Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 13

 

                          నిజం తెలుసుకోకు !

                                                                    వసుంధర
    సుధాకర్ జైల్లో ఉన్నాడన్న మాటే కాని అతని మనసు ఎప్పుడో చేరవలసిన చోటు చేరుకుంది. చేరుకొని కళ్యాణిని పలకరిస్తోంది. యోగ క్షేమాలనుడుగుతోంది. ఆప్యాయతను ధారగా కురిపిస్తోంది.
    కళ్యాణి సుధాకర్ కు ఒక్క గానొక్క చెల్లెలు. ఆ అన్నా చెల్లెళ్ళ కు యింకెవ్వరూ లేరు. ఇద్దరూ ఒకరి కొకరు  గాడంగా అభిమానించుకుంటున్నారు.
    సుధాకర్  దూర ప్రాంతాలలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ప్రతి నెలా కళ్యాణి అవసరాలకు  డబ్బు పంపిస్తుంటాడు. ఏడాది కొకసారి వెళ్ళి ఆమెను చూస్తుంటాడు.
    ఇప్పుడు సుధాకర్ వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు. కళ్యాణి అతని కంటే ఎనిమిదేళ్ళు చిన్న.
    ఏడు సంవత్సరాల క్రితం సుధాకర్ తండ్రి చనిపోయాడు. తల్లి కళ్యాణిని కన్న సంవత్సరానికే కన్ను మూసింది. అందువల్ల చిన్నప్పట్నించి సుధాకర్ కళ్యాణిని కంటికి రెప్పలా సాకాడు. ఆమె ఏడిస్తే అతని ప్రాణం విలవిల్లాడి పోతుంది. ఆమె నవ్వితే అతని ముఖంలో పూలు వికసిస్తాయి. కళ్యాణికి చిన్న దెబ్బ తగిలినా, రవంత కష్టం కలిగినా అతడు సహించలేడు. అది విచిత్రమైన అనుబంధం.
    సుధాకర్ బియ్యే ప్యాసు కాగానే నార్తిండియా లో ఉద్యోగం రావడము, తండ్రి పోవడమూ ఒక్కసారే జరిగాయి. అప్పటికి కళ్యాణి వయసు పన్నెండేళ్ళు.
    సుధాకర్ పెళ్ళి చేసేసుకుని కళ్యాణిని కూడా తీసుకుపోతే బాగుంటుందని కొందరు బంధువులు సూచించారు. కళ్యాణి ఓ యింటి దయ్యేవరకు పెళ్ళి చేసుకోవడం  సుధాకర్ కు యిష్టం లేదు. దూర ప్రాంతంలో తన ఒక్కడితో ఉండడం వల్ల కల్యాణి కి ఇబ్బంది అని అతను భావించాడు. అందుకే ఆ ఊళ్ళోని బంధువుల యింట ఆమెను వదిలి పెట్టాడు.    
    సుబ్బరామయ్య గారు దూరపు వరుసలో కళ్యాణి కి పెద్దనాన్న అవుతాడు. ఆయనకు డబ్బయితే లేదు కాని హృదయం నిండా మంచితనమే ఉంది. మంచితనం ఆయన్ని మరింత పేదవాడ్ని చేస్తోంది కూడా.
    సుబ్బరామయ్య గారేదో ఆఫీసులో చిన్న గుమస్తా గా ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురాడ పిల్లలు. మగపిల్లలు లేరు. ఆడపిల్లల పెళ్ళి గురించి ఆయనకు బెంగ ఉంటుంది.
    కానీ ఇటీవలే అయన ఆలోచనల్లోనూ ఆర్ధిక పరిస్థితుల్లోనూ కూడా మార్పు వచ్చినట్లుంది. ఆఫీసులో లంచాలు పట్టడం మొదలుపెట్టాడో ఏమో , ప్రస్తుతం ఆయనకు రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి. ఇటీవలే అయన మొదటి కూతురు పెళ్ళి కూడా చేశాడు.
    కళ్యాణి నిమిత్తం సుబ్బరామయ్యగారికి కొంత డబ్బు పంపిస్తుండేవాడు సుధాకర్. అదికాక వేరే కొంత కళ్యాణికి కూడా పంపిస్తుండేవాడు.
    పదిహేనో యేట మెట్రిక్ ప్యాసయింది కళ్యాణి. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు టైపూ, షార్టు హ్యాండు నేర్చుకుని ఓ కంపెనీలో స్తేనో గ్రాఫర్ గా చేరింది.
    పదిహేనేళ్ళకే పద్దెనిమిదేళ్ళ పిల్లలా ఉండేది కళ్యాణి. ఆమెకు పొడుగు, పొడుగుకు తగ్గ అవయవ పుష్టి అన్నింటికీ మించిన కనుముక్కు తీరు, ఆ తీరుకు సరిపడ  శారీర ఛాయా ఇవన్నీ కలిసి ఆమెను అందగత్తెల  లిస్టులో చేర్చేశాయి. ఆ అందానికి కావలసిన ఇతర హంగులన్నీ కళ్యాణి సమకూర్చుకునేది. ఆమెను చూడగానే దివి నుంచి భువికి దిగివచ్చిన అప్సరస అని చాలామంది అనుకునేవారు.
    తలచుకుంటే కళ్యాణి పెళ్ళి పెద్ద కష్టం కాదని సుబ్బరామయ్య, సుధాకర్ కు రాస్తుండేవాడు. అయితే చాలా పెద్ద సంబంధం చేయాలని సుధాకర్ ఆశయం. అందుకవసరమైన డబ్బు పోగు చేయడానికి అతడు దూరప్రాంతంలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. అతని వద్ద యిప్పుడు సుమారు పన్నెండు వేల రొక్కం ఉంది. అవసరమైతే అప్పు చేసి కొద్ది సంవత్సరాలలో తీర్చగల ఆదాయం ఉంది.
    ఈ పర్యాయం కళ్యాణి పెళ్ళి కుదిర్చేయాలని సుధాకర్ కి అనుకుంటున్నాడు. చెల్లెల్ని పెళ్ళి కూతురు ముస్తాబులో ఊహిస్తుంటే అతని మనసు చలించి పోతోంది.
    మనసు కంటే ఆలస్యంగానే అయినప్పటికీ సుధాకర్ మనిషి కూడా మొత్తం మీద చేరవలసిన ఊరు చేరుకున్నాడు. స్తేషన్లోంచి బయట అడుగు పెట్టి ఓ రిక్షాలో కూర్చుని వెళ్ళవలసిన చోటు చెప్పాడు.
    రిక్షా శరవేగంతో దూసుకు పోయి ఓ యింటి ముందు ఆగింది. సుధాకర్ రిక్షా దిగి డబ్బులిచ్చి యింటి వైపు తిరిగి నిరుత్సాహ పడిపోయాడు. ఇంటికి తాళం పెట్టి ఉంది.
    సూట్ కేసు అరుగు మీద  పెట్టి దిగాలుగా కూర్చున్నాడు సుధాకర్. తను వస్తున్నట్లు ముందుగానే ఇంటికి ఉత్తరం రాశాడు. అందరికీ తన రాక గురించి తెలిసే ఉండాలి.
    అతనింకా ఏదో ఆలోచనల్లో ఉండగానే ఎదురింటి వాళ్ళబ్బాయి పరుగున వచ్చి - "నమస్కారమండీ! ఇదేనా రావడం--" అన్నాడు.
    "అవునోయ్ - యింటికి తాళం పెట్టి ఉంది ..."
    "తాళం చెవి నా దగ్గరుందండి. సుబ్బరామయ్యగా రూళ్లో లేరు. కళ్యాణి ఊళ్ళోనే ఉంది. నిన్న సాయంత్రం మా యింట్లో ఈ తాళం చెవి ఇచ్చి వెళ్ళింది. సినిమాకు వెడుతున్నానని చెప్పింది. మళ్ళీ యింతవరకూ రాలేదు ...." అన్నాడా అబ్బాయి.
    సుధాకర్ తాళం చెవి అందుకుని -- "ఎప్పుడూ యిలా జరుగుతుంటుందా?' అన్నాడు.
    "లేదండి. కానీ యిలా తాళం చెవి యిచ్చి వెడుతుండడం యింట్లో అందరికీ మామూలే! పది గంటలయ్యే సరికి ఉదయం పూట ఇంట్లో ఆడా , మగా ఎవ్వరూ ఉండదు కదండీ - అందుకని తాళం చెవి మా ఇంట్లో ఇచ్చి వెడుతుంటారు ..." అన్నాడా అబ్బాయి.
    ఆ విషయం సుధాకర్ కూ తెలుసును దొడ్డమ్మగారేమో కుట్టు పనులు నేర్చుకుంటోంది. కళ్యాణి స్టెనో గ్రాఫర్. ఆడపిల్లలిద్దరూ సేల్సు గరల్సు గా ఏదో షాపులో పని చేస్తున్నారు. సుబ్బరామయ్య కు ఉద్యోగం.
    "పెద్దనాన్న గారేన్నాళ్ళ నుంచి ఊళ్ళోలేరు?"
    "ఓ వారం రోజులవుతుందండీ...."
    ఉత్తరం తను ఆఫీసు అడ్రసుకీ రాశాడు. సుబ్బరామయ్య గారూల్లో లేరు కాబట్టి ఆయనకీ విషయం తెలియదు. ఉత్తరం అయన ఆఫీసుకు రాశాడు కాబట్టి కళ్యాణికి విషయం తెలిసి వుండదు.
    "అయితే కళ్యాణికి నేను వస్తున్నానని తెలుసుండదు ...." గొణుక్కుంటున్నట్లుగా అన్నాడతను.
    "తెలుసునండి. మీరీ వేళ ఈ సమయంలో వస్తారని కళ్యాణి చెప్పింది. నిన్న తాళం చెవి యిచ్చేటప్పుడు ఈ విషయం చెప్పి - ఒకవేళ తను అంతవరకూ ఇంటికి రాలేని పక్షంలో మీకీ తాళం చెవి యివ్వమని తనే చెప్పింది" అన్నాడా అబ్బాయి.
    'అంటే కళ్యాణికి ముందుగానే తెలుసునన్నమాట. తను ఎక్కువసేపు బయట వుండబోతున్నానని. అన్నయ్యోస్తున్నాడని తెలిసీ ఆపుకోలేని ఆ రాచకార్యమేమిటో అనుకున్నాడు సుధాకర్. ఏది ఏమైనప్పటికీ అతను అసంతృప్తిగానే అక్కణ్ణించి కదిలి యింటి తాళం తీశాడు. ఇంకా అక్కడే నుంచున్న ఆ అబ్బాయి కి థాంక్స్ చెప్పి- సూట్ కేసు తో సహా యింట్లో ప్రవేశించాడు.
    కల్యాణిని చూడాలని సుధాకర్ మనసు తహతహ లాడి పోతోందని సుధాకర్ కు తెలుసు. అందుకే కళ్యాణి ఎక్కడికి వెళ్ళిందో , ఏమయిందోనని అతను ఆదుర్దా పడుతున్నాడు.
    ఆ యింట్లో కళ్యాణికి ఓ గది ప్రత్యేకించారు. తనకు తోచిన విధంగా కళ్యాణి ఆ గదిని అలంకరించుకుంటుంది. ఇతరు లెవ్వరూ ఆమె అనుమతి లేనిదే ఆ గదిలో ప్రవేశించకూడదు.
    సుధాకర్ మనసులో ఒక కొంటె ఆలోచన వచ్చింది. అతను చెల్లెలి కోసం ఒక మంచి బహుమతి తెచ్చాడు. ఆ బహుమతి ఒక అట్ట పెట్టెలో ఉంది. ఆ పెట్టె మీద "చెల్లెలి కి ప్రేమతో - అన్నయ్య సుధాకర్ !" అని రాశాడు. ఆ బహుమతి ని చెల్లెలి గదిలో వుంచి తమ యింట్లోంచి బయటకు వెళ్ళిపోయి సాయంత్రం వరకూ రాకూడదు. కళ్యాణి వచ్చి చూసుకుని ఆశ్చర్యపోతుంది.
    ఇలా చేయడానికి సుధాకర్ కు మరీ ఎక్కువ ఇష్టం లేదు. ఎందుకంటె యింకో అరగంటలోనే చెల్లెలు వచ్చేస్తేనో ...అప్పుడు వెంటనే ఆమెను చూసే అవకాశం పోతుంది.
    ఇలా అనుకుని చెల్లెల్ని వెంట నే చూసే ఆనందం నుంచి దూరం కాకుండా ఉండడానికి సుధాకర్ అక్కడే మరో అరగంట సేపు ఎదురు చూశాడు. కానీ ఎక్కడా కళ్యాణి వచ్చే జాడ కనిపించలేదు. నిరుత్సాహం అతనిలో కోపాన్ని, విసుగునూ ప్రవేశపెట్టింది. తాననుకున్న పని చేయడం మినహా మరేమీ లేదని అతనికి తోచింది.
    సుధాకర్ సూట్ కేసు తెరిచి అందులోంచి అట్టపెట్టె బయటకు తీశాడు. అందులోని బహుమతి చూసి చెల్లెలు కి కలిగే భావ సంచలనాన్ని తలచుకుని క్షణకాలం పాటు అతను పరవశించాడు. తర్వాత ఆ అట్టపెట్టెతో నెమ్మదిగా కళ్యాణి గదిలోకి ప్రవేశించాడు. గదిలో ప్రవేశిస్తూ అతని కళ్ళ బడ్డ దృశ్యం అతన్ని ఆనంద పరవశుడిని చేసింది. గదిలో మంచం మీద ఒక యువతి పడుకుని ఉంది. ఆమె కట్టుకున్న చీర సుధాకర్ కి బాగా గుర్తే! అది అతను కళ్యాణి కోసం కొన్నది. ఏ పరిస్థితుల్లోనూ కళ్యాణి గది లోకి మరొకరు ప్రవేశించరు.
    సుధాకర్ కు కళ్యాణి కొంటెతనం అర్ధమైపోయింది. ఈ విధంగా తన నామె ఆశ్చర్యపరచాలను కుందన్న మాట! అయితే యింటి బయట తాళం పెట్టి యింట్లో కి ఎలా వచ్చింది?
    సుధాకర్ ఎక్కువగా ఆలోచించలేదు. అందుకేదో పద్దతి నవలంబించి ఉంటుంది. లేదా మరుతాళం చెవి ఆమె వద్ద ఉండి వుంటుంది. ముందు తను చెల్లెల్ని చూడాలి .
    ఎడం చేత్తో అట్ట పెట్టిని పట్టుకుని ఒక్క అంగలో మంచాన్ని సమీపించి కుడి చేత్తో ఆమె నడుం మీద కితకితలు పెడుతూ - 'అమ్మ దొంగా -- ఇక్కడ పడుకున్నావా?" అన్న సుధాకర్ ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగా అతని చేతిలోని అట్టపెట్టె జారిపడింది.
    అతని ఉలికి పాటుకు కారణం ఆ యువతిలో చలనం లేకపోవడం కాదు. ఆమె శరీరం మంచు కన్న చల్లగా ఉండడం. చటుక్కున అతనామెను ఇటు వైపు తిప్పాడు.
    జీవకళ లేని ఆ ముఖం నిస్సందేహంగా కల్యాణిది! ఆమెను అట్నించి ఇటు తిప్పడం లో అక్కడే ఉన్న ఒక కాగితం బయల్పడింది.
    "నా చావుకు యెవ్వరూ బాధ్యులు కారు. ఇది ఆత్మహత్య !"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS