Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 13

 

                      దొంగలకు రక్షణ లేదు!

                                                                       వసుంధర
    
    "తమరలా కూర్చోండి బాబూ-- కాస్త ఆలస్యమైనా ఫరవాలేదు గదా -- " అన్నాడు వెంకటరత్నం.
    వెంకటరత్నానిది బంగారం, నగల వ్యాపారం. ఆరోజు అతడి దుకాణం చాలా రద్దీగా వుంది. బంగారం ధర ఆకాశా నంటూతున్నా దాని గిరాకీ యే మాత్రం తగ్గడం లేదు.
    వెంకటరత్నం అలా చెప్పగానే సత్యం కూర్చున్నాడు.
    సత్యం నిజానికి ఏమైనా కొనే ఉద్దేశ్యంతో అక్కడికి రాలేదు. బంగారం కొనేవాళ్ళను చూద్దామని వచ్చాడు. అదీ అనుకోకుండా జరిగింది.
    సత్యం కాఫీ తాగుతుండగా కాఫీ హోటల్లో ఒకతను జేబులోంచి చిన్న తోలు సంచీ తీసి దాని జిప్ తొలగించి అందులోని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. వీలైనంత రహస్యంగానే అతను లెక్క పెడుతున్నా సత్యం అది గమనించాడు. అవన్నీ వంద రూపాయల నోట్లు. డబ్బు కనీసం పదివేలకు తక్కువుండదు.
    సత్యం కళ్ళు మెరిసాయి. మనసు సంతోషించింది. తనువు పులకరించింది. బుర్ర పనిచేయసాగింది. ఎదుటి మనిషిని పరీక్షించి అతడు తనకంటే బలమైన వాడు కాదనుకున్నాడు. ముఖ కవళికలు గమనించి -- ధైర్యం తక్కువని అంచనా వేశాడు.
    అయినా తనకున్న ధైర్యం అతడికేలా ఉంటుంది.
    తను దొంగ ! దొంగతనం వృత్తిగా జీవిస్తున్న మనిషి!
    సత్యం జేబులు తడుముకున్నాడు. మొలకు చుట్టుకున్న కత్తి తగిలింది. అదుంటే చాలు -- వస్తాదు లాంటి వాడు కూడా భయపడి పారిపోవాలసిందే!
    సత్యం ఆ మనిషిని పలకరిద్దామని చూశాడు. కానీ అతను చాలా ముభావంగా ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తూ వున్నాడు.
    హోటల్ బయటకు వచ్చి ఆగాడు సత్యం. ఆక్షణం నుంచీ అతడినే అనుసరించసాగాడతను. ఆ మనిషి బంగారం కొట్లోకి ప్రవేశించాక కాసేపాగి తనూ అందులో ప్రవేశించాడు.
    ఆ మనిషికి సుమారు పది తులాల బంగారం కావాలిట. చిత్రమేమిటంటే అతడు వెంకట్రత్నానికి తెలిసిన వాడిలాగే వున్నాడు.
    "చాలాకాలంగా తమ రిటువైపు రావడం మానేశారు" అన్నాడు వెంకట్రత్నం.
    "ఏంచేస్తాం . నానాటికీ బంగారం ధర పెరిగిపోతుంటే?" అన్నాడతను. అలా అన్నాడు కానీ అతనిప్పుడు పది తులాల బంగారం కొనాలని వచ్చాడు.
    మాటల సందర్భం లో సత్యానికి అతడి పేరూ, ఊరూ తెలిశాయి. ఆ సాయంత్రానికి అతడు బయల్దేరి తన గ్రామానికి వెళ్ళిపోతాడని తెలిసింది. విశాఖపట్నం నుంచి అతడి గ్రామం చేరుకోవాలంటే మూడు గంటల ప్రయాణం.
    అతడి పేరు ప్రకాశం. ప్రకాశానికి వెంకట్రత్నానికి నడిచే సంభషణల్లో ఆ ఊళ్ళో మరికొన్ని పేర్లు తగిలాయి. అవి జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడు సత్యం.
    ప్రకాశం బేరం పూర్తయింది. కొన్ని నగల్ని అతడు తన దగ్గరున్న తోలు సంచిలోనే వేశాడు.
    సత్యం ఆలోచిస్తున్నాడు. అతడి జేబులోంచి ఆ తోలు సంచీని తీయడం కష్ట సాధ్యం. పని యింకా సులభమయ్యే పధకం వుంది. అదేంటంటే ప్రకాశం తో పాటు బయాల్దేరి అతడి ఊరు వెళ్ళడం.
    ఆ ఊరితో అట్టే పరిచయం లేకపోయినా సత్యానికి కాస్త జాగ్రఫీ తెలుసు. బస్సు దిగాక ఏరు పక్కనుంచే ఓ మైలు దూరం నడిస్తే గాని ఆ గ్రామం రాదు. సాధారణంగా ఆదారి నిర్మానుష్యంగా ఉంటుంది. అదే తనకు అనువైన చోటు. ఆదారిలో తన కత్తి తనక్కావలసింది సంపాదించి యివ్వగలదు.
    ప్రకాశం తో పాటే సత్యం కూడా బయటకు వెళ్ళి పోతుంటే వెంకటరత్నం -- "వెళ్ళిపోతారేం -- ఒక్క నిముషం బాబూ" అన్నాడు.
    బంగారం దుకాణాల్లో ఒక్క నిముషమంటే అది ఎంతైనా కావచ్చు.
    "ఇప్పుడే వస్తాను--" అంటూ సత్యం అక్కణ్ణించి బయటపడ్డాడు. ఆ తర్వాత అతను జాగ్రత్తగా ప్రకాశాన్ని గమనిస్తూనే వున్నాడు. అయితే అతనికి తెలియకుండానే వెన్నాడుతున్నాడతను.
    
                                       2
    మధ్యాహ్నం ఒంటిగంట కు ప్రకాశం బస్ స్టాండ్ చేరుకున్నాడు. బస్సు ఒంటి గంటన్నరవుతుంది. అక్కడ సత్యం ప్రకాశాన్ని పలకరించాడు.
    "మిమ్మ ల్నేక్కడో చూసినట్లుందే?....." అన్నాడు ప్రకాశం.
    "వెంకటరత్నం బంగారం షాపులో -- " అన్నాడు సత్యం.
    ప్రకాశం మౌనంగా వూరుకున్నాడు. సత్యమే కలగజేసుకుని -- "నేనూ మీ ఊరే వస్తున్నాను. ఇదే మొదటి సారి ఆ వూరు రావడం. మీరు నాకు కాస్త దారి చూపించి సాయం చేయాలి?' అన్నాడు.
    "దానికేం భాగ్యం -- నాతొ పాటే మీరూ వస్తారు--" అన్నాడు ప్రకాశం. తర్వాత అతను కుతూహలంగా --ఎవరింటికి ?' అనడిగాడు.
    "రాయుడు గారింటికి ?" అన్నాడు సత్యం.
    బంగారం షాపులో జరిగిన సంభాషణ నుబట్టి రాయుడికీ, ప్రకాశానికీ భేటీ వుందని గ్రహించాడు సత్యం. అందుకే ఆ పేరు చెప్పాడు. ప్రకాశం సత్యాన్ని బంధుత్వాల గురించి మరి ప్రశ్నలు వేయలేదు.
    ఇద్దరూ బస్సులో పక్కపక్కన కూర్చున్నారు. సత్యం ప్రకాశాన్ని సంభాషణ లోకి దించి తను విశాఖపట్నం లో ఇన్ కంటాక్స్ లో పనిచేస్తున్నానని అబద్దం చెప్పాడు. ఇన్ కంటాక్స్ డిపార్టుమెంటువాళ్ళు చేసే రెయిడ్స్ గురించి తను పేపర్లో చదివినవన్నీ - తను చేసినట్లు గానే ప్రకాశానికి చెప్పాడు.
    ప్రకాశానికి సత్యం పట్ల రవంత ఆరాధన కలిగింది -- "ఎంత డబ్బున్నా -- మీ ఉద్యోగస్తులకున్న విలువ మాకు లేదు" అన్నాడు.
    బస్సు సరిగ్గా ఒంటిగంటన్నరకు కదిలింది. అందులో ప్రకాశం ఊరోస్తున్నవాళ్ళు మరి నలుగురున్నారు. సత్యం వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు. తను ప్రకాశం వారితో కలవకుండా చేయాలి. అందుకేదో ఉపాయం పన్నాలి.
    రోడ్లు బాగాలేవు. బస్సు బాగా కుడుపుతోంది. అక్కడక్కడ తుంపర పడుతూండడం వల్ల బస్సు కిటికీలు మూసేయాల్సి వచ్చింది. లోపల భరించలేనంత ఉక్కగా ఉంది.
    "ఇలాంటి బస్సు ప్రయాణం నేనెప్పుడూ చెయ్యలేదు" అన్నాడు సత్యం విసుగ్గా.
    "నాకిది మామూలే -- వానల్లేకపోతే లోపలకు గాలి తగుల్తుంది. బాగానే ఉంటుంది--" అన్నాడు ప్రకాశం.
    "మరీ గతుకుల రోడ్ల మాటేమిటి?...." అన్నాడు సత్యం.
    "పల్లెటూళ్ళలో ఎడ్ల బండ్ల లో తిరిగేవాళ్ళం. మాకీ గతుకులోక లెక్క ?" అన్నాడు ప్రకాశం.
    "నాకు పల్లెటూరి జీవితం బొత్తిగా తెలియదు..." అన్నాడు సత్యం.
    ప్రకాశం తమ ఊరి గురించి చెబుతుంటే సత్యం పరవశుడై విని -- "సుందర ప్రకృతి దృశ్యాలు పల్లెటూళ్ళ లోనే కనబడుతాయి. బస్ దిగిన చోట ఏదో లోయ ఉన్నాడని విన్నాను. అది నాకు చూపిస్తారా?' అన్నాడు.
    "తప్పకుండా?" అన్నాడు ప్రకాశం.
    బస్సు పావు తక్కువ అయిదుకు ప్రకాశం ఊరు చేరింది. ఆరుగురు దిగారక్కడ. అందులో యిద్దరు ప్రకాశాన్ని పలకరించారక్కడ.
    సన్నగా తుంపర పడుతోంది.
    "ఈ సమయంలో ఆ లోయెం చూస్తారు? రేపు చూద్దురు గానిలెండి ..." అన్నాడు ప్రకాశం.
    సత్యం అక్కడున్న చెట్టునూ, పుట్టనూ చూపించి -- ఇదేమిటి, అదేమిటి అనడుగుతున్నాడు. ప్రకాశం వోపిగ్గా చెబుతున్నాడు. అతను గొడుగు తీసి సత్యాన్నందులోకి ఆహ్వానించాడు.
    'అనుకోకుండా మీ పరిచయం లభించింది. ఊళ్ళో అడుగుపెట్టే లోగా నాకు రాయుడి గారి గురించి కొంత సమాచారం కావాలి!"అన్నాడు సత్యం.
    "ఎందుకూ?" అన్నాడు ప్రకాశం కుతూహలంగా.
    "రాయుడు గారు ఇన్ కంటాక్స్ ఎగేస్తున్నడని మా డిపార్టుమెంటుకు ఫిర్యాదులు వచ్చాయి--" అన్నాడు సత్యం.
    ముందుకు నడుస్తున్న నలుగురిలో ఒకడు వెనక్కు తిరిగి -- "బాబూ -- వానపడుతోంది. మా దగ్గర గొడుగులు లేవు. మీరూ మాతో వస్తారా-- మమ్మల్ని అడుగులు త్వరగా వేయోచ్చంటారా?" అన్నాడు.
    "మీరు నడిచేయండ్రా -- నేనూ , ఈబాబూ కలిసి వస్తాంలే ?" అన్నాడు ప్రకాశం. రాయుడి గురించి సత్యానికి వ్యతిరేకంగా చెప్పడానికి అతని మనసు కుతూహల పడుతోంది.
    సత్యం అతను చెప్పేవి వినడం లేదు. ఆ నలుగురు మనుషులూ తమకెంత దూరంగా వెడుతున్నారో చూస్తున్నాడు. అతను అడుగులు నెమ్మదిగా వేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రకాశం కాస్త త్వరపడుతున్నాడు.
    "ఒక్క క్షణం?" అన్నాడు సత్యం.
    "ఏమిటి?"
    "అల్పాచమానం...."
    "ఉన్నదొక్కటే గొడుగు , అవతల చూస్తె వాన పెద్దదవుతోంది ...."అన్నాడు ప్రకాశం.
    "ఫరవాలేదు. వానలో తడవడం నాకెంతో యిష్టం !" అంటూ సత్యం పక్కకు వెళ్ళాడు. అతడు కావాలనే అక్కడ బాగా ఆలస్యం చేశాడు. ఆ మనుషులు అప్పటికీ బాగా దూరమయ్యాడు.
    సత్యం వచ్చి ప్రకాశాన్ని కలిసి -- "ఊరింకా ఎంత దూరముంది?" అనడిగాడు.
    "సగం దూరం వచ్చేశాం!" అన్నాడు ప్రకాశం.
    "వాల్తేర్ వెళ్ళడాని కిప్పుడేదైనా బస్సుందా?"
    "ఇంకో అరగంటలో ఉంది!'
    "ఇదంతా ఏరేనా? గట్టు అంతదూరన ఉందేమిటి?" అన్నాడు సత్యం.
    "ఎప్పుడేనా వానలు బాగా పడి వరదలోస్తే ఈ ఏరు నిండుతుందంటారు. నా చిన్నతనంలో ఈ ఏరు నిండడం ఒకసారి చూశాను...." అన్నాడు ప్రకాశం.
    సత్యం ఒక్కసారి చుట్టూ చూసి -- వాన తెరిపిచ్చినట్లుంది -- గొడుగు మూసేయండి --" అన్నాడు.
    వాన తెరిపిచ్చిన మాట నిజమే! అయితే సత్యంగోడుగు మూయమన్న కారణం వేరు. తను కట్టి తీస్తే అతని చేతిలో ఏ విధమైన అయుధమూ ఉండకూడదు. ఒక్కోసారి గొడుగే ఆయుధంగా ఉపయోగపడుతుందన్నది అతడికి అనుభవపూర్వకంగా తెలిసిన విషయం.
    ప్రకాశం గొడుగు మూసేశాడు. దాన్ని వెనుక నుంచి చొక్కా కాలరుకి తగిలించుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS