"డాడీ, అన్నమాట ప్రకారం రేపు నా భార్యతో వస్తాను. బై బై" అంటూ కిరణ్ ఫోన్ పెట్టేశాడు.
తనెక్కడవున్నాడో తెలియక, తను చెప్పిన మాటలవల్ల మమ్మీ, డాడీ ఎంత ఆందోళన చెందుతారో, ఏవేవో వూహిస్తూ, ఎన్నో రకాలుగా అనుకుంటూ వ్యధచెందుతూ వుంటారు. ఇవన్నీ కిరణ్ కి తెలియక కాదు. ప్రస్తుతం కిరణ్ నిండా మునిగి వున్నాడు. నిలువులోతునీళ్ళల్లో మునిగి నిలుచున్నవాడు, చలి గురించి ఆలోచించడు. కిరణ్ కూడా ఆలోచించటం లేదు.
అదయిన తరువాత ఇరువురు కలిసి హోటల్ కు వచ్చారు. రాత్రివరకూ మీన మేషాలు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నారు. పెళ్ళి చేసుకోవటానికి, ఈ హోటల్ నుండి బైటికి వెళ్ళేముందే పధకాన్ని అమలు జరిపింది. కామిని ఒక్కొక్కపనిచేస్తూంటే ఆమె తెలివికి ఆశ్చర్యపోక తప్పలేదు కిరణ్ కి. అంత తెగింపు, చొరవ, ధైర్యం వున్నది తన జీవిత భాగస్వామిని కాబోతున్నది, ఆ విషయం భయాన్ని కలుగచేస్తున్నది కాని, సంతోషాన్ని కలుగజేయటంలేదు.
ఇరువురు హోటల్ నుండి బయటకు వెళ్ళేముందు...
"నే చేస్తున్నది నువ్వు చూస్తూ వుండు" అంది కామినీదేవి.
కూర్చున్న చోటునుండి కదలకుండా "వూ" అన్నాడు కిరణ్.
కామినీదేవి లేచివెళ్ళి గోడవైపు తిరిగివున్న అనిత డెడ్ బాడీని ఇటువైపుకి త్రిప్పుకుంది. "ఓహ్ మంచి పిట్టనే పట్టావ్" అంది.
కిరణ్ మాట్లాడలేదు సోఫాకి అతుక్కుపోయి కూర్చున్నాడు.
"ఇంత అందమైన ఆడదాన్ని చంపటానికి చేతులెలా వచ్చాయ్ కిరణ్" సారీ తొందరపడి మాటన్నాను. ఇది పొరపాటున జరిగిన హత్య కదా! పిచ్చిగా వాగకూడదనుకుంటాను. వెధవ నోటి తొందర ఏదో ఒకటి అంటున్నాను. సారీ కిరణ్" లాలనగా అంది కామినీదేవి.
అప్పటికీ ఏమి మాట్లాడలేదు కిరణ్.
అనిత చీరను విప్పుతూ "స్టన్నింగ్ బ్యూటీ" అంది కామినీదేవి.
అంతవరకు నోరు మూసుకున్న కిరణ్ "ఎందుకు చీర విప్పుతున్నావ్?" గాబరాగా అడిగాడు.
"అరె బాబా! పధకం చెప్పాను. బాగుంది అన్నావు. కానీ పధకంలొ భాగంగా ప్రతి చిన్న విషయమూ వివరించలేదు. ఎందుకంటే టైమ్ వేస్ట్ కాబట్టి తినబోతూ రుచి ఎందుకు? అనుకున్నాను. నీ కన్నీ ప్రశ్నలే నీ కన్నీ అనుమానాలే" అంటూనే కామిని డెడ్ బాడీకున్న చీరను ప్రక్కన పెట్టింది. జాకెట్టు హుక్స్ విప్పుతూ చెప్పింది "మొదటి సాక్ష్యం ఇవే."
"అంటే?" కిరణ్ అయోమయంగా అడిగాడు.
తనపని తాను చేసుకుపోతూ కామినీదేవి చెప్పటం మొదలుపెట్టింది.
"డెడ్ బాడీని ఎలా వదుల్చుకోవాలనేది పధకంలో చెప్పాను. ఇక సాక్ష్యాధారాలకి వస్తే, ఇప్పుడు ఈవిడ వంటి మీద నూలుపోగు కూడా వుండకుండా తీసేస్తాను. నగలు గట్రా తీసేస్తాను. కేవలం ఈమె శరీరం మాత్రమే మిగులుతుంది. నేను అనిత చీర జాకెట్టు ధరిస్తాను. ఆమెలా ఆ నగలన్నీ పెట్టుకుంటాను. దాదాపు అనిత లాగ తయారు అవుతాను. ఇంచుమించు ఎత్తు లావులో మేమిద్దరం ఒకటే కాబట్టి, జాకిట్ పట్టదనే ప్రాబ్లమ్ వుండదు. డెడ్ బాడీని బాత్ రూమ్ లొ ఒక ప్రక్కన వుంచేద్దాం. ఈ గదిలోనే వుంచితే వాసన వచ్చే ప్రమాదం వుంది.
కనుక ఇప్పటి నుండి రాత్రిదాకా ఈమె బాత్ రూమ్ లోనే వుంటుంది. మనం ఇక్కడినుండి బయటకు వెళ్ళి పోతాం. మనం ఇద్దరం కలసి బయటకు వెళ్ళేటపుడు హోటల్ సిబ్బంది నా ఫేస్ గుర్తుపట్టకుండా వుండటానికి మొహం నీ భుజానికి ఆన్చి ఒరిగి నడుస్తాను. నీవు నా భుజం చుట్టూ చేయివేయి. మనం పూర్తిగా బయటకు వెళ్ళిపోదాము.
ఇదే దుస్తులతో మనం పెళ్ళి ఫోటోస్ తీయించుకుందాం. తిరిగి హోటల్ కి వచ్చేటపుడు. ఒక ఫినాయిల్ సీసా, ఒక సెంట్ సీసా కొనుక్కొద్దాం. మళ్ళీ హోటల్ కి వచ్చేటపుడు అదే ఫోజ్ లొ ఒకరిని ఒకరు అతుక్కుని నడవాలి. మన రూంలోకి వచ్చాక నేను రూమ్ లో నీవైపు తిరిగి కూర్చుంటాను, నీవు నావైపు అంటే ద్వారం వైపు మొహంపెట్టి కూర్చో.
హోటల్ బాయ్ ని పిలిచి, కాఫీ టిఫిన్ తెప్పించుకుందాం. అప్పుడు నేను నీతో మాట్లాడుతూ వుంటాను. సాయంత్రం 6 గంటలకి మరోసారి కాఫీ తెప్పించుకుందాం అప్పుడు నేను బెడ్ మీద పడుకుని వుంటాను. నువ్వు నన్ను అనుకుని కూర్చో, నైట్ కి మీల్స్ తెప్పించుకున్నపుడు, నేను రూమ్ లో అటు తిరిగి ఏది సర్దుతున్నట్లుగా నుంచొని వుంటాను. బోయ్ వచ్చి ఖాళీ ప్లేట్లు తీసుకు వెళ్ళేటపుడు నేను మొహానికి పుస్తకం అడ్డుపెట్టుకుని చదువుతూ వుంటాను.
ఇలా ఎందుకు చేస్తున్నావో నీకు అర్ధమయిందను కుంటాను.
"అర్ధమయింది కామిని" వెలిగిపోతున్న మొహంతో అన్నాడు కిరణ్.
"నీ మొద్దు బుర్రకి ఏమి అర్ధమయిందో చెప్పు చూద్దాం! ముద్దుగా అడిగింది కామిని.
"ఇంత చెప్పినా అర్ధం కాకపోతే నాది నిజంగా మొద్దు బుర్రే అనుకోవాల్సి వస్తుంది. అనిత చనిపోయే టైమ్ అర్దరాత్రి. కాని అనిత సజీవంగా వుంది అనటానికి సాక్ష్యంగా, నీవీ పని పగలు రాత్రి చేస్తున్నావు. నీ ఫేస్ ఎవరూ గుర్తు పట్టకుండా నీవీ జాగ్రత్త వహిస్తూ, అనిత దుస్తులలో అనితలాగా హోటల్ సిబ్బందికి కనబడతావ్. రూమ్ బాయ్ 4 సార్లు మన రూంకి వచ్చినా అనిత నాతో వున్నట్లు సాక్ష్యం వుంటుంది. యా మై కరెక్ట్?"
"సెంట్ పర్సెంట్ కరెక్ట్, మరి ఫినాయిల్, సెంట్ ఎందుకో?" అది చెప్పగలవా? కిరణ్"
"ఓ..." అంటూ.
అనిత బాడీమీద ఫినాయిల్ పోస్తాం, వాసన రాకుండా మన బాడీలకు సెంట్ పూసుకుంటున్నాం. రూమ్ బాయ్ రూమ్ లోకి వచ్చినపుడు, మన వాసన ఘుమ ఘుమలాడి పోవాలి. డెడ్ బాడీ వాసనకాదు. అవునా?"
"కరెక్ట్ గా అంతే"
అప్పటికి అనిత వంటిమీద నూలుపోగు లేకుండా ఆమె బట్టల్ని తొలగించి, చెవి రింగులతో సహా అన్నీ తీసేసింది కామినీదేవి.
బతికున్న రోజులో దిగంబరంగా చూట్టంవేరు, కిరణ్ మొహం ప్రక్కకు తిప్పుకుని కూర్చున్నాడు.
