Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 13

 

    "అయితే ఇప్పుడు మనం చేయగల్గిందేముంది?" అంది శోభ.
    "ఉంది. నీకూ నిద్ర పట్టటం లేదంటున్నావుగా పద చెబుతాను" అన్నాను.
    శోభ కూడా లేచింది. ఇద్దరం పెరట్లో కి వెళ్ళాం . తవ్విన గోతిలో కొద్దిగా మట్టి వేసి పక్కనే వదిలేసిన కొబ్బరి మొక్కను పాతి మళ్ళీ లోపలకు వచ్చి మామా మంచాల మీద పడుకున్నాం. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇద్దరకూ కూడా నిద్ర పట్టేసింది.
    నాకు ఉదయం అయిదున్నర గంటల ప్రాంతంలో మెలకువ వచ్చింది. అప్పటికి శోభ ఇంకా నిద్రపోతూనే వుంది. నేను లేచి పెరట్లోకి వెళ్ళాను. కొబ్బరి మొక్క పాతడం వల్ల పెరడు అందం వచ్చిందని పించింది.
    నేను ముఖం కడుక్కుంటుండగా శోభ వచ్చి పలకరించింది --" ఎంత సేపయింది నువ్వు లేచి" అనడిగింది ఆత్రుతగా.
    "ఇప్పుడే లేచి ముఖం కడుక్కుంటున్నాను--" అన్నాను.
    "అమ్మయ్యా నీకూ నాలాగే మంచి నిద్రే పట్టిందన్న మాట -- "అంటూ తన దృష్టి దొడ్డి చుట్టూ ప్రసరింప చేసి "కొబ్బరి మొక్క చాలా అందంగా ఉంది కదూ! ఈ రోజు సాయంత్రం దాన్ని సరైన స్థానంలో పాతాలి --" అంది.
    "పోనీ అక్కడే వదిలేస్తేనో --" అన్నాను.
    "భలే దానివే, అంత రాయి అడ్డుగా వుంటే ఆ మొక్కేం బ్రతుకుతుంది?"
    "ఆ రాయి ఎంత పెద్దదో మనకి తెలియదు . తవ్వి బయటకు తీయ్యడానికి ప్రయత్నించి వుండవలసింది --" అన్నాన్నేను.
    'అబ్బే -- అంత లోతున్న రాయి చిన్నదిగా ఉండదు. తవ్వి బయటకు తీయడం కష్టం. ఇలాంటి విషయాల్లో నాకు చాలా అనుభవం. చిన్నతనంలో మా ఇంట్లో అందరం దొడ్డి పని బాగా చేసేవాళ్ళం. తవ్వడాలూ, చేక్కడాలూ మొగ వాళ్ళ పనీ, తుక్కు ఎరడాలు, ఊడ్వడాలు ఆడవాళ్ళ పని" అని నవ్వింది శోభ.
    ఇద్దరం స్నానాలు ముగించి కాఫీలు తీసుకున్నాక వంట ప్రారంభించేం. గంటలో వంట ముగిసింది. కాసేపు ఇల్లు శుభ్రం చేసుకుని భోజనానికి కూచుని లేచేసరికి టైము తొమ్మిదిన్నర అయింది. ఇద్దరం బట్టలు మార్చుకుని ఆఫీసులకి బయలుదేరబోయాం.
    హటాత్తుగా నేను కూర్చుండి పోయాను -- "ఏమిటో కళ్ళు తిరుగుతున్నాయి శోభా! నేను కాస్త ఆలస్యంగా వస్తాను. నువ్వు వెళ్ళిపో --" అన్నాను.
    శోభ దెబ్బ తిన్నట్లుగా కనపడింది -- "ఏమయింది నీకు?' అంది అత్రుతనూ, కంగారునూ కంఠంలో మిళితం చేస్తూ.
    "ఏమీ లేదు. బహుశా కొద్ది సేపు విశ్రాంతి అవసరమనుకుంటాను." అన్నాను నీరసంగా.
    శోభ నా తల నిమిరింది. నుదుటి పైన అరచేత్తో నెమ్మదిగా రాసింది. ఆ తర్వాత ఒక క్షణం ఆగి , "స్నేహితురాలి నీ దశలో వదిలి నేనఫీసుకేలా వెడతాననుకున్నావ్" అంది.
    నేను మాట్లాదేలేదు. ఒక క్షణం కూర్చున్నాక లేచి మంచం దగ్గరకు వెళ్ళి పడుకున్నాను. శోభ నా మంచం మీదనే పక్కగా కూర్చుంది. కొద్ది నిముషాల సేపు ఇద్దరి మధ్య మాటలు లేవు.
    "శోభా మీ ఆఫీసరు చండశాసనుడనీ , ఓ పట్టాన సెలవివ్వడనీ ఒకప్పుడన్నావు గదా -- నీ అమూల్యమైన సెలవులు నా గురించి వృధా చేయడం నాకిష్టంలేదు. నా కొచ్చింది పెద్ద జబ్బేమీ కాదు. బహుశా నరాల నిస్సత్తువ వల్ల ననుకుంటాను-- అదోరకమైన నీరసం నన్నావహించింది. నువ్వు ఇల్లు కదిల్తే నా ఆఫీసులో కూడా కాస్త ఈసమాచారం అందజేయగలవని నా ఆశ. ఓ గంటలో తేరుకుని ఆఫీసుకు వెళ్ళగలనని అనుకుంటున్నాను."
    ఏమనుకుందో ఏమో శోభ సరేనని బయల్దేరి వెళ్ళిపోయింది.
    ఆమె వెళ్ళిన మరుక్షణం నేను వీధి తలుపు గడియ వేసి పెరట్లో కి వెళ్ళాను. అక్కడ శుభ ప్రదమైన కొబ్బరి మొక్క అలాగే ఉంది.
    నేను గునపం తీసుకుని త్వరత్వరగా తవ్వి కొబ్బరి మొక్కను వెలికి తీసి గోతినీ పూర్వపు విధంగా తీశాను. ఒక్క పర్యాయం తవ్వింది కావడం వల్ల పదిహేను నిముషాలలో పని పూర్తయింది.
    అప్పుడే హృదయం పులకరించేలా మళ్ళీ ఖంగు మని శబ్దం వినపడింది. నేను మరో రెండు దెబ్బలు ప్రక్క వాటుగా వేసి ఆ శబ్దానికి కారణ భూతమైన వస్తువు కదిల్చి చూశాను. కొంచెం నిరుత్సహమే కలిగింది. అది రాయి అన్న అనుమానం కలిగింది. మరో పదిహేను నిముషాల శ్రమ అనంతరం నా అనుమానం నిజమని దృవ పడింది. నేను ఆ రాతీని తొలగించి బయటకు తీశాను. కొబ్బరి మొక్కను మళ్ళీ పాతేశాను.
    స్నానాల గదిలోకి వెళ్ళి ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కోన్నాను. ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని సంతృప్తి చెంది ఆఫీసుకు బయలుదేరాను.
    నాకు దొరికిన రాతిని జాగ్రత్తగా ఇంట్లో ఎవరికీ తెలియని చోట దాచాను. కేవలం ఒక నల్లరాయి నాలో కొన్ని గంటల పాటు కలిగించిన అనుభూతులూ, ఆశలూ తలపులోకి రాగా నవ్వు కోకుండా ఉండలేక పోయాను.

                                   8

    సాయంత్రం అయిదు గంటలకు నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి ఇంకా తాళం వేసే ఉంది. అంటే శోభ ఇంకా ఆఫీసు నుంచి రాలేదన్న మాట.
    సాధారణంగా ఆమె నాకంటే కాస్త ఆలస్యంగానే రావడం నాకు తెలిసినదేకాబట్టి ఆ విషయం నా కంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు.
    కానీ మరో పది నిమిషాల్లో పొరుగింటి వాళ్ళబ్బాయి వెంకట్రావు వచ్చి తలుపు తట్టి నేను తలుపు తీశాక "మీరీ వేళా  ఆఫీసుకు వెళ్ళలేదాండీ?"అనడిగినప్పుడు ఆశ్చర్య పోయాను.
    "ఏమలా అడుగుతున్నావ్?" అనడిగాను.
    "ఈరోజు మా ఇంట్లో తద్దినం. అందువల్ల నేను పిల్లల్ని ఆడించడం కోసం స్కూలు ,మాని ఇంట్లో ఉండి పోవలసి వచ్చింది. పన్నెండు గంటల ప్రాంతంలో నేను మా తమ్ముళ్ళ నీ, చెల్లెళ్ళ నీ తీసుకుని వీధిలోంచి నడిచి వెడుతూ మీ ఇంటి తలుపు తాళం వేసి ఉండకపోవడం గమనించాను.  అ సంగతి అమ్మకు చెప్పాను. మీకు గారెలిచ్చి రమ్మని అమ్మ నన్ను రెండు గంటల ప్రాంతంలో పంపింది. మీ ఇంటి తలుపులు తాళం వేసి లేకపోయినా ఎంత తట్టినా ఎవరూ పలకలేదు. వెళ్ళి అమ్మతో చెబితే ఒంట్లో బాగాలేదేమో , నిద్రోతున్నా రేమోనని అంది. ఇంతకూ ఇప్పుడు నేను గునపం తీసుకేడదామని వచ్చాను. మీ పని అయిందా?' అన్నాడు వెంకట్రావు.
    "ఇంకా పని అవలేదు కానీ మీకు అవసరమైతే తీసుకు వెళ్ళు. మళ్ళీ రీపు తీసుకుంటాన్లె " అన్నాను.
    "మధ్యాహ్నం నిద్ర పోయారాండీ" అనడిగాడు వెంకట్రావు కుతూహలంగా.
    "నిద్ర పోయాను గానీ మధ్యాహ్నం కాదు , ఉదయమే అదీ ఇంట్లో కాదు ఆఫీసులో. "అని నవ్వి "నిన్న రాత్రి నాకూ, నా స్నేహితురాలికి కూడా నిద్ర పట్టలేదు. అందువల్ల బహుశా మా శోభ సెలవు పెట్టి ఇంటి కొచ్చి నిద్ర పోయి ఉంటుంది."అన్నాను.
    గునపం తీసుకుని వెళ్ళిపోయాక వెంకట్రావు కొద్దిగా గారెలూ, పచ్చళ్ళూ, కారంతో తిరిగి వచ్చాడు. నేను వాటిని తీసుకుని "థాంక్స్" చెప్పి అతన్ని పంపేశాను.
    గారెల్ని చూడగానే నాకు ఆశ కలిగింది. అల్లం పచ్చడి, మామిడి పచ్చడి తోడు చేసి నాలుగైదు గారెల్ని లాగించి మంచి నీళ్ళు తాగేసరికి శరీరంలో నూతన చైతన్యం కలిగింది.
    నెమ్మదిగా పెరట్లోకి నడిచాను. నాలో ఎన్నో ఆశలు రేగడానికి కారణ భూతమైన కొబ్బరిమొక్క అదే స్థలంలో అలాగే నిలబడి ఉంది. నన్ను చూసి నవ్వుతోందనిపించింది.
    అక్కడి నుంచి నెమ్మదిగా పడక గదిలోకి వెళ్ళాను. గదిలో ఏదో కొత్త రకం వాసన వేస్తోందని పించింది. వాసనా నాకు సుపరిచితమైనదే అనిపిస్తోంది. కానీ ఏమిటో తెలియలేదు. కిటికీ తలుపులు తీశాను. చల్లని గాలి గదిలో ప్రవేశించింది. అయిదు నిముషాల్లో గదిలో ఏ విధమైన వాసనా లేదు.
    నేను ఆలోచిస్తున్నాను. శోభ మళ్ళీ ఇంటికి వచ్చిందా? వస్తే ఎందుకు వచ్చింది? ఆమెకు కూడా నాకు లాగే నిధి గురించిన అనుమానాలున్నాయా? నాకే నిధి వున్నదీ లేనిదీ సరిగా తెలియదు. ఏదో ఆశ మాత్రమే. అటువంటప్పుడు ఆవిడకు తెలిసే అవకాశం ఎక్కడుంది?"
    ఇలాంటి ఆలోచన నాకు కలగడం ఇదే మొదలు. ఆ దృష్టిలో ఆలోచిస్తుంటే శోభ ప్రవర్తన మొదట్నీంచీ నిధి గురించి వెతుకుతున్నదానివలె ఉందనిపించింది.
    ఈ ఆలోచన హాస్యాస్పదంగా నాకు తోచినపప్పటికి ఎందుకో ఒకసారి కొబ్బరి మొక్క దగ్గర పరిసరాలను గమనించి రావాలనిపించింది. మళ్ళీ పెరట్లో మొక్క దగ్గరకు వెళ్ళాను. అక్కడ అనుమానించవలసినదేమీ కనబడలేదు.
    మొక్క చుట్టూ ఉన్న మట్టిని చేతులతో పెళ్ళగించడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో నన్నాశ్చర్యపదిచేది ఒకటి నా కళ్ళ బడింది. అది ఒకచిన్న సిగరెట్ పీక, అప్పుడే ఇందాకా నా గదిలో నాకు అనిపించిన కొత్త వాసన గుర్తు కొచ్చింది. అది సిగరెట్ వాసన. నాగదిలో ఎవరో చాలాసేపు సిగరెట్లు కాల్చారు. ఆ వ్యక్తే ఇక్కడ కొబ్బరి మొక్క  దగ్గర మట్టి తవ్వి మళ్ళీ పోశాడు.
    సందేహం లేదు. పెరట్లో నిధి గురించి ఎవరికో తెలిసింది. అందులో శోభ పాత్ర కూడా ఉంది. ఎవరీ శోభ / అని ఆలోచిస్తుండగా వీధి తలుపు తట్టిన శబ్దమైంది. తప్పక శోభే అయిండాలనుకుంటూ ఆ సిగరెట్ పీకను తిరిగి మట్టిలోనే వదిలి చేతులు దులుపుకుని వెళ్ళి తలుపు తీశాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS