"ఆ తర్వాత!" గోవర్ధనరావు అడిగాడు.
"పెళ్ళికూతుళ్ళని పెళ్ళికొడుకులని నాలుగు గదుల్లో వదులుతాము. వాళ్ళు తడుముకుంటూ వెళ్ళి ఎవరినో ఒకరిని తాకుతారు. అలా తాకంగానే ఆడో మగో తెలుసుకోవడానికి చేతులు తడిమి చూస్తారు. అలా చూసినప్పుడు గాజుల చెయ్యి గనక అయితే అబ్బాయి జేబులోంచి చిన్న కానుకతీసి అమ్మాయి చేతిలో పెడతాడు...."
"ఓస్ ఇంతేనా చాలా ఈజీ దీంట్లో పెద్ద సరదాఏముంది?"
"మీరు అనుకున్నంత ఈజీకాదు బావగారూ! వక్కసారి తాకంగానే ఆట అయిపోదు. అరగంట కాలం వాళ్ళని వీళ్ళు అంటుకుంటూ అలా తిరగాలి. అంటుకున్నప్పుడల్లా అబ్బాయి కానుకతీసి అమ్మాయికి ఇవ్వాలి."
"బాగానే వుంది. అబ్బాయి అబ్బాయిని తాకితే!"
"వెరీ సింపుల్ తడిమి చూసుకుని వదిలేస్తారు. కానుక లిచ్చుకోరు. కళ్ళగంతలులాంటి ఆటకాబట్టి ఎవరికి ఎవరూ కనపడరు. తమాషా అంతా అబ్బాయిలు అమ్మాయిలకి ఇచ్చే కానుకల్లోనే ఉంటుంది. కానుకలు సరదాగా రాసిన మాటల చీటీలు అవి"
"మాటల చీటీలు అంటే?"
"చిన్న చిన్న కాగితంముక్కలమీద...'ఆ మూడు ముళ్ళు పడంగానే మీరే వంట చేయాలి'...'మీరు చాలా అదృష్టవంతులు పువ్వుల్లోపెట్టి చూసుకునే వాడు దొరికాడు'....'అమ్మో ఇంతమంది సంతానమా! మీరు సరదా అండీ బాబూ మీకు?' 'నా భర్త కొండముని లాగా ఉంటాడు'....ఇలాంటి మాటలు చీటీలమీద రాసి ఉంటుంది."
సురేంద్రనాథ్ చెపుతుంటే ఆ గేమ్ లోని తమాషా గోవర్ధనరావుకి కొంత అర్ధమైంది. అనుమానాలుకూడా వచ్చాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అడిగాడు.
"తినబోతూ రుచులు అడిగినట్టు చూడబోతూ వివరాలు దేనికి చెప్పండి! అయినా నోరుతెరిచి అది కాబట్టి చెపుతున్నాను. చీటీలమీద సరదా అయిన మాటలురాయడం ఆడవాళ్ళ పని. ముందు మాటలు రాయడమంటే వాళ్ళు సంబరపడిపోతారు. ఈ గేమ్ అయింతరువాత అబ్బాయిల ప్రాముఖ్యం ఏమీ ఉండదు. పెళ్ళికూతురివేషాల్లో వున్న మిగతా అమ్మాయిల చేతికి వచ్చిన ఏమి ప్రాముఖ్యం ఉండదు. చీటీలు ఎవరికైతే ఎక్కువవస్తాయో వాళ్ళు అదృష్టవంతులని మాత్రం అంటారు అంతే. కూతురికి వచ్చిన చీటీలువిప్పి చదివి వేళాకోళాలతో ఆటాడిస్తారు. పెళ్ళికూతురే తన చేతిలోవున్న చీటీ విప్పి పైకి చదవాలి. నా భర్త కొండముచ్చు అని రాసివున్న చీటీలోని వాక్యాలు పెళ్ళికూతురు పైకి చదివింది అనుకోండి పెళ్ళి పెళ్ళిపందిరంతా నవ్వులు పువ్వులై విరుస్తాయి" సురేంద్రనాథ్ చెప్పాడు.
మగ పెళ్ళివారు కా అంటే కా, కీ అంటే కీ కాబట్టి ఈ ఆటలో వట్టి సరదాతప్ప ప్రమాదం కనిపించలేదు కాబట్టి అన్నింటికన్నా ఇది మగపెళ్ళివారి కోరిక ఆచారం కాబట్టి అసలు విషయానికివస్తే తప్పదుకాబట్టి "మీరు చెప్పనట్లే చేస్తాను" అని చెప్పి వచ్చేశాడు గోవర్ధనరావు.
మల్లెపూలబుట్టలు, చమ్కీదండలు ఆడ పెళ్ళివారి ఖర్చు అమ్మాయిలకి అబ్బాయిలకి వేషాలు వేయడం మగపెళ్ళివారి పని ఈ గేమ్ లో ఆడపెళ్ళివారి తరఫున పెళ్ళి కూతురు వక్కతే పాల్గొనాలి అంతే.
గత్యంతరంలేక గానొక్క కూతురిని యమర్జంటుగా వివాహంచేసి ఈ పరిసరాలకి దూరంగా దేశంగాని దేశం పంపిస్తున్నాడు గోవర్ధనరావు.
"ఈ పరిస్థితులలో ఇదే మంచిది" అని ఇందిరారాణి కూడా గుండె రాయిచేసుకుని సరదాగా పెళ్ళి వేడుకలలో పాల్గొంటున్నది.
"ఇది విషమపరిస్థితి కాబట్టే నేనీ పెళ్ళి చేసుకోను" అని శీతల్ రాణి ముందు భీష్మించుకు కూర్చుంది. తల్లీతండ్రీ పట్టుదలముందు తల వగ్గక తప్పలేదు. అయినా తన ప్రయత్నం తాను ఓ పక్క చేస్తూనే ఉంది.
గోవర్ధనరావు వియ్యంకుడి కబురువిని విడిదింటికి వెళ్ళి విషయం తెలుసుకుని వచ్చాడు. పెళ్ళికూతుళ్ళు పెళ్ళి కొడుకులు ముఖాన పూలమాలలు చీటీలు చిలిపి మాటలు. ఈ ఆచారం ఏదో కొత్త కొత్తగా వుంది అయినా తప్పదు కాబట్టి అంతా విని ఇందిరారాణి కూడా "కానీండి ఏం చేస్తాం!" అంది.
విడిది గృహంలోకి మల్లెపూల బుట్టలు, చమ్కీ వుండలు అరగంటకల్లా వెళ్ళాయి.
మగపెళ్ళివారి తాలూకా ఆడవాళ్ళు వకచోట కూర్చుని పూలదండలు చీట్లు వాటిమీద సరదామాటలు కొంటెమాటలు తయారు చేస్తున్నారు.
ఈ కొత్త ఆచారం తాలూకా సమాచారం ని ఆడపెళ్ళివారి తాలూకా వాళ్ళుకూడా ఏదో చూడబోతున్నామని సరదాపడిపోతున్నారు.
అసలు విషయం ఎవరికీ తెలియదు.
ఈ కొత్త ఆచారం అమలుపరచి తీరాలని సురేంద్రనాద్ కోరికకాదు. మగపెళ్ళి వారికి వింతగా వుంది. ఆయన అసలు విషయం పైకి చెప్పలేక లోపల దాచుకోలేక "ఇప్పుడు కాదు రేపు చెపుతాను అంతా సరదాగా పాల్గొనండి" అనిమాత్రం చెప్పాడు.
ఉన్నట్లుండి పెళ్ళికొడుకు తండ్రి ఒక కొత్త ఆచారం పెళ్ళి ముహూర్తం లోపల చేయాలని చెప్పాడు. అది ఇలా చేయాలిట...అంటూ శీతల్ రాణికి చెపితే మౌనంగా ఊ కొట్టి వూరుకుంది.
