'నువ్వు బాగానే పాడుతున్నావు. ఈ పిక్చర్ లో పాడరాదూ! శంకర్ సింగ్ తో చెప్పి సోలో ఇప్పిస్తాను" అన్నారు.
"అవకాశం దొరికితే తప్పకుండా పాడతాను" అన్నాను.
పది గంటలయ్యింది.
మేం ఆలస్యంగా వెళ్ళినా లాడ్జీలో మా భోజనాలు వుంచేస్తారు.
కన్నడం అసిస్టెంట్ తో, "ఉదయం త్వరగా వచ్చేస్తాం." "ఈ రోజుకి చాలని" వెళ్ళి కార్లో కూర్చున్నారు.
కాగితాలు, పాటలు, స్క్రిప్ట్ అన్నీ ఫైల్లో జాగ్రత్తగా పెట్టుకొని, అమ్మతో కలిసి కార్లో కూర్చున్నాను.
శ్రీశ్రీగారి పాటలే కూనిరాగాలు తీస్తున్నాను.
లాడ్జికి చేరుకున్నాం.
బాయ్ తో, "భోజనాలు రూముకి తెమ్మని" చెప్పారు.
నేను స్నానం చేసి బట్టలు మార్చుకున్నాను. (నాకిప్పటికీ రెండు పూటలా స్నానం చేసే అలవాటు లేకుంటే నిద్రరాదు.)
మిగిలిన అరబాటిల్ తో శ్రీశ్రీగారు కూర్చున్నారు.
పాటలు పూర్తయి పోయినందుకు మా యిద్దరికీ చాలా రిలీఫ్ గా వుంది.
శ్రీశ్రీగారయితే ఎంత తేలిక పడ్డారో!
నాకు చాలా జాలివేసింది.
"నా పనయిపోయింది. నీ పనే బాకీ వుందన్నారు"
"మీ పని కోసం నాపనంతా చెడగొట్టారు. లేకుంటే, నేను సగానికి పైగా పూర్తి చేసేదాన్ని"
"ఫరవాలేదు. రేపు రాయొచ్చు. భోజనాలు చేసి పడుకోండి".
"మీరో?" అన్నాను.
"మీరు ముందు తినేయండి. నేనీ బ్యాలెన్స్ లాగేసి భోంచేస్తాను" అన్నారు.
"నిజంగానేనా?" అని అడిగాను.
"నాకు అబద్దం ఆడడం చేతకాదు" అన్నారు.
మరుసటి రోజు స్టూడియోకి వెళ్ళి ఫ్రెష్ గా కూర్చొని మరోసారి పాటలన్నీ చెక్ చేసుకున్నాం.
శంకర్ సింగ్ గారింకా రాలేదు. కన్నడ అసిస్టెంట్ కూడా రాలేదు. టైం వుంది. ఫరావాలేదనుకున్నాను. కార్బన్ పెట్టి మూడు కాపీల చొప్పున 16 పాటలూ ఫెర్ చేశాను. ఇంతలో - శంకర్ సింగ్ గారు వచ్చారు. ఆయనని చూసి శ్రీశ్రీగారు "పాటలన్నీ రెడీ" - అన్నారు. అతని ఆశ్చర్యానికి అంతులేదు.
"నిజంగానేనా శ్రీశ్రీగారూ? 16 పాటలూ రాసేశారా?"
"అవునండీ, ఇవిగో నేను ఫెర్ కూడా చేసేశాను" - అని చూపించాను. అతని నోటమాట పెగల్లేదు.
వెంటనే శ్రీశ్రీగారు, "మాకు మూవియోలా కావాలి. పాటలు చెక్ చెయ్యాలి" అన్నారు.
"మరి స్క్రిప్ట్ మాట" - అన్నాను.
"ఎంతసేపు! గంటా రెండు గంటల్లో మూవియోలా పనయిపోతుంది. తర్వాత నువ్వు స్క్రిప్ట్ రాయి. నువ్వింతవరకూ రాసిన రీల్సుకి నేను డైలాగ్స్ రాస్తాను" అన్నారు.
ఇద్దరం మూవియోలా దగ్గర కూర్చున్నాం.
ఒక్కొక్కటీ 'అలాగా, ఇలాగా' అని చెప్పడం ప్రారంభించారు. పిక్చర్ చూస్తూ "రాసిన పాట లిప్ కి ఫాలో అవడం కష్టమే.' - అనుకున్నాను....మూవియోలా ఫాలో అవుతున్నంత సేపూ నా తల గిర్రున తిరిగింది.
గంటా రెండు గంటల్లో అయిపోతుందనుకున్న పని మధ్యాహ్నం ఒంటి గంట దాకా లాగేసింది.
డబ్బింగ్ కి సంబంధించిన విషయాలు చాలావరకు చెప్పారు. అన్నీ శ్రద్దగా నేర్చుకున్నాను.
పనిమీద బాగా ఆసక్తి పెరిగింది.
పాటల పని పూర్తిగా అయిపోయినట్లే. మధ్యాహ్నం భోజనాలకి లేచాం. పట్టుమని పదినిముషాలు కూడా విశ్రాంతి తీసుకోలేదు.
శ్రీశ్రీగారు డైలాగ్స్ రాయడానికి కూర్చున్నారు.
కన్నడం అసిస్టెంట్ సహాయంతో మిగిలిన స్క్రిప్ట్ రాయడానికి నేను కూర్చున్నాను.
సాయంకాలం శంకర్ సింగ్ వస్తూనే "శ్రీశ్రీగారూ! గుడ్ న్యూసండీ"
ఏమిటన్నట్టు తలెత్తి చూశారు శ్రీశ్రీగారు.
"సుందర్ లాల్ సహతా అర్జంటుగా రమ్మని వైరిచ్చారు. పిక్చర్ వచ్చిందట" అన్నారు.
స్క్రిప్ట్ రాస్తూ ఇవన్నీ గమనిస్తున్నాను.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాను. "సరోజా!" అని శ్రీశ్రీగారు పిలిచారు.
ఏమీ ఎరగనట్టు, "ఏమిటండీ" - అన్నాను.
"మనం వెంటనే మద్రాస్ వెళ్ళాలి."
"ఎందుకూ?"
నాకు దగ్గరగా వచ్చి, "మనకి మరో పిక్చర్ వచ్చింది. వెంటనే బయలుదేరి, ఈ కింద ఇచ్చిన ఆఫీసు అడ్రసుకి వెళ్ళమని సుందర్ లాల్ సహతా వైరిచ్చారు."
"చాలా సంతోషమండీ" అన్నాను.
నన్నోసారి ఎగాదిగా చూశారు. "ఎంతవరకూ రాసేవ"ని అడిగారు.
"ఇంకా ఎనిమిది రీళ్ళున్నాయి" అన్నాను.
"ఫరవాలేదు, అక్కడితో ఆపేయ్. మనం ఈ రాత్రి బయలుదేరి వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్పులో రాసుకోవచ్చు" అన్నారు.
"నే నోమాట చెప్తాను. కోపం రాదుకదా?' -అన్నాను నెమ్మదిగా.
"చెప్పు" అన్నారు.
"రేపు రాత్రి బయలుదేరి వస్తున్నామని వెంటనే వైరిచ్చేయండి. ఈలోగా నేను స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తాను. మద్రాస్ వెళ్ళాక మనం డైలాగ్స్ రాసుకోవచ్చు".
"రేపటిలోగా పూర్తి చెయ్యగలవా?".
"తప్పకుండా చేస్తాను" అన్నాను.
మరుసటి రోజు రాత్రికి మూడు టికెట్లు బుక్ చేయించమని శంకర్ సింగ్ గారితో చెప్పారు.
"ఫస్ట్ క్లాసా?" - అని అడిగారాయన.
వెంటనే, "కాదు సార్! ఒక ఫస్టు క్లాస్, రెండు సెకండ్ క్లాస్" - అన్నాను. "అందరం ఒక క్లాసులోనే పోదాం" అన్నారు శ్రీశ్రీగారు.
"వద్దు" - అన్నాను కచ్చితంగా.
"సరే మీ యిష్టం" అన్నారు.
నేను మళ్ళీ స్క్రిప్టు పనికి కూర్చున్నాను. శ్రీశ్రీగారు డైలాగ్స్ రాయడానికి కూర్చున్నారు. కానీ బుర్ర పని చెయ్యనట్టుంది. విశాలమైన ఆ నుదురు రెండు చేతుల్లో నలిగిపోతోంది. అంత ఆలోచన, ఆరాటం ఎందుకో నాకర్ధం కాలేదు.
ఈ స్థితిలో ఆయన ఎదురుగా వుంటే నాకూ రాయడం కష్టంగా అనిపించింది.
"ఈ రోజుకి ఆపెయ్యరాదూ! రేపు రాద్ధువుగానీ, వెళదాం" - అన్నారు.
"లేదండీ, ఈరోజు ఎంత ఆలస్యమయినా నాకు ఓపికున్నంత వరకూ రాస్తాను మిగిలింది రేపు పూర్తి చేస్తాను."
"అంత తొందరేం వచ్చింది?"
"తొందరేనండీ. పని వచ్చినప్పుడే మనం చెయ్యాలి. మనకి కావల్సినప్పుడది రాదు" అన్నాను.
"అయితే నేను రూముకి వెళ్ళిపోతాను. పనయిన తర్వాత నువ్వు వచ్చెయ్" అన్నారు.
ఒక విధంగా మంచిదే! ఆయన రెస్టు తీసుకుంటారు. నాకూ పని చకచకా సాగుతుందనుకున్నాను.
"వెళ్ళనా?" అడిగారాయన.
"మేం వచ్చేసరికి ఎంత టైమవుతుందో చెప్పలేం. మీరు మాత్రం ఏమీ అనుకోకండి. మేం ఇక్కడే భోజనాలు చేస్తాం" - అని చెప్పాను.
"త్వరగా వచ్చేయ్యండ"ని వెళ్ళిపోయారు.
కన్నడం అసిస్టెంట్ కోపరేషణ్ తో తెల్లవారుఝామున నాలుగు గంటలకి స్క్రిప్టు వర్క్ పూర్తి చేశాను. మనస్సు చాలా తేలికపడింది. పెద్ద బరువు తీరినట్టు ఫీలయ్యాను. నేను స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశానని చెప్తే శ్రీశ్రీ గారు నిజంగా మెచ్చుకుంటారేమో చూడాలి. శ్రీశ్రీగారికి మరో పిక్చర్ రావడం నాకెంతో సంతోషంగా వుంది.
"నేనూ అదృష్టవంతురాలినేమో" అనుకున్నాను.
కానీ ఆ పిక్చర్ కి మనం వుంటామో వుండమో! శ్రీశ్రీగారు మనకి పని ఇవ్వద్దూ?
ఇవ్వనీ, ఇవ్వకపోనీ వారు చాలా మంచి మనిషి, నిష్కల్మషమైన మనసు. ఆయన బాగుంటే చాలు.....అనుకుంటూ కారు తియ్యమని డ్రైవరుతో చెప్పాను.
అమ్మతో స్క్రిప్ట్, కాగితాలు అన్నీ పట్టుకుని కారెక్కాను. దారిలో అసిస్టెంట్ ని దింపేశాం.
మేం రూముకి చేరుకునేసరికి తెలతెలవారుతోంది.
తలుపుకొట్టిన రెండు నిముషాలకి తెరిచారు. "తెల్లవారిపోతోంది. ఇప్పుడేనా రావడం?" అడిగారాయన.
"అవునండీ! మీరు రాత్రి భోంచేశారా?".
లేదని తలూపారు. "ఎన్ని రీల్స్ రాశావు"?.
"పూర్తయిపోయిందండీ".
