పనిని బట్టి ఫేస్ మార్చడు ఆర్షా. అందువల్లనే అతని అంత రంగంలో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఏల చేస్తాడో తెలియదు.
కురైపతి నిదానంగా చెప్పటం మొదలుపెట్టాడు.
".... ..... ..... ....ఆ విధంగా మీరానాడు ఆ విషయం వివరిస్తూ మీరా పని పూర్తి సక్సెస్ గా చేసుకురావాలి. టైము నెల మాత్రమే ఇస్తున్నాను ఏ కాస్త బయటపడ్డా మీ బొందిలో ప్రాణాలు సరాసరి కైలాసానికి ఎగిరెళతాయి, అవకతవక జరిగితే ఎంత మాత్రం ఊరుకోను, అంటూ హెచ్చరించి విషయం చెప్పారు చెప్పి ఈ పనిని మీరెలా చేయకలుగుతారు అని ప్రశ్నించారు అప్పుడు.....
"ఊ.....అప్పుడేమైంది! ఆపకుండా చెప్పు" ఆర్ష గద్దిస్తూ అన్నాడు.
"నేను నాకు తోచిన పధకం చెప్పాను, లంబా తనకి తోచిన ప్లాను వివరించాడు, అప్పుడు నేను లంబాని హేళన చేశాను ఎత్తి పొడిచాను, లంబాకూడా వూరుకోలేదు నా ప్లాన్ కి తిరుగులేదు అంటూ వాదనకి దిగాడు ఇరువురం రెచ్చిపోయి వాదించుకుంటూ నీ పధకంలో లొసుగుందని వకరకం నీప్లాను బెడిసికొడుతుందని వేరొకరకం తీవ్రంగానే అనుకుంటూ ఈ పని నా కప్పగించమంటే నా కప్పగించమని మిమ్మల్ని అడిగాము.....
కురైపతి మాట్లాడుతుంటే మాటల మధ్యలో అడ్డుతగిలి "నేనీ పని లంబాకే అప్పగిస్తానన్నాను అవునా!" ఆర్ష అడిగాడు.
"ఎస్"
"అప్పుడు నీ ముఖంలో కదలాడే భావాలు చూసి నీ అంతరంగం పసిగట్టాను. ఫస్టు నీకే ఛాన్స్ యిచ్చి చూద్దామనుకున్నాను. పనిని నీకే అప్పగించాను, కార్యం సాధించుకురమ్మని పంపించాను, కానీ నీవు నే అప్పగించిన పనిని అణుమాత్రమైనా సాధించుకురాలేకపోగా అక్కడంతా ఓ పెద్ద సీను సృష్టించుకొచ్చావు. నీ పథకం తగలడటమేగాక చీమదూర సందులేకుండా తయారయింది. అక్కడంతా అవునా!"
"ఎస్ బాస్, కాని ఈ తఫా.....
ఆర్ష్ చేయిచాచి 'బస్' అనటంతో కురైపతి నోరు టప్పున మూసుకుపోయింది.
"లంబాకులపతీ!" ఆర్ష్ పిలవటంతో అక్కడ కూర్చున్న వకతను లేచి ముందుకొచ్చి "ఎస్ బాస్" అన్నాడు వినయంగా ఓసారి తలవంచి మళ్ళీ పైకి ఎత్తుతూ.
"కురైపతి ప్రతాపం విన్నావుకదా? అదలావుంచు నీవేమేమి విశేషాలు సేకరించుకువచ్చావో వివరించు" అన్నాడు ఆర్ష్.
"ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అతితెలివితేటలవల్ల మొదటిసారిగా కురైపతి గుడిలో తవ్వినదాని విషయం సీరియస్ గా తీసుకోలేదు. ఇదేదో లల్లాయిగాళ్ళ పని అంటూ రిపోర్టు తయారుచేసి ఊరుకున్నాడు. రెండో సారి కురైపతి గుడివెనుకవేపు తవ్వాడు. దాంతో పై అధికారులలో కాస్త చలనంవచ్చింది. ఆలయం విషయంలో మరికొన్నిజాగ్రత్తలు తీసుకోటం జరిగింది. రెండుసార్లు ఫ్లాను ఫెయిల్ కావటంతో నాలుగురోజులు ఆగాల్సింది పోయి.....
"లంబా! నాన్చేపనిలేదు. నీవు ఏం చెప్పదల్చుకున్నావో చెప్పు"
"అలాగే బాస్! వకటికి రెండుసార్లు ప్లాను ఫెయిల్ అయినప్పుడు కొన్నాళ్ళపాటు మనం ఆగాలి! మరోసారి తొందరపడితే మొదటికే మోసంవస్తుంది. ఇప్పుడు అక్కడ అదే జరిగింది."
"అదికూడా వివరించు"
"మీరేదైనా మాట అంటారేమోనని ఈ తఫా పూర్తిగా సక్సెస్ కావాలని కురైపతి తొందరపడ్డాడు. ఏకంగా పదిమందిని తీసుకువెళ్ళి గుడి చుట్టూరా తవ్వించాడు, దాంతో ఫలితం సున్నాగాను, ప్రయత్నం విఫలం గాను కావటమేగాక నలుగురునోళ్ళలోను నానటం జరిగింది.
అది ఎలా అంటే....
ఇప్పుడు అక్కడ.....అందరిని బొట్టు కాటుక పెట్టి పిలిచినట్టయింది. భక్తులు పెరిగారు, షాపులు పెరిగాయి. వార్త పేపర్లకి ఎక్కింది. టి.వి, వాళ్ళు ఇంకా పుణ్యంకట్టుకోలేదుగాని ఆకాశవాణి వార్తలు అవకాశం చేజిక్కించుకుని వార్తలలో వకటికి పదిసార్లు చెప్పారు! విలేకరులు వార్తలు సేకరించుకువెళుతుంటే రైటర్స్ వూహాగానాలుచేస్తూ కధలు అల్లి వారపత్రికల్లోకి ఎక్కిస్తున్నారు.
ఏ సినిమా షూటింగుకి రానిజనం ఇప్పుడు పరమేశ్వరీ దేవాలయం సందర్శించటానికి దూరతీరాలనుంచికూడా అసిరిపల్లె వస్తున్నారు, దాంతో హోటళ్ళు, ఉండటానికి రూమ్స్ అన్నీ శరవేగంగా కట్టబడుతున్నాయి చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు సాధించింది ఏమీలేకపోగా అంతా తవ్వటంవల్లను.....ఈ హడావిడివల్లను.....పై అధికార్లు ఈ తఫా చాలా గట్టినిర్ణయాలు తీసుకుంటున్నారని, రహస్య ఏర్పాట్లు చేస్తున్నారని చూచాయగా తెలిసింది. ఈ పరిస్థితులలో మరోసారి ప్రయత్నించడం అన్నది తెలిసి తెలిసి కొరివితో తలగోక్కోవడంలాంటిది. కనుక ప్రస్తుత పరిస్థితులలో మనం ఆలయంజోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది" అంటూ లంబా ముగించాడు.
లంబా చెప్పిందివిని "ఇంపాజిబుల్" అన్నాడు ఆర్ష్.
"అందుకనే ఇంకోసారి చాలా పెద్దప్లానుతో నేను ప్రయత్నించి సక్సెస్ కావటమో లేక చావటమో చేస్తాను" అవకాశం వచ్చిందికదా అని కురైపతి వెంటనే అన్నాడు.
