"ఏం.... ఏం చేసిందండీ?"
"కట్టెలు కొట్టేవాడు నెత్తిమీద మోపు ఎత్తుకొంటూ గుడ్డముక్క ఏదయినా ఇమ్మని అడిగితే ఆ గుంట ముండ వచ్చి నా తువ్వాలు వెధవకి ఇచ్చేసింది. చచ్చినట్టు.....తడిసి ఆరేసుకున్నాను. దీని సొమ్మన్నట్టు ఇదిస్తే వాడి సొత్తన్నట్టు వాడివ్వడు."
'అయ్యో.....పాపం!"
"దాని కోతిపనులన్నీ సమర్దిస్తూ కూర్చోవడానికి నే నేం మీ ఆయన్ని కాదమ్మోయ్! ఈ మాటు నా జోలికి వస్తే బుగ్గలు సాగదీసి ఉన్నపళ్ళూడగొట్టేస్తాను. అసలింతకీ ఎక్కడిదమ్మా ఈ సరుకు! నీ కయినా చెప్పాడా కనీసం?"అంటూ దూరంగా ఉన్న కుర్చీ లాక్కుని తాపీగా కూర్చున్నాడు.
"ఏం మాట్లాడవేం? ఏం మాట్లాడతావులే, తల్లా, తోడా? ఎవరున్నారు నీకు? ఎవరూ లేనిదాన్ని చేసి నిన్నిలా ఆటలాడిస్తున్నాడు. అయినా ఓ సారి గట్టిగా అడిగి చూడలేకపోయావా? ఇదెవర్తి? నే నెందుకు పెంచాలి? అని నాలుగూ దుంపలేక పోయావా?"
"అడిగానండీ..." నెమ్మదిగా అంది లీల.
"సంధ్యా....నువ్వు కిందవెళ్ళి మీ అమ్మని పంపు. ఆ గుంట వెధవలు కొట్టుకు చాపకుండా కింద ఉండి చూడు."
సంధ్య వెళ్ళగానే మళ్ళీ అతను "నువ్వు శుద్ధ అమాయకురాలివమ్మా నీ కేమీ తెలియదు" అన్నాడు.
లీల మాట్లాడలేదు.
"వీడి సంగతి నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. ఎక్కడెక్కడికో వెళుతూంటాడు. ఎవరెవరితోనూ, స్నేహాలు కలుపుకుంటూ ఉంటాడు. ఈ పిల్ల ఎవరో ఏమిటో ఈ పిల్లనే పెంచవలసినంత తప్పనిసరి ఏమిటి? అని నువ్వెప్పుడన్నా ఆలోచించావా?"
లీల తల వంచుకుని లేదన్నట్టు ఊపింది.
"ఎవరయినా పిల్లని పెంచుకునేముందు వాళ్ళ తల్లిదండ్రులు రావలసినవాళ్ళు రావడం, దత్తహోమం చేసుకోవడం, అన్నశాంతి అని కొన్ని ఉంటాయికదా? అవన్నీ మానేసి 'మేం ఎక్కడినుంచో పిల్లని తెచ్చుకు పెంచుకుంటున్నానుర్రోయ్" అని కార్డు గీసి పడేశాడు."
"ఏమిటి పిలిచారుట?" అంటూ వచ్చింది రుక్మిణమ్మ.
స్నానం అయ్యిందా లేదా? పొద్దున్నే కబుర్లలోకి దిగేరేమిటి?"
"ఒకసారి అయింది. మళ్ళీ నీళ్ళు పెడితే నేను సిద్ధమే."
"అదేం?"
"కట్టెలు కొట్టేయానాదివాడిని ముట్టుకున్నానుగా దాని ధర్మమా అని!"
"ఎవరు.... వీళ్ళ పాపేనా? అవును గానీ....నాకు తెలియక అడుగుతున్నానమ్మాయ్.... ఎవర్తె అది? ఏం చూసి పెంచుకుంటున్నావు? వాడికి బుద్ధి లేకపోతే నీ కయినా ఉండద్దూ?"
"..."
"ఇంతకీ దీన్ని పెంచుకోవడం నిశ్చయమేనా?"
అవునన్నట్లు తల ఊపి, లీల "ఎందుకంటే దీన్ని అయిదు వేలిచ్చి కొన్నారట!" అంది.
"నీకూ నచ్చే ఉంటుంది. కాకపోతే అలా ఊరుకుంటావా?"
"నాకు నచ్చడం, నచ్చకపోవడంతో ఈ ఇంట్లో ఏవీ ఆధారపడలేవు."
"అలా అనుకుంటున్నదెవరూ నువ్వే!" అంది రుక్మిణమ్మ కోపంగా.
"నేను చేసిందేమిటి.... అంతా నా ఖర్మ!"
"ఖర్మేమిటి....దాన్ని కొంపకి తెచ్చినవాడే ఎవర్తె ఇదీ?' అని అడ్డు తగిలి, గెంటేస్తే అడగ్గల వాడెవడు? అంత దమ్ము ఎవరికి?"
"అప్పట్లో ఆయన ముఖం చూసి ఊరుకోవలసి వచ్చింది."
"అప్పట్లో ఆయన ముఖం చూసి ఊరుకోవలసి వచ్చింది."
"అలా ఊరుకొంటే ఎప్పటికీ నీ గతి ఇంతే!"
"అంతే.... అనుభవించవలసిందే.....నీకు వేరే మార్గం లేదు."
సుందరం హఠాత్తుగా కుర్చీలోంచి సగం లేచి, "మార్గం లేకపోవడమేమిటి? నీ అంగీకారం లేకుండా పిల్లని పెంచడానికి వాడికి హక్కు లేదు. పిల్ల.....వంశం, గుణం, పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా పెంచడానికి ఎవరికీ హక్కులేదు. నన్నడుగు చెపుతాను" అన్నాడు.
"ఇప్పుడు.....ఎవరు మాత్రం చేసేదే ముందండీ?"
"ఏ మక్కర్లేదు. 'నా అనుమతి లేకుండా మా ఆయనిలా చేస్తున్నాడ'ని మేజిస్ట్రేట్ కి ఒక కాగితం తగిలిస్తే సరి!"
'ఆ కాగితాలూ అవీ పాపం ..... దానికెలా తెలుస్తాయి? పోనీ....మీరు రాసి ఇవ్వకూడదూ?" అంది రుక్మిణమ్మ.
లీల ఉలిక్కిపడింది. కానీ....వెంటనే వెర్రిబలం వచ్చినట్లయింది. ఆ పాప వచ్చిన దగ్గరినుంచీ తను చెపుతూనే ఉంది. 'ఈ పాప మన కొద్దని!' ఇదెవరి సా సో చెప్పకుండా. వాళ్ళు దీన్ని ఎలా ఇచ్చేశారో చెప్పకుండా తన భావాల్ని లెక్కచేయక ఆయనగారు ఈ పాపని బలాత్కారంగా తన జీవితంలో ప్రవేశపెట్టాడు. 'ఈ ఇంట్లో అదయినా ఉండాలి, నే నయినా ఉండాలి" అని తాను అన్నవాడు, ఆయన చిరునవ్వు నవ్వేసి, ఊరుకొన్నాడు. 'మీ రందరూ నా కవసరమే కానీ... మీ బాధలూ మీ భావాలూ నా కనవసరం' అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు.
ఈ పిల్ల ఎవరో, పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకొంటే తప్ప, తన మనసుకు శాంతి లేదు. సక్రమంగా ఒక మర్యాదస్థుల సంసారంలోంచి వచ్చిన పిల్ల కాకపోతే....దీన్ని పెంచడం, అనుబంధం పెంచుకోవడం, ఇది పెద్దదయ్యాక దీని భావాలు పంచుకోవడం.... ఇన్ని బాధలు పడటం ఘోరం!"
ఈయన చెప్పేకాగితంద్వారా ఆ వివరాలు తెలిస్తే బాగుండును!
"ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు?" సుందరం అడిగాడు.
"ఏం లేదండీ....అంతా మళ్ళీ అవసరమైన గొడవేమోనని..."
"ఏ గొడవా ఉండదు. ఎంక్వయిర్ చేయమనే రాద్దాం. అప్పుడు తేలబోయేదాన్ని బట్టి తరవాత విషయం మనం ఆలోచించుకోవచ్చు. నువ్వు 'ఊ' అంటే కాగితం అయిదు నిమిషాల్లో రెడీ అవుతుంది."
"ప్రమాదమేమీ లేదంటే నేను సిద్ధమే."
* * *
పది రోజులు గడిచాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభాకరం లీలని మేడమీద గదిలోకి పిలిచాడు.
నిశ్శబ్దంగా జేబులోంచి ఒక కాగితం చూపించి, "ఇదేమిటో తెలుసా?" అన్నాడు. మడతలు విప్పాడు. ఆ కాగితంలోని దస్తూరీ తనది కాదు కానీ అందులోని విషయం మెజిస్ట్రేటు ఆఫీసునుంచి ట్రూ కాఫీ తీసి రిజిస్టర్డ్ పోస్టులో ప్రభాకరానికి పంపారు.
"...పుట్టుపూరోత్తరాలూ, వంశాధికాలూ తెలియాలి. సదరు పాపను పెంచడానికి నాకు అభ్యంతర ముగా నున్నది. దీనివలన నా మాతృభావము అపవిత్రం అవుతున్నది.
సదరు పాప పుట్టుపూర్వోత్తరములు నా భర్తగా రైన ప్రభాకరంగారు కోర్టువారి ఎదుట ప్రమాణం చేసి, స్థిరపరిచినచో సదరు పాపకు పెంపకపుతల్లిగా నుండుటకు నాకు అభ్యంతరము లేదని ఇందుమూల ముగా తెలియజేయడమైనది."
లీల తలపైకి ఎగరేసి "అందులో తప్పేముంది?" అంది.
"ఎన్నోసార్లు నీకు నేను నచ్చజెప్పాను. పాప అలగా జాతి పిల్ల కాదనీ, మంచి కుటుబంలోంచి వచ్చిందనీ! నీకు నమ్మకం కలగలేదా?"
లీల మాట్లాడలేదు.
"సరే. నా మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు అడిగినట్లే చెపుతాను.... కానీ.... ఒక్కటి....ఇదంతా నీకు పుట్టిన బుద్ధి కాదని ఎవరో నిన్ను ఆడిస్తున్నారనీ నేను గ్రహించగలను" అని గిర్ర్రున తిరిగి చక చకా కిందికి వెళ్ళిపోయాడతను.
* * *
పదిహేను రోజుల అనంతరం ఒకనాటి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో.
నిద్రపోతున్న ప్రభాకరానికి తన కాళ్ళు రెండూ చుట్టుకొని లీల ఏడుస్తున్నట్టు స్ఫురించి, మెలకువ వచ్చింది.
మంచం మీద లేచి కూర్చుని, అతను కాళ్ళను లాగేసుకుని, "ఏమిటిది....లే..." అన్నాడు.
లీల ఏడుపు మానలేదు. "నేను....తప్పే చేసి ఉండవచ్చు... కానీ.... నన్నింతగా శిక్షిస్తారా?"
"ఏం.... ఏమయిందిప్పుడు...?" చిరాగ్గా అడిగాడు ప్రభాకరం.
"పాప ఎవరో చెప్పమని అడిగినంత మాత్రాన...మీ రిలా చేస్తారా? ఎన్నిసార్లు నేను మిమ్మల్ని అర్ధించాను? ప్రార్దించాను? చివరికి భయం వదిలి.... నిలేసి అడిగాను. మీ రా విషయం ఎందుకు దాస్తున్నారు? మళ్ళీ రెట్టించి అడిగానని, ఏకంగా విడాకులకే దానా వేస్తారా నా మీద?"
"ఏమో నాకు తెలియదు... వెళ్ళు..."
"ప్రపంచంలో నాకు మీరు తప్ప ఎవరున్నారు? తల్లి లేదు....తండ్రి లేడు....తోడు లేదు.... అన్నీ మీరే అని నమ్మి మీ ఇంటికి వచ్చి, ఆత్మార్పణం చేసుకున్నాను. పిల్లల్ని కనడానికి నా శరీరం అనువైంది కాకపోయినా మీ కోరిక కోసం నాలుగు సార్లూ రక్తపు మడుగుల్లో దొర్లాను. మృత్యువులో కుస్తీ పట్టాను. నేను అడిగిందేమిటి? నేను పెంచేపిల్ల.... ఎవరో నాకు స్పష్టంగా తెలియజేయండి. అన్నాను. మీరు చెప్పలేదు. చెప్పడానికి మీ కిష్టంలేని పక్షంలో నాకా పిల్లమీద ద్వేషమే తప్ప ప్రేమ కలగదు. నేను ద్వేషించే పిల్లని నా మెడకు తగిలించేకంటే మీరు మీ వంశం కోసం ఇంకో పెళ్ళి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదని స్పష్టంగా తెలియజేశాను. దేనికీ మీరు 'సై' యనక పోతే మీ ద్వారా కాకపోయినా ఇంకొక రకంగానైనా ఆ పిల్లెవరో తెలుసుకుందుకు కాగితం పెట్టానేఅను కోండి. అందువల్ల ఎవరికీ ఏ ప్రమాదమూ లేదుకదా! అంత చిన్న విషయానికి మీరు నా మీద ఇంత ఆగ్రహం తెచ్చుకొని, నన్ను మీ ఇంట్లోంచి పొమ్మంటారా? మీరే పొమ్మంటే ఈ ప్రపంచంలోనే నాకు స్థానం లేదు. నా దేహంలో జీవమే అనవసరం!"
"అంత ప్రమాదమేం లేదులే! ఆ పిటీషన్ రాస్తూండగా, నీకు ఎవరో అండగా నిలబడ్డారే వాళ్ళ దగ్గరకు వెళ్ళు!"
లీల తల మంచానికేసి బాదుకుంటూ "నే నింక ఎవరి దగ్గరికీ వెళ్ళనూ. నన్ను మీరు క్షమించాననే వరకూ మరి వెళ్ళను..."అంది.
"అలాగేం... అయితే నేనే వెళతాను" అని ప్రభాకరం హఠాత్తుగా లేచి పరుగు పరుగున కిందకు వెళ్ళిపోయాడు.
లీలకు అతని వెంట వెళదామనిపించింది కానీ... వాళ్ళందరి ఎదురుగా అవమానం పొందడానికి తాను స్థిరంగా లేదు.
అయిదు నిముషాలు గడిచేలోపుగా, కారు శబ్దమైంది కారులో ప్రభాకరం ఎక్కడికి వెళతాడో?
లీల గుండె వడివడిగా కొట్టుకుంది. హడావుడిగా కిందికి దిగి వచ్చింది. అకక్డ కనబడ్డ దృశ్యం చూసి ఆమె నిర్ఘాంతపోయింది.
రుక్మిణమ్మ, సుందరంగారు, పిల్లలూ సామాన్లూ అప్పటికి కార్లో గేటు దాటడం అయిపోయింది. ప్రభాకరం అప్పుడే ఎవరితోనో యుద్ధం చేసివస్తున్న వాడిలాగా చేతులు దులుపుకుంటూ నోట్లో ఏదో గొణుక్కుంటూ లోపలికి వచ్చేశాడు.
లీల వేయి దేవుళ్ళకి మొక్కుకుంది తను వేసిన తప్పటడుగు... తనను.., పెద్ద గోతిలోకి దింప కుండానే పైకి లాక్కోగలిగింది. నిజానికి పాప ఎవరో తెలియకపోయినంత మాత్రాన తన కిప్పుడేం పెద్ద తేడా కనిపించటం లేదు. పాప ఎవరైనా సరే...ప్రభాకరం మనసులో పుత్రికాస్థానం సంపాదించిన భగవత్స్వరూపం! కలుషమైన భావాలకి పసిపాపలలో స్థానం లేదని అతను అంటున్నదేగా! చేసిన తప్పును సరిదిద్దుకొని, పాపను ప్రేమించడం అలవాటు చేసుకోవడమే మంచిదేమో! తన పిల్లలు అతని పిల్లలయ్యే యోగ్యత ఎలాగూ లేకపోయింది. అతని పాపను తను తల్లిగా చూసి, పెంచడం తన కర్తవ్యం....పవిత్ర మైన భావం మనుసులోకి రాగానే లీల కళ్ళు చెమర్చాయి.
ముఖం కడుక్కోని, బొట్టు పెట్టుకొని, మరొక సారి మనసారా భర్తకు నమస్కరిద్దామని ఆమెకు గాఢమైన వాంఛ కలిగింది.
గేటులో కారు వస్తున్న చప్పుడయింది. ఖాళీ కారును చూసి, లీల సరదాగా నవ్వుకుంది. "వాళ్ళ కిప్పుడు రైలుందో లేదో!"
అయిదు నిమిషాల్లో లీల వసారాలోకి వచ్చింది. ప్రభాకరం సూట్ కేస్ కార్లో పెట్టి వెనక్కి వచ్చాడు.
'ఇప్పుడెక్కడికి ప్రయాణం?' అన్న ప్రశ్న నోటి దాకా వచ్చిందామెకు.
ప్రకటించవలసిన కృతజ్ఞతాభావం సందేహవాయు వులో కొంత దూరం ఎగిరిపోయింది.
ప్రభాకరం లోపలికి వచ్చి, "మన హియరింగ్" వచ్చే నెల....మూడో తేదీ అంతవరకూ పాప జాగ్రత్త! నా మీద కోపం పాపమీద చూపించకు" అని మళ్ళీ కారువైపు నడవసాగాడు.
లీల నిర్ఘాంతపోయింది.
* * *
మూడో తారీకు తెల్లవారింది. లీలకు జ్వరం వచ్చినట్లయింది. పొద్దున్న లేచి, అరగంట కొకసారి చొప్పున మూడు సార్లు టెంపరేచర్ చూసుకుంది. మూడుసార్లూ నార్మలే ఉంది. మరి ఒంట్లో...ఈ గుబగుబలెందుకు?
కోర్టు అంటే భయం...!
కోర్టులో శిక్షలు వేస్తారు.
మనుషులంతా ఒకటే!
తప్పు చేసిన వారంతా ఒక్కొక్కటే!
సంఘం ముద్దాయిలని విచారణ చేసి, శిక్ష విధిస్తుంది.
తను ముద్దాయి!
"అతన్ని ఎందుకు నొప్పించావమ్మా? అతని కేసులో బలం ఉంది. 'నా భార్య నాకు వంశం నిలబెట్టే పిల్లల్ని కని ఇవ్వడం లేదు అందుచేత నా కావిడ అక్కర్లేదు' అని మీ ఆయన వాదం. నిజానికి ఏ డాక్టర్ని పిలిచి పరిస్థితి పరీక్ష చేయమన్నా నీ బండారం బయటపడుతుంది. పాపం....పీకల మీదకు తెచ్చుకున్నావు! నిన్నెవరో తప్పుదారి తొక్కించారు. చూడు... అరగంట ముందుగా కోర్టుకు వస్తాడేమో! చూసి, మరోమాటు కాళ్ళ మీదపడు" అన్నారు రామనాథంగారు తన కథంతా లాయరు సుబ్బారాయుడు ద్వారా విని.
