Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 13


                    దేవుడూ, నీకు మానవత్వం లేదు!
    
    రామాయమ్మకా పేరుండవలసింది కాదు. ఏ సరిత అనో నీలిమ అని స్టయిలుగా వుండాలి. సినిమా స్టాల్సుని తలదన్నే ఆడదామె.
    ఆమె అంటే నాకెంతో యిష్టం. నాకిష్టమైనవి స్వంతంచేసుకోవడం నా అలవాటు.
    రామాయమ్మనూ అలాగే స్వంతం చేసుకున్నాను. అందుకు నేనేం కష్టపడలేదు. డబ్బిస్తే ఎవరికైనా స్వంతం అవుతుంది రామాయమ్మ.
    నాకు పెళ్ళయింది. నా భార్యపేరు మాధురి. పేరంత అందంగా ఆమె వుండకపోయినా బాగానే వుంటుంది. మాధురి అంటే నాకిష్టమే. మాకింకా పిల్లలు లేరు.
    మాదురితో ఒక్కటే యిబ్బంది నాకు. ఆమెకు నేనేమీ లోటు చేయడం లేదు. అన్నీ కొనిపెడుతున్నాను. అన్నీ చూసుకొంటున్నాను.
    అంతటితో చాలదంటుందామె. నా వ్యక్తిగత రహస్యాలన్నీ అడుగుతుంది. వాటి గురించి చెప్పమని నిలదీస్తుంది. నేనిల్లు వదిలాక ఏ చేశానొ అన్నీ తనకు వివరంగా చెప్పాలంటుంది.
    పోనీచెబుదామా అంటే నిజాలనామె సహించలేదు. క్లబ్బు కెళ్ళానంటే వద్దంటుంది. ఆడాళ్ళ దగ్గర కెళ్ళానని మాత్రం చెప్పను.
    అయినా ఎలాగో మాధురికి, నాకూ రామాయమ్మకూ సంబంధ మున్నట్లు తెలిసిపోయింది. ఆ విషయంలో ఎన్నోసార్లు నన్ను నిలదీసింది. బుకాయించాను. నేను బుకాయించినకొద్దీ ఆమె అనుమానం బలపడింది.
    ఆఖరికి తెగించి ఓ రోజున నేను రామాయమ్మ ఇంట్లో వుండగా తనక్కడకు వచ్చి నన్ను రెడ్ హేండెడ్ గా పట్టుకొంది.
    ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్లేటు మార్చి- "సంసారివి కాదూ-ఇలాంటి చోటికి వస్తావా?" అన్నాను కోపంగా.
    "భర్తననుసరించక తప్పదు కదా" -అంది మాధురి. ఆమెకు తెలివితేటలు ఎక్కువయ్యాయి ఇటీవల.
    "భర్త వద్దన్న పని కూడా చేయకూడదు. మర్యాదగా ఇంటికి నడు. నేను చెప్పిన మాట విని నా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు" అన్నాను మొండిగా.
    "పెళ్ళయ్యాక మనిద్దరివీ ఒక్కటే వ్యవహారాలు. మీ నా భేదాలు లేవు. ఇంటికి రండి. మాట్లాడుకుందాం-" అంది మాధురి.
    అప్పటి కామేతో బయల్దేరి ఇంటి కెళ్ళాను. అనవసరంగా ఆమెతో గొడవ పడడం ఇష్టంలేక ఆమె చెప్పిన వాటన్నింటికీ తల వూపాను.
    రామాయమ్మ వలలో పడిపోయాననీ నన్ను క్షమించ మనీ తన కారణంగా నా కళ్ళు తెరుచుకున్నాయనీ చెప్పి అప్పటికి తప్పించుకున్నాను. ఇంకెప్పుడూ రామాయమ్మ దగ్గరకు వెళ్ళనని మాటిచ్చాను. కానీ వెళ్ళాను.
    ఆ సంగతీ మాధురికి తెలిసిపోయింది. నెత్తీ నోరూ బాదుకుంది. దేవుడి మీద ఒట్టేయించింది.
    అలాంటి ఒట్లకు చలించేవాణ్ణి కాను నేను. నా కార్యక్రమం యధాప్రకారం కొనసాగుతోంది. మాధురి నన్నేమీ చేయలేదని తెలిసిపోవడంతో నేను ఆమెను బొత్తిగా లెక్కచేయడం మానేశాను.
    ఒకరోజు మాధురి నాతో పెద్ద దెబ్బలాట పెట్టుకోడానికి ప్రయత్నించింది. రెండు చేతులూ కలిస్తేనేకదా చప్పట్లు! నోరు నొప్పెట్టేలా వాగుతోంది. వీలుపడితే ఓ చిర్నవ్వు నవ్వడం మినహా నేనేమీ చలించడం లేదు.
    "నేనేమీ చేయలేననుకుంటున్నారు కదూ-మిమ్మల్ని నేనూ సాధించగలను...." అంది వున్నట్లుండి.
    నేను చిన్నగా నవ్వాను.
    "ఆ నవ్వు కర్ధం తెలుసునులెండి. నేను కూడా రామాయమ్మలా మారితే అప్పుడు కూడా ఇలా నవ్వగలుగుతారేమో చూస్తాను...." అంది మాధురి కసిగా.
    ఉలిక్కిపడి-"ఏమిటన్నావ్?" అన్నాను.
    "మీమీద పగ సాధించడం కోసం నేనూ రామాయమ్మ నౌతాను."
    మాధురి మాట పూర్తి కాకుండానే చెంప చెళ్ళుమనిపించాను. మాధురికి నోట మాట రాలేదు. కానీ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
    "ఏమిటనుకుంటున్నావో-రక్తం కళ్ళ చూడగలను జాగ్రత్త!"
    భయపడిందో ఏమో మాధురి ఇంకేమీ మాట్లాడలేదు.
    అన్నంతపనీ చేయగల సమర్ధత నాకుంది. కొన్ని విషయాల్లో నాకు దయాదాక్షిణ్యాలు లేవు. ఇప్పటికి నేను మూడు హత్యలు చేశాను. అందులో యిద్దరు నేను చేసిన హత్యకు సాక్షులు కావడంవల్ల చంపబడ్డారు.
    నాకు వేరే పనేమీ లేదు. గూండాలాంటివాన్ని కానీ కాస్త పెద్ధమనిషి తరహాగా కనపడే మనిషిని. పేకాట వ్యసనం. నా క్కావలసిన డబ్బు ఎలాగో అలా సంపాదించుకుంటాను.
    మాధురి అన్న మాటలు నాకు బాగా ఆవేశాన్ని కలిగించాయి. ఆ ఆవేశంతోనే రామాయమ్మ దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఓ రెండు గంటలు గడిపితే అన్నిరకాల ఆవేశాలూ చల్లారిపోతాయి.
    
                                        2
    
    ఆవేశం చల్లారాక మాధురి మీద జాలి కలిగింది. ఇంటికి వెళ్ళి ఓ రెండు మంచి మాటలు చెప్పి ఉపశమనం కలిగిద్దామనుకున్నాను.
    నేను వెళ్ళేసరికి ఇంటి తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. తోసుకుని లోపలకు వెళ్ళి గడియ వేశాను.
    కాస్త నెమ్మదిగానే మాధురి పడక గదిలో అడుగు పెట్టాను. అయితే అక్కడి దృశ్యం చూచి స్థంభించి పోయాను.
    మంచం మీద అర్ధనగ్నంగా మాధురి-మరో పురుషుడి కౌగిలిలో!
    నా నరాలు పట్లు తప్పాయి. క్షణంలో కూడదీసుకొని "మాధురీ!" అని అరిచాను.
    మాధురి నా పిలుపు విని కూడా చలించినట్లు లేదు- "అలా అరవకండి. తీరుబడిగా వుంటే రామాయమ్మ దగ్గరకు పొండి...." అంది.
    ఆ ఆవేశం కట్టలు తెంచుకుంది. రెండడుగుల్లో వెళ్ళి జుట్టు పట్టుకుని లాగాను మాధురిని. నా కళ్ళలో ఏమాత్రం అరుణిమ వుందో తెలియదు కానీ మాధురిని కౌగలించుకుని వున్న యువకుడు ఆమెను వదిలి మంచం దిగి వణుకుతూ అలా నిలబడిపోయాడు.
    నేను మాధురిని వదిలిపెట్టి మంచం మీద పడివున్న తువ్వాలును తీసి ఆ యువకుణ్ణి మంచం కోడుకి కట్టేశాను. వాడు చాలా భయపడ్డట్లున్నాడు. చాలా బుద్ధిగా నేను చేసేది గమనిస్తూ వున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS