ఆర్ష్ పెదవి కదపంది ఎవరూ కదపరు.
ఆర్ష్ నవ్వంది ఎవరూ నవ్వరు.
ఆఖరికి ఎవరికైనా తుమ్మొచ్చినా తుమ్మరు. ఆర్ష్ తుమ్మితే అప్పటిదాకా తుమ్ము అతి కష్టంమీద ఆపుకుంటున్నవాడు తుమ్మాల్సిందే
ఆర్ష అక్కడ వున్న అందరికీ బాస్.
అంతేకాదు ఆర్ష ఎక్కడెక్కడి వాళ్ళకో కూడా బాస్.
ఆర్ష పేరు వింటే చాలు గజగజ వణుకుతారు.
ఆర్ష అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆర్ష యాభయ్యో పడిలో పడినవాడు అయినా మాంచి వయసులో ఉన్న నవయువకుడికి ఉన్న చురుకుదనం వంటరిగా వందమందిని ఎదుర్కోగల భుజబుద్ధి బలాలు, పలాయన విధానికి వస్తే నక్కజిత్తులు కుయుక్తులు......ఇలాంటివి చాలానే ఉన్నాయి.
ఆర్ష మొదట్లో చిన్నచిన్న దొంగతనాలు చేశాడు. ఆ తర్వాత శాంపిల్ గా ఓ యువతిని రేప్ చేసి వంటిమీద నగలన్నీ వలుచుకుని హత్య చేసి పారిపోబోతుంటే ఓ పోలీసువాడి కంటపడ్డాడు. సగం నగలు పోలీసు వాడికిచ్చేసరికి ఏ ప్రాబ్లం లేకుండాపోయింది.
ఆర్ష అని తనకి అప్పటినుంచే కొత్తపేరు తగిలించుకున్నాడు. ఏ పనిచేస్తే ఎలా తప్పించుకోవచ్చో అనుభవంలో అర్ధమయేసరికి విజ్రుంభించాడు ముఠా తయారయింది. అలాఅలా ఎందరికో బాస్ అయ్యాడు.
ఇప్పుడు ఆర్ష.
తన స్థావరంలో అనుచరుల మధ్య కూర్చుని తీవ్రాలోచన చేస్తున్నాడు.
ఆర్ష ముఖం అలా తీవ్రంగా ఉంటే ఎవరికీ దగ్గే ధైర్యం కూడా ఉండదు.
ఇప్పుడు పరిస్థితి అక్కడ అలాగే వుంది.
ఆర్ష ముందున్న రెడ్ బల్బ్ వెలిగింది. వెంటనే పక్కనున్న స్విచ్ నొక్కాడు. అతని ఎదురుగా వున్న జానెడు స్క్రీన్ మీద ఇద్దరు మనుషులు ప్రత్యక్షమయ్యారు, మరోక్షణంలో స్క్రీన్ మీద మనుషులు మాయం అయ్యారు.
"ఆనంద్! ఎవరొచ్చారో చూసిరా!" ఆర్ష అన్నాడు ఏమి ఎరగనట్లు.
ఆనంద్ తల ఆడించి లేచి అక్కడనుంచి బయటికి వెళ్ళిపోయాడు.
ఆర్ష పెద్ద టేబుల్ వెనుక కుర్చీలో కూర్చుని ఉన్నాడు, ఆ టేబుల్ మీద మామూలు వస్తువులే ఉంటాయి. అవి చూసేవాళ్ళకి మాత్రమే. కాని టేబుల్ సొరుగులో చెయ్యిపెట్టి స్విచ్ లు ఆన్ చేస్తే వక్కో స్విచ్ వక్కో రకంగా పనిచేస్తుంది, అద్దంలా కనిపించే వకటి టి.వి. స్క్రీన్ అది నిజంగా మినీ టీవీ కాదు.
వాకిట్లోకి ఎవరన్నా రాంగానే ఆటోమేటిక్ గా ఇక్కడ బల్లమీద ఉన్న రెడ్ లైటు వెలుగుతుంది. ఆర్ష స్విచ్ నొక్కుతాడు. వాకిలిముందు ఎవరున్నది స్క్రీన్ మీద వెంటనే కనపడుతుంది.
ఆర్ష స్విచ్ నొక్కటం ఎవరికీ తెలియదు. రెడ్ బల్బ్ వెలగంగానే ఎవరో వచ్చారని మాత్రమే వాళ్ళందరికీ తెలుసు.
ఆర్ష పెరిగి పెరిగి పెద్దవాడు అయిం తరువాత,
ఆర్ష చాలామందికి బాస్ అయిం తరువాత,
ఇలాంటి ఏర్పాట్లు చాలా ట్రిక్సు చేశాడు ఏర్పరచుకున్నాడు. అన్నీ పకడ్బందీగా ఉంటాయి.
ఆర్ష ఆజ్ఞమీద ఆనంద్ బయటికి వెళ్ళి ఇద్దరిని వెంటబెట్టుకు వచ్చాడు.
వాళ్ళిద్దరిలో వకడు కురైపతి. మరొకడు కోదండం.
కురైపతి వస్తూనే బాస్ కి వక నమస్కారం పారేసి తప్పుచేసిన వాడిలా తలవంచుకొని నుంచున్నాడు.
"పధకం బెడిసికొట్టిందా పతీ!" నెమ్మదిగా నవ్వుతూ అడిగాడు ఆర్ష.
"ఎస్ బాస్!"
"నీ పధకం చాలా బాగుందే ఎందుకు బెడిసికొట్టింది?"
"నేను తొందరపడ్డాను బాస్!"
"తొందరపడుతున్నావ్ పతీ! ఈ పని నీకన్నా లంబాకి అప్పజెపితే బాగా చేస్తాడని చెపితే అప్పుడు నీవేమన్నావో గుర్తుందా?
కురైపతి మాట్లాడలేదు. సిగ్గు భయంతో తలవంచుకుని ఉండి పోయాడు.
"సమాధానం కావాలి" ఆర్ష ముక్తసరిగా అన్నాడు.
"క్షమించండి బాస్!" కురైపతి భయంతో గుటకలు మింగుతూ అన్నమాట అది.
"నాకు సమాధానం కావాలి," బుల్లెట్ లా దూసుకు వచ్చింది ఆర్ష్ నోట్లోంచి ఆ వక్కమాట.
బాస్ కి చాలా కోపం వచ్చినట్లు కురైపతి గ్రహించాడు.
"గుర్తుంది" కురైపతి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అన్నాడు.
"మొదటినుంచీ నీకు గుర్తున్నదంతా చెప్పు" మామూలుగా అడిగినట్లు అడిగాడు ఆర్ష్.
ఆర్షలోని ప్రత్యేకత అదే అంతలోనే కఠినంగా వుంటాడు అంతలోనే సౌమ్యంగా ఉంటాడు. అంతరంగంలో ఎలా వుంటాడో ఎవడికీ తెలియదు. ఎందుకంటే నవ్వుతూ నవ్వుతూనే తుపాకికి పని కల్పిస్తాడు. చిరునవ్వు చిందిస్తూ రివాల్వర్ పేలుస్తాడు, "నీ పనికి మెచ్చాను. నీకు ప్రమోషన్ ఇచ్చాను. ఈరోజునుంచీ నీవు నా ముఖ్య అనుచరుడివి" అంటాడు కఠినమైన స్వరంతో.
