7
ఆ రాత్రి కేశవ దగ్గర అంది కామేశ్వరి!
'మా వాళ్ళకి నన్నుచూడాలని వుందట వెళ్ళమంటారా?'
కేశవ ఆశ్చర్యంగా ఆమె వెంపు చూశాడు! 'రాజేశ్వరి' ఎప్పుడూ, ఇల్లా తన అనుజ్ఞకోసం అడిగేది కాదు. ఆమె కేదితోస్తే అల్లా చేసేది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి స్వేచ్చగా వెళ్ళి పోయేది!
'ఈ రోజు, ఫ్రెండ్స్ తో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్తున్నాను, మీరు నాకోసం చూడక హాయిగా నిద్రపొండి!' అన్న చీటీ ఒకటి తలగడమీద పెట్టి వెళ్ళిపోయేది. ఒక్కోప్పుడు కేశవకి చిరాకు గల్గేది.
'చూడు రాజూ, నీకోసం నేను ఇక్కడ కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చోమంటానే. నీవు నన్ను గుర్తించకుండా అల్లా షికార్లు ఎల్లాచేస్తావ్! అనేవాడు!
'దూరంగా వుండటంలోనే ఆకర్షణ ఎక్కువవుతుంది డియర్! నిజానికి మిమ్మల్నికాదని నేనేమి చేయగలను? మీలాంటి సంస్కార హృదయులు, నా భర్తకావటం, నా అదృష్టమనుకొంటున్నాను!' అంటూ నవ్వేది రాజేశ్వరి. తనకేసి నిర్నిమేషంగా చూస్తూ వుండిపోయిన కేశవ వెంపు ఆశ్చర్యంగా చూసింది కామేశ్వరి!
'ఏమిటి మాట్లాడరేం?' అంది.మళ్ళీ చటుక్కున కేశవ కళ్ళముందు పరుచుకున్న నీలితెరలు తొలగిపోయేయి! అతని కిదంతా గమ్మత్తుగా తోచింది! కామేశ్వరితో తను ఎప్పుడు మాట్లాడవలసి వచ్చినా, రాజేశ్వరి జ్ఞాపకం రావటంతో, అతను తబ్బిబ్బు అవుతున్నాడు. తను చిన్నపిల్లవాడు కాదు! ఆడవాళ్ళతో మాట్లాడే అలవాటు లేని వాడుకాదు! బోలెడు మంది అమ్మాయిలకి పాఠాలు చెప్పేవాడు! రాజేశ్వరి చనిపోయి నాకకూడా, ఆయన అనేకమంది అమ్మాయిలకు, పాఠాలు, తెలీనివి రాత్రుళ్ళు తొమ్మిదీ, పదిగంటలదాకా కూర్చుని చెప్పేవాడు! అటువంటప్పుడు కూడా ఆయనలో ఏ వికారమూ కలిగేదికాదు! రాత్రుళ్ళు అలవాటు ప్రకారము, టేబుల్ మీదున్న గ్లాసులోని పాలుత్రాగి, మంచం మీద పడుకోబోతూ ప్రక్కమంచంకేసి చూసేవాడు! ఆ మంచం ఖాళీగా కనుపించేది! 'నళిని'కి రెండేళ్ళు వచ్చిం దగ్గర్నించీ సీతమ్మ జడుసుకుంటుందనీ, తన దగ్గర పడుకోబెట్టుకునేది. 'నళిని' కాన్వెంట్ లో జేరిన తర్వాత, హాలుకి ఎదురుగా వున్నగది 'బెడ్' రూంగా మార్చుకుంది. ఆమె బట్టల బీరువా, మున్నగు, వస్తువులన్నీ, ఆ గదిలో అమర్చుకొంది. 'నళిని!' రెండేళ్ళ పిల్లయ్యేదాకా ఆ మంచం ఖాళీగా వుండేదికాదు. కనీసం పిల్లది అన్నా ఆ మంచంమీద పడుక్కుని వుండేది. 'రాజేశ్వరి' వారానికి నాలుగురోజులు సోషల్ వర్క్ లోనే మునిగి పోయేది! ఖాళీగా వున్న మంచంకేసి, దోమతెర కంతల్లోంచి చూస్తూంటే, అతనికి తెలియకుండానే నిద్రపట్టి పోయేది! మళ్ళీ ఎప్పటికో మెలుకువ వచ్చి చూసేసరికి, సన్నని నైటు బల్బు కాంతిలో, దోమతెరలోంచి, పచ్చని మెత్తని శరీరం అలసి, నిద్రపోతూ కన్పించేది! అల్లా ఆమె వెంపు చూస్తూనే, మళ్ళీ నిద్రపోయేవాడు కేశవ!
కామేశ్వరి వచ్చింది మొదలు, ఆ మంచం ఎప్పుడూ, ఖాళీగా వుండేదికాదు! తెల్లని, పల్చని, దోష తెరలోంచి, సన్ననీ మెత్తటి నైటు బల్బు కాంతిలో, ఆమె నల్లని శరీరం కన్పించుతూనే వుండేది. రాజేశ్వరి ఎప్పుడూ తను చూసేసరికి అలసి సొలసి నిద్రావివశురాలై వుండేది! కామేశ్వరి ఎప్పుడూ, నిద్రపట్టని దానిలా, పరుపుమీద అటూ ఇటూ దొర్లుతూ కన్పించేది! ఒక్కోప్పుడు దోమతెరలోంచే,
'ఇంక నిద్రపోలేదా కామేశ్వరీ! అని పలకరించేవాడు కేశవ.
కామేశ్వరి నిద్రపోయినదానిలా నిద్ర లోనే వత్తిగిల్లినట్లుగా నటించేది. కాని బదులు పలికేది కాదు. అల్లాంటప్పుడు, కేశవకి ఆమెది నిజం నిద్రో, దొంగనిద్రో తెలుసుకోవాలని బుద్ధిపుట్టేది. గమ్మున లేచివెళ్ళి ఆమె మంచందగ్గర కాళ్ళ వెంపు నించుని దోమతెర ఎత్తిచూసే వాడు. అరగంట నించున్నా, కామేశ్వరిలో చలనం వుండేది కాదు. గాఢంగా నిద్రబోతున్నట్లు, ఆమె దీర్ఘంగా తీసే ఉచ్చ్వాస, నిశ్వాసములు సాక్ష్యం చెప్పేవి. అప్పుడప్పుడు ఆమె పల్చని పెదాల చివరల చిన్నసిగ్గు తొంగిచూసినట్లని పించేది! కాస్సేపు రాజేశ్వరిలా, కాస్సేపు కామేశ్వరిలా కన్పించేది ఆ శరీరం! రాజేశ్వరిలా ఆ శరీరం కన్పించినప్పుడు ఏవో కులాస కబుర్లు చెప్పేవాడు! కామేశ్వరిలా కన్పించి నప్పుడు, ఆమె ముఖంకేసి చూస్తూ, దీర్ఘంగా ఆలోచించేవాడు!
'ఆఁ! నువ్వు మీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా! అన్నాడు. ఇంతసేపూ నిర్నిమేషంగా ఆమెవెంపు చూస్తూనే వున్నాడు! అతను, తన శరీరాన్ని చూపు లతో తూట్లు తూట్లు పొడుస్తున్నాడని కామేశ్వరికి తెలిసిపోయింది. శరీరం అంతా, నగ్నంగా అయిపోయినట్లు కుంచించుకపోయింది! పమిటచెంగుని భుజంమీదుగా ముందుకు లాక్కుని చేతుల్లో పుచ్చుకుని గట్టిగా నలప సాగింది.
'నిజంగా నీకు వెళ్ళిపోవాలనుందా కామేశ్వరీ!' తనేదో తప్పు చేసినట్లు ఆర్ద్ర కంఠంతో అన్నాడు కేశవ.

ఆ గొంతుతో అతను ఆ మాటలు ఉచ్చరించిన తీరు కామేశ్వరిలో నున్న సుప్త ప్రకృతిని మేల్కొల్పింది.
'మీరు వెళ్ళమంటేనే వెళ్తాను! అదైనా నాలుగురోజులుండి రావటానికే!' నెమ్మదిగా వణికే గొంతుతో అంది కామేశ్వరి.
'నువ్వెళ్ళిపోతే ఆ గది అంతా చిన్నబోతుంది కామేశ్వరీ! ఆ మాట పైకి ప్రేమగా అంటాన్ని నా వయసు సహించదు. నాలో నేను చెప్పుకోలేని, లాలస నిన్ను చూస్తే కలుగుతోంది కామేశ్వరీ! క్షమించు!' అందామనుకున్నాడు కేశవ. కాని అల్లా ఆత్మనివేదన చేసుకోవటం అతని అభిజాత్యానికి విరుద్ధం!
'అవును! నీకు పరీక్షలు దగ్గర కొచ్చాయి! ఇప్పుడు వెళ్లొద్దు! బాగా చదువుకోవాలి! నీకు తెలివితేటలున్నాయి. కాస్త శ్రమించావంటే క్లాసు వస్తుంది!' అన్నాడు గురువుగారిలా.
'నేను పరీక్షలకు పోవటంలేదు!' అంది దీనంగా కామేశ్వరి.
'అదేం! కూర్చో! నాకు అంతా వివరంగా చెప్పు!' అంటూ ఆతృతగా చేయి పుచ్చుకుని, కూర్చోబెట్టాడు! కొద్దిగా చలించింది కామేశ్వరి!
'అత్తగారు వక్కరూ, వుండలేకుండా వున్నారట! అంచేత మానివేయదల్చుకున్నాను' అంది.
'ఏమిటీ! అమ్మ నిన్ను కాలేజీకి పోవద్దందా!' అన్నాడు ఆశ్చర్యంగా.
'వూఁ' అంది.
'మరి నీకు చదువుకోవాలని వుందన్నావు?' అన్నాడు.
'ఒకప్పుడు చదువుకోవాలనే దుగ్ధ వుండేది! ఇప్పుడు నాకూ ఇంక చదువు అనవసరం అనిపిస్తోంది!' అంది.
'నీకూ చదువు అనవసరం అన్పించు తోందా?' సంభ్రమంగా అన్నాడు కేశవ.
'అవును! ఎందుకు వచ్చిన చదువులు?' అంది కామేశ్వరి!'
'చదువు మానివేస్తానన్నమాట! అయితే నీవు పుట్టింటికి వెళ్ళదల్చుకున్నావా! చదవ నవసరంలేదుగా!' దుగ్దగా అన్నాడు కేశవ.
కామేశ్వరి మాట్లాడలేదు.
'అయితే నీ ఇష్టం! వెళ్ళితేవెళ్ళు!' అంటూ చప్పున తన మంచంమీదకువెళ్ళి దోమతెర దించుకుని పడుక్కున్నాడు! కామేశ్వరికి భర్తకి కోపం వచ్చిందని తెలిసింది. తను పుట్టింటికి వెళ్ళటం అతనికి ఇష్టంలేదనుకొంది.
'పోనీ, వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏమిటి!' అనుకొంది.
'ఏమండీ మీకు కోపం వచ్చిందా? మీరు వద్దంటే నేను ప్రయాణం అవనే అవను!' అందామనుకుంది. కాని అల్లా అంటానికి సిగ్గువేసి ఊరుకుంది.
మర్నాడు కాలేజీ టయిమ్ కీ నళిని తయారయ్యింది కామేశ్వరి దగ్గరికొచ్చి.
'అదే! ఇంకా అల్లాగే వున్నావ్! కాలేజీకి రావా?' అంది.
'రాను!' ముక్తసరిగా అంది కామేశ్వరి.
'ఎంచేత? వంట్లో బాగాలేదా! అప్పుడే?' వేళాకోళంగా నవ్వుతూ అంది నళిని. సిగ్గుతో చచ్చినంత పని అయ్యింది కామేశ్వరికి! బాధతో మెలికలు తిరిగింది ఆమె బేల హృదయం!
'లీవ్ లెటర్ వ్రాసావా!' అంది నళిని.
'పూర్తిగా మానేసాను! ఇంక చదవ దల్చుకోలేదు!' అంది కామేశ్వరి.
'ఏమిటీ! చదువు మానేసావా? నాన్న వద్దన్నాడా! లేకపోతే ఎవరన్నా లవ్ లెటర్స్ వ్రాసారా?' హేళనగా అంది నళిని.
'ఛ ఛ! ఏం మాటలు నళినీ' వ్యధతో కళ్ళ నీళ్ళు తిరిగాయ్ కామేశ్వరికి.
'తప్పేమన్నాను! కాలేజీలో జేరిన ప్రతీ అమ్మాయికీ విధిగా ఒకటో అరో ప్రేమ లేఖలు వస్తూనే వుంటాయ్! ప్రేమ లేఖలు రాకపోతే అమ్మాయిలకు కాలేజీల్లో చదవాలనే ఆసక్తే వుండదని మాధవ అంటూ వుంటాడు! మరి నీకు అల్లాంటి లేఖ వస్తే చూస్తూచూస్తూ నాన్న వూరుకో గలడా!' అంది నళిని.
కామేశ్వరికి కళ్ళమ్మట నీళ్ళు గిర్రు మని తిరిగాయ్! 'తన ముఖానికి ప్రేమ లేఖలు వ్రాసేవాళ్ళు కూడా వుండాలా? అంత ఆకర్షణ తనలో వుంటే గౌరవంగా జానెడు పొట్టా నింపుకోవటంకోసం రెండోపెళ్ళి సంబంధానికి ఒడంబడుతుందా?' అనుకొంది కామేశ్వరి. నిస్తేజంగా వున్న కామేశ్వరిని చూసి, కాస్త ఏడిపించ బుద్ధయింది నళినికి. వంటి నిండా పుళ్ళతో వుండి నడవలేక నడుస్తూన్న కుంటికుక్కని రాళ్ళుచ్చుకుని కొట్టి అది కుయ్యో మంటూంటే చప్పట్లు చరుస్తూ ఆనందించే పసికుర్రాడి మనసు నళినిలో వుంది.
