"కూర్చుంటే పనులు కావు. అనితను బాత్ రూంలో వుంచుదాం పద. నేను తొందరగా అనితగా మారాలి. ఏ కాస్త ఆలస్యం చేసినా ప్రమాదమే" అంది కామిని.
కిరణ్ అయిష్టంగానే లేచి వచ్చాడు.
ఇరువురు కలసి అనిత డెడ్ బాడీని తీసుకువెళ్ళి బాత్ రూమ్ లో ఒక మూలగా వుంచారు. అప్పటికే శవం నుంచి కొద్దిగా వాసన బయలుదేరింది.
నిన్న ఇదే సమయానికి...అనుకోకుండా వుండలేక పోయాడు కిరణ్.
ఆ తరువాత అనితలాగా మారిపోయింది కామినీదేవి. హోటల్ రూమ్ లో నుండి బయటకు వెళ్ళడం, రావటము, వీరిద్దరూ ప్రేమికుల్లాగా కొందరి దృష్టిలో పడటమూ తరువాత పెళ్ళి, కిరణ్ తండ్రికి ఫోన్ చేయడమూ, తిరిగి హోటల్ కు రావడమూ, హోటల్ బోయ్ దృష్టిలో నాలుగుసార్లు నాలుగు రకాలు పడటమూ సవ్యంగా జరిగిపోయింది. ఫినాయిల్ అనిత బాడీకి, సెంట్ వీళ్ళు పూసుకుని దుర్వాసన రాకుండా కూడా జాగ్రత్త పడ్డారు.
వీరి ప్రక్క రూం 42లోకి ఒకతను వచ్చి దిగిన సంగతి వీళ్ళకు తెలియదు.
రాత్రి పదకొండు గంటలు అయ్యేటప్పటికి ఇదంతా సవ్యంగా జరిగిపోయింది.
ఇంక వారు చెయ్యాల్సింది ఏమీలేదు. అనిత డెడ్ వాడిని వదుల్చు కోవటం తప్ప. ఆ పని చేయాలంటే వూరు మాటు మణగాలి. హోటల్ సిబ్బంది గాఢనిద్రలో వుంచాలి. ఒంటి గంట రెండు మధ్య ఐతే అది చాలా మంచి సమయం అందాకా చేతులు ముడుచుకుని కూర్చోక తప్పదు.
చెయ్యటం అయిపోయింది. మాట్లాడు కోవటము అయింది. అందుకనే ఎవరి దోవన వారు ఆలోచిస్తూ వుండిపోయారు.
"మనం పట్టుబడ్డం కదా!" ఆలోచనా స్రవంతి నుండి బయటపడుతూ అడిగాడు కిరణ్.
"మనం కాదు. నేను పట్టుబడను కదా? అని అనాలి" కామినిదేవి అదోలా నవ్వుతూ అంది.
కిరణ్ కి ఒళ్ళు మండింది. అయినా చిరునవ్వు మొహాన పులుముకుని "డెడ్ బాడీని వదుల్చుకునే విషయంలొ నీవు నాకు సహాయపడుతున్నావ్ కదా! అప్పుడు ఇద్దరం నేరస్తులమే కదా! అందుకని మనం అన్నాను తప్పా?" నవ్వుతూ అడిగాడు.
"నీ ఆలోచన సవ్యమైనదే, కాని మనం పట్టుబడ్డం." దృఢంగా వినవచ్చింది కామినీ స్వరం.
కామినీ ధైర్యం చూస్తూంటే కిరణ్ లో కూడా మొండి ధైర్యం ప్రవేశించింది.
ఆ తరువాత వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వారు వుండిపోయారు.
అతి భారంగా, చాలా నెమ్మదిగా కాలం ముందుకు నడుస్తోంది అనిపించింది కిరణ్ కి. కాలం గతి తప్పకుండా సవ్యంగా నడుస్తూనే వుంది. అతనిలోని ఆదుర్దా అలా అనిపింపజేస్తున్నది అంతే.
రాత్రి ఒంటిగంట.
అప్పటిదాకా ఇరువురూ సోఫాలోనే కూర్చుండి పోయారు.
"ఒంటిగంట, అయిదునిముషాలు" కిరణ్ అన్నాడు రిస్ట్ వాచీలో టైమ్ చూసుకుంటూ.
"ఇంక మనం రంగంలోకి దిగుదాము." అంది కామిని.
అనిత డెడ్ బాడీకి విముక్తి కలిగే టైమ్ ఆసన్నమయినది.
ఇరువురూ సోఫాలోంచి లేచారు.
కిరణ్ అక్కడే నుంచుండిపోతే కామిని రూమ్ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. కారిడార్ అంతా నిశ్శబ్దంగా వుంది. అన్ని రూమ్స్ క్లోజ్ చేసి వున్నాయి. అంతటా నిశ్శబ్ధంగా వుంది.
కామిని వెనుతిరిగి లోపలికి వచ్చింది." అంతా సవ్యముగా వుంది. ఇక నీదే ఆలస్యం" అంది కిరణ్ తో కామిని.
కిరణ్ బాత్ రూమ్ వైపు నడిచాడు.
9
"శాంతి భవన్"
వాకిలి ముందు టాక్సీ ఆగింది. టాక్సీనుండి కిరణ్, కామినీదేవి దిగారు. వాళ్ళు దిగిన వెంటనే టాక్సీ వెళ్ళి పోయింది.
కిరణ్ గుండె దడ దడలాడుతున్నది. అయినా అన్నిటికీ తెగించినవాడిలాగా మొండిధైర్యముతో కామిని చెయ్యి పట్టుకొని లోపలికి నడిచాడు. అతని ఒక చెయ్యి ఆమె చెయ్యిని పట్టుకుని వుంది. మరొక చేతిలో బ్రీఫ్ కేస్ వుంది. కామిని ఇంకా అనిత శారీ బ్లవుజ్ లోనే వుంది. ఏమీ మార్పు చెయ్యలేదు. వేషధారణలో.
"నీ మాట వీళ్ళ తలకెక్కలేదు." నెమ్మదిగా అంది కామిని.
విషయం అర్ధం చేసుకున్న కిరణ్ అవును అన్నట్లు తల తాటించి వూర్కున్నాడు.
క్రొత్తకోడలికి ఘనస్వాగతం ఇవ్వడానికి అక్కడ ఎటువంటి ఏర్పాట్లూ చేసిలేవు. దిగిన వెంటనే పలకరించిన వారు లేరు. ముందుగా వీరిని చూసిన పనిమనిషి గౌరమ్మ చూడనట్టు, లోపల ఏదో పనివున్నట్టు, కంగారుగా ప్రక్కకు వెళ్ళిపోయింది.
ఆ ఒక్క సంఘటనతోనే కిరణ్ మొత్తం అర్ధంచేసుకున్నాడు.
"శాంతిభవన్ అశాంతి భవనంగా రూపుదాల్చబోతోంది" అనుకున్నాడు కిరణ్.
కామినీతో సరాసరి హాల్లోకి వెళ్ళాడు కిరణ్. ఈ లోపల ఎదురైన మరో నౌకరు కూడావున్నాడు.
ఆ సమయంలో రావుగారు హాల్లో సోఫాలోకూర్చుని పైప్ పీలుస్తున్నాడు. ప్రక్కనే మరో సోఫాలో ఊర్మిళా దేవి కూర్చుని వుంది. వారిరువురి మొహాలు కావాలని కోపం ఎగపట్టుకున్నట్లు వున్నాయి.
అంతదూరాన ఆగిపోయి "డాడీ" అని నెమ్మదిగా పిలిచాడు.
రావుగారు తలెత్తిచూశాడు.
"సతీసమేతంగా" అని వ్యంగ్యంగా అన్నాడు.
"ఊర్మిళాదేవి మాత్రం ఏమీ పెదవి కదపలేదు. కోడలిపిల్లని నమిలి మింగేలా చూడటం తప్ప.
ఆ పరిస్థితి కిరణ్ మనస్సుకి చాలా కష్టంగా వుంది. అయినా తెచ్చిపెట్టుకున్న ధైర్యంలో తెగింపు, చొరవా తప్పనిసరియై, మామూలుగా మాట్లాడుతూ కామినీవైపు తిరిగి.
