గుమ్మం బైట వీధిలో వేసిన మంచం పైన పడుకుని ఉంది సరస్వతి. తల నొప్పిగా ఉంది. ఆకలి లేదని చెప్పి పడుకుంది. ఇంట్లోని దీపం వెలుగు పలుచగా గుమ్మం దాకా పాకుతుంది. వీధుల్లో చీకటి. అప్పుడప్పుడోక్కొక్కరు తారట్లాడుతూ పోతున్నారు.
'భిక్షాం దేహి మాతా! అన్నపూర్నేశ్వరీ!' అన్నాడు కావడి కిష్టయ్య. సరస్వతి లేచి వెళ్లి పట్టెడన్నం తెచ్చి వేసి మళ్ళీ పడుకుంది. కిష్టయ్య కావడి లో అన్నం వెయ్యక పొతే ఏమీ తోచదు. ఎందుకో తెలియదు! 'మాతా! అన్నపూర్ణేశ్వరీ!' అన్న పిలుపు తో ఒళ్లు పులకరిస్తుంది. ఆకాశం లో నక్షత్రాలు సనసన్నని , అన్నం మెతుకులు పారజల్లినట్లుగా ఉన్నాయి. గుమ్మానికి కుడి పక్క నున్న గన్నేరు చెట్టు మీద పిచ్చుకలు కిచకిచ మని వసతి కోసం తగువులాడుకుంటున్నాయి! చీకట్లో కూడా దాని ఎర్రని పువ్వులు దీపశిఖ లా-- రక్తపు బోట్లలా కనిపిస్తున్నాయి!
తానింతవరకూ సూర్యనారాయణని మరిచి పోయాననే అనుకుంది. నిజంగా హారం రంగయ్య కిచ్చినప్పటి నుంచీ ఆతని గూర్చి ఆలోచించనేలేదు. అతన్ని అంత తొందరగా మరవగలిగినందుకు ఆశ్చర్యం కలిగింది. తానతన్ని ప్రేమించ లేదేమో! ననుకుంది. కానీ, ఈవేళ తనను చూసుకుంటే మరీ ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మనస్సు ఎంత చిత్రమైంది!
"నిజం చెప్పు! నువ్వు నా ఆస్తి కాదూ?' అన్నప్పుడు "నేను నీఅస్తినే..." అనాలనిపించింది. పుస్తకం లో ఎక్కడో ఒక పేజీ లో మొగలి పువ్వు ఉంచింది. పుస్తకం మూసేసింది. ఆ మొగలి పువ్వుకు పరిమళం వీడి పోయిందనుకుంది. పుస్తకం తెరిస్తే 'గుప్పు' మంది. మనస్సు పుస్తకం లాంటిది. తెరచి చదవడం తెలుసుకొవాలి! అంతకంటే అద్భుత గ్రంధం ఉండదేమో?
"ఈ ఆత్మాభిమానం వదులుకుని ఏ అభ్యంతరం లేకుండా అతన్ని పెళ్ళి చేసుకోగలిగితే ఎంత బాగుండు"ననిపిస్తుంది. ఈ ఆలోచనలతో ఒక్క క్షణం సిగ్గుతో కుంచించుకు పోయిందామె! "తన నంతగా పతనం చేయడానికి కూడా సిద్దపడుతున్న తన మనస్సు మీద తనకే చిరాకు కలిగింది. ఇంతకూ ముందులా నిశ్చింత చిక్కలేదు. ఏమవుతుంది? ఏం చెద్దామనుకున్నాడో అతన్నడిగి ఉంటె బాగుండేది? ఈసారి కలుసుకుని...." ఊహను ముందుకు పోనివ్వడానికి భయపడి ఆగిపోయింది. అతను పిలిచినా వెళ్ళకూడ దనుకున్న తాను, మళ్లీ కలుసుకోవాలని కోరుతుంది. ఛీ! ఛీ! ఎందుకో తెలియకుండా మూసుకున్న కనురెప్ప లకు తడి అంటుకుంది.
'మీ నాయనా , అన్నా ఉన్నారా?' ఉలిక్కిపడి కళ్ళు తెరచింది. కాళ్ళ వైపుగా నిలుచున్నా సూర్యనారాయణ . కళ్ళు నులుముకుంది. అతను చొక్కా గూడా తొడుక్కోలేదు. బనియను మీద పెద్ద తువ్వాలు కప్పుకున్నాడు. చేతిలో టార్చి లైటు! అప్పుడే స్నానం చేసినట్లు గుర్తుగా అతని నుంచీ వస్తూన్న సబ్బు వాసన!
'పలకవెం?' సూటిగా ఆమె ముఖం మీద టార్చి వెలిగించాడు. లేచి కూర్చుంది.
"ఎందు కిప్పుడు రావడం?'
'పిల్ల నడగడానికి..."
"పిల్ల తన కిష్టం లేదనలేదూ?'
'ఎందు కనలా? అందుకే వచ్చాం ----రుజువు గూడా దొరికింది.'
"ఏం ఋజువు?'
"పిల్లది మంచం లో పడుకుని కళ్ళ నీళ్లు పెట్టుకోవడం...'
ఆమె గతుక్కుమంది.
అతను లోపలి కెళ్ళి పోయాడు. అంతా ఆశ్చర్య పోయారు. ఏం మాట్లాడడానికి తోచలేదు. ఎందుకొచ్చాడు? ఏదైనా తగువు పెట్టుకోవడానీకా? సూర్యనారాయణ అలాంటి వాడు కాదని నమ్మకం! ఏమో? తండ్రి చేస్తూన్న పని తెలిసి కూడా ఇన్నాళ్ళూ ఊరుకున్నాడు.
"కూర్చో నాయనా!' అనంతయ్య పక్కన మంచం లో కూర్చున్నాడు.
"వాసవీ! నువ్వు గూడా ఇలా రా...'
వాసవి వచ్చి ఒక పక్కన కూర్చున్నాడు.
'ఒక పొరపాటు జరిగిపోయింది. దాని గురించి ఇప్పుడెం మాట్లాడి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా సరస్వతి నివ్వడానికి మీ కిష్టమేనా?'
సంతోషమో, ఆశ్చర్యమో వెంటనే వాళ్ళు మాట్లాడలేక పోయారు. నిమిషం నిశ్శబ్దం తరవాత అనంతయ్య అన్నాడు:
'నువ్విలా మాట్లాడుతోంటే ఏంతో సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడైనా మీ నాయనా కిష్టమేనా?'
'నే నడగలేదు.'
'నాయనా! తొందరపడకు. ముందు మీ నాన్న నొప్పించు, ఇప్పటికే స్థిరపడిన పెళ్లి ఆగిపోయి ఎంతో బాధగా ఉంది. నువ్వొచ్చి అడిగినప్పుడు మా అభ్యంతర మేముంది? అయితే మీ నాయన మళ్ళీ ఏదో అవాంతరం వచ్చి మానేస్తానంటే మా పరిస్థితి ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించు!'
'ఆ పరిస్థితి రాకుండా తప్పించవలసిన బాధ్యత నాది. ముందు మీ కిష్టమా? కాదా? అన్నది నేను తెలుసుకోవాలి.'
'మా కిష్టం కావటం వల్లనే సరస్వతి ని సంతోషంగా నీ కప్పగించా లనుకున్నాం....'
'ఇప్పుడు అప్పటి పరిస్థితి కాదు గనక, సరస్వతి అభిప్రాయం కూడా ముఖ్యమైందే" అన్నాడు వాసవి.
'తప్పకుండా ఆమెనూ అడగవలసిందే!'
'సరస్వతీ!'
సరస్వతీ వచ్చేసింది. తన నడిగే దేముంది/ తన కిష్టమే గదా? తన నడక్కుండా వాళ్లే ఒప్పేసుకుని ఉంటె బాగుండేది! అన్న ఆలోచనోకవైపు.
సూర్యనారాయణ తనను కాదని వదులుకోలేడు. అన్న గర్వరేఖ ఒక వైపు, అంత ఇష్టపడని సుబ్బరామయ్య ఇంట్లో కోడరికం చెయ్యట మేం ఖర్మ! అన్న అభిమానం ఒక పక్కా ఆమెను చిత్రమైన సమస్యలో పెట్టాయి. "ఈ అభిమానం వదులుకుని అతన్ని ఏ అభ్యంతరం గూడా లేకుండా పెళ్ళాడగలిగితే ఎంత బాగుండు!" నని ఇంతకూ ముందనుకున్న కోరిక గొంతు నోక్కబడింది.
'వేరే ఉండటాని కిష్టపడితే....'
అనంతయ్య కుమార్తె కేసి ఆశ్చర్యంగా చూశాడు.
'అట్లా అనకు, సరస్వతీ! ఇంట్లో కాలు మోపక ముందే మనుష్యుల్ని చీలదీయడం మంచిది కాదు. సూర్యనారాయణ ని భర్తగా ఒప్పుకుని, సుబ్బరామయ్య గారిని మామగారుగా ఒప్పుకోలేవూ?'
'పేర్లెందుకు? ప్రేమ నంగీకరిస్తాము...కుచ్చితాన్ని తిరస్కరిస్తాము...'
'కుచ్చితమే కానీ, దాన్ని మంచితనంతో మార్చు కోవాలి.'
'అంత బరువు నేను మోయలేను.'
'ఇది కేవలం స్వార్ధం?'
'అసలు పెళ్లి చేసుకోవటమే స్వార్ధం.'
ఏమైంది సరస్వతి కి? ఎందు కిట్లా మాట్లాడుతుంది? ఈ పెళ్లి జరగవలసి లేదేమో ననుకుంటున్నా డనంతయ్య. తానెందు కిట్లా మాట్లాడుతుంది? ఏమవుతుంది? తండ్రి తననే అనకపోతే ఇంత వరకు మాట్లాడేది కాదేమో? అనుకుంటుంది సరస్వతి.
'సరే! సరస్వతి ఇష్ట ప్రకారమే చేస్తాను.'
సరస్వతి బైటి కెళ్ళి పోయింది.
'పెద్దవాడుగా నా కంత నచ్చలేదు. ఇందువల్ల.....'
'ఫరవాలేదు. ఈ ఏడాది కో , ముందుకో మా రాధాకిష్టకు పెళ్లయితే ఎట్లాగు వేరయ్యే వాళ్ళమే! ఇందులో ఏమంత ప్రమాదముంది?'
వాసవి చేయందుకున్నాడు. వాసవి ఎంతో ప్రేమతో ఆ చేయి నొక్కి, గుమ్మం దాకా రాబోయి, అక్కడ సరస్వతి ని చూసి , నవ్వుకుంటూ అక్కడి నుంచే వీడ్కోలు ఇచ్చాడు.
'పక్కకు తొలుగు!'
'తొలగ లేను....'
'తోలగాలను కున్నావుగా...'
ఆ ప్రయత్నంగా సరస్వతి చేయందుకుంది! ఆ చేయి వెచ్చగా, వణుకుతూ , ఆలంబనాన్ని దొరికించుకున్నట్లు బిగుసుకుంది.!
'నీ కా పాట వచ్చినా?'
"ఏ పాట?'
"అదే! వేరుపడితే మేలురా మగడా?...'
సరస్వతి కిలకిలా నవ్వింది.
'ఒక్క చరణం విన్నావు! మిగతా పాట....తర్వాత...'
