Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 14


    'వెంటనే అమ్మానాన్నా ఒప్పుకోకపోవచ్చు. ఏమైనా అన్నయ్యద్వారానే నా ముద్దు చెల్లుతుంది. ఎలాగూ ఆస్తి పంచిఇచ్చి నన్ను ఇక్కడే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు అన్నయ్య. నీ బీదరికం సమస్య ఏమీరాదు. ఒక కళాకారుడు, కీర్తి శాలి తన చెల్లెలికి భర్తగా లభించడం మహాభాగ్యమనుకొంటాడు అన్నయ్య, నాకు ఒక కళాసంపన్నులు భర్తగా లభించడం నా జీవితాని కొక వరంగా భావిస్తున్నాను.'
    'కళాసంపద!' పిచ్చిగా నవ్వాడు కిషన్. 'అది ఉన్న దేదో రాత్రే కొల్లగొట్టబడింది. నా ఇన్నాళ్ళ సాధనా, తపస్సూ రాత్రితో భ్రష్టములయ్యాయి. క్షణికావేశానికి లోబడి ఇన్నాళ్ళుగా ఆర్జించిన సంపద నంతటినీ తృటికాలంలో కోల్పోయిన బికారిని. నేను ఒక సామాన్య వ్యక్తిని." అతడి కంఠం వణికింది, నేత్రాలు బాష్పపూరితము లయ్యాయి.
    శిఖరాగ్రంనుండి కిందికి తొయ్యబడినట్లుగా, ఉత్కృష్టజీవితంనుండి హీనజీవితంలోకి అడుగుపెట్టినట్లుగా పరితపిస్తూన్న ఆ దీనమానవుణ్ణి చూచి నా హృదయం కదిలిపోయింది. 'ఊరికి వెలుపల కుటీరం నిర్మించుకొని నిర్మలంగా జీవిస్తూన్న కళా తపస్వి జీవితంలో మోహినీగ్రహంలా ప్రవేశించి అతడిని తపోభ్రష్టున్ని కావించాను. అతని కళారాధన భగ్నపరిచాను. కళారాధకుడుగా అతడు చేసే ఆరాధన, సౌందర్యపీఠాన్ని అధిష్ఠించిన దేవతగా అందుకొనడంలో ఉండే ఔన్నత్యం, ఉత్కృష్ట శాంతి సౌఖ్యాలు, అతడు సంసారిగా నేనతని సహధర్మచారిణిగా పొందగలనా? అతనిని ఉన్నత శిఖరంనుండి దిగజార్చి నా స్థానమూ హీనపర్చుకొన్నాను చేజేతులా' అని బాధ పడ్డాను.
    'పాపిని, బావా! నిన్నీస్థితికి ఈడ్చింది నేనేకదా?' అన్నాను సజలనేత్రినయి.
    'గతజల సేతుబంధనంతో ప్రయోజనమేమిటి?' నిర్వేదభావంతో అన్నాడు. 'ఇక ఆ పెళ్ళి సంగతేమో నువ్వే చూచుకో. త్వరగా తేలిపోతే మంచిది'. నిర్లిప్తంగా చెప్పాడు.
    అన్నయ్య వచ్చాడు, నన్ను తీసుకుపోవడానికి. 'రూప రాత్రి ఇక్కడ చిక్కుబడి పోయిందా? వద్దామని చూశాను. నన్ను గేటుకూడా దాటనివ్వలేదు గాలివాన. ఉరుములు మెరుపులు చూసి గేటు దాకా వచ్చినవాణ్ణి, వెనుదిరిగాను, రూపకుకూడా హడలే ఉరుములంటే. తలుపులు బిగించుకొని చెవిలో వేళ్ళు దూర్చి కూర్చొనేది! మరి ఎలా ఉందో ఈ అడవిలో!'
    అన్నయ్య మామూలు ధోరణిలో చెప్పుకుపోతున్నా నాకేదో దిగులుగా, భయంగా ఉంది. ఎంత విశ్వాసం! వయస్సు వచ్చిన తన చెల్లెలు పరాయి మగాడితో ఒక రాత్రి గడిపిందంటే ఏమాత్రం సందేహించని మనిషిని నే నేమనుకోవాలి? ఎంత గొప్ప హృదయం!
    'రూప రెండురోజులు నీ శిష్యరికానికి రాదోయ్. మా చిన్నమ్మ కూతురి వివాహం. నేనూ, రూపా వెడుతున్నాం. మధ్యాహ్నమే ప్రయాణం' అని నవ్వుతూ నాకేసి తిరిగాడు. 'మీ గురువుగారి దగ్గిర సెలవు తీసుకో, రూపా!'
    దిగులుగా చూశాను కిషన్ కేసి. శుష్కవదనంతో వీడ్కోలిచ్చాడు కిషన్.
    సీత పెళ్ళికి నేనూ, అన్నయ్యా వెళ్ళాం. పెళ్ళి వైభవంగా జరుగుతున్నది. సీత తమ్ముడు పెళ్ళి కొడుకుతో సరసాలాడుతూ పెళ్ళి పందిరినిండా నవ్వుల పువ్వులు నింపేస్తున్నాడు.
    చూస్తూన్న అన్నయ్య మెల్లిగా నాభుజం మీద చెయ్యి వేశాడు, 'అలా బావగారితో పరాచికాలాడి మురిసి పోగల అదృష్టం ఎప్పుడు కలిగిస్తుందో నా బంగారు చెల్లి' అంటూ.
    'అన్నయ్యకు నామీద ఎంతటి ప్రేమాధిక్యం! అలాంటి అన్నయ్య నా కోరిక తీర్చడా? తప్పకుండా నా కోరిక చెల్లిస్తాడు. నా అన్నయ్య ఎంత మంచివాడు!' నాలోని ప్రేమానందాలు పొంగి కన్నీటి రూపాన వెలువడ్డాయి.
    ఆశగా నాకేసి చూస్తూన్న అన్నయ్యతో, 'ఆ అదృష్టం నీ చేతిలోనే ఉందన్నయ్యా' అని చెప్పి, వరుడెవరో చప్పున చెప్పకుండా ఊరించి ఊరించి అన్నయ్యను ఆశ్చర్యానందాలలో ఉక్కిరి బిక్కిరి చెయ్యాలనిపించింది. కాని అంతమంది పెళ్ళివారి ముందు ఎలా చెప్పగలను?
    పెళ్ళి పీటలమీద పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ పరస్పరం క్రీగంట వీక్షించుకొంటూ చిరునవ్వులు విసురుకొంటూంటే తమాషాగా చూస్తూన్న నేను అలా పెళ్ళిపీటలమీద కిషన్ పక్కన నన్ను ఊహించుకొంటూ ఆనందసీమల్లో విహరించాను. భవిష్యత్తు ఊహల్లో సుందరంగా దర్శించడంలో ఎంత హాయి! ఎంత మాధుర్యం!
    వచ్చి మూడురోజులు అయింది. సాయంకాలం మా ప్రయాణం నిశ్చయించుకొన్నాం.
    ఎక్కడినుండో ట్రాన్సిస్టర్ సంపాదించుకువచ్చాడు అన్నయ్య. ప్రతినిత్యం ఉదయం కాఫీతో రేడియోవార్తలు కలిపి సేవించడం అలవాటు అన్నయ్యకు, వార్తలు విననినాటి కాఫీ చప్పగా ఉంటుందట అతడికి. రెండు రోజులుగా వార్తలు వినడం పడలేదేమో రేడియో ట్యూన్ చేసి ఏకాగ్రచిత్తంతో వింటున్నాడు. అన్నయ్యకు కాఫీ అందించి, కొంచెం కొంచెంగా కాఫీ సేవిస్తూ దగ్గరగా కుర్చీ జరుపుకొని వింటూ కూర్చున్నాను.
    'ప్రసిద్ధ యువ చిత్రకారుడు శ్రీ కిషన్ పాముకాటుతో దుర్మరణం చెందారని తెలుపడానికి చింతిస్తున్నాం. ఆయన నిద్రపట్టని కారణంగా అర్ధరాత్రివేళ తమ తోటలో తిరుగుతూండగా ఈ దుస్సంఘటన సంభవించింది. సకాలంలో చికిత్స అందక శ్రీ కిషన్ మరణించారు.'
    అన్నయ్య కొయ్యబారిపోయాడు. తాగుతూన్న కాఫీ కప్పు అలా చేతిలో ఉండిపోయింది. నా చేతిలోని కప్పు కిందపడి బద్దలైపోయింది. వేడి కాఫీ పాదాలమీద ఒలికి చురుక్కుమంది.
    'శ్రీ కిషన్.....'
    ప్రసారమైన తరవాత మాటలు నేను వినలేదు. 'కిషన్ బావా!' గావు కేక వేసి ఒరిగిపోయాను. కళ్ళు తెరిచి చూచేప్పటికి మంచంమీద చేర్చబడి ఉన్నాను. అన్నయ్య నా శిరస్సు ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు, ఆత్రంగా నా ముఖంలోకి చూస్తూ.
    నా ముఖంమీద తడి ఇంకా ఆరలేదు.
    పెళ్ళివారంతా నా చుట్టూ గుమిగూడి ఉన్నారు, 'తెలివి వచ్చిందా, తెలివి వచ్చిందా?' అంటూ.
    'చెల్లాయ్, ఏమైందమ్మా?' అన్నయ్య కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.
    '............................' నీరసంగా కళ్ళు మూసుకొన్నాను.
    'మూర్చ ఎందుకు వచ్చింది? ఆమెకు ఫిట్సు వస్తూంటాయా?'
    'రేడియోలో వార్తలు వింటూ పడిపోయిందిట!'
    'ప్రసిద్ధ చిత్రకారుడు కిషన్ చనిపోయాడని చెప్పారు. అతడేమైనా పరిచయం కాబోలు!'
    'కిషన్ బావ అంటూ మూర్చపోయింది; అతడు దగ్గిర బంధువేమో!'
    పెళ్ళివారి రకరకాల వ్యాఖ్యానాలకూ, సందేహాలకూ, ప్రశ్నలకూ అన్నయ్య ఇబ్బంది పడుతున్నట్లు అతడి నుండి నిట్టూర్పులు వెలువడుతున్నాయి.
    ఆ మధ్యాహ్నమే బయలుదేరి మా ఊరు చేరుకొన్నాము.
    ఎటువంటి సంకట పరిస్థితిలో బంధింపబడ్డాను నేను! ఎవరితో చెప్పుకోను, నా బాధ? విధి వికటహాసానికి విచ్చిన్నమైన నా ప్రణయగాథ ఎవరికి వివరించను? నా దుఃఖానికి లోకుల నుండి సానుభూతి పొందగల అర్హత అయినా నాకు లేదే? దైవం ఎంత నిర్దయుడయ్యాడు, నాపట్ల! తలుపులు బిగించుకొని గదిలో నిశ్శబ్దంగా రోదించాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS