Previous Page Next Page 
అష్టపది పేజి 13


    
    "నిజమే మీరు చెప్పింది కూడా. మరి ఇప్పుడెలా?" అంతా విని సురేంద్రనాథ్ అడిగాడు.
    
    "దానికొక వుపాయం ఆలోచించాము."  

 

    "ముహూర్తం లోపల నిజం తెల్సుకోగలుగుతారా?"
    
    "మీరంతా నిరాశ చెందనవసరం లేదు సురేంద్రనాథ్ జీ! మీ బాధను మేము అర్ధం చేసుకోగలం ఈ నేరం పొగమంచు పొరలా విడిపోతే ఫర్వాలేదు రెండో కంటికి తెలియకుండా అంతా సవ్యంగా జరిగిపోతుంది. కానప్పుడే పరిస్థితి కకావికలు అయ్యేది. రెండు మూడు గంటల్లోనే విషయం బైట పడేలా కొత్త ప్లాను వేసాము. దీనికిహ తిరుగు లేదు."
    
    "చెబుతాను, చెయ్యవలసింది మాత్రంమీరు."    

 

    "అలాగే చేస్తాను. పక్కలో పాము వుందని తెలిస్తే హాయిగా నిద్రపోలేను కదా!
    
    ఏం చేయాలో చెప్పండి" అన్నింటికి సిద్దమైన వాడిలా సురేంద్రనాథ్ అన్నాడు. ముఖ్యంగా ఈ టెన్షన్ భరించటం చాలా కష్టంగా వుంది ఆయనకి.
    
    సురేంద్రనాథ్ చేయవలసింది ఏమిటో వివరించాడు సి.బి.ఐ. అధికారి.
    
    అంతా విని "ఓ కె" అన్నాడు సురేంద్రనాథ్.
    
    "వియ్యంకుడికి వేపకాయ అంత వెర్రి ఉన్నట్లుంది ఇందిరారాణి విసుక్కుంటూ అంది.
    
    "కాదు, గుమ్మడికాయ అంత" గోవర్ధనరావు విసుక్కుంటూ అన్నాడు. ఆయన విసుగు పెళ్ళాంమీద కాదు అక్కడలేని వియ్యంకుని మీద.    

 

    "నాకు చాలా వింతగా వుంది. ఇలాంటి ఆచారాలు మన పక్కన లేవు."
    
    "లేవు కాదు, మనం ఎరగము అను."
    
    "ఏది అన్నా, అనకున్నా ఇక్కడ కూర్చుని మనం ఇద్దరం అనుకోవాల్సిందే. ఇంతకీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? ఆ విషయం చూడండి ముందు" ఇందిరారాణి అంది.
    
    "మనం చేయాల్సింది ఊ అనటమే" గోవర్ధనరావు తల విదిలిస్తూ అన్నాడు. ఆ విదిలింపులో అయిష్టత ఉంది అయినా తప్పదు ఏం చేస్తాం అన్న విసుగు ఉంది.    

 

    "మనకీ ఆచారంలేదని చెపితే!"
    
    "చెప్పొచ్చు కాని, మనం ముందునుంచీ అడుగులకు మడుగులు వత్తుతూ వాళ్ళెలా చెపితే అలా చేశాను ఇప్పుడు మాకీ ఆచారం లేదు, మాకీ పద్దతులు లేవు అంటే వాళ్ళమనసు నొచ్చుకుంటుంది, పైగా కోపం రావచ్చు.
    
    "కోపం రాకేమి బాగానే వస్తుంది. మగ పెళ్ళివారు అనంగానేవాళ్ళకి ఆటోమేటిక్ గా తోకలు పుట్టుకువస్తాయి. కోతులకి పుటుకలోనే తోకలు వుంటాయి. మగపెళ్ళివారికి అలాకాదు. విడిదిలో దిగంగానే తోకలు పుట్టుకు రావడం ప్రారంభిస్తాయి."
    
    భార్య అలా అంటుంటే గోవర్ధనరావుకి నవ్వు వచ్చింది. "ఈ సత్యం యెలా కనిపెట్టావోయ్" అన్నాడు.
    
    "ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చిన అనుభవం. ఓ ఇంట్లో ఆడపెళ్ళివారు పరమ నాస్తికులు. మగ పెళ్ళివారు కన్యాదేవి అని బతికున్న (మంగమ్మవ్వ లాంటి) ఓ దేవతని కొలుస్తుండేవారు. ఆమె ఫోటోని పెళ్ళి మండపంలో కుర్చీ వేసి, కుర్చీలో ఫోటోపెట్టి మంగళసూత్రాలు, తలంబ్రాలు ఆ ఫోటో కాళ్ళకి తగిలించడం, ఆ తర్వాత పెళ్ళితంతు...అలాచేశారు. అదే మరొకరింట్లో మరో పెళ్ళి విషయం. మగపెళ్ళివారికి ఏ ఆచారాలు లేవుట. ఆడపెళ్ళివారికి మాత్రం చచ్చే ఆచారాలు ఉన్నాయి. అయ్యప్పస్వామి ఫోటో, సంతోషిమాత ఫోటో పెళ్ళి మంటపంలో వుంచారుట. ఆ ఫోటోలు అక్కడనుంచి తీసేస్తేగాని పెళ్లిపీటల మీద కూర్చోనని పెళ్ళికొడుకు బెదిరింపు. మావాడిమాట కాదంటే ఈ పెళ్ళి జరగదని పెళ్ళి పెద్దలు నానాగోల అయింది. చివరికి వాళ్ళ పంతమే నెగ్గింది."  

 

    ఇందిరారాణి చెపుతుంటే "దీనినిబట్టి నీకేమి అర్ధమైంది ఇందూ?" అంటూ చిరునవ్వుతో గోవర్ధనరావు అడిగాడు.


    "ఈ దేశంలో మగపెళ్ళివారికి తోకలొక్కటే తక్కువని...వాళ్ళు ఎలుకపిల్లని చూపించి నంది అంటే నంది పంది అంటే పంది అని...." ఇందిరారాణి కోపంగా అంది.
    
    భార్య అన్న తీరుకి గోవర్ధనరావు పెద్దగా నవ్వాడు.
    
    ఉన్నట్లుండి విడిదిలోంచి కబురు వచ్చింది. వియ్యంకుడు సురేంద్రనాథ్ అర్జంటుగా రమ్మని కబురు పంపాడు. గోవర్ధనరావు విషయం ఏమిటోనని హడావిడిగా వెళ్ళాడు.
    
    "పెళ్ళి యింకా రెండుగంటలుందనగా ( ఎదురు లాంటి) మూడు జంటల తమాషా ఆట ఆడాలి. అది ఆచారం. తొందరగా ఆ ఏర్పాట్లు చేయండి" అని చెప్పాడు సురేంద్రనాథ్.
    
    "ఇలాంటి ఆచారమేదీ మా పక్కనలేదు. అంటే అది ఎలా చేయాలి?" గోవర్ధనరావు అడిగాడు.
    
    "వెరీ సింపుల్. సరదాగా ఉంటుంది. పిల్లలు, ఉత్సాహపడతారు. ఈ ఆట పేరు ఎదురు బొదురు మాట. నలుగురు పెళ్ళికొడుకులు, నలుగురు పెళ్లికూతుళ్ళు ఉండాలి. వాళ్ళు ఎనిమిదిమంది..."
    
    "ఇప్పుడు వాళ్ళనెక్కడనుంచి తెస్తాము?" రావు చిరాకు దాచుకుని చిరునవ్వు చిందిస్తూ అడిగాడు.
    
    "ఇది సరదావేడుకని ముందే చెప్పాను కదా! ఇంచుమించు అదే ఎత్తు అదే లావుగల మూడుజంటలని పెడతాము. అసలు పెళ్లికొడుకు పెళ్లికూతురు నాలుగోజంట. చేయవలసింది ఏమిటంటే మగవాళ్ళ నలుగురికి ఒకే రకం ఆడవాళ్ళ నలుగురికి ఒకే రకం డ్రస్ వేయాలి. ఆడ మొగ ఎవరిముఖాలు కనపడకుండా పూలమాలలు (కొన్ని మతాల వారు పెళ్ళికొడుకులకు కట్టినట్టుగా పూలమాలలు మొహాలకి వేళ్ళాడదీయడం) వేళ్లాడదీయాలి. అప్పుడా నలుగురిలో పెళ్ళికూతురు ఎవరో తెలియదు, పెళ్లికొడుకు ఎవరో తెలియదు...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS