"నేనుమాత్రం నీకేం చెరువు చేశానురా? లక్షణంగా అంతులేనంత ఆస్థి వస్తూంటే అనుభవించలేవా?" అన్నాడు. నాకు మండిపోయింది-"వెధవాస్థి నువ్వూనూ, చేశావ్ పాడు పెళ్ళి, ఆ క్షణం నుంచీ నేను ఏడవని ఘడియలేదు. ఏ లేనింటి పిల్లనో చేసుకుంటే శాంతంగా బ్రతికే వాడిని. ఏం చూసుకోని వాళ్ళింటికి పొమ్మంటావ్? కట్టుకున్న ఆడదైనా మొగుణ్ణి చూసినట్టు చూస్తుందా? ఆ కొంపలో కాపలావాడిలా పడి వుండమంటావా? కార్లూ, మేడలూ లేకపోయినా నేనేం అడుక్కుతింటున్నానా? నాకు చెప్పకుండా నువ్వెందుకిలా చెయ్యాలి? నాకు తెలీకుండా దాగిపోతుందనుకున్నావా?"
"ఒరేయ్! నువ్వంత గొంతు చించుకోవాల్సిన కష్టాలేంవచ్చి పల్లేదు. నీమంచికోసం-హాయిగా అనుభవిస్తావని చేశానుగానీ నిన్ను పాడు చెయ్యాలనిగాదు. అక్కడికెళ్తే నీకేం నామోషిరా? అదేం తప్పుడు పనా?"
"ఛీ! ఇంకా మాట్లాడుతావ్. నీలాంటి మానాభిమానాలు లేని వెధవ లెవరో......"
"మధూ! చిన్నా పెద్దా మరిచి మాట్లాడు తున్నావ్" అమ్మ మందలించబోతే మండిపడ్డాను-" ఇందులో మాత్రం నువ్వు కలగ జేసుకోకు. నాబాదెవరికర్ధమవుతుంది? వీడికి బడి బ్రతుకంతా నేనెంత వుసూరుమని ఏడవాలో నీకేం తెలుసు? పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగి మరీ వదిలిందట. పెద్ధవాడని నమ్మినందుకు ఇంత అన్యాయం చేస్తాడా? పైగా నా సుఖం కోసం చేశాడా?"
ఆయనకీ కోపం వచ్చింది. తారాజువ్వలా లేచాడు-"ఒరేయ్! నీ సుఖం కోసమే చేశానో, కష్టం కోసమే చేశానో సరే! బుద్ది తక్కువ పని చేశాను. నువ్వూ నీ పెళ్ళాం ఒకటి కాకుండానూ పొరు-నీకొచ్చే రూపాయలలో దానధర్మాలు చేసెయ్యవు, ఎటొచ్చీ నేనే చెరుపయ్యాను. చిన్నతనం నుంచీ చేసిందంతా ఈనాటికీ నీకు మరుపై పోయింది. ప్రయోజకుడవయ్యావ్. ఇక నేనూ తప్పుకొని ఉండటం మంచిదే. జన్మలో నీ గుమ్మం ఎక్కితే............"
"వెళ్ళు. తక్షణం వెళ్ళు. ఆమాటే నేనూ అనాలనుకొంటున్నాను". "మధూ!" అంటూ అరిచింది అమ్మ-"అన్నయ్యా! చిన్నవాడు వాడి మాటలకేమిటి? నామాట విను భోంచేసి వెళ్ళు" అంటూ అన్నగార్ని ప్రాధేయపడింది.
"చాలమ్మా! నీకొడుకు కబుర్లతోటే కడుపు నిండింది. వస్తాను" అంటూ సంచి తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. అమ్మకన్నీళ్ళతో లోపలి కెళ్ళింది. నేనలాగే కూలబడిపోయాను.
తర్వాత అరుణా వాళ్ళన్నయ్యకు ఖచ్చితంగా వుత్తరం రాశాను. "మీవుత్తరాలవల్ల ఇప్పటికీ సంగతులేమిటో పూర్తిగా తెలిశాయి. ఇదంతా మాకెవ్వరికీ తెలియనివ్వకుండా మావయ్య జరిపిన గూడుపుటాణి. పెళ్ళికిముందు నేను ఇల్లరికం వెళ్ళాలనే షరతంటూ వున్నట్టు నాకెంతమాత్రం తెలీదు. మీవంటి లక్షాధికార్ల కృపాదృష్టి తిన్నగా నామీదనే ఎలా వాలిందా అని మధనపడడానికి సరైన జవాబు ఈనాడు దొరికింది. మీవంటి సిరిసంపదలు లేకపోయినా మానాభిమానాలనేవి చంపుకున్నవాణ్ణికాదు. కట్టుకున్న పెళ్ళాం బిడ్డల్ని బ్రతికించుకోలేనంత నీచస్థితిలో లేను. నారెక్కలంటూ నాకున్ననాడు ఎవరి ఆస్థిపాస్థులకీ ఆశించాల్సిన పనిలేదు. చిన్నతనం నుంచీ మనసంతా నామీద పెట్టుకు పెంచి పెద్దచేసిన అమ్మనీ-ఒక్కగానొక్క చెల్లినీ దూరం చేసుకోలేను. నాకు తెలీకుండా జరిగిన విషయం గురించి నేనేం చెప్పలేను. నేను మీ ఇంటి కొచ్చి వుండటం ఈ జన్మలో జరగనిపని. అరుణకి నేను మొగున్నే అని మీరు అనుకుంటే వెంటనే దాన్ని అత్త వారింటికి పంపండి. ఆవిడకి మొగుడూ కాపరం అక్కర్లేదంటే అక్కడే వుంటుంది. నేను చెప్పేది ఇదే".
జవాబు వచ్చింది- "బాబాయి చేసిన పనికి నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. నిన్ను అనాల్సిన పనిలేదు. నేను అప్పుడు నీతో ముఖాముఖీ మాట్లాడకపోవటం చాలా గొడవ తెచ్చింది. అరుణని కాపరానికి పంపటం పంపకపోవటం నాచేతిలో వున్నదికాదు. మీరిద్ధరిలో ఎవరో ఒకరు మీ పట్టుదలలు మానుకొనేవరకు కలిసి సుఖపడలేరని మాత్రం చెప్తున్నాను. అరుణకి కూడా చాలా చెప్పి చూశాను. అదెంత మాత్రం ఇష్టపడటంలేదు. అమ్మకి అసలే ఇష్టంలేదు. బాబాయి ఇంత అక్రమంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. లేకపోతే అందుకు సంతోషంగా ఇష్టపడే వాడినే ఎంచుకొనేవాళ్ళం. ఇంత కన్నా నేను చెప్పగలిగిందేమీ లేదు బావా! నువ్వూ దీర్ఘంగా ఆలోచించు. నూరేళ్ళ బ్రతుకు నాశనం చేసుకోకు. నాశాయ శక్తులా అరుణకీ చెప్పి చూస్తా"
అవును ఈ విషయంలో అంతకుమించి తను చెయ్యగలిగిందికూడా ఏమీలేదు. నేనేదో జీవచ్చవంలా తిని తిరుగుతున్నాను. కడుపునిండా అన్నం తింటున్నదీ లేందీ-కంటి నిండా నిద్రపోతున్నదీ లేందీ నాకే తెలీదు. ప్రతీరాత్రి చిన్నపిల్లాడిలా ఏడ్చే వాణ్ణి. రామం బావ చెప్పినట్టు రాత్రింబవళ్ళు దీర్ఘంగానే ఆలోచించాను. అంతకన్నా వేరే ధ్యాసేముంది? కాని ఎంత చేసినా మనసుని సరి పెట్టలేకపోయాను. నన్ను నేను సంతృప్తి పర్చుకోలేకపోయాను.
ఇల్లరికం వెళ్ళటం అనేది తప్పోఒప్పోమాత్రం నాక్కకరలేదు. నా పరిస్థితులకి మాత్రం ఆమర్గం అనుసరించ దగ్గదికాదు. లక్ష్మికి పెళ్ళంటూ అయితే పోనీ వెళ్ళిపోతుంది. మరి అమ్మమాట? ఈఆఖరిరోజుల్లో ఆవిడేమవుతుంది? నాకోసం-నాచదువుకోసం ఎన్నిగొడవలు పడిందీ! ఎంత యాతన అనుభవించిందీ! నేను అభివృద్ధిలోకి రావటం ఒక్కటే ఆశయంగా పెట్టుకొని తనకున్న నగానట్రా చదువుకే ధారపోసింది. ఆనాడు అమ్మే అలా చెయ్యకపోతే ఏ కలిగినవారి ఇంటి చెంతనో చాకిరీ చేసుకోవాల్సి వచ్చేదికదా? తనేమీ పరాయివాళ్ళకి ధారపొయ్యలేదు. తనకొడుక్కి తను చేసుకుంది. కన్నతల్లి బాధ్యత నెరవేర్చింది. మరి ఈనాడు ఆ కొడుకె పెరిగి పెద్దవాడయ్యాడుకదా? తల్లిపట్ల తనకిమాత్రం కొంత కర్తవ్యం లేదా? ఆవిడ పోషణలో పెరిగి, రెక్కలు తెచ్చుకుని, ఆవిణ్ణి విడిచి తన దారిన తను ఎగిరి పోవటమేనా ధర్మం?
అమ్మ! ఏనాడూ సుఖమనేది ఎరగదు. కట్టుకున్న ఆడదాని నిర్లక్ష్యానికి నేనెలా ఏడుస్తున్నానో-నాన్నగారి ప్రయోజకత్వానికి బ్రతుకంతా ఆవిడా అలాగే కుళ్ళిపోయింది. భర్త సుఖం ఎలాగు లేదని గుండె బండ చేసుకొంది. కన్న బిడ్డలమీద కొండంత ఆశ పెంచుకొంది. ఆ ఆశలతోటే దినాలు గడుపుతూ వచ్చింది. ఈనాడు అదీ దూరమైతే ఇక ఆవిడ బ్రతుకులో అనుభవించిందేమిటి? ఆజన్మకి సార్ధకత ఏమిటి? లేని వాళ్ళు లేకుండానే పోతారు. ఉన్నవాళ్ళయినా ఒకరికికాకుండా ఒకరెందుకు దూరమైపోవాలి?
ఒక్కగా ఒక్క చెల్లి. నాన్న తర్వాత నాన్నలాంటివాణ్ణి. అన్నయ్యంటే ప్రాణం ఇస్తుంది. ప్రతీ ఆడదానికీ పుట్టింటి ఆశ వుంటుంది. తన ఇంట భోగభాగ్యాలతో తులదూగుతున్నా పట్టుమని పదిక్షణలైనా పుట్టింటవుండిరావాలని కోరుకొంటుంది. చిన్నారి లక్ష్మీ కోరికలెలా నాశనం చెయ్యను? ఈ ఆఖరి రోజుల్లో అమ్మని ఎక్కడో ఒంటరిగా ఎలా వుంచను? నా వాళ్ళకి నేను ఉండీ లేనివాడినే అయిపోనా?" "లేదమ్మా! లేదు. నీ కడుపున పుట్టి పెరిగి నిన్ను దూరం చేసుకోను. దుర్మార్గున్ని-వెధవనీ కానంతకాలం నిన్నూ, చెల్లినీ మర్చిపోను. నన్ను నేను అవమానాల పాలు చేసుకోను" అనుకున్నాను దృఢంగా. ఏం చూసి ఏ ధైర్యంతో ఆ మేడలో అడుగుపెట్టను? నాకెవరున్నారని? నన్నెవరు ఆదరిస్తారని? ఉన్నా లేదనుకోవాల్సిన భార్య వుంది. భర్తంటే గౌరవం, అభిమానం లేనీ భార్యా వుంది. తెలిసి తెలిసీ దానికోసం ఏం చూసుకు పరుగెత్తను? బ్రతుకంతా దాని దయా ధర్మాలకాశిస్తూ ఎలా పడి వుండను? ఆ ఇంట నాకు కాపలా కాచే కుక్క కున్న విలువుంటుందా? నా గౌరవం నేనే కాపాడుకోలేనివాడినైతే అలాగే 'ఆ ఇంటి పంచన పడి వుంటాను. కాని ఆ ఘడియ ఎన్నడూ రాదు, రానివ్వను.
ఆవేశంతోగానీ, అహంకారంతో గానీ చేసుకున్న నిర్ణయం కాదు నాది. నేనేది చేసినా నా మనసుకు సమంజసమనిపించేదే చేస్తాను.
* * *

రోజులు గడుస్తున్నాయి. నేను సిగ్గులేని వాన్నని అనుకొంటే అనుకోవచ్చుగానీ మూర్ఖురాలైన అరుణని మార్చాలని తాపత్రయ పడ్డాను. తెంపుకోవాలంటే తెగని ఆ బంధాన్ని బలీయం చేసుకోవాలని ఆరాటపడ్డాను. లోకం తీరూ, మంచీ చెడూ వివరిస్తూ అరుణకెన్నో వుత్తరాలు రాశాను- "చూడు అరుణా! నిన్ను దేవిరిస్తున్నా నని మాత్రం అనుకోకు. నీకులేని దూరదృష్టి నాకుందనే నా నమ్మకం. ఫ్రెండ్సు నేసుకొని కార్లలో షికార్లు కొట్టటం-సినిమాలు చూడటం కాదు బ్రతుక్కి కావాల్సింది. స్త్రీ వై పుట్టి కూడా స్త్రీత్వం మర్చిపోతున్న నువ్వు ఎంతో తెలుసుకోవాల్సింది వుంది. నువ్వు మోజు పడే విలాస జీవితంలో నీకు పవిత్రమైన శాంతి మాత్రం దొరకదు. దాంపత్య బంధం - దాని పవిత్రతా నీకు నేను బోధించాల్సిందేమీ లేదు. దేశదేశాల రచయితల్నీ నీ బీరువాలలో బంధించు కున్నావు. ఏ పుస్తకం తెరిచినా - ఏ సినిమా చూసినా గృహాన్ని స్వర్గసీమ చేసుకోమన్న సూక్తే కన్పిస్తుంది. మన బ్రతుకులు మనం చేజేతులా ధ్వంసం చేసుకోవద్దు. నువ్వు పసిపాపవి కాదు. ఒక్కరాత్రి నిద్రపోయేముందు నిశ్చలమైన మన సుతో క్షణం ఆలోచించు. ప్రతీ ఆడదీ ఏతీరులో నడుస్తూందో గుర్తుచేసుకో. నువ్వుండాల్సిన చోటేదో నీకు తెలిసివస్తుంది. నీకు తెలివితేటలున్నాయి. కాని సద్వినియోగం చేసుకోలేక పోతున్నావు. అసలు మనసనే దాన్నే నువ్వు ఉపయోగించుకోవటం లేదు. చెట్టుకు కాయ బరువు కానట్టే ఏ తల్లిదండ్రులకీ బిడ్డలు భారం కాదు. నువ్వెంత నీతల్లికి గారమైనా, ఆవిడ ప్రేమ చూపించాల్సిన పద్ధతి ఇది కాదు.
నన్ను అర్ధం చేసుకోటానికి ప్రయత్నించు అరుణా! నాకూ పదిమందిలో ప్రయోజకుడిలా బ్రతకాలని వుంది. నా కాళ్ళమీద నిలబడుతున్నాననే సంతృప్తి నాకు కావాలి. మనం కలిసి మెలిసి సంతోషంగా వున్ననాడు నీ ఆస్థి నీకు పరాయిది కాదు. నీ సర్ధాలకీ, నీ సుఖాలకీ ఏమీ లోటు రానివ్వను. నీకు సంబంధించిన ప్రతీ వస్తువూ ఇక్కడికి తెచ్చుకోవచ్చు. నేను అక్కడికి వచ్చివుండటంలో లేని సుఖం - గౌరవం నువ్విక్కడికి రావటంలో వుంటాయి. క్షణం నిశితంగా ఆలోచించు. ఇదే విధంగా ఎన్నోవిధాల మంచి చెడ్డలు చెప్తూ వుత్తరాలు రాశాను. కాని ఆవిడ రాసిన జవాబులు సారాంశం ఇది - "మీ వుత్తరాలు చదువుతున్నాను. అంత నిశితంగా ఆలోచించాల్సిన అగత్యమేమీ నాకు కన్పించటంలేదు. సంసారం సుఖమయం చేసుకోవాలని మీరు మనస్పూర్తిగా కోరిననాడు మీరే మీ పట్టుదల విడిచిపెట్టవచ్చును కదా? ఇక్కడేదో అవమానాల పాలై పోతారని మీరు అనుకోవటంకూడా వుత్త అనుమానం తప్ప మరేం కాదు- చెట్టుకి కాయ భారం కాదని అనుకోవటమే కనీ ఫలభారంతో వంగి ఒరిగిపోయిన చెట్లుకూడా వున్నాయి. నా తల్లిదండ్రుల ప్రేమని అందరితో పోల్చి చూడకండి. ఆ అదృష్టంలో మాత్రం నాకు నేనే సాటి. అమ్మక్షణం నన్ను చూడక పోయినా వుండలేము. నాకింతకన్నా ఏం చెప్పాలో తెలీటం లేదు."
