
లీల రెండు చేతులూ జోడించి పైకెత్తి, "అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు" అంది.
"కోర్టులో ఉండేది భగవంతుడు కాడమ్మా... రూల్సే ఉంటాయి."
* * *
"దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెపుతాను. అబద్ధం చెప్ప"నంటూ మొదలుపెట్టి ప్రభాకరం లీల గొడ్రాలిని ఆరోపించాడు. లేడీ డాక్టరు సుభద్రమ్మ అది తేలగలదని అన్నాడు.
లీల కరుగుతున్న కళ్ళతో అతను మాట్లాడుతున్నంత సేపూ అతను వైపే చూసింది. ఆ కళ్ళవైపు అతను చూస్తే "నాకీ కోర్టూ వద్దు....ఈ కేసూ వద్దు. నేను విత్ డ్రా అవుతున్నాను" అని చెప్పేసి, దిగిపోయి ఉండేవాడు. ఆ కళ్ళలో అంత ఆర్ద్రత ఉంది. డాక్టర్ సుభద్రమ్మ సాక్ష్యం ముగిసింది.
కాంపౌండరు, విశాలమ్మ కొంచెం సేపు మాట్లాడి దిగిపోయారు. వాళ్ళెవ్వరూ తనవైపు చూడలేదు.
వాళ్ళందరికీ ప్రభాకరం తనని అతని భార్యగా పరిచయం చేశాడు అప్పుడు. ఇప్పుడు...ఆ ప్రభాకరమే...తనకు అవసరంలేని భార్యగా తనను కోర్టువారికి వారిచేత పరిచయం చేయిస్తున్నాడు.
లీలని బోనెక్కమన్నారు.
'దేవుని ఎదుట' అవమన్నారు. రామనాథంగారి మాటలు జ్ఞాపకం వచ్చాయామెకు. 'కోర్టులో ఉండేది దేవుడు కాడమ్మా రూల్సే ఉంటాయి' అన్నారాయన.
కోర్టులో దేవుడు లేడు.
కోర్టులో....నా దేవుడు లేడు.
నా దేవుడే నన్ను కోర్టుకి రమ్మన్ననాడు, ఇంక నన్నే దేవుడూ రక్షించలేడు.
"దేవుని ఎదుట....అనండమ్మా."
లీల కోర్టువారికో దండం పెట్టి, "బాబూ! నన్ను క్షమించండి. మీరే తీర్పు ఇచ్చినా శిరసావహిస్తాను. ఇంతకంటే దేవుని ఎదుటగానీ, దేవుడు లేకుండా చూసి కానీ నేను చెప్పేదింకేమీ లేదు."
కోర్టులో నవ్వులు.
"ఆర్డర్! ఆర్డర్!!"
కోర్టువారు కూడా చిరునవ్వు నవ్వుతూ, "ఇప్పుడు నువ్వు చెప్పిన ముక్కలు కూడా దేవుని ఎదుట ప్రమాణం చేసే చెప్పాలమ్మా!" అన్నాడు.
'కానీ... కోర్టులో దేవుడుండడు.'
ఆ మాట జ్ఞాపకం రాగానే, అంతసేపూ ఎలాగో నిలద్రొక్కుకున్న లీల......కొంచెం వణికి కిందికి కూలిపోయింది.
* * *
లీలకి స్పృహ తప్పిపోయిన మాట విని, ప్రభాకరం లోపలికి వెళ్ళిపోయాడు. కానీ, ఆ మూకలో దూర టానికి అతనికి మనస్కరించలేదు.
స్పృహ తప్పి పడిపోవడానికి కారణం....తను దావా వేయడమే! అన్న విషయం అతనికి పదే పదే జ్ఞాపకం రాసాగింది. అలల లాంటి ఆలోచనలను త్రోసుకుంటూ అతను కారు తీసుకుని, ఇంటివైపు వెళ్ళసాగాడు.
ఇదంతా పాపని తెచ్చుకోవడం వల్లనే వచ్చింది. కానీ....పాప లేనప్పుడు కూడా చాలా అశాంతి ఉండేది ఇంట్లో. అది ఇంతకన్న ఘోరంగా ఉండేది. ఆ మానసిక ఆందోళన తననూ, లీలనూ నిశ్శబ్దంగా కాల్చేసింది.
ఇప్పటి చీదర ప్రచారం ఎక్కువయి, అసహ్యంగా తయారయింది.
తను ఘోరమైన పొరబాటు చేశాడు. తనవల్ల తప్పు జరిగిందని లీల తన కాళ్ళమీద పడిననాడు, లీలని క్షమించి ఉండవలసింది ఈ బాధ లీనాడు తప్పేవి!
అతని మనసు దారీ తెన్నూ లేకుండా ఆలోచించ సాగింది. తను పెట్టిన చిత్రహింస సామాన్యమైనది కాదు, స్పృహవస్తే మళ్ళీ ఆమెకి తన జ్ఞాపకాలు తప్పవు. వాటినుంచి ఆమెను రక్షించే మార్గం ఏదయినా ఉంటే బాగుండును. ఈ స్పృహ వచ్చేవేళకి ఆమెకి పూర్వవాసనా విహీనత కలగకూడదా?
అలాంటప్పుడు... "లీలా, నువ్వు నా భార్యవి మనిద్దరం లోకంలో అతి ఉత్కృష్టమైన స్నేహానికి ప్రతీకలం. ఈ పాప....మన పాప" అని చెప్పేసి, జీవితం నందనవనం చేసుకోవచ్చు.
అసంభవం! అలా ఎక్కడైనా జరుగుతుందా?
ఎందుకు జరగకూడదు? పోనీ....అలాంటి డ్రగ్స్ ఏవయినా ఉన్నా ఏమో! డాక్టర్ జయప్రద నడిగి చూడాలి. ఆవిడా, ఆవిడ భర్తగారూ చాలా గొప్ప డాక్టర్లు. లీలంటే వారికి చాలా అభిమానం! నాకీ మాత్రం ఉపకారం చేయరా!
ఇంటిదాకా వెళ్ళిన కారు వెనక్కి తిరిగి సుభద్రమ్మ నర్సింగ్ హోమ్ వైపు మళ్ళింది. జయప్రద. ఈ ఊళ్ళోనే ఉందిట సుభద్రమ్మ చెప్పింది. సుభద్రమ్మ నా కేస్ అంతా జయప్రదకి ఉత్తరంలో వ్రాసిందట ఈ రోజు హియరింగ్ అని కూడా వ్రాసి ఉంటుంది!
కారు 'క్రీచ్' అనే శబ్దంతో ఆగిపోయింది.
ప్రభాకరం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పొరుగింటి సుబ్బయ్య ప్రభాకరం కారుదిగేలోపలే కారు క్రింద దూరి కిందపడ్డ పాపను ఎత్తుకొని వచ్చాడు. "బాబూ! ఎంతపని జరిగిపోయిందండీ....ఇంతసేపూ మూర్తిగారి పిల్లలతో ఆడుకుంటూనే ఉందదండీ" అని చెపుతున్న సుబ్బయ్య మాటల్ని వినిపించుకోక ఖంగారుగా వెనకడోర్ తెరిచి, "కారెక్కు!" అని అరిచి, సుబ్బయ్య నిశ్చేష్టుడై కారెక్కగా ఒక్కసారి సుబ్బయ్య ఒడిలో ఉన్న పాపకేసి చూసి, కారు సర్రున స్టార్ట్ చేశాడు.
వట్టి మాంసపుముద్ద.
* * *
వరండాలోంచే డాక్టర్ జయప్రద చేత్తో స్వాగతం చెప్పి నోటితో తిట్లకి లంకించుకొంది.
"మీ రందరూ నన్ను క్షమించాలి. నేను పరమ మూర్ఖుణ్ణి!" అన్నాడు.
"తెలుస్తూనే ఉంది కానీ....మిమ్మల్ని అభినందించ వలసి వచ్చినందుకు విచారిస్తున్నాం."
"నన్ను చిత్రహింస చేయకండి. కోర్టులో నేను గెలుస్తానని నన్ను అభినందించవద్దు! అదంతా ఒక పీడకల! నేను 'విత్ డ్రా' అవుతున్నాను. కానీ...ముందు నా పాపకి ప్రాణభిక్ష పెట్టండి" అని పరిగెత్తి కొచ్చి కారు ఒక డోరు తెరిచి పట్టుకొన్నాడు.
లోపలినుంచి సుబ్బయ్య చెమ్మగిల్లిన కళ్ళతో పాప శరీరాన్ని ఇవతలికి తీసుకొస్తూ, 'ఈ పాపకి ఇంకెవరి సాయమూ అక్కర్లేదు, బాబూ దేవుడి దగ్గరి కెళ్ళి పోయింది. మీరూ మీరూ కొట్లాడుకుని, దేవతలాంటి పసిపిల్లని పుణ్యం కట్టుకొన్నారు" అన్నాడు.
* * *
'ఎలా....ఇతనితో నీకు నాలుగు నెలల్లో బాబు పుడ్తాడన్నవార్త ఎలా చెప్పను? అసలు....ఈ డాక్టరు రిపోర్టే సరిగా ఇచ్చి ఉండి ఉంటే ఈ నాడు....ఈ గొడవ అంతా ఉండేది కాదుగదా?' అనుకొంటూ నిట్టూర్చింది జయప్రద. వరండాలో పాప పక్కనే నేలమీద కూర్చుని తనలో తాను కుమిలిపోతున్న ప్రభాకరాన్ని చూస్తూ!
:-సమాప్తం
