ఇద్దరూ లోపల కుర్చీల్లో కూర్చున్నాక -- "ఏమిటిలా వచ్చేరు?" అంది జానకి.
"మీవారు మీకు చెప్పలేదా?" అన్నాడు కిషోర్ ఆశ్చర్యంగా.
జానకికి విషయం అర్ధం చేసుకోడానికి కొద్ది క్షణాలు పట్టింది. "వారికి లక్ష పనులు. చెప్పడం మరిచి పోయుంటారు...." అందామె.
"మీ యింటి అడ్రసు లలిత ఇచ్చింది. మీ ఇంటికే వెళ్ళి తీరాలని పట్టుబట్టింది. మీతో అయితే ముఖ పరిచయమైనా వుంది. ఆయనైతే బొత్తిగా తెలియదు నాకు. హోటల్లో దిగుదామనుకున్నాను. కానీ అది వినలేదు..."
"నేను మీ లలితనే అనుకోండి. మరోలా ఎన్నడూ భావించవద్దు. మీ పని అయ్యేవరకూ మీరు మా ఇంట్లోనే ఉండాలి...." అంది జానకి.
"మీవారింకా రారా?" అనడిగాడు కిషోర్.
"అయన బైటకు వెళ్ళారంటే వెనక్కు రావడం కష్టం. పార్టీలు ఓ పట్టాన ఆయన్ను వదలరు...." అంటూ భర్త గురించి అదేపనిగా చెప్పుకు పోసాగింది జానకి.
కిషోర్ ఓపిగ్గా అంతా విని తనూ సూర్యారావును మెచ్చుకుని -- "ఆయన్ను చూడాలని నాకు చాలా ఆత్రుతగా వుంది. ఎప్పుడొస్తారో ఏమో--" అన్నాడు.
ఆ సమయానికి సూర్యారావు ఇంట్లోనే ఉండి వారి సంభాషణంతా వింటున్నాడు. వెంకన్న సలహా మేరకు అతను దొడ్డి తలుపు తీసి ఉంచుకుని ఇంట్లోంచి బైటకు వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ యింట్లో ప్రవేశించాడు. తనకు అనువుగా వుండే రెండు మూడు రహాస్య స్థలాలు ఏర్పరచుకున్నాడు.
వారి మధ్య జరుగుతున్న సంభాషణ అతడికి బొత్తిగా నచ్చలేదు.
"చాలా దారుణంగా జాగ్రత్తగా మసుల్తున్నారు. వీళ్ళు గూడచారులుగా పనిచేయడానికి ఎక్స లెంట్ గా పనికొస్తారు...." అనుకున్నాడతను కసిగా.
సూర్యారావు ఎంతో జాగ్రత్తగా వారిద్దర్నీ గమనిస్తున్నాడు.
కిషోర్ ఆమెతో చనువుగా ఉండడానికి ప్రయత్నించ లేదు. ఆమె అతడ్ని తాకడం లేదు. అతను హాలు దాటి లోపలకు వెళ్ళాలనుకుంటున్నట్లు లేదు. సోఫాలోనే కూలపడ్డాడు. ఆమె కాఫీ తెస్తానంది. అతనలవాటు లేదన్నాడు. కిషోర్ చిన్నప్పట్నించీ అన్ని అలవాట్ల కూ దూరంగా వున్నాడట. అతడి ఏకైక లక్ష్యం చెల్లెలు! ధన సంపాదన చేసేది కూడా ఆమె సౌఖ్యానికే!
కిషోర్ ఎక్కువ మాట్లాడడం లేదు. జానకి కూడా అట్టే మాట్లాడడం లేదు. పావుగంట భారంగా గడిచింది. అప్పుడు కిషోర్ లేచి -- "నేను మళ్ళీ వస్తాను.... ఆయనోస్తే నేను వచ్చి వెళ్ళాలని చెప్పండి...." అన్నాడు.
"అయ్యో-- భోం చేయకుండా ఎలా వెడతారు? మీరు కాసేపలా కూర్చోండి. నేను వంట చేసి వస్తాను. అయన కూడా కాసేపట్లో రావాలి...." అంది జానకి.
"అలాకాదు , అవతల నాకు పని వుంది. ఓ పెళ్ళి సంబంధం గురించి మాట్లాడాలి. మీవారిని తీసుకుని వెడదామనుకున్నాను. నేనొక్కడినే వెళ్ళాల్సివస్తోంది..." అన్నాడతను కాస్త దిగులుగా.
"పెళ్ళి సంబంధం మాట్లాడ్డానికిది సమయం కాదు. సాయంత్రం వేడుదురు కాని.....కాసేపట్లో అయన వొచ్చెస్తారు...." అంది జానకి.
మనుషుల్ని తనకు వశం చేసుకుని అధికారం చెలాయించడం లో జానకి తనకు తానె సాటి. కిషోర్ మాట్లాడకుండా సోఫాలో కూర్చున్నాడు. జానకి ఓ అరడజను పుస్తకాలు తెచ్చి అతడి ముందుంచి -- "చదువుతూ వుండండి. నా వంటయ్యేలోగానే అయన రావచ్చు..." అంది.
అతను చదువులో పడ్డాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళి పోయింది.
నిముషాలు గడిచిపోతున్నాయి. కాలం పరుగెడుతోంది. కానీ కిషోర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు సుఖంగా కూర్చుని తాపీగా పుస్తకం చదువు కుంటున్నాడు.
సూర్యారావు లో సహనం చచ్చి పోతోంది. పూర్వ పరిచయం లేకపోయినా ఇలాంటి అవకాశం వస్తే ఏ మగాడు వదులుకోడు. ఎంతో కొంత చనువును ప్రదర్శించి చొరవ చేస్తాడు. అదృష్టం బాగుంటే కిట్టుబాటవుతుంది. లేదా ఏమీ జరగనట్టు అమాయకుడిలా నటించేయడమే! ఆడది ఇలాంటివి జరిగితే మగాడికి చెప్పుకోదు.
అసలు కిషోర్ లేవడెం? లేచి వంటింటి వైపు వేళ్ళాడెం?
కిషోర్ తన భార్య జోలికి వెళ్ళనందుకు బాధపడుతున్నాడు సూర్యారావు.
మధ్యలో ఒకసారి జానకి వచ్చి అతణ్ణి పలకరించి- "అయన త్వరగా వస్తే బాగుండును. వంట కూడా పూర్తీ కావస్తోంది...." అంది.
అప్పుడు సూర్యారావుకూ ఆకలి వేసింది. జానకి లోపలకు వెళ్ళగానే అతను తన దారిన తోటలోకి వెళ్ళి వచ్చి వీధి తలుపు తట్టాడు.కిషోర్ లేచి వెళ్ళి తలుపు తీశాడు. సూర్యారావు ఆశ్చర్యాన్ని నటిస్తూ -- "మీరు.... మీరు....కిషోర్ కాదు కదా!" అన్నాడు.
"నా ఉత్తరం అందిందా - మీరు సూర్యారావు గారేనా?" అన్నాడు కిషోర్. సూర్యారావు ను చూడగానే అతడి ముఖంలో అనందం కనబడింది.
"ఈరోజే అందింది, పోస్టుమాన్ పావుగంట క్రితం ఇచ్చాడు. సారీ.....మీకు చాలా ఇబ్బంది కలిగించాను.ప్రయాణం సక్రమంగా జరిగిందా? ఇల్లు సులభంగా దొరికిందా?" అంటూ కుశల ప్రశ్నలు వేశాడతను.
ఇద్దరూ కాసేపు నాలాయితి కబుర్లు చెప్పుకున్నారు. వంట కాగానే అంతా కలిసి భోం చేశారు. జానకి వంటను ప్రత్యేకంగా పొగిడాడు సూర్యారావు.
"మీరోసారి మా యింటికి రండి. మా చెల్లెలు లలిత కూడా ఇంత బాగా చేస్తుంది-" అన్నాడు కిషోర్.
"చిన్నప్పట్నించీ చెల్లెలు తప్ప మరో ధ్యాస లేదాయనకు. వచ్చే జన్మలోనైనా నాకిలాంటి అన్న దొరకాలని భగవంతుణ్ణి ప్రార్ధించుకుంటున్నాను...." అంది జానకి అతడి వంక అభిమానంగా చూస్తూ.
"అవున్లే -- ఈ జన్మకు కిషోర్ ని అన్నగా వూహించుకోలేవుగా --" అంటూ మనసులో పెడర్ధాలు తీసుకుని తృప్తి చెందాడు సూర్యారావు.
సాయంత్రం సూర్యారావు , కిషోర్ కలిసి సంబంధం చూడ్డానికి వెళ్ళారు.
వరుడు కిషోర్ కి నచ్చాడు. కిషోర్ మాట్లాడిన తీరు, ఇస్తానన్న కట్నం అవతలి వారికీ నచ్చాయి. పెళ్ళి చూపులకు ఏర్పాటు చేసుకున్నారు -- "పిల్ల నచ్చితే -- నిశ్చయ తాంబూలం, పెళ్ళి చూపులు ఒక్కరోజునే!" అన్నాడు వరుడి తండ్రి. కిషోర్ చెల్లెలి అందాన్ని పొగిడాడు.
ఆ రాత్రికే అతను తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు.
9
"చాలా దిగులుగా కనబడ్తున్నారు...." అన్నాడు వెంకన్న.
సూర్యారావు జరిగినదంతా చెప్పాడు.
"ఇందులో బాధ పడాల్సిందేముంది?" అన్నాడు వెంకన్న ఆశ్చర్యంగా.
"ఇప్పుడు నేను జానకిని క్షమించే అవకాశం పోయింది. వాళ్ళిద్దరూ కలుసుకుని తప్పు చేస్తే -- నేను పెద్దమనిషిలా శాంతంగా ఇద్దరికీ బుద్ది చెప్పాలనుకున్నాను. కుదరలేదు"అన్నాడు సూర్యారావు.
"యూ అరే కేస్ ఫర్ సైకాలజీ ..." అన్నాడు వెంకన్న.
"నా బాధ మీకర్ధం కాదు. ఆమె తప్పు చేసిందని నాకు తెలుసు. అయితే నాకు ఋజువు దొరకనివ్వడం లేదు, ఆ ఋజువు మీరు కూడా సంపాదించలేకపొతున్నారు...." అన్నాడు సూర్యారావు.
"పనికి మాలిన పనులంటే నాకు వళ్ళు మంట...." అన్నాడు వెంకన్న.
"కానీ....ఇది పనికి మాలిన పని కాదు. నేను హత్య చేయకుండా ఆపడానికి ఋజువు ఎంతో అవసరం. మీరు నన్ను సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు. నా భార్య ఒకణ్ణి ప్రేమించి వాడితో కొంతకాలం గడిపి, ఆ స్మృతులను మనసు నిండా నింపుకొని ఆ తర్వాత నన్ను పెళ్ళాడి కూడా ఇంకా వాణ్ని అరాదిస్తోంది. నన్నామే గౌరవించడం వల్ల నేనామెనేమీ చేయలేకపోతున్నాను. అది నన్ను నిలువునా దహించి వేస్తోంది. ఆమె నన్ను కిషోర్ అని పిలుస్తుంది. ఆ పిలుపు నాకిప్పుడు కంపరంగా వుంది. ఆమె కలలో కిషోర్ అని కలవరిస్తుంది. నా రక్తం మరిగిపోతుంది. తన డైరీలో ఆమె కిషోర్ పట్ల అరాధనను ప్రకటిస్తుంది. నా మనసామే ను చంపెయమంటుంది. ఆమెను చంపాలంటే ఒక్కటే ఒక్క అడ్డంకి....! అన్ని విధాలా ఆమె నాకంటే అధికురాలు. నా ఆదృష్టమో, దురదృష్టమో ఆమె నా భార్య అయింది. సమాజంలో నాకై నేను సంపాదించలేని స్థానాన్నామె నాకు సంపాదించి పెట్టింది. అటువంటి స్త్రీని ఏ కారణం చూపించి చంపను. ఆమె ఒక్క తప్పు చేస్తే నేనామెను చంపినా చంపుతాను. లేదా ఆమె కంటే అధికుడినన్న ఆనందంలో ఆమెను క్షమించినా క్షమిస్తాను. కానీ ఆమె తప్పు చేయడం లేదు. చేసిన తప్పును దొరకనివ్వడం లేదు. ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నన్నీ అట ఆడిస్తోంది...."అన్నాడు సూర్యారావు.
"అంతా మీ భ్రమ!" అన్నాడు వెంకన్న.
"నాకు ఋజువు సంపాయించలేరా?" అన్నాడు సూర్యారావు.
"మరొక ప్రయత్నం చేస్తాను...."అన్నాడు వెంకన్న. అతడి పధకం ప్రకారం సీతమ్మ ఒక రోజున జానకిని కలుసుకుంది. హటాత్తుగా ఎరిగున్న మనిషిని చూసినట్లు- "అరే-- జానకీ--నువ్వా?" అంది.
