కౌగిలి కైలాసం
జొన్నలగడ్డ రామలక్ష్మీ
సుమిత్ర , వనజ అప్పుడే ట్రెయిన్ దిగారు. సమయం రాత్రి ఒంటి గంటన్నర. ట్రెయిన్ ఏడింటికి రావలసింది. ఆరున్నర గంటల లేటు.
"ఏం చేద్దామే ఇప్పుడు ?" అన్నది వనజ.
ఇద్దరి చేతుల్లోనూ చెరో బ్రీపు కేసూ లున్నాయి. రాత్రి పదింటి దాకా బస్సులుంటాయి. ఏ ఇబ్బంది వుండదనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెయిన్ యెటూ కానివేళ వచ్చింది.
"స్టేషన్లో వుండిపోదామా?" అన్నది సుమిత్ర.
"బోరు ....ఇక్కడ మనకు నిద్రపట్టదు. బ్రీపు కేసులకు కాపాలాయే కాస్తామా, నిద్ర దేవతనే ఆహ్వానిస్తామా?" అన్నది వనజ.
"పోనీ రిక్షాల్లో వెళ్ళిపోదామా ?" అన్నది సుమిత్ర.
వచ్చిన యిబ్బంది ఏమిటంటే స్నేహితురాండ్రిద్దరిదీ చెరో దారీను. ఇద్దరి ఇళ్ళకూ కూడా రిక్షాలో సుమారు ముప్పావు గంట ప్రయాణం. దారి కాస్త నిర్మానుష్యంగా వుంటుంది. ఒంటరిగా ఆడవాళ్ళు.... ఇద్దరికీ అంతంతమాత్రం బంగారు నగలున్నాయి. చేతికి వాచీలున్నాయి. బ్రీఫ్ కేసులో డబ్బు ఉన్నది.
వాళ్ళారోజు బయల్దేరి వస్తున్నట్లు వాళ్ళ ఇళ్ళలో తెలియదు. లేకపోతె ఎవరైనా స్టేషను కు వచ్చి వుండేవారు.
"రిక్షాల్లో పొతే హాయిగా రెండున్నయ్యేసరికి నిద్రపోవచ్చు - ఏ బాధా వుండదు" అన్నది వనజ.
ఉన్న బాధల్లా రెండున్నరయ్యేదాకానే" అన్నది సుమిత్ర.
వనజ స్నేహితురాలివంక గురుగ్గా చూసి "భయడుతున్నావా ?" అన్నది.
'ఆడపిల్లలం -- భయపడక తప్పదు కదా !" అన్నది సుమిత్ర.
'ఆడపిల్లలం కాబట్టి భయపడాలనడం నాకు నచ్చదు. పద, పోదాం " అన్నది వనజ.
"వద్దే!"
వనజకు కోపం వచ్చింది. కాలేజీలో వనజ అంటే మగవాళ్ళకు చాలా భయం. ఆడవాళ్ళను మగవాళ్ళ కంటే తక్కువ చేయడం ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు.
ఇద్దరూ బియ్యే ప్యాసయ్యారు. ఒకే ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్ళి వస్తున్నారు. అనుకున్న ప్రకారం వాళ్ళు ఒక రోజు ముందుగానే బయల్దేరారు. ఇంటర్వ్యూ వచ్చిన ఊళ్ళో ఇద్దరికీ చుట్టాలున్నారు. వాళ్ళని కూడా ఎవరై నా అనుసరించవలసిన అవసరం లేకపోయింది.
"నీకు భయంగా వుంటే నువ్వు స్టేషన్లో వుండిపో- నేను మాత్రం యింటికి వెళ్ళిపోతాను " అన్నది వనజ.
'అంత కోపమెందుకే -- పద, పోదాం - " అంది సుమిత్ర.
ఇద్దరూ రిక్షాల స్టాండు కి వచ్చారు. వీళ్ళు చెప్పిన అడ్రసు వింటూనే యిద్దరు రిక్షా వాళ్ళు ముందుకు వచ్చి "రండమ్మ " అన్నారు.
"వాళ్ళ చూపులు బాగోలేవు" సుమిత్ర గొణిగింది వనజ చెవుల్లో. కానీ వనజకు వాళ్ళేనచ్చారు.
"మనం వాళ్ళ చూపులు కాదు- నేరం చూసుకోవాలి అన్నదామె.
మిగతా వాళ్ళ మీద ఓ అర్ధరూపాయ తక్కువకు వస్తున్నారు వాళ్ళు -- "నాకు భయం వేస్తోంది " అన్నది సుమిత్ర.
"భయమన్నది మనసులో ఉంటుంది. మనసు సరిపెట్టుకుంటే భయం ఉండదు. మనసన్నది లేకపోతె భయం అన్న పదానికి అర్ధం లేదు. నీకు నా హామీ !" అన్నది వనజ .
భయపడుతూనే సుమిత్ర రిక్షా ఎక్కింది. ఉన్నంతలో యిద్దరిలోనూ కాస్త చూపులు బాగున్న వాడిని యెన్ను కున్నదామే.
వనజ ధైర్యంగా రిక్షా ఎక్కింది.
కొద్ది గజాల దూరం రిక్షాలు కలిసి వెళ్ళాయి. తర్వాత స్నేహితురాండ్రిద్దరూ ఒకరి కొకరు టాటా చెప్పుకున్నారు.
2
రిక్షా ఓ చోట ఆగింది.
"ఏ రిక్షా అపావెం " అంది సుమిత్ర.
"చైను ఊడిందమ్మా " అన్నాడు రిక్షావాడు.
"సరే తొందరగా పోనీ" అంది సుమిత్ర. ఆమె బితుక్కుమంటూ రిక్షాలో కూర్చుని వున్నది.
రిక్షావాడు చైను వేసుకున్నాడు. మళ్ళీ రిక్షా బయల్దేరింది. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ రిక్షా ఆగింది.
సుమిత్ర కంగారుగా "ఏం ఆపావు? అన్నది.
'చైను ...." అన్నాడు వాడు నీళ్ళు నములుతూ.
మళ్ళీ ఊడిందా?" అంది సుమిత్ర.
"లేదమ్మా, నాకు నీ మెడలో బంగారు చైను కావాలి" అన్నాడు రిక్షావాడు.
సుమిత్ర ఉలిక్కిపడి చుట్టూ చూసింది. అంతా నిర్మానుష్యంగా వున్నది దరిదాపుల్లో పిట్ట కూడా లేదు.
"తీపి యిచ్చేయమ్మా!" అన్నాడు రిక్షావాలా.
సుమిత్రకు కంగారు పట్టుకుంది. ఆ గొలుసు ఖరీదు మూడు వేలు. అది తనది కాదు ఆక్కది. అక్కకి పెళ్ళయింది. ఇంటర్వ్యూకి బోసి మెడతో వెళ్ళవద్దని బలవంత పెట్టి తనే వేసింది గొలుసు -- సుమిత్ర అక్క!
సుమిత్ర అక్కకు పెళ్ళయింది. అత్తావారు చాలా గడ్డు మనుషులు. ఈ గొలుసు పొతే తండ్రి ఇప్పటి కిప్పుడు చేయించి యివ్వాలి. ఒక్కసారి మూడు వేలు ఇవ్వాలి.
"నేను యివ్వను. ఇది నా గొలుసు కాదు. ఎరువుది!"
"ఎరువుదైతే నాకేం -- బంగారందే కదా!" అన్నాడు రిక్షావాడు.
సుమిత్ర మరోసారి చుట్టూ చూసింది --ఎక్కడా పిట్ట కూడా కూయడం లేదు" ఇది బంగారంది కాదు" అందామె తెగించి.
రిక్షావాడు నవ్వి "అయితే ఇవ్వడానికి ఆలోచనేందుకూ?" అన్నాడు.
సుమిత్ర మాట్లాడలేదు.
"నీతో మాట్లాడుతూ కూర్చోడానికి నాకు టైము లేదు. తొందరగా గొలుసు తీసిస్తావా? నన్ను బలవంతంగా లాక్కోమంటావా?" అన్నాడు వాడు.
సుమిత్ర మాట్లాడాలనుకుంది. గొంతు పెగల్లేదు. కదలాలనుకుంది మనిషి బిగుసుకు పోయింది.
రిక్షావాడు ఆమె భుజాల మీద చేతులు వేశాడు. నగ హుక్ తీశాడు. చూస్తుండగానే ఆ గొలుసు వాడి చేతిలోకి వెళ్ళి పోయింది. సుమిత్రకు ఏడుపు వచ్చింది.
"ఇదిగో ఆ వాచీ కూడా యిలా గియ్యి" అన్నాడు రిక్షావాడు.
ఆ వాచీ కూడా సుమిత్రది కాదు. పక్కింటావిడది. ఇంటర్వ్యూ కి వెడుతున్నదని ఆవిడే బలవంత పెట్టి ఇచ్చింది.
ఎరువు సొమ్ము బరువు చేటు అంటారు. సుమిత్ర పట్ల ఆ సామెత నిజమవుతున్నది. రిక్షావాడామే చేతి వాచీని తనే బలవంతంగా తీసుకున్నాడు. సుమిత్ర ఏడుపు మొదలెట్టింది.
అప్పుడే ఎడుస్తావేమిటి ?" అన్నాడు రిక్షావాడు.
సుమిత్ర మాట్లాడలేదు.
"ఆ పెట్టి తెరు" అన్నాడు రిక్షావాడు.
సుమిత్ర హడలిపోయింది. అందులో అయిదు వందల రూపాయల క్యాషు వున్నది. ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెడుతున్నదనీ -- ధైర్యానికి కొంత డబ్బు దగ్గరుండాలనీ ఆమె తండ్రి అప్పు చేసి ఆ డబ్బామేకు తెచ్చి ఇచ్చాడు. వీలైనంతం పొడవుగా ఆమె వుండాలని అయన చెప్పాడు. ఆమె తిరిగి తెచ్చిన డబ్బును అప్పు తీర్చేయాలని అయన అనుకున్నాడు. సుమిత్ర కూడా ఎంతో పొడవుగా వుండి వీలైనంత డబ్బు మిగిల్చింది. ఇప్పుడా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై పోతోంది.
"ఇంక నన్నింతటితో వదిలిపెట్టు" అన్నదామె.
"పెట్టె తెరు" అన్నాడు రిక్షావాడు కఠినంగా.
'అరుస్తాను . ప్రతిఘటిస్తాను. ఇంక నన్ను వదిలిపెట్టు" అన్నదామె.
'అలాచేస్తే నిన్ను పాడు చేసి మరీ వెడతాను. నీ వంటి మీద బట్టలు కూడా ఎత్తుకుని వెడతాను" అన్నాడు రిక్షావాడు.
సుమిత్రకు ఏం చేయాలో తెలియలేదు.
పాపం -- ఆడపిల్ల !
ఆమెకు వేరేదారి ఏమీ లేదు. రిక్షావాడు ఆడపిల్లల్ని ఎలా బెదిరించాలో అలా బెదిరించాడు.
బ్రీఫ్ కేసు తెరుచుకుంది. అందులోని డబ్బు మాత్రమే కాక - "ఖరీదైన బట్టలు కూడా వాడు తీసుకున్నాడు.
"ఇంకో అర్ధరూపాయి ఎక్కవిచ్చి ఆ రాఘవగాడి రిక్షాలో ఎక్కి వుంటే నీకీ కష్టాలుండేవి కాదు. వాడు మహా రూలు మనిషి. అయినా మా కదే ఉపయోగపడుతుంది. మీలాంటి కక్కుర్తి వాళ్ళుండబట్టే మాలాంటి వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి." అన్నాడు రిక్షావాడు.
