ఆకలి వేస్తోంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.
ఇంతలో - "ఇదిగో" అన్న పిలుపు వినిపించింది.
"పిలిచారా" - అంటూ వెళ్ళాను.
"అవును నేను చెప్పినట్లు చేస్తావా?".
"చేస్తాను" అన్నాను.
"నా పెట్టె తెరువు".
నేను తెరిచే లోపల మరొక పెగ్ లాగేశారు.
"అందులో వున్న పుస్తకాలు, కాగితాలు తీసుకురా" అని.
ఉన్నట్టుండి - "నీ పేరేమిటన్నావు?" అని అడిగారు.
చదవేస్తేవున్న మతికూడా పోయిందన్న సామెత జ్ఞాపకం వచ్చింది.
"అదేమిటండీ, నా పేరేమిటని అడుగుతారేంటి?" అని ఆశ్చర్యాన్ని కనబరుస్తూ అడిగాను.
"అడిగినదానికి సమాధానం చెప్తే తప్పా?" అన్నారు.
"ఇలాగైతే కష్టం సార్" అన్నాను.
"ఇదిగో చూడు. నీ కెప్పుడో చెప్పాలనుకున్నాను. సందర్భం కలిసి రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఈ సార్ లూ, పూర్ లూ నాకు నచ్చవు. 'ఏవండీ' అను లేకుంటే 'శ్రీశ్రీ' అని పేరుపెట్టి పిలువు. తెలుసా..... ఇంతకీ పేరు చెప్పావు కావు" అన్నారు.
గొడవ పెట్టుకోవడం ఇష్టంలేదు. పేరేకదా అడిగారు. "సరోజ" అని చెప్పాను.
"అర్ధం తెలుసా?"
"నేను కవయిత్రిని కాను".
"అర్ధం తెలుసుకోవడానికి కవులై వుండక్కరలేదు".
ఈయనేదో పేచీ పెట్టుకునేటట్టున్నారనుకున్నాను.
"ఇదిగో, పుస్తకాలు తెచ్చానండీ" అని మాట మార్చాను. కానీ అయన "అర్ధం చెప్పనా?" అని అడిగారు.
బిక్క మొహం వేశాను. రెండు మోకాళ్ళమధ్యా తలదూర్చేసుకున్నాను. ఏమనుకున్నారో ఏమో -"ఆ పెట్టెలో ఇంకా ఏమున్నాయి? తీసుకురా" అన్నారు.
"అందులో వున్న వాటినా? పెట్టెనా?".
"పెట్టెనే పట్టుకురా" అన్నారు.
ఏమున్నాయి! అన్నీ కాగితాలూ పుస్తకాలే! బట్టలు రెండు జతలైనా లేవు. ఒక తువ్వాలు కట్టుకున్న బట్టలతో కలిపి మూడు జతలు.
ఒక జత ప్రయాణానికి అయిపోయింది. రెండవ జత లాండ్రీది. మూడవ జతమాసిపోయింది.
తన మంచానికి దగ్గరగా చిన్న టేబిల్ లాక్కున్నారు. గ్లాసు దాని మీద పెట్టుకున్నారు.
కాగితాలన్నీ తీశారు. ఒక్కొక్క పుస్తకం తీశారు.
"కుర్చీ తెచ్చుకు కూర్చో"
"లేదండీ కిందనే కూర్చుంటా".
ఆయన కాలు మీద కాలు వేసుకుని పడుకున్నారు. ఎడంచేతిలో సిగిరెట్ వెలుగుతోంది. కుడిచేతి చూపుడువేలు గాలిలో ఏదో రాస్తోంది.
ఎవ్వరం మాట్లాడలేదు.
నేను బితుకుబితుకుమంటూ కూర్చున్నాను.
శ్రీశ్రీగారి చేష్టలు వింతగా కనిపిస్తున్నాయి. తాగినవాళ్ళ ప్రవర్తన ఎలా వుంటుందో ఆనాటికి అనుభవంలేదు.
అమ్మ అయితే అప్పుడప్పుడు లోనికి తొంగి చూస్తోంది.
అమ్మ ముఖం చూస్తే, ఎప్పుడో చచ్చేవాళ్ళు అప్పుడే చస్తారేమో' అనిపించింది.
ఇంతలో శ్రీశ్రీగారు నన్ను 'ఇలారా' అన్నట్టు చేతితో సౌంజ్ఞ చేశారు.
లేచినిల్చున్నాను. ఈయన సంగతి పగలే ఇలా వుంటే రాత్రి ఇంకా ఎలా వుంటుందోనన్న ఆలోచన వచ్చి గుండెలో కలుక్కుమన్నట్టయింది.
ఆ భయంతోనే "ఏమిటి సార్" అన్నాను.
"అదిగో....'సార్' అనొద్దన్నానా? నాకు అసహ్యం" అన్నారు.
'అంకురార్పణమయింది బాబూ' అనుకున్నాను.
"మరీ నాథ భయపడతావేమిటి? వచ్చినదగ్గరనుండీ చూస్తున్నాను. బిక్క చచ్చినట్టున్న నీ ముఖం చూస్తేనే, నీ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నేనేమీ రాక్షసుడ్ని కాను. నిన్నేం చెయ్యను. భయపడకు. శ్రీశ్రీని ప్రపంచమే అర్ధంచేసుకోలేదు.....నువ్వేం చేసుకుంటావు?
చూడు - నీ దగ్గర ఓ దుర్గుణం వుంది. అడిగినదానికి సూటిగా సమాధానం ఇవ్వవు. ఎదురుప్రశ్న వేస్తావు. నీకింకా ప్రపంచజ్ఞానం లేదు. అన్నీ సర్దుకుంటాయిగానీ నేను చెప్పినట్టు మాత్రం చెయ్యి"
'అదేమాట ఎన్నిసార్లు చెప్తారబ్బా'అనుకుని "ఇప్పుడేమిటి చెయ్యమంటారు?" అని అడిగాను.
"అదిగో మళ్ళీ ప్రశ్న చెప్తాను. నువ్వేం చెయ్యనక్కరలేదు. నేను చదువమన్నది చదివితే చాలు".
'బతికాన్రా భగవంతుడా' అనుకున్నాను. ఈ పని బాగుంది. క్షేమం కూడా' అనిపించింది.
"ఏమిటాలోచిస్తున్నావు?".
"ఏం లేదు. తప్పకుండా చదువుతాను".
"నా పెట్టె తెచ్చావా?".
"తెచ్చాను".
"నువ్వు నా మంచందగ్గరే కూర్చో" అని కొన్ని తెలుగు పేపర్ కటింగ్ లూ, పుస్తకాలూ నా ముందు పడేసి ఒక్కొక్కటి తీసి 'ఇది చదువు అది చదువు అని పురమాయిస్తున్నారు.
ఆయన చెప్పినట్లే ఇచ్చినవన్నీ చదువుతూ కూర్చున్నాను.
నాలుగుగంటలు కావస్తోంది. బాత్ రూమ్ కి కూడా వెళితే ఒట్టు.
మా అమ్మ గుమ్మందగ్గరా, నేను గురువు గారి మంచం దగ్గరా పాతుకుపోయాం.
నాకు లేవటానికి భయం! ఆయన మాత్రం పెగ్ మీద పెగ్ మంచినీళ్ళలా గడగడా తాగేస్తున్నారు. చదువుతున్న దాన్ని ఆపటానికి వీలులేదు. ఆగితే "చదువు" అంటున్నారు. 'ఎందుకలా తాగుతారు? చాలండీ' అని చెప్పాలని వుంది. కానీ కొత్త....భయం....నోరు పెగలందే!
అయినా ఆయనకి మనం ఎలా చెప్తాం చెప్తే ఏమంటారో!
గుండెల్ని పిండే బాధ....ప్రస్తుత పరిస్థితిలో మౌనమే మంచిదనుకున్నాను. ఆయన తాగేస్తున్నారు. మాకు ఆకలి దంచేస్తూంది. 'ఎలాగురా దేవుడా' అనుకుంటూండగా "రాత్రి భోజనం ఆర్డర్ సార్" అంటూ హోటల్ బాయ్ వచ్చాడు.
'బతికాన్రా' అనుకున్నాను.
"రాత్రి మాట దేవుడెరుగు ప్రస్తుతం మా ప్రాణాలు పోతున్నాయి. కాఫీ, టిఫిన్ తేవయ్యా" అన్నాను.
ఆ బాయ్ పేరు 'గోవిందుడు' తెలుగు కూడా తెలుసు.
"ఏం టిఫిన్ కావాలమ్మా" అన్నాడు.
"ఏది వుంటే అదే బాబూ..." అన్నాను.
"మరి రాత్రి భోజనం...?" అని అడిగాడు.
"రెండు క్యారేజీలు....."తే అని చెప్పాను.
శ్రీశ్రీగారు సిగరెట్ దమ్ము లాగుతూ సూటిగా నా కళ్ళల్లోకి చూశారు. సిగరెట్ చివరి భాగం ఎంత ఎర్రగా వుందో- అంత ఎర్రగా వున్నాయి వారి కళ్ళు.
మొత్తం మీద ఒక సీసా ఖాళీ అయిపోవస్తూంది. అయినా మనిషి చెక్కు చెదరలేదు. మత్తెక్కినట్లు లేదు. స్పష్టంగా మాట్లాడుతున్నారు.
"నాకు ఒక ప్లేట్ చికెన్, రెండు చపాతీలు, రెండు ఎగ్స్ పట్టుకురా" అన్నారు. "అలాగే సార్" అని బాయ్ వెళ్ళిపోయాడు.
నేను నిర్ఘాంతపోయాను. 'ఈయన మాంసం కూడా తింటారన్నమాట! ఓహ్...తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయే' అనుకున్నాను.
"ఇదిగో..." అని పిలిచేరు.
"ఏమిటి" అన్నాను.
"వాడు టిఫిన్ తెచ్చేసరికి ఇంకో పావుగంట అవుతుంది. భావయుక్తంగా బాగానే చదువుతున్నావు. వాడొచ్చేలోగా మరో రెండు పేజీలు చదువు" అన్నారు.
వారి మాటలు నాకు అమృతంగా అనిపించాయి. నా జన్మతరించిందనుకున్నాను.
* * *
తూలని తాగుడు
చదివి చదివి విసుగెత్తినా, నోరు నొప్పిపుడుతున్నా చచ్చినట్టు చదువుతూ కూర్చున్నాను.
ఇక్కడో మాట చెప్పాలి. నేను తెలుగు బాగా చదవడానికి గానీ, అర్ధం చేసుకోవటానికి గానీ కారణం మా నాన్న గారే!
