సరే! తల పంకించి వూరుకున్నాను. మొగుణ్ణి ఒదులుకో గలిగిన ఆడది అమ్మని క్షణం చూడక పోతే ఉండలేదు. అరుణా! కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నావు. కానీ! చూస్తాను." అనుకున్నాను.
తర్వాత పూర్తిగా ఆప్రసక్తి విరమించు కున్నాను. అ విషయమే మర్చిపోటానికి ప్రయత్నించాను. మళ్ళా వేసంగి - పెళ్ళిళ్ళ రోజులు వచ్చాయి.
* * *
నేను పెద్దగా ప్రయత్నాలు చెయ్యక పోయినా అనుకోకుండా లక్ష్మికి సంబంధం వచ్చింది. స్వయంగా వెళ్ళి అతన్ని చూసి - కట్నం కానుకాలు మాట్లాడి వచ్చాను. పెళ్ళిచూపుల తర్వాత లక్ష్మి అంగీకారంతో పెద్దల ఇష్టప్రకారం ముహూర్తం పెట్టించాను. అమ్మకీ నాకూ సంసార సుఖం లేకపోయినా లక్ష్మికి మాత్రం ఆ లోటు రాకూడదని వెయ్యిమంది దేవుళ్ళకి మొక్కుకున్నాను. స్వగ్రామంలో వున్న పొలం అమ్మాల్సి వచ్చింది. లక్ష్మి ఓ ఇంటిదైతే చాలు. నా బ్రతుకు దెరువు నాకుంది - నా తాహతుకి తగ్గట్టుగా లక్ష్మికి పెళ్ళిచేశాను.
అందరితోపాటే మా అత్తగారింటికి శుభలేఖపంపుతూ రామం బావకి వుత్తరం రాశాను తప్పకుండా రమ్మని. చుట్టాలంతా వచ్చాక పెళ్ళి రోజునే కార్ లో వచ్చింది అరుణ. రామం బావ రాలేకపోయినందుకు క్షమించమని వుత్తరం రాస్తూ సౌభాగ్యవతి లక్ష్మికి చక్కని చీర బహుమతిగా పంపించాడు. అరుణ వచ్చిందని అనుకోవటం తప్ప ఆవిణ్ణి నేను చూడనూ లేదు, మాట్లాడనూ లేదు. పెళ్ళి జరిగిపోయిన వుదయం అరుణే నాకోసం కబురు పెట్టింది. సరే! అని వెళ్ళాను.
పిలిపించింది కానీ తీరా వెళ్తే మవునంగా నించుంది.
"ఎందుకూ పిలిచావటా?" అన్నాను పొడిగా.
"ఏం లేదు. మీతో ఒక విషయం మాట్లాడాలని..." నసిగింది.
"మాట్లాడు. ఆలస్యం దేనికి?" అన్నాను.
ఓసారి కళ్ళెత్తి నా మొహంలోకి చూసింది-లక్ష్మికి పెళ్ళయిపోయిందిగా?"
"ఆ అయింది. ఏం? చెయ్యలేననుకున్నారా?'
"ఎందుకలా మాట్లాడుతారు?"
"మరి ఏమిటి నువ్వనేది?"
"అక్కడికి రావటానికి ఇంకా మీ అభ్యంతరమేమిటి?"
అర్ధం గాక క్షణం ఆలోచించాను. లక్ష్మి గొడవ వదిలిపోయింది కాబట్టి ఇక నన్ను వచ్చెయ్యమనా ఆవిడ అనేది?
"గొప్ప ఆలోచనే" అనుకున్నాను. కోపం రాజుకొంటూంది.
"మరి అమ్మమాట?" అన్నాను ఏమంటుందో చూద్దామని.
క్షణం ఆగి అంది - "మీకు స్వగ్రామంలో ఇల్లు వుందటగా?" అంతే అరుణ చెంప చెళ్ళుమంది - "ఒళ్ళు తెలిసి మాట్లాడు - నీతల్లే నీకు ఎక్కువనుకున్నావా?"
వెనక్కి తిరిగి చూడకుండా విరుసుగా ఇవతలికొచ్చి పడ్డను. వెంటనే వడ్డన హడావిడిలో కలిసిపోవాల్సి వచ్చింది. ఐనా క్షణం క్రిందట జరిగిందంతా తలలో గిరగిర తిరిగి పోతూంది-"మీ అమ్మగారుకూడా మనతోనే వుంటారు." అంటుందేమో అనుకున్నాను నేను. ఆవిణ్ణి స్వగ్రామానికి పంపించెయ్యాలట. ఎంతచక్కటి ఆలోచన! తెలివితేటలన్నీ ఏమై పోతాయ్ మరి?
నాకోసం ఎందుకో అమ్మ కబురు పెట్టింది. పులుసుగిన్నె పక్కవాడికి అందించి తొందరగా వెళ్ళాను.
"అరుణ వెళ్ళిపోటానికి తయారైందిరా! ఎంత చెప్పినా వినటంలేదు. చుట్టాలంతా వుండగా ఇంటి కోడలు వెళ్ళిపోవటం ఎంత అప్రతిష్టో ఆలోచించావా? ఈ మూడురోజులూ అయ్యక లక్ష్మిని అత్తారింటికి పంపేటప్పుడు అరుణని తోడుగా పంపుదామనుకొంటున్నానుకూడా. ఇప్పటికిప్పుడెళ్ళిపోతే ఏం బావుంటుంది చెప్పు" అంది.
"ఎందుకు బావుండదు? బాగానే వుంటుంది. పోనీ! దానికి నేను చెప్పనూ చెప్పను. చెప్పినా వినదు. ఇందుకా నువ్వు పిలిచింది? అవతల పందిట్లో నాకు పనుంది." అంటూ వెళ్ళి పోతూంటే - "అయ్యో! ఇదేం ఖర్మరా?" అని అమ్మ అనుకోవటం వినిపించింది - అరుణ వెళ్ళిపోయిందని ఎవరో చెప్పారు. అమ్మలక్కలు గుసగుసలాడుకోవటం నేను చూడకపోలేదు.-మూడురోజుల తర్వాత లక్ష్మి అత్తవారింటి కెళ్ళింది. మళ్ళా నాలుగోనాటి సాయంత్రానికి మొగుడితో సహా కలిసి వచ్చింది. లక్ష్మి భర్తఇక్కడ వారం రోజులున్నారు. ఆవారం రోజులూ ఎన్నడూ ఎరగనంత సంతోషంగా గడిచింది. ప్రతీ విషయానికీ సిగ్గుపడే లక్ష్మి నా ఎదురుగానే మొగుడికి వీళ్ళందించినట్టూ - తుండందించినట్టూ-ప్రతీ పనీ చేస్తూ తిరగటం ఆశ్చర్యం కల్గించినా ముచ్చటేసింది.
"అరుణ మాత్రం ఆడది కాదూ?" అనుకున్నాను. బావ వెళ్ళిపోయే రోజున లక్ష్మిని కూడా తీసికెళ్తానని కూర్చున్నాడు-"ఇప్పుడే ఏమిటి నాయనా? మూడో నెలనైనా పంపిస్తాం' అంది అమ్మ.
"అవునండీ బావగారూ! ఏమిటలా కంగారు భోంచేస్తున్నారు?" అన్నాడు నవ్వుతూ.
బావకూడా నవ్వుతూ-"అబ్బే! నాకేం కంగారు లేదండీ! మీచెల్లాయి నా ప్రాణాలు కొరుక్కుతినే స్తోంది-"నేనూ వచ్చేస్తాను. మీరు లేకపోతే వుండలేను. మా అన్నయ్యని అడగండి. నన్నూ తీసుకుపోండి." అంటూ ఒకటే సొద. నేనేం చెయ్యను చెప్పండి?" అన్నాడు. లక్ష్మికి కోపం వచ్చింది - "మీరు చెప్తే మాత్రం అన్నయ్య నమ్ముతాడనుకున్నారా? అలా దేవిరించుకోటం మా ఇంటా ఒంటా లేదు." అంది విసురుగా.
"పోనీ అలా అడిగిందే అనుకో తప్పేం లేదుగా? లక్ష్మి అడిగిందని చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మీరిద్దరూ సుఖంగా వుంటే చాలు. ఈ కొత్తలో మీకెడబాటెందుకు కల్గించాలి?" అన్నాను నవ్వి. లక్ష్మి మెల్లగా లోపలికి జారుకొంది.
స్టేషన్ లో లక్ష్మిని విడిచి రావటానికి ఏమిటో అంత బాధపడ్డాను. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.
"లక్ష్మి మీలాగ గడుసుది కాదు. జాగ్రత్త బావగారూ!" అని ఆయనకి అప్పగించాను. లక్ష్మి కళ్ళు తుడుచుకోటం తప్ప ఏమీ మాట్లాడలేక పోయింది. భారంగానే విడిపోయాం-కాని ఆ బాధలోనే ఏదో ఆనందం వుంది.
అప్పటినుంచి లక్ష్మి ఇక్కడ వుండటం అరుదే. పట్టుమని పదిరోజులుండటానికే ఏవో వంకలు పెడుతుంది. నేను దాన్ని వేళాకోళం చేస్తూనే వుంటాను. తగని తాపత్రయం నేర్చింది. ఇంట్లో ఏవస్తువున్నా పట్టుకుపోతానంటుంది. "నీ మొగుడి సంపాదన నిలవజేసుకొంటూంటే ఇక్కడ నేనేమిటే నీకు అచ్చి వున్నది." అంటే -"కాదేవిటి మరి? పుట్టింట వున్నదానికి నీ అడ్డేవిటి? నీకు కావలసినవేమిటో నీ పెళ్ళాం తెస్తుందిలే." అంటుంది.
లక్ష్మి కాపరానికి పోయిన కొత్తలో ఓనాడు అన్నం పెడుతున్నప్పుడు అమ్మ అంది-"ఇన్నాళ్ళూ లక్ష్మి గురించైనా వుండి పోవాల్సి వచ్చింది. ఇక ఆ అడ్డులేదు కదా? దాని బ్రతుకేదో అది బ్రతుకు తుంది. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు సుఖం లేకుండా వుంటావు మధూ? నేను మన వూరు వెళ్ళివుంటాను ... నువ్వు."
అమ్మ చెప్పేదేవిటో నాకు తెలుసు- "అమ్మా!" అన్నాను కోపంగా. "నేనంత దుర్మార్గున్ననుకోకు. నిన్ను ఈరోజుల్లో ఎక్కడో దిక్కులేని దానిలా వదిలెయ్యటానికి నేను చచ్చానా అమ్మా?"
"మధూ! ఏవిటా మాటలు?"
"అంతే నిన్ను దూరం చేసుకొంటానని ఏ నాడూ అనుకోవద్దు. చిన్నప్పుడు నువ్వు నన్ను పెంచావు. ఇప్పుడు నిన్ను నేను ....." నాగొంతు పూడిపోయింది- "ఈ అన్నం సాక్షిగా నిన్ను చెల్లినీ దూరం చేసుకోను." అంటూ చెయ్యి కడుక్కుని లేచిపోయాను. అమ్మ మళ్ళా ఆప్రసక్తి ఎత్తలేదు.
తర్వాత కొన్నాళ్ళకి నాకు చాలా జబ్బుచేసింది. ఆ జబ్బులో నెలరోజులపాటు మంచంమీదే వుండి పోయాను. ఓరాత్రి మరీ సీరియస్ గా వుందట. అమ్మ ఏడిచిందట కూడా. ఆ మగతలో ఓసారి బాగా తెలివి వచ్చింది. కళ్ళు విప్పాను. అమ్మ పక్కలో కూర్చుని వుంది. లక్ష్మి దగ్గర్లోనే వుంది. మావయ్య కూడా వున్నాడు. అరుణా వాళ్ళమ్మ గుమ్మంలో కూర్చుంది.
అప్రయత్నంగా - "అరుణ వచ్చిందా?" అని అడిగాను మా అమ్మని, అమ్మ తల నిమురుతూ - "వస్తుంది. ఉత్తరం రాశాము. నువ్వు ఏమీ ఆలోచించకుండా పడుకో. ఒంట్లో బాధగా వుందా?" అంది. అమ్మ నన్ను మభ్యపెడుతూందని అనుకున్నాను. తర్వాత ఓరోజు వుండి అరుణా వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. కాని అరుణ రాలేదు. నాకు నెమ్మదిగా ఆరోగ్యం చిక్కింది. "ఆ జబ్బుతో నన్నెందుకు తీసుకుపోలేదు భగవాన్!" అంటూ ఏడిచాను. ఎన్నాళ్ళు ఏమేమి అనుభవించాలో ఎవరికీ తప్పదు. ఆ సంఘటనతో అరుణ మీద ఏదై నాఆశలాంటిది మినుకు మినుకుమంటూంటే ఆరిపోయింది- నా మనసు పూర్తిగా విరిగిపోయింది.
మరి కొన్నాళ్ళు పోనిచ్చి ఓనాడు అమ్మ అంది - "ఇలా ఎన్నాళ్ళు జరుగుతుంది? నేను వెళ్ళి స్వయంగా మీ అత్తగార్ని అడిగి వస్తాను. నీవు జబ్బులో వుండగా వచ్చినప్పుడు ఆ విషయాలేమీ మాట్లాడలేదు." అని - నేను ఎంత మాత్రం వీల్లేదన్నాను-"నీకేం మతిపోయిందా? దేవిరించుకుంటావా? నా మానాభిమానాలు మంటగలపాలంటే నే వెళ్ళిరా!" అని ఖచ్చితంగా చెప్పాను. ఓనాడు ఇంటికొచ్చేసరికి పక్కింటి వాళ్ళు తాళాలిచ్చారు. "మీ అమ్మగారు మా అబ్బాయిని తోడుదీసుకొని వూరెళ్ళారు. రేపొస్తారట" అని చెప్పారు. నాకంతా అర్ధమైంది నామాటంటే ఆఖరికి ఆవిడకు కూడా లెక్కలేకపోయినందుకు బాధపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాను. ఆరాత్రి భోంచెయ్యకుండా పడుకున్నాను. మర్నాటి వుదయానికే ఆవిడ వచ్చేసింది. ఏమీ ఎరగనట్టు అతి సామాన్యంగా ఇంట్లో పనులు చేసుకోటం ప్రారంభించింది. తను వెళ్ళిన వ్యవహారం ఏదేమైనా సుముఖంగా వుంటే ఈసరికి కబుర్లన్నీ చెప్పేదే! ఆ ధోరణేమీ కన్పించలేదు. నేనడగనూ లేదు- నాలుగైదు రోజులు గడిచాక ఆ సంగతి చెప్పింది. "పెళ్ళయే వరకూ ఊరుకుని తీరా అయ్యాక ఏమీ తెలీదని నాటకం ఆడుతున్నారు. పెళ్ళికి ముందే మేము అడిగిన విషయం మీకు తెలీకుండా ఎలా వుంటుంది? ఇలాటి మడతపేచీలు పెట్టుకోకపోతే అప్పుడే ఏదో ఖచ్చితంగా చెప్తే ఈపెళ్ళి జరిగేదే కాదుగా? మిమ్మల్ని మేమూ-మమ్మల్ని మీరూ ఆడిపోసుకోటం ఎందుకిదంతా? దాని ఆస్థంతా అక్కడికి తెచ్చుకొంటే తింటారటగాని ఇక్కడికి రావటానికి నామోషీ వచ్చిందా? నాపిల్ల పరాయింటికి పంపటానికి పెళ్ళి చెయ్యలేదు. ఇప్పుడు దానికొచ్చిన లోటేమీలేదు. నాతోపాటే అదీ వుంటుంది." అందట మా అత్తగారు. సరే! ఈవిడ కోడలు అత్తగారొచ్చిందన్న సంగతే పట్టించుకోలేదట.
"ఏ లేనింటి పిల్లనో ముడిపెడితే ఈగొడవ లేమీ వుండేవికాదు. నీ బ్రతుకు నేనే పాడుచేశాను. సుఖపడే రాత నీకూ లేదు-నీ సంతోషం చూసుకొనే రాత నాకూ లేదు." అంటూ అమ్మ గడపలో కూర్చుని పరిపరివిధాల బాధపడింది.
ఇదే ఆఖరి ఘట్టం. మా బాంధవ్యం పూర్తిగా తెగిపోయింది. వాళ్ళకీ మాకూ వుత్తరాలైనా లేవు. పెళ్ళయి పూర్తిగా మూడు సంవత్సరాలు దాటింది. ఎక్కడివాళ్ళం అక్కడ వుండిపోయాం.
అరుణతో గడిపింది ఏడురోజులు - అవి నాకు సంతోషాన్నిగానీ సంతృప్తిగానీ ప్రసాదించలేదు. "అరుణే కావాలి. అరుణ లేక పోతే బ్రతకలేను." అనే ఉద్దేశ్యాలతో అరుణని పెళ్ళిచేసుకోలేదు. మనసా ఇష్టం లేకపోయినా నాకు నేను నచ్చచెప్పుకొని అంగీకరించాను. కావాలని ఇష్టం చేసుకున్నాను. తర్వాత సంగతులతో మనసు మరీ దూరం అయిపోతూ వచ్చింది- ఏవిధంగానూ అరుణ నాకు శాంతి చూపించలేదు. నన్ను భర్తగా గౌరవించలేదు. ప్రేమించలేదు. ఒక్కసారైనా తనకై తాను ఆప్యాయంగా దగ్గిరికి తీసుకోలేదు. నేను దగ్గరుండటమే తప్పదన్నట్టు ఇబ్బందిపడేది. ఇష్టంలేని అన్నం తిన్నట్టుగా కాపరం చెయ్యటం నాకు గిట్టలేదు.
