
"సంతానం లేకపోతే భార్యాభర్తలు కామించడం అనవసరం" అన్నాడు.
"ఇంత కుళ్ళుభావాన్ని నీ అంత పవిత్రమూర్తి మీద ఎలా ప్రసరించను?" అన్నాడు.
"కావాలంటే కరంచంద్ గాంధీని అడుగు" అన్నాడు మరి ఇప్పుడెందుకిలా బిగిస్తున్నాడు కౌగిలి?
ప్రభాకరం మంచివాడై పోతున్నాడు. అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నాడు, అడిగినా అడక్కపోయినాసరే.
ఇప్పుడు కాదు.... పాప వచ్చిన దగ్గరినుంచీ అందరి పట్లా మంచివాడుగా ఉంటున్నాడు.
పాలేరాడి కూతురి పెళ్ళికి రెండు వేలు నోటు వ్రాయకుండా అప్పిచ్చాడు.
కమతగాడి ఇంట్లో బంధువులు వస్తే గింజల్లేవంటే శేరుకాదు, కుంచం కాదు అరబస్తా ధాన్యం శాంక్షన్ చేసేశాడు.
కూలీలకి గింజలు కొలవడం ఆచారం ఉన్నచోట డబ్బులు వెదజల్లేడు.
పాపని కన్నందుకు వాళ్ళమ్మకి అయిదు వేలు ధర్మం చేసేడు.
పాప కారు కొనమంటే కొనేశాడు.
అయిదారు తరాలై డబ్బు ధారాళంగా సంపాదించడమే తప్ప విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం ఎరగని ఈ వంశంలో ప్రభాకరుడు ఉదయించాడు.
అతనికీ మొదట్లో ఉండేవి, లక్షణా లన్నీను.
పాప పాప పాప.
ఈ పాప ఇతన్ని 'మంచివాడు'గా చేస్తూంది.
నా కీ మంచితనం అక్కర్లేదు.
మంచిగా నన్ను చేరదీస్తాడు.
నేను రుచులు మరిచిపోయిన సుఖాలు మళ్ళీ నా కందిస్తాడు. నన్ను పవిత్రమైన మధుమందాకినీ నదుల్లో ముంచి తేలుస్తాడు.
కానీ... నా కిది అక్కర్లేదు.
మర్నాటికల్లా నా కేదో అయిపోతుంది.
నాలుగో నెలలో మరో కష్టం తప్పదు.
తొమ్మిది నేలల్లూ నిండితే నాకు నూరేళ్ళూ నిండిపోతాయేమో?
'నిండవు....నిండవు.'
"నిండుతా ఏమో!"
"పోతే పోనీ. అనంత కల్పాంతరాల కాలంలో ఈ తొమ్మిది నెలలూ ఒక లెక్కా నన్నందులో కలిసిపోనీ!"
"చాలా పనులున్నాయి. ఇంకా చాలా ఏళ్ళు బతకాలి."
"ఎక్కడి కక్కడే చావు,
ఎక్కడి కక్కడే పుట్టుక."
"లీలా!"
"ఊఁ ..."
"ఏమిటా పరధ్యానం?"
"పరధ్యానం నా కెప్పుడేనా ఉందా?"
"అవును, లేదు నీది పతిధ్యానమే."
మంచంమీద పడుకోబెట్టారు.
"ఒంటిమీద తెలివి ఉందా?"
"మనస్సు మనస్సులో లేదు."
"పరవశం అయిందన్నమాట!"
"ఏమో?"
"మరీ మంచిదే"
పక్కనే పడుకొన్నాడు.
అతన్ని మరిచిపోయిన తన శరీరావణ్యం లోని మొక్క మొక్కనీ పలకరిస్తున్నాడు.
'క్షేమమా?' అంటున్నాడు.
'నేను జ్ఞాపకం ఉన్నానా?' అంటున్నాడు.
'రమ్మంటున్నా యని.
పెదవులు, చేతులకన్నా చురుగ్గా పలకరిస్తున్నాయి.
'వద్దు వ'ద్దంటే ఆమె మనసు.
'నోర్ముయ్' అంది శరీరం.
12
రుక్మిణమ్మ మొగుడితో పిల్లలతో దిగగానే లీలకి కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఎందుకో వాళ్ళ ఉద్దేశ్యాలు సక్రమంగా ఉంటాయని తన కనిపించదు. వాళ్ళ బాగు వాళ్ళు కోరుకోవడంలో తప్పేమీ ఉండకపోవచ్చు. కానీ, వాళ్ళ బాగు ఏమీ లేకపోయినప్పటికీ ఇతరుల సుఖాన్ని పాడుచేయడం అన్నది అమానుషం అని లీల ఉద్దేశ్యం.
వాళ్ళంతా నిన్న సాయంత్రం దిగారు. వచ్చిన దగ్గరినుంచి మళ్ళీ ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోయే వాళ్ళలాగా, చాలా హడావుడిగా ఉన్నారు. ఇల్లు నాలుగు మూలలా తిరిగేయడం, పనివాళ్ళందర్నీ పిలవడం, చాకలికి బట్టలు వేయడం, బియ్యం మొదలైన సరుకులు బాగుచేయించడం.
ఎన్ని పనులు...ఎన్ని పనులు! అన్నీ ఎవరో తరుముకు వస్తున్నట్లు తొందర తొందరగా చేయిస్తూంది రుక్మిణమ్మ. మధ్య మధ్య తన దగ్గరకు వచ్చి, సానుభూతి వాక్యాలు పలుకుతూంది. ఇంత చిన్న వయసులో తనకి ఇన్నిన్ని ఆపదలు రావడం భగవంతుడి దయలేకపోవడమేనని పరిపరి విధాల చెపుతూంది.
ప్రొద్దున్న తొమ్మిది గంటలకి పాప బిస్కట్టులు తిని పాలు తాగుతుంది. పాప చుట్టూ చేరి వాళ్ళ పిల్లలు అల్లరి చేశారు. నిజానికి పాపకు తను దగ్గిర ఉండి వడ్డించమా లేదు. మరొక రకంగా పాపను అభిమానించిందీ లేదు. కానీ వాళ్ళు పాపను అల్లరి పెడుతూంటే మనసు చివుక్కుమంది.
"ఇదెక్కడ దొరికిందే నీ పీకలమీదికి? చెప్పినట్టు విని చావదు" అని ఆడపడుచు అంటే, ఆ క్షణాన్ని తనకు పాప మీదున్న చిరాకంతా పోయి, ఏదో తెలియరాని సానుభూతికూడా కలిగింది. చిరునవ్వు నవ్వి తను "పట్టించుకోక మీ పనులు చూసుకుంటే సరి!" అంది.
స్నానం చేసి తలల్లో బంతిపూలు పెట్టుకొని వచ్చింది సంధ్య. డాబామీద బట్టలు ఆరవేసుకునే తాడు ఎత్తుగా ఉంది. ఓణి ఆ తాడుమీద ఆరేయడానికి సంధ్య రెండు సార్లు ఎగిరింది. అలా ఎగురుతున్న సంధ్యను చూస్తుంటే లీలకెంతో ఆనందం కలిగింది.
'ఎన్నేళ్ళుంటాయి సంధ్యకి? పద్దెనిమిదేళ్ళు ఉండచ్చు. పన్నెండో క్లాసు పాసయి ఏడాది దాటింది. అయితే మాత్రం ఈ చిన్నమ్మాయికి ఇప్పుడప్పుడే పెళ్ళెందుకు'
పెళ్ళయిన దగ్గర్నుంచీ కష్టాలు మొదలు.... ... సంధ్య దగ్గరకు వస్తూ తన్ను చూసి చిరునవ్వు నవ్వింది. బెంచీమీద బాగా చేసింది లీల. సంధ్య ఆ చోటులో కూర్చుంది.
"నువ్వు పై చదువు చదవ్వా?"
"చదవాలంటే వేరే ఊర్లో పెట్టాలిట... అందుకే నాన్న ఒప్పుకోలేదు."
"పోనీ ఈ ఊర్లో చదవకూడదూ? మా ఇంట్లో నీ కలవాటేగా?" ఆ ప్రశ్నలో వేరే అర్ధం ఉందేమో నని సంధ్య లీల కళ్ళలోకి వెతుకుతూ చూసింది.
"ఏమంటావు మీ మామయ్యతో చెప్పమంటావా? నే చెపితే మీ మామయ్య కాదనరు."
"నాకు చదువుకోవాలని ఉంది కానీ..."
"మీ వాళ్ళు?"
సంధ్య తల వంచేసుకుంది.
లీల తీయగా నవ్వి, "అయితే ఇదేదో నీ కిష్టం లేదన్నమాట" అంది.
వంచిన తల ఎత్తలేదు సంధ్య.
"పెళ్ళి చేసుకోవచ్చనుకో కానీ... నీ కింకా రెండు మూడేళ్ళు టైముందేమోనని నా ఉద్దేశ్యం."
"అత్తా నువ్వేమీ అనుకోనంటే..."
"నేనే మనుకొంటానమ్మా" అని స్నేహంతో సంధ్య చేయి తన చేతుల మధ్యా పట్టుకొంది లీల.
"నా దగ్గర నీకేం కావలసినా నిర్మొహమాటంగా తీసుకోవచ్చు. నాకు ప్రపంచంలో ఎవరున్నారు కనక?"
"అదికాదత్తా నా అనుమాన మేమిటంటే?"
"చెప్పు.... నీ మనసులోని మాటేదో చెపితే నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను."
"అమ్మా, నాన్నా ఇక్కడికెందుకొచ్చారో నీకు తెలుసా?"
లీల మనసులో మూడు నెలల నాటి ఉదంతం తళుకుమని మెరిసింది. కానీ ఏమీ తెలియనట్టే, "నా కెలా తెలుస్తుంది?" అంది.
"అత్తా... నన్ను గురించీ, మామయ్య గురించీ అమ్మా నాన్నా ఏదో మాట్లాడుకుంటూంటే విన్నాను."
"ఎవరి గురించీ... మామయ్య గురించా?"
తల నిలువుగా ఆడించి సంధ్య, "మామయ్య గురించే కాదు నన్ను గురించికూడా!" అన్నది.
లీల నిట్టూర్పు విడిచింది. "అందులో మంచీ చెడూ నీ కర్ధం అయ్యాయా?"
సంధ్య ముఖంమీద రెండు చేతులూ వేసుకొని మూసుకుంది.
లీల ఆమె భుజంమీద రెండు సార్లు తట్టి, "నువ్వు నే అనుకున్నంత చిన్నదానివి కావు. నీకూ సంగతులు తెలుస్తున్నాయి. బాగ లర్ధం అవుతున్నాయి. మీ వాళ్ళకి ఇలాంటి ఉద్దేశ్యం పుట్టడానికి కేవలం ఆ భగవంతుడే కారణం. ఓ విధంగా మా సమస్యలన్నిటికీ అదే తరుణోపాయమేమీననికూడా నా కనిపిస్తూంది" అంది.
సంధ్య హఠాత్తుగా లేచి నిలబడింది.
ఎవర్నో తిట్టుకుంటూ సుందరంగారు హడావుడిగా వచ్చేస్తున్నాడు.
"నాన్న..." అని ఆగిపోయింది సంధ్య.
"నిన్ను పిలవలేదుగా....కూర్చో!"
"పిదప కాలం... పిదప బుద్దులూనూ అయినా ఎక్కడెక్కడి మూకా చేస్తున్నారు కొంపలో. ఛీ ఛీ..." అని విసుక్కొంటూ తుడితువ్వాలును తీసుకెళ్ళి గట్టిగా పిండి తాడుమీద ఆరవేసి, లీలా సంధ్యలు కూర్చొన్న దగ్గరికి విసుగ్గా వచ్చాడు.
"ఎక్కడ సంపాదించాడమ్మా మీ ఆయన ఈ పిల్లని? పిల్లా....అది......పిశాచమా?"
