Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 13


                                     5
    తన కొడుకు పేరున వున్న భవనం పునాదులతో సహా లేచి పోయి, కొన్నాళ్ళ తర్వాత ఊరి చివరి స్థలంలో వెలవగా చూసిన గురవయ్యకు మతి పోయినట్లయింది. తన కాలికింది చెప్పులాంటి కన్నయ్య ఈరోజు ఊళ్ళో అందరిలోకి భాగ్యవంతుడు కావడం ఆయనకు కన్నెర్రగా వుంది. ఏమీ చేయలేక తాత్కాలికంగా పూరుకున్నాడు.
    అయితే కధ అంతటితో ఆగలేదు. శివపురం లో ఇప్పుడు పేదలు లేరు. ఎవరికీ గురవయ్య అవసరం రాకుండా పోతోంది. క్రమంగా గురవయ్య వ్యాపారం దెబ్బతింటోంది. అలాగే కొన్నాళ్ళు సాగితే గురవయ్య కూడా కన్నయ్య దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించాల్సి వస్తుంది.
    ఒకప్పుడు కన్నయ్య శివపురం గ్రామ ప్రజల దయాదాక్షిణ్యాలపై జీవించేవాడు. ఇప్పుడు వాడి దయాదాక్షిణ్యాలపై ఆ ఊరి ప్రజలు జీవిస్తున్నారు. అయితే ఈ విషయం గురవయ్య కు తప్ప మరెవ్వరికీ బాధగా లేదు.
    ఒకరోజు గురవయ్య కన్నయ్య ఇంటికి వెళ్లి ఏకాంతంలో వాణ్ణి కలుసుకుని, "నీ దానధర్మాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. నీ కారణంగా నా వడ్డీ వ్యాపారం దెబ్బ తింటోంది. ఇది నీకు న్యాయం కాదు " అన్నాడు.
    "నీ వ్యాపారం దెబ్బ తింటే మానేసేయ్ !" అన్నాడు కన్నయ్య కటువుగా.
    "మానేస్తే నేనెలా బ్రతికేది ?" అన్నాడు గురవయ్య.
    "నేనూ నీకు డబ్బిస్తాను. ఏం కావాలంటే అదిస్తాను ?" అన్నాడు కన్నయ్య.
    "నేను అభిమానం ఉన్నవాణ్ణి. దానం పుచ్చుకొను !" అన్నాడు గురవయ్య.
    "దానం పుచ్చుకోవేం! ఇదివరకు నాచేత ఉత్తినే పని చేయించుకొని ఋణపడ్డావు. ఇప్పుడు డబ్బు తీసుకుని బుణ పడతావు. నాకు ఋణపడాలన్నదే నీ సరదా కదా! ' అన్నాడు కన్నయ్య.
    గురవయ్య చిన్న మొహం చేసుకుని అక్కణ్ణించి బయల్దేరి తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి, "అయ్యా! కన్నయ్య కారణంగా నాకు అన్యాయం జరిగింది. వాడు మాయ చేసి నా ఇల్లు ఎత్తుకు పోయాడు. ఎలాగైనా నా ఇల్లు నా కిప్పించాలి. వాడికి తగిన శిక్ష విధించాలి !" అన్నాడు.
    గ్రామాధికారికి కూడా కన్నయ్యంటే రవంత కన్నెర్రగానే వుంది. ఇప్పుడు ఊళ్ళో కన్నయ్య కున్న పలుకుబడి అయన క్కూడా లేదు. అందువల్ల అయన వెంటనే కన్నయ్యాను పిలిపించి గురవయ్య ఆరోపణ వినిపించి సంజాయిషీ అడిగాడు.
    "ఆ ఇల్లు వాళ్ళబ్బాయి నాకు దానం చేసాడు. నేను తీసుకున్నాను. భద్రయ్య నా కాళ్ళు పట్టుకొని అడిగాడంటే వాడిల్లు వాదికిచ్చేయనూ?" అన్నాడు కన్నయ్య.
    "చూశారా ! కుర్రాణ్ణి చేసి మోసం చేశాడు. ఇప్పుడు వాడు వీడి కాళ్ళు పట్టుకోవాలట !" అన్నాడు ఉక్రోషంగా
    "కుర్రాణ్ణి చేసి మోసం చేయడానికి నేనూ నీ కొడుకంత కుర్రాడినే కదా !" అన్నాడు కన్నయ్య.

    విచారణ వినడానికి అక్కడికి వచ్చిన జనమంతా ఇది విని నవ్వారు.
    దాంతో గ్రామాధికారికి ఉక్రోషం వచ్చింది. 'అలా నవ్వకండి. ఏదో నాలుగు మంత్రాలు నేర్చుకొని ఇలా ఊళ్ళో వాళ్ళని బాధించడం మంచి వాళ్ళ లక్షణం కాదు. కన్నయ్యను విచారించడానికి నాకు శక్తి చాలదు. అందుచేత వాణ్ణి రాజుగారి న్యాయస్థానానికి పంపిస్తున్నాను" అన్నాడు.
    అంతేకాదు అయన కన్నయ్య గురించి రాజు గారికి పెద్ద ఫిర్యాదు తయారు చేసాడు. అవసరమైతే వాడి మంత్ర శక్తులను తొలగించడానికి మహా మంత్ర వేత్తలను సంప్రదించాలని కూడా అయన సూచించాడు.
    ఇద్దరు రక్షక భటులనిచ్చి గ్రామాధికారి కన్నయ్యను రాజధానీ నగరానికి పంపించాడు. కన్నయ్య తనతో పాటు భిక్షా పాత్ర కూడా తీసుకుని వెళ్ళాడు.

                                     6
    రాజాస్థానం న్యాయాధికారి శివపురం గ్రామాధికారి పంపిన వివరాలన్నీ చదివి కన్నయ్యకు పిలిపించి, "ఇందుకు నీ సంజాయిషీ ఏమిటి ?" అన్నాడు.
    "నేనే పాపమూ ఎరుగను. నేనే తప్పూ చేయలేదు. ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. నామీద అసూయ కొద్దీ గురవయ్య ఈ అభియోగం తెచ్చాడు అన్నాడు కన్నయ్య.
    "ఇల్లు దానంగా పట్టడమేమిటి ? ఇది చాలా ఆశ్చర్యంగా వుంది " అన్నాడు న్యాయాధికారి.
    "నా వద్ద అద్భుతమైన భిక్షా పాత్ర వుంది. అది ఎలాంటి దైనా స్వీకరించగలదు. మీరిప్పుడీ న్యాయస్థాన భవనాన్ని నాకు దానమిచ్చినా అది స్వీకరిస్తుంది" అన్నాడు కన్నయ్య.
    "ఐతే ఈ భవనాన్ని నీకు దానంగా ఇస్తున్నాను. తీసుకో" అన్నాడు న్యాయాధికారి.
    న్యాయాధికారి పకపకా నవ్వి "ఇదేనా భిక్షా పాత్ర మహిమ ?" అన్నాడు.
    "ఏమో నాకేమీ అర్ధం గావడం లేదు " ....... అన్నాడు కన్నయ్య కంగారుగా.
    "నీలో ఏ మహిమలూ లేఫు . నీకు ఏ మాయలూ మంత్రాలూ తెలియవు. మీ గ్రామంలో నువ్వేదో మోసం చేశావు. లేకపోతే గ్రామాధికారి నీ గురించి ఇంత తీవ్రంగా ఫిర్యాదు చేయడు నీకు శిక్ష తప్పదు " అన్నాడు న్యాయాధికారి.
    "నిజంగానే నాకే మహిమలూ , మంత్రాలూ తెలియవు. నాకున్నదల్లా ఒక్కటే వరం. నాకు ఏ కల వచ్చినా అది నిజమవుతుంది. ఆ కల కారణంగానే నాకీ భిక్షాపాత్ర దొరికింది" అన్నాడు కన్నయ్య.
    "సరే, ఇంకో అబద్ద మన్నమాట. ఇదీ చూస్తాను. ఈ రాత్రి నిద్రలో నీకు ఏ కల వచ్చిందీ చెప్పు . అది నిజమైతే నీ మాటలు నమ్ముతాను. లేకుంటే శివపురంలో నువ్వు చేసిన మోసం కాక ఇక్కడ చెప్పిన అబద్దాలకు కూడా వేరే శిక్ష అనుభవించాల్సి వుంటుంది." అన్నాడు న్యాయాధికారి.
    కన్నయ్య బాధగా నిట్టూర్చాడు. 'తను శివపురంలో మోసం చేశాట్ట. అందుకని తననిక్కడకు పంపించారు. నిజంగా మాయ మంత్రాలు తెలిసిన వాడైతే తననిక్కడకు వాళ్ళు పంపించగలరా?
    ఐతే కన్నయ్య న్యాయాధికారితో వాదించలేదు. భిక్షా పాత్ర ఎందుకు పనిచేయలేదో అర్ధం కాక వాడు సతమతమవుతున్నాడు. తనకు మళ్ళీ చెడ్డ రోజులు వచ్చాయోమోనని వాడికి భయంగా ఉంది. నిజానికి తన పాత రోజులు వాడికి చెడ్డవి కావు. కానీ ఇప్పటి సుఖాల అనంతరం పాత రోజులు వాడికి చెడ్డవే అవుతాయి కదా !
    ఆ రాత్రి పడుకోబోయే ముందు కన్నయ్య దేవుడ్ని ప్రార్ధించుకుని "ఏదో మామూలు కల కాక న్యాయాధికారికి నాపై నమ్మకం కలిగించ కల మంఛి కల రప్పించు భగవాన్ !" అనుకున్నాడు.
    కన్నయ్య కారాగారంలో పడుకున్నాడు. రక్షక భటులు వాడికి కాపలా ఉన్నారు. దిగులుతో కన్నయ్యకు ఓ పట్టాన నిద్ర రాలేదు. నిద్ర పట్టక వాడు చాల అవస్థ పడ్డాడు. అందులోనూ మనిషి సుఖాలకు అలవాటు పడ్డాడు. కారాగారంలో కటిక నేల మీద నిద్ర రావడం లేదు. ఆఖరికి ఎలాగో తెల్లవారుజామున నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఓ కల వచ్చింది.
    కలలో వాడికి న్యాయాధికారి ఇల్లు కనబడింది. పడక గదిలో న్యాయాధికారి నిద్రపితున్నాడు. ఆ గదిలో ఓ దొంగ ప్రవేశించాడు. వాడు న్యాయాధికారిని సమీపించి ఏదో వాసనా చూపించాడు. అది వాసనా చూస్తూనే న్యాయాధికారి జీవం లేనివాడిలా తల పక్కకు వాల్చేశాడు. దొంగ న్యాయాధికారి తలగడ కింద వున్నా తాళాలు తీసుకొని గదిలో వున్న పెట్టె తెరచి అందులోనుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ పెట్టె మూసేసి తాళం వేసేసి ఆ తాళాలు మళ్ళీ న్యాయాధికారి తలగడ క్రింద పెట్టేశాడు. అక్కడ్నించి దొంగ న్యాయాధికారి వుండే తోట కెళ్ళాడు. అక్కడ ఓ చెట్టు తొర్రలో డబ్బు సంచీ వేశాడు.
       తర్వాత కన్నయ్య కు మెలకువ వచ్చేసింది. వాడికి మెలకువ వచ్చేసరికి ఎదురుగా న్యాయాధికారి కనబడ్డాడు. కన్నయ్య వెంటనే ఆయనకు తనకు వచ్చిన కల చెప్పేశాడు.
    న్యాయాధికారి ఆశ్చర్యంగా కన్నయ్య వంక చూసి, "నువ్వు నాతొ రా " అన్నాడు.
    ఇద్దరూ బయల్దేరి తిన్నగా న్యాయాధికారి ఇంటి తోటలోకి వెళ్ళారు.
    "నువ్వు కలలో చూసింది ఈ తోటయేనా ? అన్నాడు న్యాయాధికారి.
    "ఇదే!" అన్నాడు కన్నయ్య ఆశ్చర్యంగా.
    "ఏ చెట్టు తొర్రలో దొంగ డబ్బు వేశాడో చెప్పగలవా ?" అన్నాడు న్యాయాధికారి.
    "చెప్పగలను" అంటూ కన్నయ్య తోటంతా తిరిగి ఓ చెట్టు దగ్గర ఆ చెట్టు తొర్రలోకి చేయి పెట్టి ఓ మూట బయటకు తీసి "నా కల నిజామైంది ?" అంటూ అరిచాడు.
    న్యాయాధికారి ఆశ్చర్యంగా కన్నయ్య చేతిలోని మూట వంక చూసి, "ఇదంతా నీకెలా తెలుసు ? నువ్వే దొంగవని నాకు అనుమానంగా వుంది" అన్నాడు.
    "అలాగంటా రేమిటండీ ! కారాగారంలో మీ భటులు నాకు గట్టి కట్టుదిట్టం చేసారు గదా - రాత్రికి రాత్రి నేను దొంగతనమెలా చేస్తాను ?" అన్నాడు కన్నయ్య.
    "నువ్వేదో మాయ చేస్తున్నావు. నిజంగానే నువ్వు మాయగాడివి " అన్నాడు న్యాయాధికారి.
    "నాకే మాయలూ  తెలియవు " అన్నాడు కన్నయ్య.
    న్యాయాధికారి ఓ క్షణం అలోచించి , "నీ కలలో కనబడ్డ ఆ దొంగ ఎలా వుంటాడు ?" అన్నాడు.
    కన్నయ్య దొంగను వర్ణించి చెప్పగానే న్యాయాధికారి ఉలిక్కిపడి, "నువ్వు నాతోరా ?" అన్నాడు.
    ఇద్దరూ కలిపి న్యాయాధికారి ఇంట్లోకి వెళ్ళాడు. అయన కన్నయ్యను ఓ గదిలో కూర్చోబెట్టి , తన కుటుంబ సభ్యులందర్నీ ఆగడిలోకి పిలిచి, "వీళ్ళలో దొంగ ఎవరో చెప్పు !" అన్నాడు.
    వాళ్ళలో కన్నయ్యకు కలలో కనబడ్డ దొంగ కనిపించాడు. కన్నయ్య వాణ్ణి న్యాయాధికారికి చూపించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS