Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 13


    "అయ్యో-దానికేముంది? మాది పెద్ద యిల్లు మీరుండడానికేమీ అభ్యంతరంలేదు. మావారూరికే అలా అంటారు కానీ ఇందులో నా పెత్తనమేముంది?" అని నవ్వింది శారద. ఆమె హేమను బాగా ఆదరించింది.
    హేమ ఆలోచిస్తోంది. తను ముద్దుపెట్టుకోగానే భర్తకు ఫోన్ చేసి చెప్పగలిగిందామె. కానీ తనను ఆమె గుర్తించలేదు. అంటే తనెవరో ఆమెకు తెలియదు. తనకూ, ఆమె భర్తకూ జరిగిన సంభాషణ ఆమెకు తెలియదు. ఎటొచ్చీ అదొక్కటే ఆమెకు తెలుసు.
    ఎలా తెలుస్తోంది?
    ఆమె మనసు నిజంగా భర్త దగ్గరుంటే అది జరిగిందేమిటో చూడడమేకాక-తనను కూడా చూడ'గలిగి ఉండాలి. అంటే-ఎవరో ఏజంట్లు ఆమెకు నిముషాల మీద వార్త నందిస్తున్నారు. అంత నిముషాలమీద వార్త లెలా చేరుతున్నాయి? ఏదైనా వైర్ లెస్ ఏర్పాటు ఉందా? భర్త ప్రవర్తన గురించీ తెలుసుకోవడానికి భార్య అంత కష్టపడుతుందా?
    రఘుని ఎవరు కనిపెడుతున్నారు? ఆ కనిపెట్టినవారు దృశ్యాలనే చూస్తారా? మాటలు కూడా వింటారా? మాటలు కూడా వినే పక్షంలో తమ పథకం కూడా వారికి తెలిసిపోవాలి. అప్పుడీమె తగు జాగ్రత్తలో ఉండాలి-
    అయితే శారద, హేమను మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. ఆమెతో సరదాగా గడిపింది. సాయంత్రం భర్త యింటికి రాగానే-"ఏమిటి-అందరిదగ్గరా మీరు భార్యా విధేయుడన్న సర్టిఫికెట్ సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు?" అంటూ హేమను చూపించింది.
    "మరి కాదా?" అన్నాడు రఘు.
    "అవునో కాదో మీకే తెలుసు-" అంది శారద.
    రఘు హేమకు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించాడు. హేమకూడా శారదతోనే ఎక్కువగా తిరగటానికి ప్రయత్నించింది. రఘుపట్ల వీలైనంత తక్కువ ఆసక్తిని ప్రకటించింది. భోజనాలవద్ద ఆమె శారద వంటకాల్ని ప్రశంసించింది. శారద ఇల్లు సద్దుకున్న విధానాన్ని కూడా ఆమె మెచ్చుకుంది. తిరిగివెళ్ళాక తన ఇంట్లో అలాంటి మార్పులు చేయాలన్నదామె. ఒకటి రెండు వంటకాలు కూడా యెలా తయారుచేయాలో  శారదను అడిగి తెలుసుకుందామె.
    శారదకు హేమ బాగా నచ్చింది.
    రాత్రి తొమ్మిదిన్నరకు తనకు నిద్రవస్తోందని పడుకుంది హేమ.
    భార్యాభర్తలు తమ పడకగదికి వెళ్లారు. ఇంట్లో ఇంకెవ్వరూ లేరు. ముగ్గురే మనుషులు.
    శారదకు రోజూ రాత్రి పడుకోబోయేముందు మంచి నీళ్ళు త్రాగడం అలవాటు. ఆమె బాత్రూంకు వెళ్ళిన సమయంలో నీళ్ళలో మత్తుమందు కలిపాడు రఘు.
    శారద వచ్చి నీళ్ళు త్రాగకుండానే పడుకుంది.
    రఘు ఆమెకు నీళ్ళ గురించి గుర్తు చేయాలనుకున్నాడు. కానీ గుర్తుచేస్తే ఆమె అనుమానిస్తుందేమో!
    మంచినీళ్ళ గురించి పట్టించుకోకుండా ఆమె అతడితో కబుర్లు మొదలెట్టింది. హేమ యెంత మంచిదో, ఆమె తనను ఎన్నివిధాలుగా మెచ్చుకుందో, తనలోని ఏయే గుణాలామెను ఆశ్చర్యపరచాయో చెప్పుకుపోతోంది రఘుకు. ఆమె హేమ గురించి మాట్లాడుతూంటే రఘు శరీరం వశం తప్పుతోంది. కొద్దిసేపట్లో తామిద్దరం అమరసుఖాలనుభవించబోతున్నారు. కానీ ఆ కొద్ది సేపటికోసం తనిప్పుడు ఎంతసేపు ఎదురుచూడాలో?
    "అస్తమానూ ఆ హేమ గురించికాక-మరింకేమైనా మాట్లాడరాదూ?" అన్నాడు రఘు.
    "పరాయి ఆడదాని తలపువస్తే శ్రీవారి మనసు వశం తప్పుతుందని నాకు తెలుసు. కానీ అది మంచి బుద్ది కాదు-...." అంది శారద అతణ్ణి కవ్విస్తున్నట్లు.
    రఘు తడబడ్డాడు. శారదకు తమ పథకం తెలుసా, తెలియదా? అయినా దూరంగా జరిగినవన్నీ తెలుసుకో గల్గుతున్న ఆమె తమ పధకాన్ని ఊహించలేదా? ఊహిస్తే పరిస్థితి నింతవరకూ ఎందుకు రానిచ్చింది? తన్ను రెడ్ హాండెడ్ గా పట్టుకుందామనా?
    "నీ యిష్టం. పోనీ ఆ హేమ కబుర్లే చెప్పు-నీతో యేమన్నా తగువే-" అన్నాడు రఘు విసుగ్గా.
    హేమ కబుర్లు కాకపోయినా శారద యేదో ఒకటి వాగుతూనేవుంది తప్ప మంచినీళ్ళు తాగడంలేదు.
    "అబ్బ-దాహంవేస్తోంది-" అంటూ లేచాడు రఘు. అప్పుడే శారదకు తన దాహం సంగతి గుర్తువచ్చి నట్లుంది-"అవునండీ-నాకూ దాహం వేస్తోందండీ" అంది.
    "నీకూ తెస్తానుండు-"అంటూ మంచం దిగాడతను. పక్కనే ఉన్న నీళ్ళ సంగతి అతడికి గుర్తుంది. అయితే వాటి సంగతి చెబితే భార్య యేమనుకుంటుంది? అవి తన్నే తాగమని తను వెళ్ళి నీళ్ళు తెస్తానంటుంది.
    "ఈ రోజేమిటి-మీరింత బుద్ది మంతులైపోయారు?" అంది శారద.
    "నీ అనుమానమేగానీ నేనెలాగూ బుద్ది మంతున్నే!" అన్నాడు రఘు-"అయినా ఇందులో బుద్ది దేముంది? ఎలాగూ నేను మంచినీళ్ళు తాగటానికి వెళ్ళాలి..." అని ఉలిక్కిపడ్డట్లు-"పోనీ మళ్ళీ నీకే అనుమానాలొస్తాయో యేమో-కూడా నువ్వూ రాకూడదూ...." అన్నాడు.
    "అక్కర్లేదు వెళ్ళండి. ఈ రోజు నాకేమిటో బద్ధకంగా ఉంది. అయినా నా మనసు మిమ్మల్ని వెన్నంటి ఉండగా కూడా రావలసిన అవసరం నాకు లేదు-" అంది శారద. అది హెచ్చరికో, మరేమిటో రఘుకి అర్ధం కాలేదు.
    ఇప్పుడతనికి ఒక్కటే బాధ. శారదచేత ఆ నీళ్ళెలా తాగించాలీ అని. అంతరాంతరాల్లో శారదకు తమ పథకం తెలిసిపోయిందని అనుమానంగా కూడా ఉంది. అనుకున్నది జరగదనే బెంగ కూడా ఉంది.
    అతను ఓ గ్లాసుడు నీళ్ళు తాగి మరో గ్లాసుడు నీళ్ళతో గదిలోకి వచ్చాడు. అప్పుడే శారద గదిలోని నీళ్ళుతాగి కాళీ గ్లాసును పక్కన పెడుతోంది. అతన్ని చూడగానే "మరిచిపోయాను. నే నెప్పుడూ నీళ్ళిక్కడే పెట్టుకుంటానుగా-" అంది వారధ.
    "నాకు గుర్తుంది. కానీ అవి తాగేశాక ఇంకా నీళ్ళు కావాలేమో అనుకున్నాను. అవున్నాయని తెలిస్తే నేనే అవి తాగేవాన్ని-" అన్నాడు రఘు. అతడికి మనసులో సగం సంతోషంగానూ, సగం అనుమానంగానూ ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS