తాళాలు వేసుకొని కిందకి దిగిపోయాం.
నేను ముందే చెప్పానుగా - నాకు కొంచెం దేవుడి పిచ్చి ఎక్కువని.....'శుక్లాంబరధరం" శ్లోకం చదువుకుంటూ కారులో కూర్చున్నాను.
ముందు సీటులో కూర్చున్న శ్రీశ్రీగారు వెనక్కి తిరిగి నా ముఖంవైపు అదోలా చూశారు. ఎందుకలా చూశారో నాకర్ధం కాలేదు. దాని గురించి నేనంతగా పట్టించుకోలేదు కూడా!
దగ్గర దగ్గర ఇరవై నిమిషాల ప్రయాణంతో మహాత్మా స్టూడియోలో వున్న ఆఫీసుకి వెళ్ళాం. శంకర్ సింగ్ గారు ఎంతో ఆప్యాయంగా శ్రీశ్రీ గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆలింగనం చేసుకున్నారు.
"షి ఈజ్ మై అసిస్టెంట్" - అని శ్రీశ్రీగారు అతనికి నన్ను పరిచయం చేశారు.
"ఈవిడ మా అమ్మగారు" అని సింగ్ గారికి అమ్మని పరిచయం చేశాను.
కాఫీలు, టిఫిన్లు తెప్పించారు.
"మేం తినేసి వచ్చాం. ఇక మావల్ల కాద"ని నేనూ, అమ్మా కాఫీలు మాత్రమే తాగాం. శ్రీశ్రీగారు మాత్రం మళ్ళీ టిఫిన్ చేసి కాఫీ తాగారు.
ఈ ఫార్మాల్టీలయ్యేసైర్కి పదిగంటలయ్యింది.
"ఎల్లుండి రికార్డింగ్ పెట్టాను శ్రీశ్రీగారూ! 16 పాటలున్నాయి. అన్ని పాటలూ ఒకేసారి రాసెయ్యాలి. మొత్తం పాటలన్నిటికీ ప్రేక్స్ వున్నాయి. పాటలు రడీ అయితే మూడురోజుల్లో రికార్డింగ్ పూర్తి చెయ్యొచ్చ'ని శంకర్ సింగ్ అన్నారు.
"అంటే - ఆరు రోజులు మనం మైసూరులో వుండాలన్నమాట' నాలో నేనే అనుకున్నా.
"స్క్రిప్ట్, పాటలు ఇచ్చెయ్యండి. ఒరిజినల్ సాంగ్స్ ట్యూన్ వుంటే మా కింకా ఈజీగా వుంటుంద"ని శ్రీశ్రీ గారన్నారు.
మాకొక రూము, స్క్రిప్ట్, టేప్ రికార్డర్ ఇచ్చేశారు.
శ్రీశ్రీగారు "ముందు పాటలు చూద్దాం" అన్నారు.
"మీ యిష్టం" అన్నాను.
శంకర్ సింగ్ గారొచ్చి శ్రీశ్రీగారితో, "మీరు రోజూ ఆఫీసులోనే స్క్రిప్ట్ వర్క్ చేసుకోండి. ఉదయం ఎనిమిది గంటలకొస్తే రాత్రి తొమ్మిది గంటలకి పంపించేస్తాను" అన్నారు.
మాకు కన్నడం అసిస్టెంట్ నిచ్చారు. నాకు కన్నడం రాదు.
"మీరు పాటలు రాయండి. నేను ఈయన సాయంతో కన్నడ మాటల్ని తెలుగులోకి అర్ధంతో సహా రాసేస్తాను. మూడురోజుల్లో రెండు పనులు అయిపోతాయి" అన్నాను.
"అయిడియా బాగానే వుంది కానీ, నేను పిలిచినప్పుడు పలకాలి" అన్నారు.
"ఇక్కడే నేనూ కూర్చుని రాస్తానండి"
మొదట కన్నడం పాటలన్నీ అతను చెప్తూ వుంటే అర్ధంతోపాటు రాసి శ్రీశ్రీగారి కిచ్చేశాను.
పనిలో మంచి హుషారొచ్చింది.
శ్రీశ్రీగారు పాటలు రాయడంలో నిమగ్నులైపోయారు. నేను చకచక స్క్రిప్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మధ్యలో శ్రీశ్రీగారిని గమనిస్తూనే వున్నాను.
అట్టే అవస్థ లేకుండా పని వేగం పుంజుకుంది.
మూడురోజుల్లో కన్నడం మాటలన్నీ అర్ధాలతోసహా తెలుగులోకి రాసెయ్యొచ్చనుకున్నాను.
"ఎలా రాస్తున్నావు?" అని శ్రీశ్రీగారడిగారు.
చూపించాను.
"గుడ్ కానీ ఇంకో పద్దతి కూడా వుంది. తెలుగులో డైలాగ్స్ రాసేటప్పుడు చెప్తాలే. కన్నడం స్క్రిప్ట్ ముందు తెలుగులోకి రానీ" అన్నారు. అసిస్టెంట్ ఎంత స్పీడ్ గా చెప్తున్నాడో, అంత స్పీడ్ గా నేనూ రాస్తున్నాను.
"స్క్రిప్ట్ కి ఏమీ తొందరలేదు. పాటలు అయిపోతున్నాయి. పల్లవులు వేసేస్తే పాటలు అయిపోయినట్టే. నువ్వు కొంచెం కోపరేట్ చేస్తే ఈ రోజే పూర్తి చేస్తాను" అన్నారు.
నాకు ఆశ్చర్యం వేసింది.
"నా కోపరేషనా? ఏం చెయ్యాలి?".
"ఏమీ లేదు. నాకు సందేహం వున్న చోట పాడమంటాను. కరెక్టుగా వుందో లేదో పాడి చెప్పాలి"
టేప్ రికార్డర్ దగ్గరగా పెట్టుకున్నాను.
పాటలన్నీ ముందుగానే విన్నాను.
"బైజూ బావరా" హిందీ పిక్చర్ పాటల బాణీలో అన్ని పాటలూ చేశారు. నాకా పాటల ట్యూనులన్నీ బాగా తెలుసు. పాడమన్న చోట టేప్ రికార్డర్ వేసుకుని, దాంతోపాటు సమానంగా వారు రాసిన తెలుగు పాటని పాడుతున్నాను. ఒక్కోసారి ఆఫ్ చేసి నేనే పాడుతున్నాను.
"ఇప్పుడు పాడింది నువ్వా? రికార్డా?" అని అడిగారు.
"నేనే" అన్నాను.
కళ్ళు మూసుకుని, "ఈ లైను పాడు, ఆ లైను పాడు" - అనేవారు.
పాటకి పల్లవి, అనుపల్లవి, ఒక చరణం కాదు. ఆ పదహారు పాటల్లో ఒక్కో పాటకి నాలుగూ అయిదూ చరణాలున్నాయి. తలనొప్పి! అయినా హిందీ ట్యూన్ కాబట్టి కాస్త హాయనిపించింది.
మధ్యాహ్నం భోజనాలయ్యాయి. మళ్ళీ కూర్చున్నాం.
"టేప్ రికార్డర్ వద్దు. నువ్వెపాడు" - అన్నారు. సిగరెట్ వెలిగించారు. కళ్ళు మూసుకున్నారు. ఆ ఆలోచన తీవ్రత చూసి, నేను స్టన్ అయిపోయాను.
కాగితాలు తీసుకో నేను చెప్పింది రాస్తూ వుండు" అన్నారు.
రాసుకుంటూ వెళుతున్నాను.
రాత్రి ఎనిమిది గంటలైంది.
ఆఖరి పాటలో ఆఖరి చరణం బాకీ పెట్టారు.
ఎంత హుషారుగా వున్నారంటే చెప్పటానికి లేదు. మళ్ళీ కాఫీ తాగారు. సిగరెట్ వెలిగించారు.
"ఈ ఒక్క చరణం కూడా రాసేసి పాట పూర్తి చెయ్యనా?".
"లేకుంటే ఎలా?".
"అయితే ఓ కండిషన్?"
"ఏమిటండీ?"
"ఉదయం ఏమిటన్నావు. ఈ రాత్రి నన్ను డ్రింక్ తాగొద్దని అన్నావుగా?" ముఖం దించేసుకున్నాను.
"చెప్పు.....అన్నావా లేదా! ఇప్పుడు తాగడానికి పర్మిషన్ ఇస్తానంటే పది నిముషాల్లో చరణం పూర్తి చేసేస్తాను" అన్నారు.
నాకు ఎంత సరదా వేసిందో చెప్పలేను.
రెండు రోజుల క్రితం నా స్థితి ఎలా వుండేది! 'నేను ఫలానా' అని పదే పదే చెప్పుకోవలసిన పరిస్థితి.... కళ్ళ ముందు రీల్లా తిరిగింది.
'శ్రీశ్రీగారి దృష్టిలో బాగానే పడ్డానన్న మాట' అనుకున్నాను.
"మాట్లాడవేమిటీ".
"సర్లెండి. నేనొద్దంటే మానేస్తారేమిటి? మీరా చరణం రాస్తే పాటలన్నీ పూర్తయి పోతాయి! రాయండి" - అన్నాను.
ఆనందంతో గంతులు వేస్తున్న నా మనస్సు ఆలోచన్లతో నిండిపోయింది. శ్రీశ్రీగారిలో మార్పులు గమనిస్తున్నాను. ఇవి తాత్కాలికమో, స్థిరమో కానీ తెగించి నిలబడితే మాత్రం శ్రీశ్రీగారిని బాగుచెయ్యచ్చనే ఆశారేఖ కళ్ళముందు మెదిలింది.
'చూద్దాం ఏదీ, శ్రీశ్రీగారి దగ్గరికి పనికొచ్చి నలభై గంటలైనా కాలేదు' - అనుకున్నాను.
"ఏమిటాలోచిస్తున్నావు?".
"ఏం లేదండీ".
"సరే! చరణం అయిపోయింది రాసుకో".
ఆశ్చర్యపోయాను.
ఎంత హార్ట్ వర్కర్! ఉదయం పదిగంటల నుండి రాత్రి తొమ్మిది గంటలయ్యేసరికి మొత్తం 16 పాటలు పూర్తి చేసేశారు.
ఛాలెంజ్ చెయ్యొచ్చు. ఇది ఎవ్వరివల్లా కాదు.
నేను మొండినంటే ఆయన జగమొండి లాగున్నారు. నా పట్టుదలే గొప్పదనుకున్నాను. కానీ శ్రీశ్రీగారితో సాలడం కష్టమే - అనిపించింది.
పాటలన్నీ పూర్తయిపోయాయి.
"పద. ఒకసారలా బైట గాలి పీల్చుకొని వద్దాం" అన్నారు.
చీకటయినా లైట్ల వెలుగు బాగా వుంది. అందరం మళ్ళీ కాఫీలు తాగి ఓ పావుగంట కూర్చున్నాం.
"ఫైనల్ గా ట్యూన్ తో పాటలు చెక్ వేద్దామా" అన్నారు. కూర్చున్నాం.
"టేప్ రికార్డర్ వద్దు. నీకు ట్యూన్లు వచ్చినంతవరకూ నేను రాసిన పాటలు పాడు" - అన్నారు.
పది పాటలు దాకా పాడాను. మిగిలిన పాటలు ఒరిజినల్ ట్యూన్ తో సరిగ్గా పాడాను.
కార్బన్ లా దింపేసారు. ఒక్క అక్షరం కూడా తేడా లేదు.
"పాటలు ఎలాగున్నాయి?".
"చాలా బాగున్నాయి".
