"అది నా చేతుల్లో లేదు...." అన్నాను.
పద్మావతీ నిరుత్సాహపడలేదు. గోపీచంద్ ఆమెకు చాలా పెద్ద జాబితా యిచ్చాడు. వాటిల్లో కొన్నిటి గురించి నాకే తెలియదు.
లోయెర్ ఇన్ కం గ్రూపు వాళ్ళకు ప్రభుత్వం ఒకచోట ఇళ్ళు కట్టి పెడుతోంది. మొత్తం పన్నెండు బ్లాకులు, బ్లాకులో ఎనిమిదేసి ఇళ్ళు వుంటాయి. రెండు అంతస్థుల్లో అన్నీ ఒకరికే కాకుండా నాలుగేసి బ్లాకులు ఒకరికి చొప్పున కాంట్రాక్టు యివ్వాలనుకుంటోంది. ప్రభుత్వం. ఫైలు నేనే చూస్తున్నాను.
కొనుక్కునే వాళ్ళకోకో ఇల్లు ఇరవై వేల రూపాయలకు మించకూడదు. ఇందులో లోయేస్టూ కొటేషన్లూ మూడు ఎన్నిక చేస్తాం. అందరి కంటే తక్కువ అడిగిన మొత్తానికి మిగతా యిద్దరూ చేయగలరో లేదో విచారిస్తాం. పని అప్పగించేస్తాం.
మొత్తం ముగ్గురికి సంబంధించిన వ్యవహారం గావడం వల్ల ఇందులో పెద్దగా రిస్కు కూడా వుండదు.
నేను పద్మావతి దగ్గర వివరాలు తీసుకున్నాను.
"పద్మా! ఈ విషయములో నేను నీకు తప్పక సాయపడగలను--" అన్నాను.
"అయితే మన పెళ్ళి ఖాయం-" అంది పద్మావతి "
మగాడు ఆడదాని గురించి ఆలోచిస్తాడు. ఆడది పెళ్ళి గురించి ఆలోచిస్తుంది. పెళ్ళి చేసుకోకపొతే పద్మావతి నాకు దక్కని పక్షంలో ఆమెను పెళ్ళి చేసుకోవాలనే అనుకున్నాను.
"పెళ్ళంటే నూరేళ్ళ పంట. నువ్వు నా గురించి బాగా ఆలోచించుకొన్నావా?" అన్నాను.
"ఆలోచించుకున్నాను, నువ్వు లేనిదే నేను బ్రతకలేను..."
పద్మావతి లాంటి అందమైన యువతి పెదవులు కదలిక లోంచి వచ్చిన ఆ మాటలు నాకు కలిగించిన పరవశమింతా అంతా కాదు. అంత పరవశంలోనూ నేను దూరాలోచన చేస్తూనే వున్నాను. దురాలోచన వున్నవాడికి దూరాలోన తప్పనిసరి.
"పద్మా మీ నాన్నకు చెప్పు. రెండు రోజుల్లో మన పెళ్ళి జరిగిపోతుంది. నీవు నన్నింతగా ప్రేమిస్తున్నావని తెలిసేక ఆగలేను ---" అన్నాను.
పద్మావతి తనకు మాత్రమే సాధ్యపడే అందమైన నవ్వుతో -- "నీవు నా మనసు చదవగలిగితే తొందరపాటు నీది మాత్రమేనని అనుకోవు --" అంది.
8
మర్నాడాఫీసులో పద్మావతి చెప్పిన కేసుకు సంబంధించిన ఫైల్సు శ్రద్దగా పరీక్షించాను. టెండర్స్ రావడాని కింకా పన్నెండు రోజులు గడువుంది. దీనికోసం ఊళ్ళో ఇద్దరు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. అంతవరకూ వచ్చిన వాటిలో లోయేస్ట్ కొటేషన్ మొత్తం నోట్ చేసుకున్నాను.
ఆరోజు పద్మావతి ని కలుసుకుని క్లుప్తంగా వివారాలు చెప్పాను, ఆమె సంతోషంగా -- "నూతన్ -- నీకెలా థాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు. నా చుట్టూ వున్న ఆడపిల్లలందరికీ లాగే పెళ్ళి చేసుకొని మామూలు జీవితం గడిపే అవకాశం అసలంటూ నాకోస్తుందా అని భయపడ్డాను. నీ పరిచయం నా అదృష్టం ...." అంది.
"నేను మన పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నాను....." అన్నాను.
"ఊ" అంది పద్మావతి సిగ్గుపడుతూ.
"కానీ ఒక యిబ్బంది వుంది ..." అన్నాను. అప్పుడు పద్మావతీ ముఖముఖాలు గమనిస్తూ --" ఈ పెళ్ళికి మా పెద్ద లొప్పుకోరు ...." అన్నాను మళ్ళీ.
పద్మావతీ కళ్ళలో కంగారు కనపడింది -- "ఎందుకని?"
"నాకు చాలా పెద్ద పెద్ద సంబంధాలోస్తున్నాయి. లక్ష రూపాయాలు కట్న మివ్వడానికి సిద్దంగా వున్న వాళ్లిద్దరున్నారు...."
"అయితే మన పెళ్ళి జరగదా?" అంది పద్మావతి.
"పద్మా ---నీకంటే నాకు కట్న మెక్కువ కాదు -- లక్ష రూపాయలు కాదు, పది లక్షలిచ్చినా నాకు నువ్వే కావాలి ...."
పద్మావతి మాట్లాడలేదు.
"ఈ ప్రపంచాన్నంతా ఎదిరించైనా సరే నేను నిన్నే పెళ్ళి చేసుకుంటాను ...."
"వద్దు నూతన్ -----" అందామె --"నేనంత విలువ చేయను. ఈరోజు కాకపోయినా మరో రోజున లక్ష రూపాయల విలువా నీకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ప్రేమ కూడా డబ్బు తర్వాతనే ...."
"నా విషయంలో మాత్రం అలా జరగదు...." అని ఆమెకు నా గొప్పతనం గురించి వివరించి చెప్పాను.
ఆఫీసులో నా సీటే నాకు లక్షలకు లక్షలు సంపాదించి పెట్టగలదు. అయినప్పటికీ నేను కొన్ని ఆదర్శాలు ప్రేమిస్తూ ఆ ప్రేమ కోసం ఆ డబ్బును నిర్లక్ష్యం చేస్తున్నాను. ఉద్యోగంలో చేరాక మొదటిసారిగా ఈ టెండర్ సమాచారం లీక్ చేశాను. అదైనా డబ్బు కోసం కాదు, ప్రేమ కోసం, అది సామాన్యమైన ప్రేమ కాదు, పద్మావతీ లాంటి అపురూప సౌందర్యవతి పై ప్రేమ! ఆ ప్రేమ కోసం కట్నం డబ్బు లక్షలకై ఆశపదతానా?
పద్మావతి నేను చెప్పిందంతా విని -- "మా నాన్న నిన్ను చూసిన తొలిరోజునే మనకీడూ జోడూ బాగుంటుందని అన్నాడు. అప్పుడు నేననుకోలేదు -- నువ్వు దక్కుతావని! నేను గోపీచంద్ విష వలయంలో చిక్కు కున్నాక -- నన్నందులోంచి ఏ మగాడూ తప్పించలేడని నిరాశ పెంచుకున్నాను. కానీ నువ్వు ..." అంటూ ఇక వాక్యం పూర్తీ చేయలేక ఆగిపోయింది.
"పద్మా! మన వివాహం జరుగుతుంది. కానీ అందుకే ఆర్భాటమూ వుండదు. రహస్యంగా గుళ్ళో పెళ్ళి చేసుకుందాం. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. తర్వాత కూడా మన వివాహానికి ప్రచారముండకూడదు. నువ్వు మీ ఇంట్లోనే వుంటావు. అలా కొంతకాలం గడిచేక నెమ్మది మీద మావాళ్ళకు నచ్చజెప్పి నిన్ను మా ఇంటికి తీసుకుని వెడతాను -" అన్నాను.
"నువ్వెలాగంటె అలాగే ...." అంది పద్మావతి.
"రేపే మన పెళ్ళి !" అన్నానుత్సాహంగా.
పద్మావతి నవ్వి -- "రేపే యెలా కుదురుతుంది. మనది టెండర్ లవ్ అని మర్చిపోతున్నావు -" అంది.
టెండర్ లవ్ అన్నమాట విని ఉలిక్కిపడ్డాను. టెండర్ అంటే - సున్నితమైనది, మృదువైనది సులభంగా భంగపడేది. మా ప్రేమ గురించి అర్ధం చేసుకునే కావాలని ఈ మాటలన్నదా?
"మనది టెండర్ లవ్ కాదు . వెరీ స్ట్రాంగ్ లవ్...." అన్నాను.
పద్మావతీ తడబడి -- "అదే నా ఉద్దేశ్యమది కాదు. టెండర్ లవ్ అంటే -- టెండర్ కోసం లవ్ అని .... ఆ హౌస్ బిల్డింగ్ టెండర్ తేలేదాకా అంటే ఇంకో పన్నెండు రోజులా దాకా మన పెళ్ళి జరగదు ...." అంది.
నేను తేలికగా నిట్టుర్చాను. నా మనసులో దుర్మర్గాముంది కాబట్టి కానీ ఆమె అన్నమాట వెంటనే అర్ధం కావాల్సి వుంది. అయినా తెలిసో తెలియకో మామధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారం అసలు స్వరూపాన్ని పద్మావతి చక్కగా వివరించగలిగింది.
మరి మాది నిజంగా టెండర్ లవ్!
9
నేను శతభిషాన్ని కలుసుకున్నాను.
"శతభిషాన్ని చాలామంది శతభిషం అంటారు.
ఆడపిల్లల్ని మోసం చేసి వదిలి పెట్టడంలో అందే వేసిన చేయి వాడు.
శతభిషానికి అందం లేదు కాని చొరవ వుంది. ఆడపిల్లల్ని అందంతో కంటే చొరవతో బాగా లొంగ తీసుకోవచ్చునని వాడి అభిప్రాయం. అమ్మాయిల వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి అది సరైనదే అనుకోవచ్చు. ప్రేమ పేరు చెప్పి మోసం చేసి ఎందరినో వ్యభిచార గృహాలకు అమ్మేశాడు వాడు.
అప్పుడప్పుడు ఆడపిల్లలను వశ పర్చుకునేందుకు నావంటి అందగాళ్ళ సాయం కూడా తీసుకుంటుంటాడు వాడు. నాకు అందం, చొరవ కూడా వుంది. వాడి సహకారంతో నేనూ ఓ ఇద్డరాడపిల్లల్ని మోసం చేశాను. శతభిషం తో సుఖమేమిటంటే మోసపోయిన ఆడదాని బాధ మనకుండదు. వాడే చూసుకుంటాడు.
పద్మావతీ విషయంలో శతభిషం సాయం కోరానంటే అందుక్కారణం మాత్రం వేరే వుంది.
దొంగ పెళ్ళిళ్ళు చేయించడానికి వాడేర్పాటు చేయగలడు.
వాడికి అందుబాటులో నాలుగైదు దేవాలయాలున్నాయి. అక్కడ పెళ్ళి జరిగితే -- పూజారి కానీ, తంతు జరిపించిన బ్రాహ్మణుడు కానీ ఆతర్వాత సాక్ష్యం చెప్పరు, అంటే పెళ్లి శాస్త్రం ప్రకారమే జరుగుతుంది కానీ పెళ్ళికి సాక్ష్యముండదు. ఈ పెళ్ళిళ్ళ వల్ల ఆడపిల్లల్ని మోసగించడం సులభమై పోతుంది. తనకు నిజంగా పెళ్ళయి పోయిందనుకొని - ఆ పిల్ల ఆతార్వత నుంచి మొగుడెలా చెబితే అలా వింటుంది.
పద్మావతి విషయంలో శతబిషాన్ని కలుసుకోవాలా వద్దా అని ఆలోచించాన్నేను. ఎందుకంటె పద్మావతీ అందం ఆమె అంటే కొంత గౌరవాన్ని కూడా కలిగించింది. ఆమెను నిజంగానే ప్రేమిస్తున్నానా అని కూడా అనిపిస్తోంది. అయితే ఆమె నాకు కావాలి. పెళ్ళి చేసుకుంటే తప్ప ఆమె నాకు దక్కదు. ఈ పెళ్ళిలో నాకు శతభిషం సాయం తప్పదు.
"అమ్మాయి ఫోటో చూపించు ...." అన్నాడు శతభిషం.
అయిష్టంగానే చూపించా.
"మంచి పిట్టను పట్టావు. నాకు మంచి బిజినెస్సు ...." అన్నాడు శతబిషం.
