Previous Page Next Page 
వసుంధర కథలు-13 పేజి 13


    వెంకన్న పోస్టుమార్టం రిపోర్టు చూడగానే-సుబ్బారావు పని చేసే లాబరేటరీకి వెళ్ళాడు. సుబ్బారావు చనిపోయే ముందు రోజు లాబరేటరీకి వెళ్ళాడు. రోజంతా లాబరేటరీలోనే వున్నాడు. లాబరేటరీలో ఎక్స్-32 విషం వుంది. రెండువందల యాభై గ్రామ్ బాటిల్సు రెండుండాలి లాబరేటరీలో. వాటిని మధుమూర్తి అనే సైంటిస్టు-రసాయనిక ప్రయోగంకోసం తెప్పించాడు.
    వెంకన్న మధుమూర్తిని కలుసుకుని-"వాటితో మీకు పనేమిటి?" అనడిగాడు.
    "నా అనాలిసిస్ లో ఇనుము ప్రతిబంధకం, దాన్ని మాస్కు చేయడానికి అస్కార్బిక్ ఆసిడ్ లాంటి రసాయనాలు చాలా ఉన్నాయి. కానీ నా అనాలిసిస్ లో అవన్నీ ఇంటర్ఫియరవుతాయి. ఎక్స్-32 వల్ల ఇనుము మాస్కవుతుంది. అనాలిసిస్ లో ఇంటర్ఫియరన్సుండదు-" అన్నాడు మధుమూర్తి.
    "కనీ-అలాంటి ప్రమాదకరమైన విషం మీ దగ్గరుండడం-ప్రమాదం కదూ!" అన్నాడు వెంకన్న.
    "ప్రమాదమనుకుంటే ప్రయోగాలు చేయలేం. నా దగ్గర సోడియం, పొటాషియం సయనైడ్సున్నాయి. సెకన్లలో ప్రాణాలుతీసే ఆ విషాలతో కనీసం నెల కొక్క ప్రయోగమైనా చేస్తాను నేను-" అన్నాడు మధుమూర్తి.
    "మరి మీకు భయం వేయదూ?"
    "తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు-ఏ భయమూ ఉండదు-"
    "మీ దగ్గరున్న ఎక్స్-32 యెవరికైనా యిచ్చారా?"
    "లేదు-అది లాకండ్ కీలో యెప్పుడూ నా దగ్గరే ఉంటుంది...."
    "ఇప్పుడూ ఉందా?"
    "వారంరోజుల క్రితం నేను వాడాను...."
    "ఇప్పుడు నేనొకసారి చూడవచ్చా?"
    "ష్యూర్ -" అంటూ లేచాడు మధుమూర్తి. అతడు లేబరేటరీలోని పక్క గదిలోకి వెళ్ళి కొద్ది క్షణాల్లో ఓ రెండు చిన్న సీసాలతో తిరిగి వచ్చాడు. అతడు వెంకన్నకా సీసాలందించాడు. అందులో ఒకటి సీల్డు బాటిల్ ఒకదానికి మాత్రం మూత సులభంగా వచ్చింది.
    "ఇది నేను వాడుతున్నాను. నా ప్రయోగానికి-అరగ్రాము చాలు...." అన్నాడు మధుమూర్తి.
    వెంకన్న పరీక్షగా ఆ సీసనే చూస్తూ-"మనిషి ప్రాణాలు తీయడానికెన్ని గ్రాములు కావాలి?" అన్నాడు.
    "అయిదువందల మిల్లీ గ్రాములు - అంటే అరగ్రాము...."
    "ఈ సీసా మీవద్ద నన్నిట్లింకెవరికైనా తెలుసా?"
    "ఎందుకు తెలియదు? చాలామంది సైంటిస్టులకు తెలుసు. మా పర్చేజ్ డిపార్టు మెంటుకీ, స్టోర్సు డిపార్టు మెంటుకీ కూడా తెలుసు...."
    "ఎవరైనా మిమ్మల్నీ విషం కావాలని అడిగి తీసుకున్నారా?"
    "అడిగితే మాత్రం నేనెందుకిస్తాను?"
    "ప్రయోగాలకని అడిగినా యెవరికీ యివ్వరా?"
    "ఎక్స్-32తో ప్రయోగాలు చేసేవాణ్ణి లాబొరేటరీ మొత్తం మీదా నేనొక్కడినే-" అన్నాడు మధుమూర్తి.
    "అంటే ఈ ఊరిమొత్తంమీద ఎక్స్-32 వున్నవారు మీరొక్కరే! ఆ ఎక్స్-32 ప్రయోగంతో సుబ్బారావు మరణించాడు. సుబ్బారావు ఆఫీసులో ఉండగా ఆఫీసు సమయంలో ఈ విషప్రయోగం జరిగింది. దీనికి మీరేం సమాధానం చెబుతారు?" అన్నాడు వెంకన్న.
    ఉన్నట్లుండి మధుమూర్తి ముఖానికి చెమటలు పట్టాయి-"సుబ్బారావుపై విషప్రయోగం జరిగిందని నాకు తెలియదు..." అన్నాడతడు.
    "మీ కొలీగ్ పోయాడని మీకు సెలవు కూడా యిచ్చారు. అతడెలా పోయిందీ కూడా మీరు తెలుసుకోలేదా?"
    "నేనాఫీసు విషయాలాట్టే పట్టించుకొను. నాలోకమే నాది. ఆఫీసుకు సెలవిచ్చినా - నాకేవో ప్రయోగాలుంటే చూసుకున్నాను తప్ప యింటికీ వెళ్ళిపోలేదు. సంతాప సమావేశానికి మాత్రం వెళ్ళి రెండు నిముషాలు మౌనం వహించాను...." అన్నాడు మధుమూర్తి.
    అతడి మాటలమాయకంగా తోచాయి వెంకన్నకి- "సరే-ఇప్పుడు చెప్పండి-ఎక్స్-32 సుబ్బారావుకి మీరే యిచ్చారా?"
    "నే నెందుకిస్తాను?" అన్నాడు మధుమూర్తి కంగారుగా.
    "ఇచ్చే అవకాశం ఇంకెవ్వరికీ లేదు కాబట్టి- మిమ్మల్నే అనుమానించాలి-" అన్నాడు వెంకన్న.
    మధుమూర్తి చాలా కంగారుపడిపోయాడు. అతడు బాగా ఆలోచించి-"నా లాబరేటరీ అసిస్టెంటు సుధాకర్ కి నేను తరచుగా బీరువా తాళాలిస్తూంటాను-" అన్నాడు.
    వెంకన్న సాలోచనగా-"ఈ సీసాలోని విషం తగ్గితే మీకు తెలుస్తుందా?" అన్నాడు.
    "ఎవరైనా పది పదిహేను గ్రాములు తీసుకుంటే తెలుస్తుంది తప్ప-రెండు మూడు గ్రాములు తీసుకుంటే తెలియదు..."
    "ఇలాంటి భయంకర విషం దగ్గరున్నప్పుడు ప్రతి మిల్లీ గ్రామునూ ఎప్పటికప్పుడు లెక్కించాలని మీకు తెలియదా? తెలుసుకోవడం మీ బాధ్యత కాదా?" అన్నాడు వెంకన్న కఠినంగా.
    "వెంకన్నగారూ! ఇందాకట్నించి మీరు విషం విషం అంటున్నారు. కానీ నాకు సంబంధించినంతవరకూ ఇది విషం కాదు, రసాయనం. ప్రమాదకరమైన ప్రతి రసాయనాన్నీ విషంగా భావిస్తే సైంటిస్టులు ప్రయోగాలు చేయలేరు..."
    "సరే-అదలాగుంచండి. మీరు మీ అసిస్టెంటు సుధాకర్ గురించి చెప్పారు. అతడికీ ఎక్స్-32 అందుబాటులో వుంది. అతడికీ సుబ్బారావుకీ యేమైనా శత్రుత్వముందా?"
    "నాకు తెలియదు. నేను లాబ్ లో యెవరితోటీ యెక్కువ మాట్లాడను. సుబ్బారావుతో కూడా నా పరిచయం అంతంతమాత్రం...." అన్నాడు మధుమూర్తి.
    వెంకన్న సుధాకర్ని కలుసుకుని-సూటిగా విషప్రయోగం గురించి అడిగాడు. సుధాకర్ కంగారుపడి తనకేమీ తెలియదన్నాడు.
    "తెలియదంటే కుదరదు-పోలీసులు నిన్నరెస్టు చేస్తారు...."
    "నేనే పాపం ఎరుగను!" అన్నాడు సుధాకర్.
    "నువ్వేపాపం ఎరక్కపోతే-సుబ్బారావుకి విషప్రయోగమెలా జరిగింది? నీకు, మధుమూర్తికి తెలియకుండా ఇంకెవరైనా ఆ సీసా తీసుకోగలరా?"
    "తీసుకోలేరు సార్!" అన్నాడు సుధాకర్.
    "అయితే నిజం చెప్పు-నువ్వెవరికైనా ఎక్స్-32 ఇచ్చావా?"
    సుధాకర్ తల అడ్డంగా ఊపాడు.
    "బాగా ఆలోచించుకుని చెప్పు ఈ సమాధానంమీద నీ భవిష్యత్తాధారపడి ఉంది-" అన్నాడు వెంకన్న.
    "నాకేం తెలియదు సార్..."
    "సరే-ఈ మాటలతో ఇన్ స్పెక్టర్ శంకర్రావుని కూడా నమ్మించు. నువ్వు అరెస్టవడం కాయం-" అన్నాడు వెంకన్న.
    సుధాకర్ వెంటనే-"మీరు మధుమూర్తి నేందుకు అనుమానించరు?" అన్నాడు.
    "ఎందుకంటే -నీకూ, సుబ్బారావుకీ మాత్రమే శత్రుత్వమున్నట్లు ఆధారాలున్నాయి-" అన్నాడు వెంకన్న.
    "ఎవరు చెప్పారు?"
    "ఎవరు చెప్పారో చెప్పను..." అన్నాడు వెంకన్న.
    సుధాకర్ మాట్లాడలేదు.
    వెంకన్న అతడితో-"బాగా ఆలోచించుకో-చిన్న నిజాన్ని దాచి సాఫీగా సాగిపోతున్న సంసారంలో కల్లోలం సృష్టించుకోకు-" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS