"నే నడుగుదామనుకుంటున్నదీ అదే, వదినా! అన్నయ్య ఎందుకిలా మారిపోయాడు? నీ సంగతీ, ఇంటిసంగతీ అసలు పట్టించుకోవటంలేదు. రాత్రి ఎప్పుడోగానీ ఇంటికి చేరుకోవట్లేదు. బాబుని దగ్గరికే తీసుకోడు." తనుకూడా ఏడిస్తే వదిన బెంబేలు పడిపోతుందనో ఏమో పంటిబిగువున బలవంతాన కన్నీ రాపుకుంది విశాలి.
నీటితో మెరుస్తున్న మహాలక్ష్మి కళ్ళు నిరాశతో నవ్వాయి.
"మంచం పట్టిన నాకు మాత్రం వివరాలేం తెలుస్తాయి? కానీ, ఆ మాత్రం అర్ధం చేసుకోకపోలేదు. మంచం పట్టిన నా మీద జాలీ, సానుభూతీ లేకపోగా విలాసాలలో తేలిపోతున్నారు. వైద్యం చేయించి నన్ను అనారోగ్యం నుంచి తప్పించే ఆలోచనే రాకపోగా ఇంటికే దూరమవుతున్నారు. ఇది న్యాయమేనా అని అడిగితే, నీ కెందుకు? అనవసరం అంటారు. నీకు సేవ చెయ్యడానికి విశాలి ఉందిగా, ఇంకా నేనుకూడా కూర్చోవాలా నీ దగ్గిర అంటారు." ఆయాసంతో ఒక నిమిష మాగింది మహాలక్ష్మి.
"నిన్ను కష్టపెట్టినందుకే నా కీ శిక్ష."
"ఛ! ఊరుకో, వదినా! అవేం మాటలు!"
"ఇంటి బాధ్యత అంతా నీ ఒక్కదానిమీదా పడటం కాక, బాబు పోషణభారంకూడా నీ మీదే పడింది. చూడు, విశాలీ! నే నీ బ్రతుకు బ్రతకడంకంటే చావడం మేలు. నా బ్రతుకు ఇంక కొద్ది రోజులే అని కూడా నాకు తెలుసు. ఇప్పటివరకూ బాబుని కన్నబిడ్డలా చూసుకున్నావు. ఇంకమీదటకూడా అలాగే ప్రాణంలా చూసుకుంటావు కదూ? నువ్వే వాడిని పెంచి పెద్ద చేయాలి. వాడికి నీ మంచితనంలో సగం అబ్బినా చాలు. నాకు మాట ఇయ్యి విశాలీ," వాడిని నీ దగ్గిరే ఉంచుకుంటానని. పెంచి పెద్దచేసే బాధ్యత తీసుకుంటానని మాట ఇవ్వు." తన చేతిని చాపింది మహాలక్ష్మి.
"నువ్వు నూరేళ్ళూ బ్రతకాలి, వదినా! ఇప్పుడేదో అయిపోయినట్టు ఎందుకలా మాట్లాడతావు?" దుఃఖంతో మరి మాట్లాడలేకపోయింది విశాలి.
"అవన్నీ తరవాత! ముందు నేను అడిగినది చెప్పు. నీ కిష్టమా, కాదా?"
తన చేతిని వదిన చేతిలో ఉంచి అంది విశాలి: "రాజేంద్రని నా ప్రాణంలా చూసుకుంటాను. నువ్వు వేరే చెప్పాలా, వదినా! మనఃస్ఫూర్తిగా చెపుతున్నాను నేను. నా మాట నమ్ము." గొంతులో బాధ సుళ్ళు తిరిగి, కళ్ళలో నీరు కదలాడి తల దించుకుంది విశాలి, సూటిగా వదిన కళ్ళలోకి చూడలేక.
"వద్దు, విశాలీ! ఏడవకు. నేను బాధపడటమేకాక నీ మనసుకూడా కష్టపెడుతున్నాను." బలం లేని తన చేతులతో, తడబడుతూ విశాలి కన్నీరు తుడవడానికి ప్రయత్నించింది మహాలక్ష్మి.
"చేత్తో తుడిస్తే చెరిగిపోయే కన్నీరు కాదు, వదినా, ఇది! హృదయంలో చెలరేగే తుఫాను ఆగినప్పుడే ఈ కన్నీరు ఆగుతుంది. అంతవరకూ స్రవిస్తూనే ఉంటుంది." విశాలి మనసు తనలో తనే పలికింది బాధగా.
ఇంతలో తలుపు చప్పుడైంది.
పైటతో ముఖం తుడుచుకుని, వెళ్ళి తలుపు తీసింది విశాలి.
చెల్లెలివైపు చూడనైనా చూడకుండా, సరాసరి గదిలోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుని, మంచం ఎక్కాడు రామం.
"అన్నం తిని రండి ఇందాకటినించీ మీ కోసం కనిపెట్టుకు కూర్చుంది విశాలి, తనుకూడా తినకుండా."
"నా కాకలి లేదు." చిరాకు పడ్డాడు రామం.
"భగవంతుడా!" బాధగా నిట్టూర్చింది మహలక్ష్మి.
"బయట హోటళ్ళలో తినిరావడం, ఇంట్లో ఆకల్లేదనడం, అన్నం తినకపోవడం-ఇదేమన్నా బాగుందా మీకు, మీరు తినకపోతే విశాలికూడా తినదు. అలాగే పడుకుంటుంది. ఎన్నాళ్లని ఆ పిల్లని పస్తులుంచుతారు? తెల్లారి లేచిన దగ్గరినుంచి ఇంటిపనంతా తనే చూసుకోవాలి."
"అయితే ఏం చెయ్యమంటావు? నా కాకల్లేదని చెపుతుంటే వినిపించటం లేదా? అయినా నా కోసం తనని ఎదురుచూస్తూ కూర్చోమని చెప్పానా నేను?"
"చెప్పాలేమిటి? మీరు మగాళ్ళు, మీకు ఉండక పోవచ్చు. కానీ, ఆడదాని కలా కాదు. ఇంట్లో చెట్టంత మగాడు రోజులకి రోజులు అన్నం తినకుండా మంచ మెక్కుతుంటే ఎంత బాధగా ఉంటుంది! అందులో అన్నయ్యంటే ప్రాణమిచ్చే చెల్లెలికి అన్నం ఎలా సయిస్తుంది? నా మీద దయ ఉంచి అన్నం తినండి. విశాలిని ప్రేమగా పలకరించండి." ఎక్కువగా మాట్లాడే ఓపిక లేకపోయినా చెప్పదలుచుకున్నది చెప్పింది మహాలక్ష్మి.
"చాల్లే! కబుర్లు చెప్పొచ్చావు! పడుకో, నోరు మూసుకుని."
"మీకు జాలీ, ప్రేమా మచ్చుకైనా లేకుండా ఎలా పోయాయో నా కర్ధం కావటం లేదు."
"నీకు ఇంత స్పీచ్ ఇవ్వడానికి ఓపికెలా వచ్చిందో నాకూ అర్ధం కావటం లేదు."
ఇంక ఏం మాట్లాడాలో తెలియక, మాట్లాడినా ప్రయోజనం లేదని గ్రహించి మౌనంగా పక్కకి తిరిగి పడుకుంది మహాలక్ష్మి.
అన్నయ్యని భోజనానికి పిలవాలని గది బయట తారట్లాడుతున్న విశాలికి చెవుడు లేదు. గదిలో జరిగిన సంభాషణ వద్దన్నా వచ్చి చెవుల్లో పడింది. వంటింటి తలుపులు వేసి వచ్చి పడుకుంది. తల్లినీ, తండ్రినీ మరిపించి పెంచిన తాతయ్య జ్ఞప్తికి వచ్చి, ఏ లోకా ల్లోనో ఉన్న ఆయనకే తన బాధ చెప్పుకుని కుమిలి పోయింది.
* * *
రోజూ రెండు పూటలా అన్నం మెత్తగా గుజ్జులా కలిపి ఏదో రెండు ముద్దలు వదినచేత బలవంతంగా తినిపిస్తూంది విశాలి.
మంచం మీద కూర్చునే అది కాస్తా అయిందనిపిస్తుంది మహాలక్ష్మి.
మంచం దిగి రెండడుగు లేస్తే గుండెల్లో పోటు. విపరీతమైన ఆయాసం.
మొదట్లో రామం ఇంటిసంగతులు పట్టించుకునే రోజుల్లో డాక్టర్ విశ్వనాధంగారు రోజూ వచ్చి చూసి వెళ్ళేవారు. తరవాత తరవాత రామం ఆయనకి ఇవ్వ వలసింది ఇవ్వక, కొనమన్న మందులు కొనక, ఆఖరికి డాక్టరుతో రోగి విషయమై మాట్లాడటంకూడా మానేశాక, ఆ డాక్టరుగారు ఇంటికి వచ్చి చూడటం మానుకున్నారు.
మందూ మాకూ లేక మంచం పట్టిఉన్న వదినని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది విశాలికి.
తనుకూడా కంటనీరు పెడితే వదినకి ధైర్యం చెప్పేవారే కరువవుతారని, నీరు చిప్పిల్లబోయే కన్నుల్లో నవ్వులు చిదిస్తుంది విశాలి. వదిన మంచం పక్కనే కూర్చుని, కాలక్షేపం అయ్యేలా ఎన్నో కబుర్లు చెపుతుంది.
రాజేంద్రని తీసుకువచ్చి, వాడికి తను నేర్పిన విద్యలన్నీ వాడిచేత చేయిస్తుంది, చూపిస్తుంది.
ఆ రోజు మధ్యాహ్నం విశాలి చాపమీద పడుకుని, 'కోనంగి' చదువుతూండగా వీధి తలుపు చప్పుడైంది.
మహాలక్ష్మి గాఢనిద్రలో ఉంది.
రాజేంద్ర అప్పుడే అత్తతో కబుర్లు చెప్పి చెప్పి అలిసిపోయి పడుకున్నాడు. రామం షాపుకి వెళ్ళాడు. పుస్తకం పక్కన పెట్టి, లేచి వెళ్ళి తలుపు తీసింది విశాలి.
"నీ నిద్ర పాడు చెయ్యటం లేదుకదా?" అంటూ లోపలికి అడుగు పెట్టింది సువర్ణ.
"అబ్బే! లేదు! నేను నిద్రపోవటం లేదు. అది చదువుతున్నాను" అంటూ తను చదివే పుస్తకం చూపెట్టింది విశాలి.
ఇద్దరూ చాపమీద గోడకానుకుని కూర్చున్నారు.
"అల్లరిగాడు పడుకున్నాడే!" అంటూ మెల్లగా రాజేంద్ర బుగ్గమీద ముద్దు పెట్టుకుంది సువర్ణ.
"ఊరికే అలా వాడిని ముద్దు పెట్టుకుంటే సరిపోదు. వాడి కో చిన్న ఫ్రెండు నివ్వాలి మరి నువ్వు." కొంటెగా చూసింది విశాలి.
సిగ్గుతో తల దించుకుంది సువర్ణ.
బుగ్గలు ఎరుపెక్కాయి.
కళ్ళు ఓరచూపులతో స్నేహితురాల్ని పలకరించాయి.
అర్ధం చేసుకుంది విశాలి.
ఆనందంగా సువర్ణ చేతి నందుకుంది.
"అమ్మదొంగా! నాతో చెప్పకూడదనుకుంటున్నావా?"
ఏదో అనబోయింది సువర్ణ.
"ఉండు" అంటూ లోపలికి పరుగెత్తు కెళ్ళి పంచదార డబ్బా తీసుకొచ్చి సువర్ణ నోటిలో ఇంత వేసి, తన నోట్లోకూడా కాస్త వేసుకుంది విశాలి. డబ్బా మూత గట్టిగా నొక్కి, వంటింట్లో పెట్టేసి వచ్చింది.
"నిజంగా చాలా సంతోషకరమైన వార్త చెప్పావు, సువర్ణా!"
చిరుకోపం ప్రదర్శించింది సువర్ణ.
"సంతోషకరమైన వార్తలు నేను చెప్పడమే తప్ప నువ్వు నా కేం చెప్పవా?"
"నేనా?"
"నువ్వే!"
అర్ధం కాలేదు విశాలికి. "ఏమున్నాయి చెప్పడానికి?"
"తలుచుకుంటే ఎందుకు ఉండవూ?"
"ఏమో బాబూ! అడిగే దేదో తిన్నగా అడగరాదూ?"
నవ్వింది సువర్ణ. "తిన్నగానే అడుగుతాను. నా కేం భయమా?"
ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి సువర్ణ విశాలికి దగ్గిరగా జరిగింది. "నీకు పెళ్ళి చేసుకోవాలని లేదా? నువ్వు పెళ్ళి చేసుకుంటే నా కది సంతోషకరమైన వార్త కాదా?"
స్నేహపూరితమైన స్నేహితురాలి కన్నుల్లోకి ఒక్క క్షణం చూసి చిన్నగా నవ్వింది విశాలి.
"నీ కా ఆలోచన ఎందుకొచ్చిందసలు? నా కా ఉద్ధేశ్యమే లేదు."
తెల్లబోయింది సువర్ణ. "అంటే!"
ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఉండిపోయింది విశాలి.
"విశాలీ! నువ్వు నా ప్రియస్నేహితురాలివి కనక చనువుకొద్దీ, నువ్వేదో సుఖపడాలన్న కాంక్షకొద్దీ నేను నీ కొకటి చెప్పదలిచాను."
"చెప్పు."
"మా బంధువుల్లో చంద్రం అని పెళ్ళి కావలసిన వాడొక డున్నాడు. వరసకి నాకు అన్న అవుతాడు. వాళ్ళమ్మ ఏదో జబ్బుతో మంచం పట్టింది. పోయేలోగా కొడుకు పెళ్ళి చూసిపోవాలని ఆవిడ కోరిక. అందుకని త్వరలోనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. అతనికి తోబుట్టువు లెవరూ లేరు. చదువు, ఉద్యోగం, స్వంత ఇల్లు, ఏదో కొద్దిగా ఆస్తి ఉన్నాయి. పిల్ల ముఖ్యం కనీ కట్నం ముఖ్యం కా దతనికి. అసలు కట్నం తీసుకోకూడదనే అనుకుంటున్నాడు. ఆమధ్య వో సారీ ఊరొచ్చినప్పుడు మా ఇంటి కొచ్చాడు. అప్పుడతను చెప్పినదాన్నిబట్టి నీలాంటమ్మాయి కావాలతనికి. ముందు నీ ఉద్దేశ్యం అడిగి, తరవాత అతనికి నిన్ను చూసుకోవడానికి రమ్మని రాద్దామని ఉన్నపళంగా ఇలా పరుగెత్తుకొచ్చాను, నీతో ఇవన్నీ చర్చించడానికి. అబ్బ! ఏదీ ఓ గ్లాసుడు మంచినీ ళ్ళందుకో ఆగకుండా ఏకరువు పెట్టి అలిసిపోయాను."
సువర్ణ మంచినీళ్ళు తాగుతుంటే అలాగే చూస్తూ మౌనంగా ఉండిపోయింది విశాలి.
"ఆఁఇప్పుడు చెప్పు నీ ఉద్దేశ్యం." గ్లాసు గోడవారగా పెట్టింది సువర్ణ.
"నువ్వు నన్నర్ధం చేసుకో, సువర్ణా! ఈ పరిస్థితుల్లో నేను పెళ్ళి చేసుకుంటానని నువ్వు మాత్రం ఎలా అనుకున్నావు?"
"అదిగో! మళ్ళీ అదే మాట."
"నువ్వు తెలియకే అడుగుతున్నావని నే ననుకోను. అన్నయ్య సంగతి తెలుసుగా నీకు? వదిన మంచంమీదున్న సంగతీ తెలుసు. పైగా, రాజేంద్ర చిన్నపిల్లాడు. వీళ్ళని ఎవరి మానాన వారి నొదిలి నేను పెళ్ళి ఎలా చేసు కుంటాను? నేను పెళ్ళి చేసుకుని వెళిపోతే వదిన నెవరు పట్టించుకుంటారు? రాజేంద్ర నెవరు చూస్తారు?" విశాలి కన్నుల్లో నీరు తిరిగి చెంపల మీదుగా జారి పైటమీద పడి ఇంకిపోయింది.
గుండె కలచినట్లయింది సువర్ణకి.
"అందుకని అసలు నువ్వు వెళ్ళే చేసుకోకుండా ఉండి పోతానంటావా? నువ్వీ కుటుంబం కోసం సుఖాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నానే- అటువంటి నిన్ను మీ అన్నయ్య కొంచెమైనా లక్ష్య పెడుతున్నాడా? చెల్లలనే దృష్టితో నిన్ను చూస్తున్నాడా?" ఆవేశంతో ఎర్రబడింది సువర్ణ ముఖం. ఎలాగైనాసరే స్నేహితురాలిని, ఈ విషయంలో ఒప్పించాలనేపట్టుదలతోనే ఉంది.
"నువ్వు పొరపడుతున్నావు, సువర్ణా! ఈ కుటుంబం కోసం అంటున్నావు. నేనుకూడా ఈ కుటుంబంలో ఒక మెంబర్నేగా!"
"చెప్పొచ్చావులే! అయితే మాత్రం నిన్ను లక్ష్యపెట్టని వాళ్ళ కోసం వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకుంటావా? పెళ్ళికాని ఆడదానికీ సంఘంలో ఉన్న విలువ నీకు మాత్రం తెలియదూ?"
నిట్టూర్చింది విశాలి. "మనిషికి తృప్తి అనేది ఉందని నే ననుకోను. పెళ్ళి కానంతవరకు పెళ్ళి కాలేదనే అసంతృప్తి, పెళ్ళయ్యాక పిల్లలు కలగకపోతే పిల్లలు లేరనే అసంతృప్తి. దాని తరవాత మరోటి. ఇలా అనేకం. మన ఆశలకి, కోరికలకి అంతెక్కడ చెప్పు? ఇక సంఘం, విలువ- ఈ సంగతంటావా? పెళ్ళి చేసుకుంటేగానీ, సంఘం నాకు సరి అయిన విలువ ఇవ్వదు అనే దానికంటే ఇంటి పరిస్థితులకే నే నెక్కువ ప్రాముఖ్య మిస్తాను. నా స్నేహితు రాలిగా నువ్వు నన్నర్ధం చేసుకుంటావనే అనుకుంటాను." కన్నుల్లో నీరు కనుపించకుండా తల దించుకుంది విశాలి.
కొంచెంసేపు ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయింది సువర్ణ.
చివరికి స్నేహితురాలి చేయి అందుకుని మెల్లగా అంది: "ఆలోచించుకుని చెప్పు, విశాలీ!"
తల ఎత్తింది విశాలి. ఆ విశాల నయనాల్లో, 'నా ఉదేశ్యం ఇక మారదు' అన్న స్థిరమైన భావం స్పష్టంగా కనుపించి మరి మాట్లాడలేకపోయింది సువర్ణ.
* * *
