'అల్లా కంగారు పడిపోతా వెందుకు కామేశ్వరీ! కావాలని కాలేజీలో చేరావు! ప్రేమ లేఖలు రావటం తప్పా? మాధవని తెలుసుగా! మా క్లాసుమేటు? అతని అన్నయ్యకి నిన్ను ఇద్దామనుకున్నారట కదూ? నిజమేనా?' సూటిగా అడిగింది నళిని.
'ఏమో! నాకు గుర్తు లేదు!' నాకు పధ్నాలుగేళ్ళు దాటింది మొదలు మా అమ్మావాళ్ళూ నాకు పెళ్ళి చేయాలనే ఆలోచించేవారు అప్పట్నించీ ఎన్నో సంబంధాలు చూసారు. ఎంతోమంది పెళ్ళి కొడుకులు వచ్చి నన్ను చూసుకున్నారు. కాని వక్కరికీ నేనూ, మా వాళ్ళు ఇవ్వగలిగే వరకట్నం నచ్చేది కాదు! అందులో ఏ పెళ్ళి కొడుకునీ నేను గట్టిగా చూసిందీ లేదు! నచ్చుకుని మెచ్చుకుందీ లేదు!' అంది కామేశ్వరి.
'నీకు గుర్తువున్నాలేకపోయినా, మాధవ అన్నయ్య రామనాధం మటుకు, నిన్నే ఆరాధిస్తున్నాడట! మాధవ అస్తమానూ వాళ్ళ అన్నగురించి చెప్తోవుంటాడు! అతను నిన్ను పెళ్ళి చూపులకు వచ్చి చూచి వెళ్ళింది మొదలు నీ మూర్తినే కన్నుల ముందు నిలుపుకొని, ధ్యానించుచున్నాడట! నువ్వు కూడా కధానాయికవే అవి, మాధవ చెప్తేనే తెలిసింది. నాకు! లేకపోతే ఎల్లా తెలుస్తుంది?' అంటూ వెళ్ళిపోయింది నళిని.
'హఁ' నిశ్శబ్దంగా, వెయ్యి ముక్కలయింది కామేశ్వరి మనస్సు.
తనదేం జన్మ? పెళ్ళి కానన్ని రోజులూ, తన్నిగురించి తన తల్లిదండ్రులు, ఈ పిల్లకి పెళ్ళంటూ చేయగల్గుతామా! అని బాధపడేవారు. పిల్ల రూపురేఖలని, కట్నాల గలగలల్లో దాచగల తాహతులేదు! అతి సామాన్య కుటుంబీకులు వాళ్ళు! ఎల్లావో అల్లా, వసుంధర పుణ్యమా అంటూ తనకి కన్నెచెర వదిలించేరు. ఆ చెర వదిలింది, దేముడా అనుకుంటే ఇక్కడ అసలయిన చెర ప్రారంభమయ్యింది. ఇది యావజ్జీవిత శిక్ష! కాపిటల్ పనిష్ మెంట్. ఎక్కువ చిత్ర హింసలు పెట్తూంది ఈ శిక్ష! సూది మాటలు, వాడి మాటలు, శూలాల్లాంటి మాటలు, అని తను పుస్తకాల్లో చదివేది! ఆమాటలు ఎల్లా వుంటాయా అని ఆలోచించేది తను! పెళ్ళయ్యేదాకా ఆ మాటలు అనుభవం లోకి రాలేదు! ఇప్పుడు అనుభవం లోకి వచ్చేయ్! ఈ మూడు ముళ్ళ ధర్మమా అంటూ తనకి కొన్ని విచిత్ర మనస్తత్వాల పరిచయభాగ్యం లభించింది!
ఆ రామనాధం ఎవడో మహానుభావుడు! తనకోసం, అమిత విరహం అనుభవిస్తున్నా డట! ఆ విరహమేధో, తనకి పెళ్ళి కానప్పుడు ఎందుకు కలగలేదో పాపం! అప్పుడు, మూడువేల రూపాయలతో పదికాసుల బంగారంతో తన్ని కప్పెట్టితేనే కాని తను ఆ రామనాధుడిచేత, మూడుముళ్ళూ వేయించుకొందికి అర్హురాలయింది కాబోల్ను!
కామేశ్వరి ఆలోచనల్లోపడి కొట్టుకుంటూండగానే సీతమ్మ హాలులోనికి వచ్చింది.
'నువ్వు ఇస్కూలికి వెళ్ళలేదామ్మా?' అంది.
'నేను కాలేజీకి వెళ్ళటం మానేసాను అత్తా!' అంది కామేశ్వరి.
కోడలు తను చెప్పిన వెంటనే, తన మాటమీద గౌరవంవుంచి స్కూలు మానేసినందుకు సీతమ్మ పొంగిపోయింది.'
'పోన్లే తల్లీ! మంచిపని చేసావ్! పైన కేశవ గదిలో బీరువాల నిండు కూ బోలెడు పుస్తకాలున్నాయ్! కావలిస్తే తీసుకుని హాయిగా చదువుకొంటూ కూర్చో!' అనీ సలహా చెప్పింది సీతమ్మ.
కామేశ్వరి మేడమీద తన గదిలోనికి పోయి కిటికీలో కూర్చుంది. దూర దూరంగా కొండలకీ, ఆకాశానికీ మధ్య నున్న సరిహద్దు గీత వంకరటింకరగా కనపడుతోంది. ఆకాశంలో పక్షులు, స్వేచ్చగా ఎగురుతున్నాయి. కొండల క్రిందుగా వున్న విశాలమైన పసరికమైదానంలో ఆవులూ, దూడలూ పచ్చికను మేస్తున్నాయి! కొండలకి ఎగబ్రాకుతూన్న ఆవులు సుద్ధ చుక్కల్లా కన్పడుతున్నాయి. నిర్మలాకాశంలోని లేత నీల హరితాలు కలిసేచోట నల్లదనం వచ్చింది. ఒకమబ్బుకీ ఒక మబ్బుకీ పోలికే లేకుండా కణకణాలుగా విడిపోయి తొందర పనివున్నట్లుగా పరుగెట్టుతున్నాయి! ఆ విడిపోయిన మబ్బులును చూస్తోంటే కామేశ్వరికి తమ విభిన్న జీవన దృక్పధాలు జ్ఞప్తికి వస్తున్నాయి!
తన పుట్టింట్లో తన తల్లికీ, తన తండ్రికి ఎప్పుడూ మాట పొంతన కుదిరేది కాదు. అస్తమానూ అయినదానికీ, కానిదానికీ పోట్లాడుకుంటూ వుండేవారు! అయినా చిత్రమేమిటంటే వాళ్ళిద్దరూ కలిసి జీవించుతున్నారు! పిల్లల్ని కన్నారు! వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసారు! తమకు వీలున్న దాంట్లో వాళ్ళ వాళ్ళ జీవితరీతుల్ని తీర్చి దిద్దగల్గుతున్నారు!
ఇక అత్తింట్లో కూడా సామరస్యం అంతంతమాత్రంగానే వుంటోంది. ఒకళ్ళ మాటకీ, ఇంకోళ్ళమాటకీ అసలు పొత్తుకుదరదు. అత్తగారు కాలేజీ చదువులు, అసలు చదువే ఆడదానికి అనవసరం అంటుంది. ఆడబిడ్డ వసుంధర ఉన్నత విద్య మనోవికాసానికి హేతువు అవుతున్నదనీ అంచేత అవకాశాలు వున్నంతమేరకు స్త్రీ ఉన్నతవిద్య సాధించటం ఎంతో అవసరమై వుంటుందనీ, ఉన్నత విద్య అభ్యసించిన స్త్రీ తన జీవితాన్ని అత్యంత రమణీయంగా నడిపించుకోగల సామర్ధ్యాన్ని సంతరించుకుంటుందనీ అంటుంది!
కేశవ ఒకళ్ళ స్వేచ్చాస్వాతంత్ర్యాలకు భంగపాటు కలిగించటం సంస్కారవంతుల లక్షణం కాదనీ, స్త్రీ అయినంతమాత్రాన్న వయసులో ఒకరికంటే చిన్నది అయినంత మాత్రాన్ని ఆమె ఇష్టానిష్టాలని జరగకుండా చేయబూనటం అవివేకం అన్పించుకుంటుంది అనీ అంటాడు. నళిని 'జీవితం అనుభవించాలి! ఒకళ్ళకి భయపడకూడదు. 'మర్యాద' అంటూ, లేనిపోని ముసుగులో దూరి వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోకూడదు!' ఒక విధమైన విలాస తత్వం ఆమెది!
ఇన్ని విభిన్న దృక్పధాలు గల వ్యక్తులతో ఒక సంసారం, ఒకే ఇంటి కప్పు క్రింద జరుగుతోంది! ఎలకా పిల్లీ, పామూ ముంగిసా, ఓకే గదిలో వున్నట్లు వుండాలి న్యాయంగా ఆ ఇల్లు! కాని, కేశవ మౌన ముద్రతో ఆ ఇల్లు నందనవనంలా ప్రశాంతంగా గడిచిపోతూంది!
మేడమెట్ల మీద బరువైన అడుగుల సవ్వడి వినిపించి, కామేశ్వరీ గదిలోంచి, వరండాలోకి వచ్చింది! మెట్లు ఎక్కి వస్తోన్న గవర్రాజునీ చూసి ఆశ్చర్యపోయింది కామేశ్వరి! ఒకే చేతితో తనంత పొడుగుగావున్న అమృతపాణీ అరటిపళ్ళ గెలా, చెరుకు గడలమోపు ఇంకో చేతితోనూ పట్టుకుని పైకి బరువుగా వచ్చాడు గవర్రాజు!
* * *
గవర్రాజు ఒక విచిత్రమైన వ్యక్తి! కొంతమందికి ఒక దురభిమానం వుంటుంది. తమవల్ల, వూరందరూ ఉపకారం పొందుతూండాలనీ, లోకమంతా తను పరోపకార చింతనని గుర్తించి తమకి 'విశిష్ఠ సేవా పతకం' ఇవ్వాలనీ వుంటుంది. గవర్రాజు కచ్చితంగా, ఆ తరహాకే చెందుతాడు! గవర్రాజుకి ఈ కీర్తి కాంక్ష వయసు వచ్చినప్పట్నించీ వయసుతో పాటు పెరగవొచ్చింది. అసలు గవర్రాజు చిన్నప్పుడు ఒట్టి గడుగ్గాయిలా వుండే వాడు! అల్లరి చిల్లరిగా తిరుగుతూ, చదువుకునేవాడు కాదు! తండ్రికి విసుగొచ్చి చావగొట్టేవాడు! దానితో ఇంకా రెచ్చిపోయి, ఇంట్లో చేతికి అందిన డబ్బులు పట్టుకుని పారిపోయేవాడు! ఆ డబ్బుతో జల్సాగా హోటళ్ళమ్మట తిరిగివచ్చేవాడు! క్షమార్పణలు, కన్నీళ్ళు, నట్టులూ, ప్రమాణాలూ, మొదలైన తతంగమంతా జరిపి తండ్రి మళ్ళీ జేరనిచ్చేవాడు! నాలుగురోజులు ఇంటిపట్టున వుండి బుద్ధిగా పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు! అయిదోరోజున మళ్ళీ విశ్రాంతి పొంది విసుగు చెందిన అతని శరీరం అతన్ని 'ఎడ్వంచర్' కి ప్రోత్సహించేది ఈ 'కొరమాలిన' కొడుకుని, ఎల్లా దారి లోనికి తేవాలో అర్ధంకాక, ఆ తల్లి తండ్రులు తికమక పడిపోయేవారు! వాళ్ళు బ్రతికి ఉన్నన్నిరోజులూ, 'గవర్రాజు'కీ ధనార్జన చేయాలనే దృష్టి వుండేది కాదు. ఎప్పుడు చేతిలో డబ్బు అయిపోతే అప్పుడు ఇంటికివచ్చి తల్లి తండ్రుల కాళ్ళమీదపడి, వాళ్ళకి భక్తి ప్రపత్తులు, ప్రదర్శించి, ఇంట్లో స్థానం సంపాదించుకునేవాడు!
తల్లితండ్రులు చనిపోగానే అతని రాక పోకలు, అతని ఇద్దరన్నలకు కానీ, వాళ్ళ భార్యలకి కానీ,ఇష్టంగా వుండేది కాదు! విసుక్కుంటూ, కసుక్కుంటూ, ఇంత తిండి బయటవసారాలో పడేసేవారు! ఎవళ్ళపెట్టెలూ, బట్టలూ, సామాన్లు, వున్నగదులకి వాళ్ళు భద్రంగా తాళాలు వేసుకునేవారు. పిల్లలు, 'బాబాయి, బాబాయి' అంటూ చేరబోతే ఆ పిల్లల్ని తిట్టికొట్టి గదుల్లోకి తోసేసేవారు కొత్తల్లో, గవర్రాజు ఇదంతా పట్టించుకునేవాడుకాదు! కాని రాను రానూ ఆ ఇంట్లో అతనికి ఏమీ ఆదరణ లభించటం లేదనీ, తన్ని పురుగుకన్నా, కనాకష్టంగా చూస్తున్నారనీ గ్రహించేడు! అతనికి బాధ కలిగింది! ఎంతయినా మానవుడు! ఒకరోజు పెద్దన్న పనిచేసే ఆఫీసు కి వెళ్ళాడు గవర్రాజు.
'ఏరా ఇటు వచ్చావ్!' విసుగ్గా అన్నాడు పెద్దన్న.
'నాకు కొంచెం డబ్బు కావాలి!' అన్నాడు గవర్రాజు.
'ఎందుకు?' కోపంగా అన్నాడు.
'వూరికి వెళ్ళాలి!' చిన్నతనంతో ముడుచుకుపోయేడు గవర్రాజు. ఎందువల్లో తండ్రిలా చనువుగా పెద్దన్నని గదాయించలేకపోయేడు గవర్రాజు.
'ఏ వూరికి వెళ్తావ్! ఏమిటా రాచకార్యం! ఇంట్లో ఈసారి నీచేతికి ఏమీ అందలేదల్లే వుంది! బుద్దిగా అడుగుతున్నావ్! ఇదిగో! వకమాట చెబ్తున్నాను గవర్రాజూ! మేమూ, పిల్లాజల్లాతో గౌరవంగా బ్రతుకుతున్నవాళ్ళం! మన బాబు మనకు డబ్బు చెట్లేమీ దొడ్లో పాతిపెట్టి ఇయ్యలేదు! రెక్కాడితేనే, డొక్కాడేది! ఏదో సంసార్లం! నువ్వు మాటిమాటికీ వొచ్చి నాన్నని పీడించి నట్లు మమ్మల్ని కూడా డబ్బుకోసం పీడించితే మా దగ్గరేం వుంటుందీ? బ్రతుకు నీవు చూసుకోలేకుండా మా మీద ఆధారపడితే మేము ఎన్నిరోజులని పోషించగలం?' అన్నాడు.
'వూరికి నా ఖర్మాన్న నేను పోతానంటే డబ్బు ఇయ్యలేనంటారు! ఇంట్లో వుంటే వదినలకు విస్తట్లో అన్నం వడ్డించటమె మహాకష్టంగా వుంటోంది! విసుక్కుంటూ ముష్టివాడికి మల్లే పడేస్తారు!' అన్నాడు గవర్రాజు.
'ఇంత డబ్బు సంపాదించుకుంటూంటే మాజీవితాలే తిన్నగా వెళ్ళమారటం లేదు! తేర తిండివాళ్ళు మటుకు నీకు గౌరవాన్నిస్తూ, ఎక్కడ్నించి తెచ్చిపెడతారు?' అన్నాడు అన్న.
అన్న మాటలకు ఉక్రోష పడ్డాడు గవర్రాజు.
'అయితే నావాటా నాకు పంచియ్యండి! నా ఖర్మాన్న నేను పోతాను!'
గవర్రాజు మాటలకు పెద్దగా నవ్వాడు పెద్దన్న.
'అసలు మనకు వాటాలు వేసుకో వాల్సినంత ఆస్తిపాస్తులు మన నాన్నగారు మిగిల్చాడనుకున్నావా? ఆస్తి వున్నదేదో, నీకు డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా తెగ నమ్మటానికే హరించుకుపోయింది? నీవే మన్నా, అయ్యో మనకు ఇద్దరన్నలు వున్నారు! వాళ్ళు పోషించాల్సిన భార్య బిడ్డలున్నారు! అని ఆలోచించావా? ఒక చిన్న పాదుషాలా వెలిగించావు జీవితాన్ని! వాళ్ళు బ్రతికున్న నాల్గురోజులూ, నీకు చదువు సంధ్యలు అబ్బలేదని బెంగపెట్టుకున్నారు కాని, అయ్యో! పెద్దాళ్ళిద్దరికీ, పెళ్ళిళ్ళు చేసి సంసారాలూ, నెత్తి కెక్కించాం! చాలీచాలని జీతాలతో వాళ్ళకి సంసారం ఎల్లా జరుగుతుందీ? ఉన్న మడిచెక్కకూడా అమ్మేసి, చిన్నాడి చేతులో పోసేశాం, అని ఆలోచించారా! పొలం అమ్మిన డబ్బులో మేము చిల్లి కానీ కూడా ఇంట్లోకి ఖర్చు నిమిత్తం తీసుకోలేదు! ఏదో! తల్లితండ్రులు! పెద్దవాళ్ళు! వాళ్ళే సంసారం నిర్వహించుతున్నారు! అని వూరుకునేవాళ్ళం! వూరుకున్నందుకు ఏమయింది? మా నెత్తినే చేతులుపెట్టి చల్లగా జారుకున్నారు! గుప్పెడు గింజలు, ఇంట్లోకి వచ్చే దారిలేక, మేము మా సంసారాలను, ఎంత గిజాటుగా నడుపుకుంటున్నామో నీకేం తెలుసు? ఇవ్వాళ నువ్వు హఠాత్తుగా, నీకు వాటాపంచి ఇమ్మంటున్నావ్! ఏముంది నీకు ఇవ్వటానికి? ఆ బొక్కి కొంప, వకటున్నది! బాగుచేయించటానికి మాకు స్తోమతు లేదు. ఇల్లంత చవుడు బారిపోయింది. పెంకులు చితికిపోయి, సకల దిక్పాల కులూ, ఇంట్లోకి తొంగిచూస్తారు! అది అమ్మితే తట్టెడు పెంకులిచ్చి కూడా కొనరు!' అన్నాడు పెద్దన్న.
'పోనీ! రెండువందలు అప్పుగా ఇయ్యి! ఏదయినా వ్యాపారం పెట్టుకుంటాను. కలిసిరాగానే, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఈ ఉపకారమన్నా చెయ్యి! మనం ఒక కడుపునపుట్టి పెరిగిన ఏకోదరులం! నాన్నవున్న రోజుల్లో నాకు ఆర్జనమీద దృష్టి కాని, ఆర్జించాలనే అవసరం కానీ వుండేదికాదు! గతం మర్చిపోయి నాకు ఈ చిన్నసాయం చెయ్యి!' దీనంగా అన్నాడు గవర్రాజు.
'నీకు కలిసిరావటం అంటూ వుంటుందా? ఇంక మళ్ళీ మళ్ళీ వచ్చి డబ్బు అడిగి మమ్మల్ని బాధపెట్టకు! మేము నీకు ఇవ్వలేకపోతే మాకూ, దిగులు గానే వుంటుంది!' అన్నాడు పెద్దన్న.
