Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 13

                             
    మరునాటి సాయంకాలం నే నొక్కదాన్నే వెళ్లాను. కిషన్ కుటీరానికి అన్నయ్యకేవో పనులు ఉండి రాలేక పోయాడు.
    సంతోషంగా ఆహ్వానించాడు కిషన్. కాస్సేపు అతడి పెంపుడు జింకతో, పావురాలతో ఆట సాగించి, తరవాత అడిగాను: 'బొమ్మలు గియ్యడం నేర్పరూ?'
    'కట్నం నిన్నే ముట్టిపోయిందిగా? నేర్పనంటే చెల్లుతుందా?' నవ్వుతూ అన్నాడు. 'రండి' అంటూ కుటీరం కేసి దారి తీశాడు. అనుసరించాను.
    స్టాండ్ ఫలకంపై నాడు అవతరించిన చిత్రం చూసి ఆశ్చర్యసంభ్రమాలలో మునిగిపోయాను. లేడి పిల్లమెడ కావలించుకొని అందంగా కూర్చొన్న ఆ కోమలి ఎవరు? పోలికలు నావే. నిన్న నేను జింకపిల్ల కంఠాన్ని కౌగలించుకొన్నప్పటి దృశ్యమే చిత్రించాడు కిషన్.
    చిత్రంకింద వ్రాసిన అక్షరాలను నెమ్మదిగా చదువుకొన్నాను. 'హరిణితో హరిణేక్షణ!'
    'ఏమిటి? బొమ్మలు నేర్చుకోడానికి వచ్చి బొమ్మలా నిల్చుండిపోయారు!'
    'ఊఁ నేర్పండి!' ఒయ్యారంగా కూర్చున్నాను, జడ ముందరికి వేసుకొని.
    పెన్సిలూ, ఓ డ్రాయింగ్ పేపరూ నాముందు పడేసి, 'చిత్రఫలకంపైని జింక బొమ్మని చూస్తూ దానికి స్కెచ్ వెయ్యండి. మీకు ఉన్న పాండిత్యం తెలియాలి' అన్నాడు.
    పావుగంట కష్టపడి జింకకు స్కెచ్ వేసి కిషన్ ముందు ఉంచాను, డ్రాయింగ్ పేపరు.
    చేతిలోకి తీసుకోకుండానే చూచి పకపకా నవ్వేశాడు 'జింక అనుకోవాలా? కుక్క అనుకోవాలా?'
    'గాడిద కూడా అనుకోవచ్చు!' అతడి పరిహాసానికి అలక ప్రదర్శించబోయి చేతగాక పక్కున నవ్వేశాను.
    రోజూ కిషన్ దగ్గిరికి వెడుతున్నాను. అన్నయ్య ఒక్కొక్క రోజు వచ్చేవాడు; పనులేమైనా ఉంటే వచ్చేవాడు కాదు.
    అసలు నేను కిషన్ దగ్గిరికి వెడుతున్నదెందుకు? బొమ్మలు గియ్యాలనా? నిజానికి ఆ ఉత్సుకతకన్నా కిషన్ లోని ఏదో ఆకర్షణ నన్ను అతని దగ్గిరికి కొనిపోతూంది.
    బొమ్మలు గియ్యడంలో నాకు ఉన్న పాండిత్యం అంతా ఉపయోగించి కిషన్ ను కడుపుబ్బ నవ్వించేదాన్ని. మనిషి అని మొదలుపెట్టిన బొమ్మ కోతిగానో, శూర్పణఖగానో వచ్చేది. ఇక జంతువుల బొమ్మలు సరేసరి. వేసిన పిచ్చి గీతలన్నీ తెచ్చి అన్నయ్యముందు పడేసేదాన్ని. దయ్యంలా ఉండి గుడ్లురిమి చూస్తున్నట్లుండే బొమ్మలు, నవ్వు తెప్పిస్తూ రకరకాల భంగిమల్లో ఉండే బొమ్మలు చూచి అన్నయ్య కళ్ళనీళ్ళు తిరిగేదాకా నవ్వేశాడు.
    ఇంట్లో ఉన్నంతసేపు కిషన్ చుట్టూ పరిభ్రమించే నా మానసంలో కిషన్ ను ఆలంబనంగా చేసుకొని అనురాగవల్లరి రోజురోజుకూ దృఢంగా పెనవేసుకు పోతున్నది. అతడి పురుష సౌందర్యాన్ని రెట్టించే ఏదో అలౌకిక గాంభీర్యం నన్ను అతడి సమక్షంలోనూ, పరోక్షంలోనూ పిచ్చిదాన్ని చేసేది. అతడినుండి మాత్రం నేను కోరిన చనువూ, ఆకర్షణా పొందలేక పోయాను. కిషన్ బంధుప్రేమ ఎరిగి ఉన్నవాడు కాదు. అతడికి పశుపక్షి జాలంతో ఉండే ఆత్మీయతానుబంధం మనుష్యుల దగ్గిర లేదేమో అనిపిస్తూంది, అతడి నిర్వికారమైన చూపులూ, నిర్లిప్తమైన ధోరణి చూస్తూంటే ఏదో దృశ్యానుబంధం కోసం పరధ్యానంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుండే అతన్ని చూచినప్పుడు మంత్రముగ్ధ నయ్యేదాన్ని. ఆ కళా తపస్వి తేజస్సంతా అప్పుడు అతని ముఖంలో ద్యోతక మయ్యేది.
    కాలేజీ తెరిచారు. వెళ్ళాను. తిరిగి దసరా సెలవు లకు వచ్చినప్పుడు కిషన్ ను చలింపజెయ్యడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. బొమ్మలు నేర్చుకోవాలన్న మిషతో రెండు పూటలా అతడి దగ్గిర హాజరయ్యేదాన్ని. అతడి నిరాసక్త హృదయానికి చేరువై అతడిలో ఆశలు. రేకెత్తించడానికి నా వయస్సు సొగసు ఒయ్యారాలన్నీ ఒలకబోశాను.
    అమ్మానాన్నలకు నా ప్రవర్తనపట్ల ఆవంతైనా సందేహం లేదు. 'చదువుకొన్న పిల్ల! దాని మంచిచెడ్డలు  దానికి తెలుసు' అన్న భరోసామీద వారు ఉన్నారు. అన్నయ్య కలలోకూడా అటువంటి భావానికి తావిచ్చే మనిషి కాదు.
    ఆనాడు ఉదయంనుండి మబ్బులు ముసురుతూనే ఉన్నాయి ఆకాశంలో. నేను వెళ్ళేసరికి కిషన్ మయూరి నృత్యం తిలకించడంలో ధ్యానమగ్నుడై ఉన్నాడు. నీలి మొయిళ్ళను చూచి పులకించిన హృదయంతో పింఛం విప్పి నర్తిస్తూంది నెమలి. కిషన్ కు సమీపంలో వెళ్ళి నిల్చున్నాను. గాలి అలలలో తేలిపోయి కిషన్ ను తట్టి కవ్విస్తూంది నా పైట. గమనించనట్లే నిల్చున్నాను! నా చూపులు మరొక దెసకు పయనించాయి. గాలి తాకిడికి నిలవకుండా ఊగిసలాడుతూన్న పూలకొమ్మల చుట్టూ పరిభ్రమిస్తూంది ఓ తుమ్మెద!
    'తేటికోసమై తేనియ దాచే
    విరికన్నియ నా సంబరమేమో!'
    'రూపా!' సందేహిస్తూ పిలిచాడు కిషన్.
    'ఊఁ!' క్రీగంట వీక్షించాను, పాట ఆపి.
    'ఆరాధనలో ఉండే ఆనందం, అనుభూతిఅనుభవంలో ఉంటాయంటావా?' తనలో రేగుతూన్న ఏదో సంఘర్షణకు పరిష్కారం అడుగుతున్నట్లుగా ఉంది.
    చేరవచ్చిన తుమ్మెదరాయనికి అందీ అందక కవ్విస్తూన్న పూబాలకేసి చూపెట్టాను. 'అటు చూడు, బావా! ఏ సౌఖ్యమూ లేనిదే పుష్పం పొందుకోసం అన్ని తిప్పలు పడుతుందా ఆ తుమ్మెద?'
    అతనినుండి ఒక నిట్టూర్పు వెలువడింది. 'ఊహ తెలిసినప్పటినుండి సౌందర్యాన్ని ఆరాధించడమేగాని అనుభవించాలన్న ఆకాంక్షకు ఎప్పుడూ లోబడలేదు. కాని నా ముఫ్ఫై ఏళ్ల తపస్సంతా వ్యర్ధమయ్యే రోజు దగ్గరికి వచ్చినట్లుంది!"
    విజయగర్వంతో లోలోన నవ్వుకొన్నాను.
    కిషన్ ఆకాశంకేసి ఒకసారి చూచి అన్నాడు. 'ఇవాళ నీ పిచ్చిగీతలకు సెలవు. వర్షం వచ్చేట్టుంది. అటు చూడు! పొద్దుగూకకముందే ఇల్లు చేరు. వెంట గొడుగైనా తెచ్చుకోలేదుకదా మరి?'
    కావాలనే కాస్సేపు ఆలస్యం చేశాను. ఒకటీ అరా చినుకులు పడుతూంటే బయలుదేరాను.
    'వర్షం వస్తూంటే బయలుదేరడమేం, రూపా? కాస్సేపు ఆగి వెళ్ళు.' అన్నాడేగాని నేను ఆగిపోవడం అతనికి ఇష్టం లేనట్లు గుర్తించాను, అతని ముఖభంగిమలు బట్టి. ఏ ఆకర్షణనుండో తప్పించుకోడానికి అతడు సతమతమౌతున్నాడు!
    'పెద్దగా ఏమీ కురవదులే. గబగబా నడిచి ఇల్లు చేరుకోగలను. తడిసినా చీరె మారుస్తాను.' నన్ను కంచె కూడా దాటనివ్వలేదు వర్షం. నిమిషంలో తప్పతడిపేసింది. పైగా ఎదురుగాలి. ముఖానికి బాణాల్లా తాకుతున్నాయి చినుకులు. అడుగు ముందుకు పడే వీలు కనిపించక వెనుదిరిగాను.
    'చ్చొచొచో! చెప్పలేదూ? ఇప్పుడేం గతి? తడిచీరెలో ఎంతసేపు ఉంటావ్?' కిషన్ నొచ్చుకొంటూనే నాకేసి నిశ్చలంగా చూస్తున్నాడు. దృశ్యానుభవం కోసం శూన్యంలోకి చూస్తుండే చూపు అది!
    కంటికి చాటు అవుతున్న ముంగురులు పైకి తోసుకుంటూ నన్ను నేను పరీక్షగా చూచుకొన్నాను. ఒంటికి హత్తుకుపోయిన చీరెలో స్పష్టంగా అగుపడుతున్న అవయవాలసొంపు నన్ను సిగ్గిలజేసింది. కిషన్ ఏ అవస్థలో ఉన్నాడో తెలుసుకొనే ధైర్యం నాలో శూన్యమయింది. కళ్ళెత్తి అతడికేసి చూడడానికే బిడియపడ్డాను.
    తడిచీరెలో ఉన్నకొద్దీ చలి వెయ్యడం ప్రారంభించింది. పెదవులు వంకరలు తిరుగుతున్నాయి.
    అంతవరకూ నిశ్చలప్రతిమలా నాకేసి చూస్తూన్న కిషన్ తెలివి తెచ్చుకొని, 'చలి వేస్తూందా?' అని అడిగాడు జాలిగా.
    'వెయ్యదూ?' నవ్వాను.
    ఇస్త్రీ చేసిన ఎనిమిది మూరల ధోవతి ఒకటి గబ గబా తెచ్చిఇచ్చాడు. 'చీరె మార్చుకో. నిప్పులుచేసి ఇస్తాను, ఒళ్ళు కాచుకొందువుగాని. ఇంద, తువ్వాలు తీసుకొని తల తుడుచుకో' అంటూ తన భుజంమీది తువ్వాలు అందించి వెళ్ళాడు.
    ధోవతి చీరెలా కట్టుకొని తడిబట్టలు పిండి ఆరవేశాను. దేవుడి ఫోటోముందు ఉన్న కుంకుమ భరిణ అందుకొని నుదుట బొట్టు దిద్దుకొన్నాను. రవిక లేని భుజాలు కొంగుతో ఆచ్చాదించుకొని తుండుతో జుట్టు తుడుచుకొంటూ వంటగదికేసి వెళ్లాను. కణకణలాడే నిప్పులకుంపటి నాముందు ఉంచాడు కిషన్. చేతులూ, ముఖం వెచ్చగా కాచుకొంటూ కూర్చొన్నాను. రేపటి పెరుగుకోసం తోటుపెట్టుకో డానికి ఉంచుకొన్న పాలు పోసి వేడివేడి కాఫీ కాచి ఇచ్చాడు, స్టౌమీద.
    కాఫీ తాగి గ్లాస్ కింద ఉంచాను. వక్కపొడి అందించాడు.
    'ఈ ఋణం ఎలా తీర్చుకోను? నాకోసం చాలా శ్రమపడ్డావు, బావా' అన్నాను, గుమ్మంలో నిలబడి బయట వ్యాపించిన గాడాంధకారంలోకి చూస్తున్న కిషన్ దగ్గిరగా వెళ్ళి నిల్చుంటూ.
    'నువ్వీరాత్రి ఇక్కడ చిక్కుపడినట్లే. ఆ ఉరుములూ, మెరుపులూ చూస్తూంటే వర్షం వెలిసే సూచనలు లేవు. నన్ను కూర్చోబెట్టి మనిద్దరికి వంట నువ్వే చెయ్యి. ఋణం తీరుతుంది. నవ్వుతూ నాకేసి చూశాడు. అతడి చూపుల్లో ఆరాధనేకాని అనురాగం చూడని నేను ఆశ్చర్యపోయాను. ఆ కళ్ళలో ఏదో ఆకాంక్ష! ఏదో తపన!
    కిషన్ కోరిక మన్నించి వంటచేశాను ఇద్దరికీ. అతనికి వడ్డించి, ఆ సమీపంగానే నేనూ వడ్డించుకు కూర్చొన్నాను. అతడు భోజనం కానిచ్చి చెయ్యి కడుక్కుని వెళ్ళాడు. మిగిలిన వంటపదార్ధం మూసిపెట్టి, తిన్నచోట శుద్దిపెట్టి, చేతులు తుడుచుకొంటూ బయటికి వచ్చాను.
    కిషన్ పడకగదిలో మంచంమీద పడుకొని ఉన్నాడు. 'రూపా, అక్కడ స్టూల్ మీద వక్కపొడి భరిణ ఉంది అందుకో. నాకు ఇంత ఇచ్చి నువ్వూ వేసుకో.'
    భరిణ అందుకొని వక్కపొడి అందివ్వబోయిన నా అడుగులు అతడికి మూడడుగుల దూరంలోనే ఆగిపోయాయి. అతడి వాలకం చూచి అదిరిపడ్డాను. అతడిలో కలిగిన ఈ మార్పు మనసారా నేను వాంచించినదే అయినా అది ఇంత హఠాత్తుగా సంభవమౌతుందనుకోలేదు. నా గుండె దడ దడ కొట్టుకోసాగింది.
    కిషన్ మెరుపుతీగలా లేచి నా చెయ్యి అందుకొని తనకేసి లాక్కొన్నాడు. మరుక్షణమే అతని గాఢ పరిష్వంగంలో బంధించబడ్డాను.
    వక్కభరిణ కిందపడి పొడి అంతా ఒలికిపోయింది.
    ఆవేశంగా నన్ను గుండెలకు హత్తుకొంటూ అధరామృతపానం చేస్తూన్న కిషన్ ప్రయత్నాన్ని కంగారుగా, భయంగా వారించబోయాను.
    కిషన్ నా పెదవుల మీద వేలు ఉంచి, 'ష్! మాట్లాడకు. అభ్యంతర పెట్టకు, నన్నింత దూరం తెచ్చి. నువ్వేం చెప్పినా నీటిచుక్కలు పడిన వేడిగ్లాస్ లా అవుతుంది నా పని' అన్నాడు, కౌగిలి ఇంకా బిగిస్తూ.    
    "పెళ్ళి.... పెద్దలు...' గొణుగుతూ అసహాయంగా కళ్ళు మూసుకొన్నాను.
    'పిచ్చినమ్మకాలు పెట్టుకోవద్దు. మనస్సులు కలిశాయి. బస్! పెళ్ళితో పనిలేదు. సాయంత్రం నువ్వు తోటలో చూచిన దృశ్యం గుర్తు తెచ్చుకో. ఏ తాళికట్టి పువ్వును చేరబోయిందా తుమ్మెద? స్వేచ్చలో ఉండే సుఖం ఈ మంత్రతంత్రాలలో ఏదీ?' అన్నాడు అదుపాజ్ఞలు లేక స్వేచ్చగా పెరిగిన ఆ అమాయికపు పెద్దమనిషి.
    ఆ వర్షారాత్రి కిషన్ తృష్ణకు నా కన్యాత్వం అర్పించ బడింది.
    ఒళ్ళు విరుచుకొంటూ మత్తుగా కళ్ళు తెరిచి చూశాను తొలి ఉషోదయాన్ని. నా పక్కన పక్కమీద కిషన్ లేడు. వెదుకుతూ వెళ్ళాను, దారిపక్కన ఉన్న పచ్చికమీద మెత్తగా అడుగులు వేస్తూ, రాత్రి కుంభవృష్టిగా కురిసిన వర్షంవల్ల పూలమొక్కలన్నీ నేలకు ఒరిగాయి. ఆకులన్నీ మట్టికొట్టుకున్నాయి. నేలంతా పచ్చిపచ్చిగా ఉంది.
    దీర్ఘాలోచనలో మునిగి బావిగట్టు మీద కనిపించాడు కిషన్. కళావిహీనమై ఉన్న అతడి మ్లానవదనాన్ని చూచి ఆశ్చర్యపోయాను.
    కలవరపాటుతో పిలిచాను. 'బావా!'
    'రాత్రి చాలా తప్పుగా ప్రవర్తించాను కదూ?' హీనస్వరంతో అన్నాడు. 'మగవాన్ని అనిపించుకొన్నాను. రేప్పొద్దున నీకేదైనా అయితే ఎంత అవమానం నీకు? పెళ్ళికాకుండానే...'
    బాధ వ్యక్తపరిచే అతడి మాటలను చిరునవ్వుతో తేల్చివెయ్యబోయాను. 'అంత బాధ ఎందుకు, బావా? దగ్గిర ముహూర్తం చూచి పెట్టించమని చెబుతాను మావాళ్ళతో. విచారమెందుకు?'
    'మీవాళ్ళు అంగీకరిస్తారా, రూపా? ఇల్లు లేదు; చారెడు భూమి లేదు; పైసా సంపాదన లేదు. నీ సుఖసంసారంకోసం తాపత్రయపడే నీ తల్లిదండ్రులు నాకు కట్టబెడతారన్నది కలలోని వార్త కాదూ?'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS