Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 13

    చివరి వాక్యానికి వులిక్కిపడి చూశాడు భార్గవ.

    ఒక ఆడది ఫాలో అయి బెదిరించటమా....నో....ఇట్స్ రేర్ అనుకున్నాడు.

    "నన్నేదో బ్లాక్ మెయిల్ చెయ్యాలని కాదు, తప్పుదోవ పట్టించడానికి కాదు, కేవలం నా నవల్లోని ముఖ్యపాత్రను చంపవద్దని..."

    "ఏది ఏమైనా....ఈ రోజుల్లో ఎవరికీ ప్రొటెక్షన్ లేదు. ఆడదాని బెదిరింపుని అతి తేలిగ్గా ఎప్పుడూ తీసుకోకండి" అన్నాడు శరత్ సీరియస్ గానే.

    "సరే సార్! మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను....బై" అన్నాడు భార్గవ లేస్తూ.

    "సీ...యూ....మీ మూడ్ పాడుచేసినందుకు రియల్లీ సారీ" అని చేయి కలిపాడు శరత్. భార్గవ అక్కణ్ణించి శెలవు తీసుకున్నాడు.


   
                          *    *    *    *    *

       
    భార్గవ ఫోరెన్సిక్ డివిజన్ లోకి అడుగు పెట్టేసరికి అక్కడ ఎవరి పనుల్లో వారున్నారు. అధునాతనమైన మెషీన్లు, కంప్యూటర్లు, నేర పరిశోధనకు సంబంధించినరకరకాల పరీక్షలు అక్కడ జరుపబడతాయి. పోలీసులు, నేరస్థులు, డాక్టర్లు, మరి కొంతమంది సిబ్బంది పని చేస్తారక్కడ.

    భార్గవ ఒక వ్యక్తిని ప్రక్కకు పిలిచి ఇక్కడ అమితేష్ అనే వ్యక్తి వుంటాడు. ఎక్కడ? అనడిగాడు. అతను ప్రక్కగది చూపించాడు.

    అతడు ఆ గదిలోకి వెళ్లేసరికి అమితేష్ బిజీగా. ఏదో హత్య కేసు పరిశీలనలో నిమగ్నమై వున్నాడు. అమితేష్ గొప్ప ఇంటర్ పోల్ డిటెక్టివ్ కం ఫింగర్ ప్రింటర్. నేరస్థులు దోపిడీలుగాని, హత్యలుగాని చేసి పోయిన తర్వాత వాళ్ళ చేతి ముద్రలూ, కాళ్ళ ముద్రలూ ఫోటోలు తీసి ఫింగర్ ప్రింటర్స్ ఆ గుర్తుల్ని డెవలప్ చేస్తారు ఆ ముద్రల ద్వారా నేరస్థుల్ని పట్టుకునే అవకాశం వుంటుంది. హత్యా జరిగినచోట, దోపిడీ జరిగినా చోట పడిన హంతకుల ముద్రల్ని భద్రపరుస్తారు. పకడ్భందీగా ఏ ఆధారం లేకుండా హత్యచేసి వెళ్ళిపోయినప్పటికీ...చివరి దశలో ఫింగర్ ఫ్రింట్స్ ద్వారా నయినా హంతకుడు పట్టుబడక తప్పదు. ఈ సృష్టి విచిత్రమేమిటంటే....ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలూ ఒక్కలా వుండవు. ఫింగర్ ఫ్రింట్స్ సేకరణ చాలా కష్టమయిన పనే అయినప్పటికీ చాలా పెద్దపెద్ద కేసులు....అంతర్జాతీయ కేసులు కూడా ఫింగర్ ఫ్రింట్స్ ద్వారానే పట్టుబడ్డాయి.

    కొన్ని సందర్భాలలో దోపిడీ జరిగినచోట వస్తువుల్ని, హత్య జరిగినచోట వ్యక్తుల్ని బయటివారు ఎంతమాత్రం ముట్టుకోకూడదు. దీనివల్ల వాళ్ళ వేలిముద్రలు, కాలిముద్రలు పడి ఆ నేరమేదో అమాయకుల మీద పడవచ్చు.

    ప్రతి వస్తువుమీద పడిన మన వేలిముద్రలు మనకు కన్పించవు. కాని....వాటిని ఫోటోల ద్వారా ఫింగర్ ఫ్రింట్స్ గుర్తిస్తారు.

    అలాంటి ఫింగర్ ఫ్రింట్స్ లో నిపుణుడు అమితేష్! అమితేష్ భార్గవకు మంచి ఫ్రెండ్ కూడాను!!

    "హలో అమితేష్" అన్నాడు భార్గవ. అతని మొహం పాలిపోయి వుంది. పనిలోంచి తలెత్తి "అరె! నువ్వేమిట్రా ఇలా వచ్చావ్?" అన్నాడు అమితేష్ విష్ చేసి.

    చేస్తున్న పని ప్రక్కనబెట్టి కాసేపు కుశల ప్రశ్నలేసాడు అమితేష్ ఆ తరువాత వచ్చిన  పనేమిటని అడిగాడు. భార్గవ కొంచెంసేపు తటతటాయించి చెప్పాడు.

    "ఒక సీరియల్ ముగింపు విషయంలో నాకు కొన్ని హెచ్చరికలు వస్తున్నాయి. అదీ ఒక అమ్మాయినుండి అమితేష్! ఎలాంటి హెచ్చరికకూ నేనెప్పుడూ భయపడలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నాను కూడా! అలాంటిది ఈ హెచ్చరిక చాలా విచిత్రమయింది.ఆ అమ్మాయి నన్ను ఏడ్పించాలనుకుంటుందేమోనని వూహిస్తున్నాను కాని...ఎన్నడూ లేనిది గుండెల్లో గుబులు..." ఆగాడు భార్గవ.

    "ఆ అమ్మాయి నిన్ను ఏ రకంగా హెచ్చరిస్తోంది?" అన్నాడు అమితేష్.

    "లెటర్స్ ద్వారా...ఫోన్ ల ద్వారా..." అన్నాడు భార్గవ.

    అమితేష్ కొద్దిసేపు నిశితంగా ఆలోచించాడు__ "పోలీస్ కంప్లయింట్ ఇచ్చావురా?" అన్నాడు.

    "లేదు. గోటితో పోయేదాన్ని గొడ్డలితో నరకటం నాకిష్టం వుండదు. ఈ లెటర్ ద్వారా రెడ్ హాండెడ్ గా మనమే పట్టుకుందామని."

    "పోలీస్ సాయం లేనిదే కేవలం ఫింగర్ ప్రింట్స్ ద్వారా మనం పట్టుకోవటం అసాధ్యమేమో?" అన్నాడు అమితేష్ అనుమానంగా.

    "అంతేనంటావా?" భార్గవకు నీరసం ముంచుకొచ్చింది.

    "అదికాదు ఫోన్ ద్వారా నైతే ఆ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేయలేం కదా! ఇకపోతే లెటర్స్ ద్వారా...అవి ఇదివరకే నీవు విప్పి చదివుంటావ్! నీ వేలిముద్రలు కూడా వాటిమీద పడివుంటాయి."

    "లేదు. నిన్న మరో లెటరొచ్చింది. గులాబీరంగు కవర్. అడ్రస్ మీద అదే రైటింగ్...ఎందుకైనా మంచిదని ఆ కవర్ ని విప్పకుండా నీ దగ్గరికి తెచ్చాను. నువ్వు కూడా ఏదైనా సాయం చేస్తావని..." అన్నాడు భార్గవ ఒక కవర్ ను టేబిల్ మీదుంచుతూ.

    "వెరీగుడ్....మంచిపని చేశావ్" అని ఒక ఫోర్ సెప్ తో కవర్ ని చించాడు అమితేష్.

    అంతలో మృత్యు నినాదంలా మ్రోగింది ఫోను కవర్ ని ప్రక్కన బెట్టి "హల్లో..." అన్నాడు అమితేష్.

    "భార్గవగారున్నారా....?" అవతల్నుంచి ఆడకంఠం విన్పించి....అదే కేసని గుర్తించి వెంటనే" అవునండీ నేనే భార్గవని" అన్నాడు అమితేష్.

    "షటప్...మీ డిపార్ట్ మెంట్ తెలివితేటలు నాకు తెల్సుగాని మీ ముందు కూచున్న ఆ రైటర్ గారి కివ్వండి" శ్రావ్యమైన కంఠంలో కోపం ధ్వనించింది.

    "ఇదేదో తెలివిమీరిన ఆడది చేస్తున్నట్టే వుంది....గడుగ్గాయి కేసే" అంటూ భార్గవకు ఫోనందించాడు అమితేష్.

    "హలో!" అన్నాడు భార్గవ నవనాడులు క్రుంగిపోయి నీరసంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS