Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 14


    చిన్నప్పుడే నా చేత దాసుగారి యదార్ధ రామాయణం అంతా కంఠోపాఠం చేయించారు. భాషబాగా రావటానికి వాల్మీకి రామాయణం వచనకావ్యం, మహాభారతం వచనకావ్యం, పానుగంటివారి 'సాక్షి' వాల్యూమ్స్, జ్ఞానవాసిష్టం, భగవద్గీత, హరికథామృతలహరి, కాళిదాసు, శ్రీనాథ మొదలైన గ్రంథాలతో పాటూ భాగవతం కూడా అంతంత మాత్రంగా చదివించడంవల్లనే తెలుగుభాషలో విద్వాంసురాల్ని కాకున్నా ఓ విధంగా చదవడం, కొన్ని వాక్యాలని అర్ధంచేసుకోవడం వరకూ శక్తిని సంపాదించగలిగాను.
    ఏదైనా చదువుతున్నప్పుడు మాత్రం భావంతో, భలే ఆవేశంగా చదువుతాను. అభినయ నృత్యాలతో, నవరసభరితంగా హరికథలు చెప్పడంకూడా అందుకు కారణమని చెప్పక తప్పదు.
    ఇక కథలోకి వద్దాం.
    టిఫిన్లు చేశాక మేం కాఫీ తాగాం. శ్రీశ్రీగారు రెండవ సీసా ఓపెన్ చేశారు.
    అరగంట విశ్రాంతి ఇచ్చి మళ్ళీ చదవడానికి కూర్చోపెట్టారు. ఏంచదివానో నాకు జ్ఞాపకం లేదు. మీరు అడిగినా నేను ఇప్పుడు చెప్పలేను. కానీ నేను చదివినవాటిలో మహాప్రస్థానం వుందని మాత్రం చెప్పగలను. పేపర్ కటింగులు కూడా చదివాను.
    ఇలా ఎంతసేపు కూర్చున్నానో టైం తెలీలేదు.
    "ఫోన్ వచ్చింద"ని బాయ్ వచ్చి చెప్పాడు.
    "కింద ఫోన్ వుంది. వెళ్ళిరా" -అన్నారు శ్రీశ్రీగారు.
    మహాత్మా పిక్చర్స్ నుండి ప్రొడ్యూసర్ శంకర్ సింగ్ మాట్లాడుతున్నారు. మీరెవరు?" అని అడిగారు.
    "నేను శ్రీశ్రీగారి అసిస్టెంట్ నండీ" అన్నాను.
    "సరేనమ్మా! నేను శంకర్ సింగ్ ని - శ్రీశ్రీగారితో చెప్పండి. రేపు ఉదయం తొమ్మిది గంటలకి కారు పంపుతాను. సిద్దంగా వుండమనండి"
    "అలాగే సార్ నమస్కారం" అన్నాను.
    ఆయన చెప్పిన మాటలు అలాగే శ్రీశ్రీగారి దగ్గర అప్పగించేశాను.
    "వెరీగుడ్.....చదువు" - అన్నారు.
    ఓపిక చచ్చిపోయింది. విసుగెక్కువైపోతోంది.
    'చచ్చాన్రా' - అనుకున్నాను.
    "టైం ఎంతయ్యిందో" అన్నాను.
    "టేబుల్ మీద వాచీ పెట్టాను. చూసిరా" అన్నారు.
    ఇదే సందని లేచాను.
    పదిగంటలు కావస్తోంది బోయ్ భోజనం తెచ్చాడు.
    రెండో బాటిల్ కూడా సగం ఖాళీ అయ్యింది.
    "ఈ రోజుకింతే కోటా! ఇక తాగను. తీసుకెళ్ళి అలమరలో దాచేయ్. రేపు పనంతా అయిపోయిన తర్వాత రూముకొచ్చి రాత్రి తీసుకుంటాను" అన్నారు.
    అంత తాగినా, చక్కగా మామూలుగానే మాట్లాడినందుకు ఆనందంతో పాటూ ఆశ్చర్యంకూడా వేసింది.
    తాగితే మామూలుగానే వుంటారన్నమాట!
    ఇంతలో సడన్ గా లైట్ వెలిగింది.
    శ్రీశ్రీగారు లేచారు.
    నిద్రపోతున్న దానిలా కళ్ళుమూసుకున్నాను.
    ఆయన బాత్రూంకి వెళ్ళారు.
    పక్కకి ఒత్తిగిల్లాను. అన్నీ గమనిస్తున్నాను.
    బైటకొచ్చి బాత్రూం తలుపు గడియపెట్టారు. టేబుల్ దగ్గరికి వెళ్ళారు. సిగరెట్ అంటిస్తారేమో అనుకున్నాను.
    కానీ వాచీ చూసి, మా మంచం దగ్గరకొచ్చి మమ్మల్ని ఓసారి చూశారు. వెళ్ళి పడుకున్నారు.
    కాళ్ళమీద పడి క్షమాపణ కోరుకోవాలన్నంత ఆవేశం కలిగింది.
    ఛ - అనవసరంగా లేనిపోని పాడు ఆలోచనలతో మనస్సు పాడుచేసుకున్నాను. ఆయనేం చేసిపోతారో అని భయపడి చచ్చాను. అపార్ధం చేసుకున్నాను.
    నన్ను భగవంతుడు కూడా క్షమించడేమో అనుకున్నాను.
    అమ్మ పక్కన నిశ్చింతగా నిద్రపోయాను.
    ఉదయం ఏడుగంటలకి కానీ తెలివిరాలేదు.
    నేను లేచేసరికి అమ్మ స్నానం చేసి సిద్దంగా వుంది.
    రాత్రి జరిగింది అమ్మతో చెప్పబోయాను.
    "సరేలేవే! నేను నిద్రపోయాననుకున్నావేమిటి' ఆయన లేవడం, లైటు వెయ్యడం అన్నీ గమనిస్తూనే వున్నాను. మళ్ళీ ఆయన తన మంచంమీద పడుకున్న తర్వాతే నేను నిద్రపోయాను. పాపం - ఆయనని తల్చుకుంటే జాలేసిందే సరోజా! తాగినవాడ్ని నమ్మి ఎవరు బాగుపడ్డారంటావు? ఏమేమో అనుకుని అనవసరంగా భయపడి చచ్చాను.
    మహానుభావుడు! ఆయన్ని అనుకుంటే మహాపాపం! తనక్కావల్సినంత తాగారు. తిని హాయిగా నిద్రపోయారు. ఏమైనా నోరెత్తారా? అల్లరి పెట్టారా? ఈయన గురించి గోరంతని కొండతలు చేస్తూ, లేనిపోనివి చెప్పి మనల్ని అందరూ హడల గొట్టేశారు. వాళ్ళు చెప్పిన దానికి ఈయన చేసిన దానికి సంబంధం లేదు. ఎవరికేమిటి హాని చేశారు?" అని మా అమ్మ చిన్న ఉపన్యాసం దంచింది.
    'అమ్మయ్య - బతికాన్రా' - అని ఒక్క నిట్టూర్పుతో, త్వరగా లేచి స్నానం చేసి రడీ అయిపోయాను.
    ఎనిమిది గంటలయ్యింది.
    శ్రీశ్రీగారిని లేపడం ప్రారంభించాను.
    నా పిలుపుకి 'ఉఁ, ఆఁ' అని రిప్లయి ఇస్తున్నారు కానీ లేవలేదు. ఎలాగైతేనేం ఎనిమిదిన్నరకి లేచారు.
    "నాదేమ్వుంది! నేను రడీ. పళ్ళు తోమేసుకుని బయలుదేరిపోవడమే" అన్నారు.
    "స్నానం చెయ్యరా?"
    "మధ్యాహ్నం వచ్చి చేస్తాను".
    "అబ్బబ్బే! డ్రింక్ కంపు.....అసహ్యంగా వున్నారు గడ్డం గీసుకుని, స్నానం చేసి మంచి బట్టలు వేసుకోండి" అన్నాను.
    "నా గడ్డం, బట్టలు కాదు వాళ్ళకి కావలసింది నా రాత" అన్నారు.
    రాత్రి సంఘటనతో నేను మెత్తబడ్డాననే చెప్పాలి.
    "అలా అనకండి. మనపక్కన ఎవరైనా కూర్చుంటే కంపుకొడితే ఎలా?" ఆయన శుభ్రం కోసం చొరవ చేసుకుంటే కానీ లాభం లేదని తెలుసుకున్నాను.
    "టైమయిపోయింది. మధ్యాహ్నం షేవ్ చేసుకుంటాలే" అన్నారు.
    "కాదండీ. ఈ మాసిపోయిన బట్టలతో మీరు రావడానికి ఒప్పుకోను."
    "టైమయిపోయింది. కారొచ్చేస్తుంది."
    "వస్తే వుంటుంది. మరేం ఫరవాలేదు"
    ఏమనుకున్నారో ఏమో, "అయితే నా పెట్టెలో చిన్న పెట్టె వుంది. తీసి టేబుల్ మీద పెట్టు" - అన్నారు.
    వెంటనే వెళ్ళి ఆ పెట్టె తీసి టేబుల్ మీద పెట్టాను.
    "ఈ గిన్నెతో వేడినీళ్ళు తెస్తావా?" అని అడిగారు.
    తెచ్చి ఇచ్చాను.
    గబగబా షేవ్ చేసుకుని, బాత్రూం కి వెళుతూ "టిఫిన్ కి చెప్పు తినేసి వెళదాం" అన్నారు.
    కారు వచ్చేసిందని చెప్పడానికి బాయ్ వచ్చాడు. మూడుప్లేట్లు ఇడ్లీ, వడ, కాఫీ తెమ్మని వాడితో చెప్పాను.
    శ్రీశ్రీగారు స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ సిద్దంగా వుంది.
    దువ్వెన అడిగారు. నీటుగా, దొరలా తయారయ్యారు.
    'వెనకాల పొడుస్తూ వుంటే చెప్పిన మాట వింటారు కాబోలు' అనుకున్నాను.
    "ఈ రోజు రాత్రి మీరు తాగటం మానేస్తే బాగుంటుంది. ఇలా అంటున్నందుకు క్షమించాలి" అన్నాను.
    "మనం వచ్చేసరికి ఆలస్యమవుతుంది. మీరూ వచ్చి టిఫిన్ చెయ్యండి" అని మా అమ్మతో అంటూ మాట మార్చేశారు.
    అమ్మ సంతోషానికి హద్దులేదు.
    ముగ్గురం టిఫిన్లు చేసేశాం.
    "తాళాలు వేసుకుని రండి. నేను కార్లో కూర్చుంటాను" అని శ్రీశ్రీగారు కిందికి దిగిపోయారు.
    
                            *    *    *

        


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS