప్పుకుంటాను. మిమ్మల్ని దేవుడిలా భావించి పూజించుకుంటాను. ఇక్కడేం జరిగిందో, నేనేం చూశానో ఎక్కడా చెప్పను...."
    "అని నువ్వంటే మాత్రం నేను నమ్మొద్దూ....."
    "నమ్మాలిసార్. మా నాన్న ఇప్పుడు జబ్బుతో బాధపడుతున్నాడు. నా ఆదాయం లేకపోతే ఆయనకు వైద్యం జరుగక నికృష్టమైన చావువస్తుంది. నా ఒక్కడిమీద మొత్తం మా ఇంటిల్లిపాది జీవితాలూ ఆధారపడిఉన్నాయి. ఆవేశంలో మీరో మనిషిని చంపారు. మీ ఆవేశానికి కొంత నేనూ కారణభూతున్నయ్యాను. అందువల్ల ఆ హత్యానేరం నాదే. నేనే ఆ హత్య చేశాననుకోండి. నేను మీగురించి ఎక్కడా చెప్పను. చెబితే నాకేం ఒరుగుతుంది. నా ప్రాణాలు రక్షించి నావాళ్ళందరి జీవితాలూ నిలబెట్టండి...."
    హత్యలు సులువుగా చేయగలిగినంత మాత్రాన మనిషిలో మానవత్వం లేదనుకుందుకు వీలులేదు. నేనా యువకుడి మాటలకు కరిగిపోతున్నాను. ఒకమూల అనుమానంగానూ ఉంది-వదిలిపెడితే వాడు తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెడతాడేమోనని.
    కానీ వాడు ఘొల్లుమని ఏడ్చేస్తున్నాడు. తనవాళ్ళని తల్చుకుని బాధపడిపోతున్నాడు. కాళ్ళా వేళ్ళా పడిపోతున్నాడు. తన్నొక్కన్ని రక్షిస్తే నేను కృష్ణపరమాత్మను మించిపోతానంటున్నాడు. నేను మాధురిని హత్యచేయడం సబబైన పని అనీ-అటువంటి ఆడదానికదే శిక్ష అనికూడా అంటున్నాడు. అందుకు నన్నభినందించాల్సి ఉందిట. అలాంటప్పుడు తననేరాన్ని బయటపెట్టవలసిన అవసరమేముందంటున్నాడు. ఇవన్నీ అని తన తల్లిదండ్రులనూ, తమ్ముళ్ళనూ, చెల్లెళ్ళనూ తలచుకుని హృదయం కరిగించేలా ఏడ్చేస్తున్నాడు.
    నాకూ హృదయం ఉందనిపిస్తోంది. అది కరుగుతున్నట్లూ ఉంది.
    "నీకు దేవుడిమీద నమ్మకముందా?" అనడిగాను.
    "ఉంది-" అన్నాడు చంద్రశేఖరశర్మ.
    "అయితే దేవుణ్ణి ప్రార్ధించుకో. ఆయనొక్కడే నీకు సాయపడగలడు...." అన్నాను.
    "నా కళ్ళెదుట దుష్టశిక్షణ కావిస్తూండగా చూశాను. మీరుకాక ఇక్కడ నాకు దేవుడెవరున్నారు?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS